"బంగారు" ద్వీపం (అనువాద నవల) -25 - అచ్చంగా తెలుగు

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -25

Share This

 "బంగారు" ద్వీపం (అనువాద నవల) -25

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton




@@@@@@@@
(కుందేలుతో పొదలో దూరిన కుక్క మూలుగు వినిపించి, గొడ్డలితో ఆ పొదను తవ్విన వాళ్ళకు పాత నుయ్యి, దానిలో విరిగిన స్లాబు మీద కుక్క కనిపించాయి. ఆ నూతిలో లోతు తెలియలేదు. కుక్కను పైకి తెచ్చి ఆ చుట్టుపక్కల నేలంతా తవ్విన వారికి భూమిలో ఒక ఇనుప రింగు ఉన్న రాతిపలక, దాన్ని పైకి ఎత్తిన వారికి పాతకాలపు రాతి మెట్లు కనిపించాయి. అక్కడ టార్చి వెలుతురులో ఒక విచిత్ర దృశ్యం కనిపించింది. తరువాత......)@@
@@@@@@@

అతని కళ్ళకు ఒక విచిత్ర దృశ్యం కనిపించింది.

కిర్రిన్ కోట యొక్క నేలమాళిగలు రాతితోనే తయారు చేయబడ్డాయి. ఆ గుహలు సహజంగా ఏర్పడినవో, ఎవరైనా మనుషులు వాటిని తొలిచి తయారుచేసారో పిల్లలకు అర్ధం కాలేదు. కానీ అవి ఖచ్చితంగా భయపెట్టేవిగాను, దట్టమైన చీకటితోను, ప్రతిధ్వనించే శబ్దాలతోను నిండి ఉన్నాయి. జూలియన్ ఉత్తేజంతో నిట్టూర్చగానే అది ఆ రాతి గోడల మధ్యన ప్రతిధ్వనించి ఎంతో మంది నిట్టూరుస్తున్నట్లు ధ్వనించింది. ఇది పిల్లలందరికీ చాలా విచిత్రమైన అనుభూతిని ఇచ్చింది.

"ఇది వింతగా లేదూ?" లోస్వరంలో అంది జార్జి. తక్షణం ఆమె మాటలు ఎన్నో రెట్లు పెరిగి మరింత ఎక్కువ స్థాయి శబ్దంతో చుట్టూ ఉన్న నేల మాళిగల గోడలను తాకి పదే పదే ప్రతిధ్వనించాయి. "ఇది వింతగా లేదూ! ఇది వింతగా లేదూ! ఇది వింతగా లేదూ!" అంటూ చాలా మంది అంటున్నట్లు ధ్వనించింది.

డిక్ పట్టుకొన్న తన చేతిని అన్నె లాక్కుంది. ఆమెకు విపరీతంగా భయమేసింది. ఆమె ఈ ప్రతిధ్వనులను యిష్టపడదు. అవి ప్రతిధ్వనులేనని ఆమెకు తెలుసు. కానీ అవి గుహలో దాక్కున ఎంతోమంది ప్రజలు మాట్లాడుతున్నట్లు ధ్వనిస్తోంది!

"లోహపు కడ్డీలు ఎక్కడ ఉన్నాయని మీరు అనుకొంటున్నారు?" అని డిక్ అడిగాడు. వెంటనే అక్కడ గుహల్లో అతని మాటలు ప్రతిధ్వనించాయి. "లోహపు కడ్డీలు. . . లోహపు కడ్డీలే!. . . లోహపు కడ్డీలే!. . .ఉన్నాయి! ఉన్నాయి!"

జూలియన్ నవ్వాడు. అతని నవ్వు విభిన్న రకల నవ్వులుగా మారిపోయి నేలమాళిగల్లో గింగిరాలు కొడుతూ పిల్లలకు వినిపించింది. ఇది నిజంగా వింత విషయమే!

"రండి!" జూలియన్ పిలిచాడు. "మనం కొంచెం దూరం పోతే, ఈ ప్రతిధ్వనులు అంత తీవ్రంగా ఉండకపోవచ్చు."

"కొంచెం దూరం. . ,దూరం. . కొంచెం దూరం. ..దూరం!"

వాళ్ళు ఆ రాతి మెట్లకు కొంచెం దూరంలో ఉన్న నేలమాళిగల వైపు వెళ్ళి అన్వేషించారు. అవన్నీ కోట కింద విస్తరించిన రాతి నేలమాళిగలు. చాలా ఏళ్ళ క్రితం కర్కోటకులైన ఖైదీలను ఈ నేలమాళిగల్లో బంధించి ఉండవచ్చు. కానీ చాలామటుకు వీటిని సరుకును నిల్వ చేయటానికి వాడే వారు.

"లోహపు కడ్డీలను ఉంచటానికి ఏ నేలమాళిగను వాడే వారా అని ఆలోచిస్తున్నాను" అన్నాడు జూలియన్.

