క్రొత్తనీరు.(రెండవ భాగం )
టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
వరంగల్ హై స్కూల్ ప్రాంగణం.. కోలాహలంగా ఉంది..
శని ఆదివారాలు స్కూలుకు సెలవు. పాత మిత్రుల కలయికతో ఆ ప్రాంతం సందడిగా మారింది.అప్పటి స్కూల్ హెడ్ మిస్టర్,టీచర్లు,స్టూడెంట్స్ అందరూ కలిసి కేరింతలు కొడుతున్నారు. స్టేజి మీదకు ఒక్కొక్క టీచర్ని పిలిచి సన్మానం చేస్తున్నారు. గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.
పాత ఫ్రెండ్స్ తో కబుర్లలో పడింది మాళవిక.
"ఏర్పాట్లు చాలా బాగున్నాయి! ఈవెంట్ మేనేజర్ ఎవరు?" కుతూహలంగా అడుగుతున్నారెవరో.
"మిత్ర.... మన మిత్రాగాడు..."
అంటూ వినిపించింది మరొక గొంతు.
తలత్రిప్పి చూసింది మాళవిక.
మిత్ర పొడుగ్గా ఉన్నాడు... బ్లాక్ సూట్ వేసుకున్నాడు.. అందరినీ పలకరిస్తూ ఏర్పాట్లు చూస్తున్నాడు.
ఆశ్చర్యంగా చూసింది మాళవిక.
మిత్ర...తన క్లాస్మేట్...తన పక్క ఇంట్లోనే ఉండేవాళ్ళు. స్కూల్లో అస్సలు చదివేవాడు కాదు. వాళ్ళ నాన్న నాగరాజు. అమ్మ వసంత. అక్కయ్య శ్రీదేవి. వాళ్ళ నాన్న పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లి వంటలు చేసేవాడు. వాళ్ళ అమ్మగారు వచ్చి అప్పుడప్పుడూ తమ ఇంట్లోనే వంట చేసేది.
అప్పట్లో సన్నగా ఉండేవాడు. మంచి దుస్తులు కూడా ఉండేవి కావు. అతి కష్టం మీద వాళ్ళ నాన్న పిల్లల్ని చదివించేవాడు.
దగ్గరగా వచ్చాడు మిత్ర.
పక్కన ఫ్రెండ్స్ అంతా పలకరిస్తున్నారు.
"ఏం చదివావు బిజినెస్ పెట్టుకున్నావా? ఎలా ఉన్నావు? "అంటూ.
" చిన్నప్పుడు ఎలా చదివేవాడినో మీకు అందరికీ తెలుసు! మన ర్యాంకు లాస్ట్ నుండి ఫస్ట్ కదా!.....పెద్దగా చదువు అబ్బలేదు....ఏదో డిగ్రీ అయిందనిపించి దీనిలోకి వచ్చాను.. పర్వాలేదు సాగుతోంది బండి... "
అంటూ మాళవిక పక్క కుర్చీలో కూర్చున్నాడు.
"అమ్మా నాన్న ఎలా ఉన్నారు? "అడిగింది మాళవిక.
"బాగున్నారు మల్లీ!అక్క లెక్చరర్. బావగారు గవర్నమెంట్ జాబులో ఉన్నారు.దానికి ఒక బాబు. రాజమండ్రిలో ఉన్నారు. అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు. నేను ఇక్కడ ఈవెంట్ మేనేజర్ గా చేస్తున్నా!...మీ సంగతి చెప్పు!ఏం చేస్తున్నావు!ఎలా ఉన్నావు!అంకుల్, ఆంటీ కులాసానా! అన్నయ్య ఎలా వున్నాడు?..."
తన ఉద్యోగం, అన్నయ్య పెళ్లి గురించి చెప్పింది మాళవిక.
ఫ్రెండ్స్ కొందరు ఫోటోలు తీసుకుంటున్నారు. మిత్ర,మాళవిక మిగిలారు.
"సో!ఇప్పుడు హైదరాబాద్ లో ట్రావెల్ ఏజన్సీలో జాబ్ అన్నమాట!నేను అప్పుడప్పుడూ కొన్ని ఈవెంట్స్ కోసం హైదరాబాద్ వస్తుంటాను!వచ్చి నప్పుడు కలుస్తాను!ఓకేనా!.....
అతడు మాట్లాడుతుంటే కొంతమంది ఫ్రెండ్స్ మిత్రనూ, మాళవికనూ ఫోటోల కోసం కేకవేశారు.
