శివరాత్రి నాడు మరణించి సద్గతి పొందిన అనాచారి "గుణనిధి" - అచ్చంగా తెలుగు

శివరాత్రి నాడు మరణించి సద్గతి పొందిన అనాచారి "గుణనిధి"

Share This

శివరాత్రి నాడు మరణించి సద్గతి పొందిన అనాచారి "గుణనిధి"

అంబడిపూడి శ్యామ సుందర రావు 




స్కాంద పురాణంలోని కాశీ మాహాత్మ్యాన్ని* కాశీ ఖండము* అనే పేరుతో శ్రీ నాథుడు రచించాడు.ఆ గ్రంథంలోని 17 వ అధ్యాయములో గుణ నిధి వృత్తాంతం వివరించబడింది.   

ఆ గ్రంధం లో అష్ట దిక్పాలకులు విశ్వనాథానుగ్రహం పొంది ఆయా దిక్కులకు ఆధిపత్యం పొందడం, వాళ్ల తపస్సులు ఆ వివరాలు అందులో వివరించబడ్డాయి  ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు.ఆయన వెనకటి మూడు జన్మల కథలు వర్ణింపబడ్డాయి గుణనిధి అనే అల్లరి చిల్లరగా తిరిగిన (చెడిన) ఒక బ్రాహ్మణ కుమారుడి కథ మొదటిది  కంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే సదాచార సంపన్నుడైన  బ్రాహ్మణుడు . సోమయాజి.. గొప్ప పండితుడు. రాజానుగ్రహం పొంది, తరచూ రాజ సభకు రాక పోకలు చేసే విద్వన్ముఖ్యుడు. యజ్ఞాలు చేయిస్తూ భూరి దక్షిణలు, గోదాన భూదాన హిరణ్య దానాదులు విశేషంగా ఆర్జించిన పుణ్య మూర్తి ఆయన ఏకైక పుత్రుడు. గుణనిధి . జూదం , దాని అనుబంధ వ్యసనాలలో మునిగి దుస్సహవాసాలతో ఇల్లు గుల్ల చేసిన ఘనుడు. అందరూ ఆడిపోసుకునే దశ అందుకున్న వాడు. గుణనిధి  తండ్రి మహా కోపదారి. ఒళ్ళు మండి సోమిదేవమ్మ, ఈ చిన సోమయాజినీ వదిలేశాడు. అట్లా ఇట్లా కాదు.. శాస్త్ర పద్ధతి ప్రకారం తిలోదకాలిచ్చి వదిలేశాడు . ఏదైనా శాస్త్రం ప్రకారం చేయాలి.! అంతే. పోండి. మీకూ నాకూ ఏ బంధమూ, సంబంధమూ లేదు . పోండి ! అన్నాడు. కుపుత్ర త్వంబు కంటే అపుత్రత్వంబు మేలు. అని ఏకైక పుత్రుణ్ణి వదిలి పారేశాడు. .వాడు ఇంటికి పోలేక అక్కడక్కడ తిరుగుతూ శివరాత్రి నాడు రక్షక భటులా చేతిలో  ప్రాణాలు విడిచాడు . శివలోకం చేరాడు.. సంగ్రహంగా కథ ఇది

శివరాత్రి నాటి మరణం ఒక జీవుడి సద్గతికి కారణం కావడం ఇందలి ఇతివృత్తం .ఇంతకు మునుపు కదా తెలుసుకుందాం.  సోమిదేవమ్మ లేక లేక ఎందరో దేవుళ్ళకు మొక్కి మొక్కి , సోమయాజి ఏ యే క్రతువులో చేసి చేసి పుట్టిన ఒక్కగానొక్క కొడుకు.చూడ ముచ్చటైన వాడు. చేతుల మీదనే పెరిగాడు.పొలం, పాడి విస్తారం . ఇంటనే తిష్ట వేసి బంధుజనం.. వచ్చే పోయే ఈ ఊరి వాళ్ళు, ఆ ఊరి వాళ్ళు..యజ్ఞాలు చేయడం , చేయించడం ..యజ్ఞదత్తులకు క్షణం తీరిక లేదు. తరచుగా రాజు గారి ఆహ్వానం..యజ్ఞదత్తుడు పుత్రుడికి చక్కగా వడుగు చేశాడు.  అగ్ని కార్యము నేర్పాడు.  తనకు ఒక రోజు కుదిరితే మరో రోజు కుదరదు... ఒక ఘనపాఠికి  అప్పజెప్పాడు.. రోజూ ఏమి చదువుతున్నావు అని  అడగడానికి తనకు తీరిక లేదు. ఇల్లాలికి అన్ని బాధ్యతలూ అప్పజెప్పాడు..

