మలుపు
లక్ష్మీ రాఘవ
“ఉత్తర భారతం మునక “
భారీ వర్షాలతో 15 మంది మృతి!
ఉత్తర భారతాన్ని వరుణుడు
ముంచెత్తుతున్నాడు ఢిల్లీ, ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ తడిసి ముద్దవు తున్నాయి.
ఆకస్మిక వరదలు, కొండచారులు విరిగిపడి రాకపోకలు స్థoభించాయి. కొంతమంది ప్రాణాలు
పోగొట్టుకున్నారు. సాధ్యమైనంత రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి ..”
T.V లో హెడ్ లైన్స్ వింటూంటే గాబారాతో ఒళ్ళంతా చెమటలు పట్టింది సీతకు. సమయానికి
భర్త రాజారావు కాంప్ వెళ్ళటం, ఒంటరిగా ఉండటం ఇంకా భయాన్ని పెంచింది. నేరుగా పల్లవినే అడగవచ్చు కదా అని
వెంటనే పల్లవి ఫోను కలిపితే. రావటం లేదు.
రాత్రి మాట్లాడినప్పుడు వర్షాలు ఎక్కువ కావచ్చు వెనక్కి వచ్చేయాలని అనుకుంటున్నామంది.
కేదార్నాధ్ నుండీ బయలుదేరుతామని కూడా చెప్పింది.
పెళ్ళయి మూడు నెలలకు విహారయాత్రగా
యమునోత్రి, గంగోత్రి, కేదారీనాథ్, బద్రినాథ్ కు వెళ్ళటమే ఒక విచిత్రం!
“తమిళనాడు యాత్ర చేయండి. బాగుంటుంది”అంటే కూడా
‘తమిళనాడు, కేరళ లాటివి ఎప్పుడైనా
చూడచ్చు. పల్లవికీ, నాకూ కూడా ఇలా వెళ్లాలని ఉంది. మీరు అడ్డు చెప్పద్దు” అన్నాడు
అల్లుడు శ్యామ్.
“మరీ పెళ్లి అవగానే ఇంత దూరం
వెళ్ళాలా” సీత సందేహానికి
“అమ్మా, మేమిద్దరం మరీ చిన్నపిల్లలం
కాదు.. పల్లవికి కూడా ఇష్టపడింది. ఇంకోసారి అందరం కలిసి వెడదాం” అని మరి
మాట్లాడనీకుండా చేశాడు శ్యామ్. రాజారావూ ‘పిల్లలు
ఆలోచించుకునే నిర్ణయించుకున్నారు కదా’ అన్నాడు అడ్డు చెప్పకుండా... ఇప్పుడెంత కష్టం
వచ్చింది ...
మళ్ళీ టివి ముందు కూర్చుంది సీత.
“కేదారనాథ్ నుంచి వెడుతున్న యాత్రీకుల
బస్సు ముల్కoటి బ్రిడ్జి -హోటల్ ఆనంద్
కాశీ మధ్య నదిలో కొట్టుకు పోయింది. ఒక్క ఐదుగురిని మాత్రం రక్షించగలిగారు ..” ఈ
వార్త తో సీత గుండె బేజారయిపోయింది. అంటే మిగిలినవారు చనిపోయినట్టేనా?
“వర్షం ఎడతెరిపి లేకుండా కురవటం తో
పలు ప్రాంతాలలో రెడ్ అలర్ట్ చేశారు..”వార్తలు వినబుద్ది కాక లేచింది సీత.
రాజారావుకి ఫోను చేయక తప్పలేదు. ఆయన అప్పటికే
చాలా మందిని కాంటాక్ట్ చేస్తూ విషయ సేకరణ చేస్తున్నాడు. అదే మాట సీతకు చెప్పగానే కొంచెం
రిలాక్స్ అయ్యింది.. నీరసంగా పరుపుమీద వాలింది.
*****
ఒక్కసారిగా తన ఒక్కగాని ఒక్క కూతురు
పల్లవి గురించిన ఆలోచనలు చుట్టుముట్టాయి. చిన్నప్పటినుండీ చక్కటి గొంతు, పాట వినగానే వెంటనే గ్రహించి పాడే స్వాభావాన్ని
గుర్తించి పల్లవిని సంగీతం క్లాసులకు పంపడం మొదలుపెట్టారు సీత దంపతులు. చదువుతో
బాటు సంగీతాన్ని అభ్యసించింది. వర్ణాలనూ, రాగాలనూ అంత త్వరగా గ్రహించగలిగే పల్లవి,
సంగీతం మాస్టారు రామారావుగారికీ ప్రియ
శిష్యురాలైంది. రెండేళ్లలోనే మొదటి గాత్ర కచేరీ లో పాల్గోనడం తో బోలెడంత దైర్యం
కలిగింది. మరి వెనుదిరగలేదు. తల్లిదండ్రులు సపోర్ట్ గా ఉండటంతో చదువు ప్రైవేటుగా
కూడా చదువుకోవచ్చు అన్న ఉద్దేశ్యం తో సంగీతాన్నే పూర్తి స్థాయిలో అవపోసన పట్టింది. కానీ
క్రమంగా కచేరీల తాకిడి తగ్గింది..