అతను ఆగి తన జేబులోంచి పటాన్ని బయటకు తీసాడు. చేతిలోని టార్చిని దాని మీద కేంద్రీకరించాడు. ఆ పటం లోహపుకడ్డీలను ఉంచిన నేలమాళిగను స్పష్టంగా తెలియపరుస్తున్నా, అక్కడకు వెళ్ళే మార్గంపై అతనికి సరైన అవగాహన లేదు.

"నేను చెప్పేదేమిటంటే, ఆ పక్క నేలమాళిగను మూసివేస్తూ ఒక తలుపు ఉంది చూడు" అకస్నాత్తుగా డిక్ అరిచాడు. "అదే మనం వెతుకుతున్న నేలమాళిగ అని పందెం వేస్తున్నాను. అక్కడే లోహపుకడ్డీలు ఉంటాయని నా పందెం!"

@@@@@@@@@@@@ .

నాలుగు టార్చిలు ఆ యినుప తలుపు మీద మెరిసాయి. అది భారీగా, దృఢంగా ఉంది. నిండా పెద్ద పెద్ద యినుప మేకులతో బిగించబడి ఉంది. "ఉఫ్' మని జూలియన్ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ దాని దగ్గరకు పరుగెత్తాడు. దాని వెనుక వస్తువులను నిల్వ చేయడానికి ఉపయోగించే నేలమాళిగ ఉందని అతను ఖచ్చితంగా భావించాడు.

కానీ తలుపు బలంగా బిగిసిపోయి ఉంది. ఎంతలా నెట్టినా, లాగినా అది తెరుచుకోలేదు. దానికి పెద్ద తాళపు కన్నం ఉంది. కానీ దానికి తాళం చెవి లేదు. నలుగురు పిల్లలు ఉద్వేగంతో తలుపుని చూస్తూ నిలబడ్డారు. ఆత్రుత పెరిగిపోతోంది. వారు భావించినట్లే నిజంగా లోహపు కడ్డీలకు దగ్గరగా ఉన్నారు. కానీ తలుపు తెరుచుకోవటం లేదు.

"మనం గొడ్డలిని తీసుకొద్దాం" అకస్మాత్తుగా అన్నాడు జూలియన్. "తాళపు కన్నం చుట్టూ ఉన్న చెక్కను విరక్కొట్టి, తాళాన్ని పగలగొడదాం."

"అది మంచి ఆలోచన" ఆనందంగా చెప్పింది జార్జి. "వెళ్దాం రండి."

వాళ్ళు ఆ పెద్ద తలుపుని వదిలి తాము వచ్చిన దారినే తిరిగి వెళ్ళటానికి ప్రయత్నించారు. కానీ నేలమాళిగలు చాలా పెద్దగా గజిబిజిగా ఉండటంతో, వాళ్ళు దారిని మరిచిపోయారు. పెద్దదైన ఆ రాతి మెట్లకు వెళ్ళే దారిని కనుగొనే ప్రయత్నంలో వాళ్ళు చీకట్లో విరిగిపోయిన పాత పీపాలు, పుచ్చిపోయిన చెక్కలు, ఖాళీ సీసాలు, యింకా అనేక వస్తువులను కాళ్ళతో తన్ని తూలిపడ్డారు.

"చిరాకు పుట్టిస్తోంది" చివరకు విసుక్కొన్నాడు జూలియన్. "ప్రవేశద్వారం ఎక్కడ ఉందో నాకు బొత్తిగా గుర్తు లేదు. మనం ఒక దాని తరువాత ఒకటిగా నేల మాళిగలను దాటి వచ్చాం, అవన్నీ ఒకే రకమైన చీకటితో, కంపు కొడుతూ అర్థం గాకుండా ఉ న్నాయి."

"జీవితాంతం మనం యిక్కడే ఉండాలేమో!" దిగులుగా అంది అన్నె.

"చవటా!" అంటూ ఆమె చేతిని పట్టుకొన్నాడు డిక్. ""మనం త్వరలోనే బయటపడే మార్గాన్ని కనుగొంటాము. హలో!- ఇది ఏమిటి . . . "

అందరూ ఆగిపోయారు. నేలమాళిగ పైకప్పు నుంచి కింద నేల వరకు విస్తరించిన, యిటుకలతో కట్టిన చిమ్నీ గొట్టంలాంటి ఆకారం వారికి కనిపించింది. జూలియన్ దానిపై టార్చి వెలుతురును కేంద్రీకరించాడు. వెంటనే అతను తెల్లబోయాడు.