ఆమె కెన్ని పనులు.ఇంట్లో బంధు జనం ఎక్కువ.. చిన్న తనం కదా! క్రీడా సక్తుడు. చదువుతాడు లే. ఏం వయసైపోయింది అని గారాబం.. సోమయాజుల అంశ కదా!ఊహ వస్తే పట్టు బట్టి పోటీ బడి చదివి , తండ్రిని మించి పోతాడులే ! అని ధైర్యం. గట్టిగా అరిచి చెప్పడానికి బాగుండదు. వీళ్ళందరూ ఏమనుకుంటారు ? మన పరువు పోదు ! అనుకుంటుంది. ఈ సోమయాజికి మహా చెడ్డ కోపం.. ఒళ్ళు తెలీదు. ఏ నిమిషంలో ఏమంటాడో? అయినా చిన్న వయసే గదా! అని ఆ ఉపాధ్యాయుడూ తక్కువ చేసి చెప్పడు . నాలుగు తరాలకు సరిపోయే అంత ఉన్న వాడు . ఏదో కొంత చదివితే చాలు లే ! అనుకొన్నాడో , వాడికింకా గురుబలం రాలేదు. దశ మారాలి అనుకొన్నాడో చెడుగా చెప్పడు.

సోమయాజి ఇల్లాలిని అపుడపుడూ అడుగుతూనే ఉన్నాడు. వీణ్ణి సమస్త విద్యలలో కోవిదుణ్ణి చేయాలి అని ఆయన పట్టుదల..సంధ్య వార్చేడా?. అగ్ని హోత్రం వేల్చేడా? చదువుకోను పోయాడా? ఏడీ కనబడడే ? అని పరామర్శ చేస్తూనే ఉన్నాడు.ఈయన కోపంలో ఏమైనా చేసేస్తాడు. గొంతు పిసికినా పిసికేస్తాడు  అని అన్నిటికీ మెత్తగా జవాబు చెబుతూ వచ్చింది ఆ తల్లి.

వాడేమో  జూదం ఆడడంలో నిష్ణాతుడై పోయాడు. అమ్మనడిగి అడగక ఇంట్లో నగలన్నీ పణంగా పెట్టి ఆడేస్తున్నాడు. తల్లి ఒంటి మీద నగలు, ఆమెకు ఏడు వారాల సొమ్ములు ఉన్నాయి. అన్నీ దురలవాట్లకు  స్వాహా. బాల్య యౌవనాల నడిమి వయసులో ఈ వ్యసనాలు వస్తే విధాత గూడా తప్పించలేడు.  అంటాడు ఓ మహాకవి.ఒకరిని అనుకోని లాభం లేదు అది అంతే అని. ఇంట్లో ఉండే విలువైన వస్తువులన్నీ సుపుత్రుడు అందరికీ పంచేశాడు.

ఒక మిట్ట మధ్యాహ్నం. మంచి ఎండలో వస్తున్నాడు సోమయాజి.  ఉదయం నుంచి ఏమీ తిని ఉండడు. మధ్యాహ్న స్నానం చేసి అగ్నిహోత్రం చేసే , బ్రాహ్మణ సంతర్పణ చేసి భోజనం చేయాలి.దారిలో పెద్ద వేలం  పాట . ఎవడో ఒకతను పెద్దగా అరుస్తూ ధర చెప్తూన్నాడు. సోమయాజి ఉన్న వాడే గదా! కొందాం అని ఆగాడు. అది నవరత్న ఖచిత అంగుళీయకం. ఇది నాదే. రాజు గారు ఆ రోజు సగౌరవంగా నాకు ఇచ్చాడు. ఇది అతని దగ్గర కెట్లా వచ్చింది.? హస్త లాఘవం చూపి , మా ఇంట్లోదే కొట్టేశాడు అని నిర్ధారణకు వచ్చాడు. ఎక్కడిది ? నిజం చెప్పు. అబద్ధం చెబితే రాజుతో చెప్పి శిక్ష వేయిస్తా . అని గద్దించాడు. అతగాడికి పది మందిలో పరువు పోయింది. "మీ ముద్దుల కొడుకు ఇదే కాదు ..ఇంకెన్నో నాకు జూదంలో ఓడి సమర్పించాడు "అని ఏకరువు పెట్టాడు.స్వామికి ఊళ్ళో తల  తీసేసినట్లయింది. కోపంతో ఇంటికి పరుగులు తీశాడు.