మారుతున్న కాలంతో తనతోబాటు సంగీతం
నేర్చుకున్న వారంతా లైట్ మ్యూజిక్ పాటలు ప్రాక్టీసు చేస్తూ సినిమాల ఛాన్సుల కోసం
ఎగబడ్డారు. ఫ్రెండ్స్ కొంతమంది సలహాలిచ్చినా పల్లవి మారలేదు. రామారావు మాస్టారికి
వయసు పెరిగింది.
ప్రైవేటుగా
డిగ్రీ పూర్తిచేసింది పల్లవి. ఇక తప్పనిసరిగా పెళ్లి చేసేయాలని ప్రయత్నించారు సీత,
రాజారావు దంపతులు. ప్రతి సంబంధమూ పల్లవి చదువు గురించీ, ఉద్యోగం గురించీ విచారించి
వెనుదిరిగారు. సాంప్రదాయ సంగీతం ఎవ్వరికీ పట్టలేదు. సంగీతం ఇష్టమైనవారు కూడా మాకు
కచేరీలు చేసే అమ్మాయి అవసరం లేదు అన్నవారే. ఇది చాలా బాధ కలిగించిన విషయం. కానీ
పల్లవి ధైర్యం కోల్పోలేదు. రామారావు మాస్టారు సంగీతం క్లాసులకు టీచర్ గా పని
చేయసాగింది. ఇంటి దగ్గర కూడా కొంతమంది పిల్లలు సంగీతం కోసం వచ్చేవారు. వయసు
పెరుగుతున్న కూతురు ఇలా ఉండిపోవటం ఇష్టం లేకపోయినా తమ ప్రయత్నం మానకుండా సంబంధాలు చూస్తూనే
ఉన్నారు..అలా పల్లవికి ముప్పై ఏళ్లు దాటిపోయాయి.
అప్పుడు రామారావు మాస్టర్ ద్వారా
వచ్చిన సంబంధమే శ్యామ్ ది. శ్యామ్ కుటుంబం లో అందరూ కర్ణాటక సంగీత విద్వాంసులట. ముందు
శ్యామ్ పల్లవిని కలిసి మాట్లాడుతాను అన్నాడట. పల్లవి అభ్యంతరపెట్టలేదు కానీ తమ
ఇంటికి దగ్గరలో ఉన్న రాములవారి దేవాలయం లో కలుస్తానంది. పెద్దలు అంగీకరించారు.
సాయంకాల సమయం లో అనుకున్న సమయాని కంటే
అరగంట ముందుగా రాజారావు కూతుర్ని కారులో తీసుకు వచ్చి గుడి దగ్గర దింపి తాను బయట
కారులో కూర్చున్నాడు.
గుడిలో రాములవారికి సాయంకాల హారతికి తయారవుతూ
వున్న పూజారి పల్లవిని చూసి “రామ్మా పల్లవీ, సరిగ్గా సమయానికి వచ్చావు. ఒక పాట
పాడు, హారతి చేస్తాను” అన్నాడు. పల్లవి తరచూ అక్కడికి వచ్చి ఒకటో, రెండో కీర్తనలు
పాడి వెళ్ళటం అలవాటే కనుక వెంటనే “జగదానందతారకా ..”అని శ్రావ్యంగా పాడింది. హారతి
పూర్తిచేసి అక్కడ ఉన్న భక్తులకు ఇచ్చాడు. శఠారి పెడుతూ ఆశీర్వదించాడు. అప్పుడు చుట్టూ ఉన్న
అందరినీ చూసింది పల్లవి.
చివరగా నుంచున్న ఒకతను పల్లవిని చూసి
చిరునవ్వు నవ్వాడు. అతనే శ్యామ్ అని గుర్తుబట్టింది పల్లవి.
బయటకు వస్తున్న పల్లవి దగ్గరగా వచ్చి”పల్లవి
గారూ... “అన్నాడు వెంటనే తల ఊపింది.
“శ్యామ్ “ అన్నాడు గుండెల మీద చెయ్యి
ఉంచుకుని నేనే అన్నట్టుగా.
పల్లవి నవ్వింది. “ఇక్కడ కూర్చుందామా?