"అది ఏమిటో నాకు తెలుసు!" అకస్మాత్తుగా అంది జార్జి. "ఇది నుయ్యి. నీకు గుర్తుందా? నేల మాళిగల ప్లానులోను, అలాగే భూతలానికి చెందిన ప్లానులోను యిది చూపబడింది. అదే, బావికి సంబంధించిన ఈ గొట్టం కిందకి, భూమిలో యింకా కిందకి వెళ్తోంది. నేలమాళిగల్లోకి, అలాగే భూతలానికి నీటి సరఫరాకు దీనికి ఎక్కడైనా కన్నం ఉందా అని నేను ఆలోచిస్తున్నాను. "

వాళ్ళు చూడటానికి వెళ్ళారు. నూతి గొట్టానికి అవతల వైపున ఒక పిల్లాడు తలనుంచి భుజాల వరకు ఒకేసారి దూరి, కిందకు తొంగి చూసేంత పెద్దగా ఒక కన్నం ఉంది. వారు తమ టార్చి కాంతులను కిందకు, పైకి వేసి చూసారు. బావి యొక్క దిగువ భాగాన్ని చూడటం అసాధ్యమనిపించేటంత లోతుగా ఉందది. జూలియన్ దానిలోకి ఒక రాయిని జారవిడిచాడు. కానీ ధడ్ మని నేలను తాకిన శబ్దం కానీ, నీరు చిందిన చప్పుడు కానీ రాలేదు. తల పైకెత్తి చూసిన అతనికి బలహీనమైన సూర్యకాంతి కనిపించింది. ఆ వెలుగు, అంతకు ముందు తనను కాపాడతారని టిం కూర్చున్న విరిగిపోయిన రాతిపలకపై పడి, పరావర్తనం చెంది, తనకు కనపడుతున్నట్లుగా అతను గమనించాడు. ఆ విరిగిన పలక ఈ గొట్టానికి కొద్దిగా కింద ఉంది.

"అవును" చెప్పాడతను. "ఇది నిజంగా నుయ్యే! వింతగా లేదూ? సరె! ఇప్పుడు మనం కనుక్కొన్న నుయ్యి నేల మాళిగల ప్రవేశ ద్వారానికి ఎంతో దూరంలో లేదని తెలిసింది కదా!"

ఆ మాటతో వారిలో ఉత్సాహం ఉరకలేసింది. అందరూ చేతులను పట్టుకొని, తమ చేతిలోని టార్చీల కాంతిని యిక్కడా అక్కడా కేంద్రీకరించి చీకట్లో అన్వేషించారు.

ఉన్నట్లుండి అన్నె ఉత్సాహంగా అరిచింది. "ఇదే ప్రవేశ ద్వారం, ఖచ్చితంగా యిదే! మసకబారిన పగటి వెలుగు నాకు కనిపిస్తోంది. "

పిల్లలంతా ఆ మూలలో మలుపు తిరిగారు . అక్కడ పైకి వెళ్ళే నిటారుగా ఉన్న రాతి మెట్ల మార్గం వాళ్ళకు కనిపించింది.

వెంటనే జూలియన్ చుట్టూ పరిశీలించాడు. ఆ మెట్లను దిగిన పిదప తాము వెళ్ళిన మార్గాన్ని గుర్తు చేసుకొనే ప్రయత్నం చేసాడు. అక్కడకు దగ్గరలో చెక్క తలుపును కనుగొంటాడని మాత్రం అతను అనుకోలేదు.

వాళ్ళంతా మెట్లెక్కి సూర్యరశ్మిలోకి వెళ్ళారు. క్రింద నేలమాళిగల్లోని చల్లనిగాలి బారిన పడ్డ తలలు, భుజాలు ఈ వెచ్చదనానికి అద్భుతమైన అనుభూతిని పొందాయి. జూలియన్ తన వాచీ వైపు చూసి ఆశ్చర్యపోయాడు.

"ప్రస్తుతం ఆరున్నరైంది. ఆరున్నర! నాకు ఆకలి అనిపించడంలో ఆశ్చర్యం లేదు. మనం కనీసం టీ కూడా తాగలేదు. మనం ఎంతో కష్టపడ్డాం. గంటల తరబడి ఆ నేలమాళిగల్లో అన్వేషించాం."

"సరె! మనం యింకా ఏమన్నా చేసే ముందు ఒక రకమైన టీ, రాత్రి భోజనం తీసుకొందాం" అన్నాడు డిక్. "దాదాపు పన్నెండు నెలలుగా నేనేమీ తిననట్లు అనిపిస్తోంది."

"బాగుంది. భోజనసమయంలో మా కన్నా రెండింతలు తిన్నట్లుగా ఊహించుకో!" కోపంగా అన్నాడు జూలియన్. వెంటనే చిరునవ్వు నవ్వుతూ, "నాకు అలాగే ఉంది" అన్నాడు. "రండి. అసలైన మంచి భోజనం చేద్దాం. జార్జి! గిన్నెను మరగబెట్టి కోకో ఏదన్నా తయారుచేస్తావా? సమయమంతా భూగర్భంలో తిరగటం వల్ల నాకు చలిగా అనిపిస్తోంది."

కెటిల్‌ను పొడి కర్రల మంటపై ఉడకబెట్టడం సరదాగా ఉంది. సాయంత్రం సూర్యుని వెచ్చదనంలో నడుము వాల్చటం, రొట్టె ముక్కలు, జున్ను కేక్, బిస్కట్లను నమిలి తినటం, ఎంతో ఆనందంగా అనిపించింది. వారంతా ఆ అనుభూతులను బాగా ఆస్వాదించారు.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages