గెలిచి చూపిస్తా
నాగమంజరి గుమ్మా
“ఒరే కుంటి కులాసం వస్తున్నాడురోయ్…”
“ఎత్తెత్తి అడుగు వెయ్యి… ఎగురుకుంటూ నడవవోయ్..” వీధిలో పిల్లల వ్యాఖ్యానాలు చిన్నారి ప్రవీణ్ మనసులో ములుకుల్లా గుచ్చుకుంటున్నాయి. తన కాళ్ళవైపు చూసుకున్నాడు. ఒక కాలు పొట్టి, ఒక కాలు పొడుగు. నడిస్తే ఎగురుతున్నట్లే ఉంటుంది. తన నిజ పరిస్థితిని వాళ్ళు వేళాకోళంగా పాడుతున్నారు. వాళ్ళని ఏమి అనలేక, ఉబికి వచ్చే కన్నీళ్లను చొక్కాకి తుడుచుకుంటూ, ఆ పిల్లల దండును దాటి వెళ్ళిపోయాడు ప్రవీణ్.
వయసు పెరిగే కొద్దీ పదాలు వేరైనా, సారాంశం ఒకటే అయిన వెటకారాలు, వేళాకోళాలు ప్రవీణ్ మనసును రగిలించేవి. ఏదో ఒకటి చెయ్యాలనిపించేది. కానీ ఏమీ చేయలేని అశక్తత. ఇంట్లో వాళ్ళకి భారం అవడం తప్ప ఏ పని చేయలేని వైకల్యం…
ఒకరోజు తమ ఊరి ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఆటలపోటీలు జరుగుతూ ఉంటే చూడటానికి వెళ్ళాడు ప్రవీణ్. అక్కడ ఉన్న ఒక కోచ్ ప్రవీణ్ లోని క్రీడాసక్తిని గమనించాడు. ప్రవీణ్ ని కలిసి పారాలింపిక్స్ క్రీడల గురించి చెప్పాడు ఆ కోచ్. ప్రవీణ్ మొదట చక్రాల కుర్చీలో కూర్చుని ఆడే బాస్కెట్ బాల్ ప్రాక్టీసు చేసాడు. దానితో పాటు లాంగ్ జంప్, హైజంప్ కూడా ప్రాక్టీసు చేయమన్నాడు కోచ్. తల్లి తండ్రి ప్రవీణ్ కు తమ అంగీకారం తెలియజేసారు. ఇంతలో కరోనా మహమ్మారి విజృంభించింది. ప్రవీణ్ తల్లి కరోనా బారిన పడింది.
కరోనా కారణంగా శిక్షణాలయం మూత పడింది. ప్రవీణ్ సొంత ఊరికి వచ్చేసినా అభ్యాసం మానలేదు. కరోనా తగ్గిన తర్వాత పారాలింపిక్స్ క్రీడలు జరుగుతాయని ప్రకటన చూసి ప్రవీణ్ ను సంసిద్ధుని చేశారు కోచ్. ప్రవీణ్ తన సత్తా చూపించి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. సొంత ఊరిలో ప్రవీణ్ కు సన్మానం చేసారు.
“కష్టాలు మనిషికి కాక మానుకి వస్తాయా? పడి లేచి, నిన్ను నీవు ఋజువు చేసుకున్నావు. చాలాసంతోషం. కరోనా బారినపడి అనారోగ్యంతో లేవలేని తల్లి, కుటుంబభారాన్ని తానొక్కడై మోస్తూ, కూలి చేసి సంపాదించే తండ్రి. చిన్నవారైన తోబుట్టువులకు ఆదర్శంగా, కన్న తల్లిదండ్రులకు ఆనందాన్ని, పుట్టిన ఊరికి పేరును తీసుకువచ్చిన నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది… నీవైకల్యం నీ పట్టుదల ముందు చిన్నబోయింది” ప్రవీణ్ కుమార్ ను అభినందిస్తూ అతని గ్రామపెద్ద చిరుసత్కారం చేస్తూ చెప్పాడు.
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నది పెద్దల ఉవాచ. తనకున్న వైకల్యాన్ని చూసి కుంగిపోకుండా తనకంటూ ఒక లక్ష్యం నిర్దేశించుకొని, సాధన చేసి, గెలిచి చూపించాడు ప్రవీణ్.
*****
No comments:
Post a Comment