ఆ రోజు గడిచింది.
రెండో రోజు భద్రకాళి గుడి, రామప్ప వెళ్ళారందరూ. అక్కడ కూడా టిఫిన్లు, భోజనం దగ్గర్నుంచి అన్ని ఏర్పాట్లు మిత్ర చేశాడు. రాత్రికి వరంగల్ చేరారందరూ.
సోమవారం పొద్దున్నే వరంగల్ నుండి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమయ్యింది మాళవిక. ఆమెతో పాటు హైదరాబాద్ లో ఉండే ఫ్రెండ్స్ కొందరు వచ్చారు. బస్టాండుకు మిత్ర కూడా వచ్చాడు.
"అంకుల్ ని, ఆంటీని అడిగానని చెప్పు!హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి రావాలి!"
నవ్వాడు మిత్ర.
"నువ్వు నాకు క్లాసుమేటువే కాదు. మీ నాన్నగారు మాకు బ్యాంకు లాగా ఉండేవారు. మా నాన్న ఎప్పుడు అడిగినా లేదనకుండా డబ్బులిచ్చేవారు. ఆ విషయం నేనెలా మర్చిపోతాను? తప్పకుండా వస్తాను! ఈ ట్రిప్ లో నిన్ను ఒకసారి మా ఇంటికి తీసికెళ్ళాలనుకున్నాను.కానీ అంతమందిలో నిన్ను ఒక్కదాన్ని అడిగితే బాగుండదని ఊరుకున్నాను!...."
"అసలు టైమ్ ఎక్కడ ఉంది? అటూ ఇటూ తిరిగే సరికి టైమ్ అయిపోయింది.మనం అందరం ఇలా కలుసుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంది.....ఈ సారి ఇంటికి వస్తానులే మిత్రా!"
బస్ కదలబోతుంటే వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు మిత్ర.
బస్ కదిలింది.
ఇంటికొచ్చి అమ్మా నాన్నతో ఆ రెండు రోజులు వరంగల్ లో కలిసిన ఫ్రెండ్స్ గురించి, టీచర్ల గురించి చెప్తూ, మిత్ర గురించి కూడా చెప్పింది మాళవిక.
"నాగరాజు, వాళ్ళావిడ వంటలు చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. అప్పుడప్పుడూ ఇబ్బందిగా ఉంటే నన్ను డబ్బులు అడిగే వాడు. వీడికి చదువుమీద శ్రద్ధ లేదని నాతో చెప్పుకొని బాధపడేవాడు. పోనీలే!అతడి కష్టం ఫలించింది!కొడుకు ప్రయోజకుడయ్యాడు!."
మెచ్చుకోలుగా అన్నాడు వాసుదేవరావు.
తండ్రి అలా మిత్రను మెచ్చుకుంటుంటే ఆనందం వేసింది మాళవికకు.
****
వారంరోజులు గడిచాయి.
ఆ రోజు మేనేజర్ సమీరను తన కాబిన్ లోకి పిలిచాడు. ప్రక్కనున్న మహిమ సందేహంగా చూసింది.సమీర కేబిన్ లోకి వెళ్తూ ఒక నిమిషం తలత్రిప్పి అందరినీ చూసింది. కొలిగ్స్ మొహాల్లో బెంగ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వారంలో చాలా మందిని మేనేజర్ పిలవటం, ఆ తరవాత వచ్చి వాళ్ళు ఉద్యోగం పోయిందని చెప్పటం రివాజుగా మారింది.
గట్టిగా ఊపిరి పీల్చుకొని మేనేజర్ దగ్గరికి వెళ్ళింది సమీర.
కాసేపటికి బయటికి వచ్చిన సమీర చుట్టూ మూగారు కొలిగ్స్ అందరూ.
"పోయింది!నాది కూడా!మీతో పాటే నేను కూడా!....నవ్వటానికి ప్రయత్నిస్తూ చెప్పింది సమీర.
"నీ ఉద్యోగం ఉంటుందేమోనని తెగ బాధపడ్డాను కదా!ఇప్పుడు నా బొజ్జలో హాయిగా ఉందనుకో!..."అన్నాడు శ్రీకర్ అనే కొలీగ్ వాతావరణాన్ని తేలిక చేస్తూ.
నవ్వారందరూ.
"మనం అందరం ఓకే బోటు.. కష్టం ఏ ఒక్కడికో రావటం లేదు. తోడుగా ఎంతమందో!... అందరితో పాటు మనం!..."
అందరూ తలా ఒక మాట మాట్లాడుతున్నారు.