మెల్లగా సోమిదేవమ్మ ని  పిలిచాడు. ఆమె కొడుకును కాయడానికి  అవలీలగా అబద్ధాలు చెప్పడానికి బాగా అలవాటు పడిపోయింది. ఉంగరం గురించి అడిగితే నీ ఉంగరం ఎక్కడ పోదులే.భద్రంగా భోషాణం లో పెట్టాను లే." అని తేలిగ్గా అబద్దం  చెప్పింది సోమయాజి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.అబద్ధాలు చెబుతూ బంగారం లాంటి  నా కొడుకును నాశనం చేశావు.నిర్భాగ్యురాలా  అని తరిమి పారేశాడు ముద్దుల కొడుక్కి  ఈ సంగతి తెలిసింది . తనని అభిమానించే తల్లి లేదు. ఏ మొగం పెట్టుకొని ఇంటికి పోయేది …అని బాధ పడ్డాడు.ఇప్పుడు తినడానికి లేదు.ఇంక ఇంట్లో పైసా పుట్టదు అందరు మొగం చాటేశే వాళ్లే .ఆకలి  ఎప్పుడూ ఆకలి తల్లి ఏ వేళకు ఇంటికి పోయినా బంగారు గిన్నెలో వంటకం, గట్టి పెరుగు, వడ  నోట్లో పెడుతుంది

అదృష్టం కొద్దీ శివరాత్రి వచ్చింది. ఎక్కడా ఏమీ ఉదయం నుంచి తినడానికి లేదు.శివాలయంలో అభిషేకాలు. దీపారాధనలూ జరుగుతూ ఉన్నాయి. పిండి వంటలు, పాయసాలు , మధుర పదార్థాలు… వాసనలు నోరూరిస్తున్నాయి.ఈ పదార్థాలు తీసుకొని పోయి తిందాం. .. అనుకొన్నాడు. ఆలయంలో అవకాశం కోసం రెప్ప ఆర్పక చూస్తూన్నాడు.అర్ధ రాత్రి అయింది. భగవంతుడు దయ దలిచాడు. అందుచేతనే జాగారానికి సిద్ధపడి వచ్చిన వాళ్లూ కునుకు దీశారు. గర్భగుడిలో దీపం కొండెక్కుతున్నది . గుణనిధి గబగబ దీపం ఎగదోశాడు. పక్కనే ఉన్న నెయ్యి కొంచెం ఆ ప్రమిదలో పోశాడు.. 

ఒక తాంబాళం తీసుకుని భక్ష్య  భోజ్యాలన్నీ  కావలసినన్ని పెట్టుకొని,. తల వాకిట ఎక్కడో చాటుగా తిందాము అనుకొని వస్తూ ఉన్నాడు. ఆలయంలో అందరూ ఆడి పాడి అలసి అక్కడే అనుకోకుండా కునుకు తీశారు..ఎక్కడి కక్కడ పడి పోయి ఉన్నారు. పాపం శర్మ తొందరలో ఆ చీకట్లో ఎవరి చెయ్యో కాలో తొక్కాడు. అలవాటు లేని పని గదా ! ఆ పాత్ర చేతితో పట్టుకుని పరుగెత్తాడు.భక్తులు దొంగలు పడ్డారు . స్వామి నగలు దొంగిలించుకు పోతున్నారు అనుకొని " దొంగ దొంగ " అని అరిచారు. వెంటనే రక్షక భటులు బాణాలు వేశారు. అతడి ప్రాణాలక్కడే పరమాత్మలో కలిసి పోయాయి..

యమభటులు వచ్చారు. శివుని ప్రమధ గణాలు వచ్చాయి. 

వీడంతటి అనాచారి ఇక పుట్టడు. బ్రాహ్మణుడై పుట్టి ఎపుడూ అనాచారాలతోనే పెరిగాడు.. ఈ శివరాత్రి నాడు గూడా స్నానం లేదు , సంధ్య లేదు . దొంగతనం చేశాడు. ..అని ఏకరువు పెట్టసాగారు యమభటులు. 