అని అక్కడే ఉన్న మండపు మెట్ల మీద చేయి చూపితే పల్లవి తల ఊపి కూర్చుంది. ఆమెకు
కొంచెం దూరం లో కూర్చుంటూ “అద్భుతం గా పాడారు పల్లవీ” అభినందించాడు.
“ఇక్కడ వచ్చినప్పుడల్లా పాడటం అలవాటు
” అని చెప్పింది
శ్యామ్ తన కుటుంబం లో సంగీతం పాత్ర
గురించి చెబుతూ తల్లిదండ్రులు ఇద్దరూ యాక్సిడెంట్ లో పోవడం వల్ల పెళ్లి మీద ధ్యాస
తక్కువై ఆలస్యం చేశానన్నాడు. ఇప్పుడు మాస్టారి ద్వారా పల్లవి సంబందం తెలిసాక
సంగీతం తెలిసిన అమ్మాయి, వయసు సరిపోతుoదన్న ఉద్దేశ్యం, ముందుగా తన ఆలోచనలు, ఉద్యోగ విశేషాలు చెప్పి తరువాతనే
తల్లిదండ్రులను కలవాలన్న భావన...అందుకు అనుగుణంగా పల్లవి కూడా గుడిలో కలవాలనుకోవడం
చాలా నచ్చిన విషయం.....ఇలా శ్యామ్ చెబుతూంటే పల్లవికి ప్రతి విషయమూ నచ్చింది.
“నేనూ ఒక్కతే అమ్మాయి కాబట్టి
తల్లిదండ్రుల బాధ్యత కొంత వరకూ ఉంటుంది .. “అన్నట్టుగా పల్లవి చెబితే శ్యామ్
వెంటనే
“నాకూ ఇలాటి కుటుంబమే కావాలి పల్లవీ.
మీరు ఓకే అంటే మీ ఇంటికి వస్తాను” అన్నాడు సంతోషంగా.
గుడి బయటకు రాగానే కారు లో కూర్చున్న
రాజారావు పక్క పక్కన నడుస్తున్న వీరిద్దరినీ చూసి సంతోషిస్తూ కారు దిగాడు.
నాన్న దగ్గరికి రాగానే పల్లవి “శ్యామ్
గారూ, మానాన్న రాజారావు గారు “అని పరిచయం చేసింది.
అందరూ కలిసి ఇంటికి వెళ్లారు..
వారం రోజుల్లోనే పెళ్ళి జరిగిoది...మూడునెలలు కొత్తకాపురం. ఆపైన ఈ
యాత్రా ప్రయాణం .. సినిమా రీలు లాగా కదులుతున్నాయి సీత మనసులో ...
******
ఇంతలో ఫోను మ్రోగేసరికి ఉలిక్కిపడి
లేచింది సీత.
రాజారావు ఫోను. ట్రిప్ లో గాయపడ్డ అనేక మంది యాత్రీకులను
ఆస్పత్రిలో చేర్చారట. నెమ్మదిగా పేర్లు ప్రకటిస్తారట.
సీతను భయపడవద్దని, తాను వెంటనే
బయలుదేరి వస్తున్నట్టు చెప్పాడు.
ఆ రాత్రి నిద్రలేదు సీతకు..
పొద్దున్నే రాజారావు వచ్చినా వరద విషయాలు
తెలుసుకునే ప్రయత్నం లోనే సరిపోయింది..
ఇంతలో చనిపోయిన జాబితా బయటకు రావటం,
అందులో శ్యామ్ పేరు ఉండటం తో క్రుంగిపోయారు ఇద్దరూ.. పల్లవి కోసం వెళ్ళే పరిస్థితి
లేదు. డిల్లీ దాకా కూడా వెళ్ళటం కుదరదు. అక్కడ కూడా చాలా వర్షాల, వరదల వార్తలు
భయపెట్టాయి.
అనుకోకుండా రెండో రోజు ఒక ఫోను
వచ్చిందీ. “పల్లవి మీ అమ్మాయే కదా “ అని తెలుగులో మాట్లాడాడు ఆయన
“అవును . మీరెవరు?..”
“మీరు భయపడకండి. నాపేరు ప్రకాష్. నేనూ
ఒక ప్రయాణీకుడిని. ఇక్కడ మీ అమ్మాయి పల్లవి నెమ్మదిగా కోలుకుంటోంది. ఈ రోజు నాకు
ఫోను నెంబరు ఇస్తే చేస్తున్నాను. మీరు గాబరా పడతారేమో అని మీకు చెబుతున్నాను....నేను
కొంచెం తొందరగా కోలుకున్నాను. ఒంటరి వాణ్ని కాబట్టి ఇక్కడే అందరికీ సాయంగా
ఉంటున్నాను..”