"ఇంకో రెండు నెలలే!ఆ లోపల చూసుకోవాలి! కావాలంటే ఈ రెండు నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యొచ్చు!.."
"హాపీగా!"అంటూ అరిచారు కొందరు.
సమీరకు దిగులుగా ఉంది.
భద్రత ఎక్కడ ఉంది? మళ్ళీ ప్రయత్నాలు చెయ్యాలి!అనుకుంటూ మాళవికకు మెసేజ్ పెట్టింది.
"డోంట్ వర్రీ!మళ్ళీ దొరుకుతుంది!.. దిగులు పడితే ప్రయోజనం లేదు.నువ్వు బెంబేలు పడకు!రేపు కలుద్దాం!"
అంటూ రిప్లై ఇచ్చింది మాళవిక.
ఇల్లు చేరింది సమీర.
విషయం చెప్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంది సమీర.రఘురామ్, పద్మ కూతురి ప్రక్కనే కూర్చుని సముదాయించారు.
ఆ రోజు రాత్రి రఘురామ్ కూతురికి కంచంలో అన్నం పెట్టుకొని వచ్చి ముద్దలు కలిపి పెడుతూ ఉన్నాడు.
"కొన్ని రోజులు సెలవన్నమాట!పాజిటివ్ గా ఆలోచించాలి మనం!ఇది కాకపోతే ఇంకోటి. హాయిగా ఇంట్లో ఉండు!రేపు బుక్స్ షాప్స్ కి వెళ్లి మంచి బుక్స్ కొనుక్కొచ్చుకుందాం!"
"పోనీ!ఆ సంబంధం చేసుకోరాదూ!టెన్షన్ ఉండదు నాకు!..."తల్లి మాటలకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు సమీరకు.
ఎటు తిప్పి ఎటు వచ్చినా తల్లికి తన పెళ్లి గురించే తపన.
"కాసేపు ఈ టాపిక్ వదిలేస్తావా!నాకు మనశ్శాంతి లేకుండా చెయ్యకు!..."విసుగ్గా ఉంది సమీరకు.
ఇంట్లో ఉంటే అమ్మ తన బుర్ర తినేస్తుంది.
ఆఫీసుకు వెళ్లటమే నయం!
ఆ రోజు ద్రాక్షారామం నుండి పద్మ తమ్ముడు రామకృష్ణ వచ్చాడు. పద్మ పుట్టిల్లు ద్రాక్షారామం.
సమీర పెళ్లి సమస్య గురించి తమ్ముడితో చెప్పుకొని బాధపడింది పద్మ.
"నువ్వు ఊరికే దిగులు పడకక్కయ్యా!సమీరను ఒక పదిరోజులు మా దగ్గరికి పంపించు!నేను, సరళ కాస్త బ్రెయిన్ వాష్ చేస్తే తప్పకుండా దారికొస్తుంది. అందరిళ్లల్లోనూ ఇదే వరస. పెళ్ళి వద్దంటూ ఏళ్ల తరబడి మొండికేసి కూర్చోవటం, వయసుయిపోయాక ఒంటరిగా దిగులుపడటం ఇప్పటి తరానికి పట్టిన జాడ్యం."
"ఏమిటోరా!పిల్ల పెళ్ళి గురించి నాకు, మీ బావగారికి దిగులయి పోయింది. ఎన్ని దేవుళ్ళకు మ్రొక్కుకుంటున్నామో!...."నిట్టూర్చింది పద్మ.
సమీర ఆఫీసు నుండి రాంగానే ద్రాక్షారామానికి రమ్మంటూ బలవంతం చేశాడు రామకృష్ణ.
మొదట రాను రానన్నా తర్వాత అమ్మ పెట్టే పెళ్లి గొడవ కొంచెం తప్పించుకోవచ్చు అనుకుంటూ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని మేనేజర్ కు చెప్పి మామయ్యతో పాటు ద్రాక్షారామం బయలుదేరింది సమీర.
రామకృష్ణ ద్రాక్షారామంలో ఆయుర్వేద డాక్టర్. అతడికి ఇద్దరు మగపిల్లలు. వరుణ్, వికాస్ లు.స్కూల్ చదువుల్లో ఉన్నారు.ఒక ప్రక్క వర్క్ చేసుకుంటూ,పిల్లలతో ఆటలతో కాలం గడుపుతోంది సమీర.
ఆ రోజు రామకృష్ణ మధ్యాహ్నం వరకు పెషేంట్లను చూసి మేడపైకి వచ్చాడు. క్రింద పోర్షన్ లో క్లినిక్ ఉంటుంది.