ప్రమథులు తర్జని చూపారుఇంతటి పుణ్యాత్ముడు అరుదుగా దర్శనమిస్తాడు. ఉదయం నుంచి ఈ వేళ వరకూ ఏమీ తినలేదు. జాగారం చేశాడు. ఒక్క కునుకు తీయలేదు దీపారాధన చేశాడు. స్వామి సన్నిధిలో కన్ను మూశాడు.. అని ఒక్కొకరు ప్రశంసా వర్షం కురిపిస్తూన్నారు..'అయ్యా! మా అజ్ఞానం మన్నించండి . ఒక మారు మార్కండేయ మహర్షి విషయంలో పొరబడ్డాము. ఈ ద్వితీయా అపరాధము క్షంతవ్యం కాదు . మీ దయ" అని దీనంగా చూచారు. మహా భక్తుడి సన్నిధిలో జరిగిన అపరాధం కాబట్టి వదిలేస్తున్నాం అని వాళ్లు అనుగ్రహించారు.

ఈ విప్రకులుడు మరు జన్మలో దముడు అనే రాజపుత్రుడైనాడు. కళింగ దేశాధిపుడైనాడు . ప్రజలందరి చేత బలవంతంగా నైనా శివాలయాలలో , వీధులలో దీపాలు పెట్టించాడు . ప్రజలను చల్లగా కాపాడాడు. ఆలయంలో దీపాలు పెట్టని వాళ్ల తల తీసేయమని చట్టాలు చేసి, అమలు పరిచాడు.దాన ధర్మాలతో అలరించాడు. . ఎడతెగని శివ భక్తితో  సర్వసంపదలు పొందాడు.. అందరికీ పంచాడు . మహా రాజు అనిపించుకున్నాడు. అందరి హృదయాల్లో నిలిచి పోయాడు. వెనకటి కర్మ ఇప్పుడు ఫలింపుకు వచ్చింది  అపుడు ఇవ్వడమే . ప్రతి గ్రహం ఎరగడు. పోతూ పోతూ ఇష్టపడి కాకుండా ఐనా, ఒక చిరు దీపం పెట్టాడు. ఇప్పుడు దేశమంతా దీపాల వెలుగు. అనంతైశ్వర్యం అందరికీ.మరుసటి జన్మలో కుబేరుడు ఐనాడు. ఈశ్వరుడికి అతి సమీపంలో తన ఉనికి. అన్ని నిధులూ ఆయన అధీనం.

ఇదండీ గుణనిధి కధ జీవితం అంతా అనాచారిగా ఉన్న చివరలో శివరాత్రి రోజున ఆహారం దొరకక తప్పనిసరి పరిస్థితులలో ఉపవాసం ఉన్నాడు గుళ్లో తిను బండరాలను చూసిఆలయములో ప్రవేశించి ఆ ఆహార పదార్ధాలను తస్కరించటానికి అనువైన సమయం కోసం చూస్తూ కొడిగడుతున్న దీపం లో అక్కడ ఉన్న ఆవు నెయ్యి పోసి దీపం కొండెక్కకుండా చూసాడు ఆ ఆహార పదార్థాలు తీసుకొని పారిపోబోతూ గుళ్లోని భక్తుల కాలో చెయ్యో తొక్కడం వాళ్ళు దొంగ దొంగ అని అరవటం సైనికులు వేసిన బాణాలకు గుణనిధి ప్రాణాలు విడుస్తాడు ఆ  విధంగా గుణనిధి చేసిన ఉపవాసం జాగరణ దీపారాధన అన్ని చేయాలని చేసినవి కావు అయినప్పటికీ శివరాత్రి నాడు శివాలయంలో శివుని సన్నిధిలో ఇవన్నీ చేసి ప్రాణాలు విడవడం వల్ల మరుజన్మలో రాజుగా ఆ తర్వాత జన్మలో కుబేరునిగా జన్మించాడు ఆవిధముగా పుణ్యం మూట కట్టుకొని అష్ట దిక్పాలకులలో ఒకడైనాడు. ఇదంతా శివరాత్రి శివారాధన వల్ల కలిగే పుణ్యఫలం  , 


***


No comments:

Post a Comment

Pages