మూడింటికి పిల్లలతో హాల్లో కారమ్స్ ఆడుకుంటూ ఉంది సమీర.
"బాబాయి ఉన్నారా?"అంటూ వచ్చాడో యువకుడు.
తలెత్తి చూసింది సమీర.
స్ఫురద్రూపం... కళ్ళల్లో చురుకుదనం.రింగుల రింగుల జుట్టు. హుందాగా ఉన్నాడు.
"రా!రా!ప్రణయ్!నువ్వు కూర్చో!బాబాయిని పిలుస్తానుండు!"అంటూ రామకృష్ణ భార్య సరళ లోపలికి వెళ్ళింది.
"మా హైదరాబాద్ సమీర వదిన. ."అంటూ పరిచయం చేశాడు వరుణ్.
"హాయ్!"అంటూ పలకరింపుగా నవ్వాడు ప్రణయ్.
"హలో!"అంది సమీర నవ్వుతూ.
ఇంతలో లోపలినుండి వచ్చాడు రామకృష్ణ.
"మందులు తీసిపెట్టాను ప్రణయ్!నేనే పంపిద్దామనుకొంటున్నాను."అంటూ మందుల ప్యాకెట్టు ప్రణయ్ కిచ్చాడు.
"నీకు గుర్తులేదనుకుంటా సమీరా!నీ చిన్నప్పుడు ఆడుకొనేదానివి.మన వీధి చివర జగన్నాధం తాతయ్య గారి మనవడు. ప్రణయ్. గుర్తుపట్టవా!ప్రణయ్!పద్మ అత్తయ్య కూతురు...."
ప్రణయ్ ముఖం విప్పారింది.
"గుర్తు పట్టలేదు బాబాయ్!చిన్నప్పుడు చూసిందే.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?.."
"కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేస్తున్నాను..."
సమీర మాట పూర్తి కాలేదు రామకృష్ణ అందుకొన్నాడు.
"వీడి గురించి చెప్తాను విను!అమెరికాలో ఎమ్. ఎస్. చేసి, బ్రహ్మాండమైన ఉద్యోగం చేస్తూ, ఆ ఉద్యోగం వదిలేసి వచ్చాడు. ఇక్కడే వాళ్ళ నాన్న కున్న ఐదెకరాల పొలంలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు. వీళ్ళ నాన్న కంటే వీడే నాకు మంచి ఫ్రెండ్. నీకు నచ్చే విషయం చెప్పనా!మనింట్లో కంటే వీళ్ళ ఇంట్లో మంచి లైబ్రరీ ఉంది. మంచి మంచి బుక్స్ కలెక్ట్ చేసి పెడుతుంటాడు."
రామకృష్ణ మాటలకు నవ్వుతూ
"సరే!బాబాయ్!నేను వెళ్ళాలి. మీరు పిల్లల్ని తీసికొని మా ఇంటికి రండి!మీరు వచ్చారంటే అమ్మావాళ్ళు చాలా సంతోషిస్తారు." అంటూ బయల్దేరాడు ప్రణయ్.
అతడు వెళ్ళాక " అమెరికా నుండి ఎందుకు వచ్చేశాడు? అంత చదువు చదివి వ్యవసాయం చేస్తున్నాడా? కారణం ఏమిటి మామయ్యా? "అంది సమీర కుతూహలంగా.
"దాన్నే 'తిక్క 'అంటారు తల్లీ!మొదట్లో వాళ్ళ నాన్న కూడా గొల్లుమన్నాడు. అంతడబ్బు పెట్టి చదివిస్తే అదంతా వృధా అయిందే అని. కొడుకు డాలర్లు సంపాదించి తెస్తే ఇక్కడ మేడలు, మిద్దెలు కట్టిపెడదామని వాళ్ళ నాన్న కలలు కన్నాడు. తీరా వీడు గోడకు కొట్టిన బంతిలాగా పొలాల్లో పడ్డాడు. మీ తరం వాళ్ళను అర్థం చేసుకోవటం చాలా కష్టం!నువ్వు మీ అమ్మా, నాన్న మాట వింటున్నావా చెప్పు!..."
రామకృష్ణ మాటలు సమీరలో ఇంకా కుతూహలాన్ని పెంచాయి.
***
ఆ సాయంత్రం పక్కింటి వాళ్ళ పాప పుట్టినరోజు.సరళ సమీరను వెంట తీసికొని వెళ్ళింది. అక్కడ దాదాపు యాభైమంది దాకా వచ్చారు. కుర్చీలు వేస్తూ, భోజనాల ఏర్పాట్లు చూస్తూ ప్రణయ్ కనిపించాడు. సమీరను, సరళను పలకరించి తన పనిలో తాను వెళ్లిపోయాడు. చాలా మంది తల్లికి తెలిసిన వాళ్ళు. వాళ్ళల్లో ప్రణయ్ తల్లి సరస్వతి కూడా ఉంది.
"నిన్ను చిన్నప్పుడు చూశాను. ఏది? మీ అమ్మ ఇక్కడికి ఎక్కువసార్లు రాదాయె!ఎప్పుడూ మీ నాన్నకు ట్రాన్స్ఫర్ల ఉద్యోగం. మీకు స్కూళ్ళని, చదువులనీ ఎక్కువగా రాదు. ఎవరి ఇళ్లల్లో వాళ్లకు సరిపోతుంది. మొన్నటిదాకా మా అత్తగారు ఉన్నారు.పెద్దావిడ మంచంలో ఉండేది. ఆవిడకు చేసి , పిల్లల బాధ్యతలు పూర్తిచేసేసరికే నా జీవితం అరిగి పోయింది..ఇంకా ఫ్రెండ్స్ ని కలుసుకోవటం నా రాతలోనే లేదు...నువ్వయినా కనిపించావు. నాలుగు రోజులంటావా!రేపు మా ఇంటికి రా!మీ అమ్మను చూసినట్లే ఉంది."
సరస్వతి ముఖం వడలినట్లుగా ఉంది. జుట్టు నెరసి పోయింది. కాళ్ళనొప్పులు కాబోలు!మెల్లగా నడుస్తోంది. '
అమ్మ, ఈవిడ ఓకే వయసువాళ్ళు కదా!ఈవిడే చాలా పెద్దదానిలా కనిపిస్తోంది. అమ్మ ఈవిడ కంటే యంగ్ కాబోలు!'అనుకుంది సమీర.
ఆప్యాయంగా సమీర చెయ్యిపట్టుకొని కూర్చుంది సరస్వతి. అక్కడ చాలా మంది తల్లి గురించి అడిగారు. 'ఇక్కడి వాళ్లకు ప్రేమ ఆప్యాయతలు ఎక్కువే ' మనసులో అనుకుంది సమీర. అందరూ కలిసి భోజనాలకు వెళ్లారు. అక్కడ వడ్డన చేస్తూ కనిపించాడు ప్రణయ్.
'ఇతడు అందరికీ సాయం చేస్తూ కలుపుగోలుగా ఉంటాడు కాబోలు '. అనుకుంది సమీర.
భోజనాలయ్యాక వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ ఉంటే ప్రణయ్ వచ్చాడు. అతడిని చూసి నవ్వింది సమీర.
"ఎలా ఉంది మా ఊరు?"నవ్వుతూ అడిగాడు ప్రణయ్.
"చాలా బాగుంది. చల్లగాలి, పంట పొలాలు, భీమేశ్వరుడి గుడి... అన్నీ బాగున్నాయి."
"రేపు మా ఇంటికి రండి!మా ఆవు ఈనింది. మా ఇంటికి వస్తే జున్ను ఫ్రీ. స్వచ్ఛమైన వన్నీ మా పల్లెటూళ్ల సొంతం...."
"అందుకేనా అమెరికా వదిలేసి ఇక్కడికి వచ్చారు "
ఒక్క క్షణం సమీర వైపు కళ్లార్పకుండా చూశాడు ప్రణయ్.
'ఎందుకడిగానా!'అనుకుంది సమీర.
అతడు నవ్వేశాడు.
"ఇక్కడికొచ్చి శుంఠ అనే బిరుదు సంపాదించుకొన్నాను. అందరికీ కారణాలు వివరించటం కంటే మౌనంగా ఉండటం మేలు..."
"సారీ అండీ!..."
"అరెరే!సరదాగా అన్నాను. పట్టించుకోవద్దు. రేపు వస్తారుగా!మీకు బుక్ రీడింగ్ ఇష్టమని బాబాయి చెప్పారు. మా ఇంటి లైబ్రరీ చూద్దురు గాని!.."
అతడిని ఇంకెవరో పిలవటంతో సమీరకు" బై "అంటూ చెయ్యి ఊపి అక్కడి నుండి వెళ్ళాడు ప్రణయ్.
(సశేషం.)
No comments:
Post a Comment