“ప్రకాష్ గారు, థాంక్ యూ సోమచ్. ప్లీజ్
మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి తనకి కొంచెం హెల్ప్ చేయండి...”
“ఇక్కడ అందరూ అదే పరిస్థితిలో
ఉన్నాము. ఒకరికి ఒకరు .. అంతే. గాయపడ్డ వారిది ఒక్కొక్కరిదీ ఒక్కో గాధ. కొందరికైనా
సాయపడటానికి నాలాటి కొందరిని తక్కువ దెబ్బలతో బతికించాడేమో. ఇక్కడ రెస్క్యూ వాళ్ళ
కష్టాన్ని కొంచెం పంచుకుంటూ ఉంటే బతికిన ప్రతి మనిషి ఆక్రోశం అర్థం అవుతూంది.
దేవుడు నాకు ఒక అవకాశం కలిగించాడు కాబట్టి ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండదలిచాను. మీకు
మళ్ళీ ఫోను చేస్తాను ..” అని అతడు పెట్టేయగానే ఆ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుని సీత కు
విషయం చెప్పాడు. అప్రయత్నగా చేతులెత్తి దండం పెట్టింది.”దేవుడి సాయం ఇలా” అంటూ
సాయంకాలం ప్రకాష్ ఫోను వచ్చింది. పల్లవి
బెటర్ అవుతూందని చెప్పాడు.
మరురోజు మళ్ళీ వర్షాలు ఎక్కువ అయ్యే
సూచనతో అవటం ప్రభుత్వం కొలుకుంటున్నవారిని
స్వస్థలాలకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
మూడు రోజుల తరువాత హైదరాబాదు వారిని
ప్రత్యేకం గా పంపింది ప్రభుత్వం. రాజారావు వెళ్ళి పల్లవిని ఇంటికి తీసుకు వచ్చాడు.
ఒక వారం తరువాత కోలుకున్న పల్లవి
శ్యామ్ నీటిలో కొట్టుకుపోవడం కళ్ళారా చూసినట్టు, అతని ఆచూకీ తెలుస్తుo దా అని బాధపడుతూ, తనకూ స్పృహ
కోల్పోవడం గుర్తుకు వచ్చి చెప్పింది. ఈ విషాదానికి తట్టుకోలేకపోయింది ఆ కుటుంబం.
మూడు నెలలు గడిచాయి. పల్లవి నెమ్మదిగా
కోలుకుంది. చిన్నగా స్వరం సరిచేసుకుంటూ పాటలు పాడటానికి ప్రయత్నిస్తూ ఉంటే
కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యేది సీత. పల్లవి
మళ్ళీ పాటలు పాడుకోవడంతో కొలుకోగలదన్న నమ్మకం రాజారావు ది.
పెళ్లి అయిన తరువాత శ్యామ్ తో
పల్లవి జీవితం బాగుంటుందని ఎంతో నమ్మిన తల్లిదండ్రులు దేవుడిలా అన్యాయం చేస్తాడని
అనుకోలేదు. పెళ్లి తరువాత విహారయాత్ర బదులుగా దేవుడి దర్శనం చేసుకోవడం తప్పయిందా? అని
సీత పదే, పదే అనటం తో ఒక రోజు పల్లవి “దేవుడిని నిందించకమ్మా.. మనకెలా జరగాలని ఉందో
అలా జరుగుతుంది. రోజూ పేపర్లలో చదువుతున్నావు
తిరుపతి వెడుతూ బోల్తా పడ్డ బస్సులు, పెళ్ళిళ్లకు వెళ్ళి వస్తూ యాక్సిడెంట్లూ.... ఎన్నో
కుటుంబాలు ఇలా అవుతున్నాయి. మన కర్మలకు దేవుడిని నిందించకూడదు ..”అంటూంటే ఇ౦కా
బాధపడింది సీత. పెళ్లి చేయకుండా కన్యగానే పుట్టినింట ఉండిపోయినా బాగుండేది
అనిపించేది.
రెండునెలల్లో మళ్ళీ సంగీతం క్లాసులు తీసుకునేంత సరిపోయింది
స్వరం.
కొంతమంది పిల్లలు నేర్చుకోవడానికి రావటం
మొదలు పెట్టారు. స్టూడెంట్స్ తక్కువే అయినా పల్లవికి కాలక్షేపం అవుతూంది..
*****
ఆరోజు ఆదివారం పొద్దున 11 గంటల సమయంలో ఇంటి బెల్ మ్రోగితే
రాజారావు తలుపు తీశాడు.
“సార్. మీరు రాజారావుగారనుకుంటాను”
అంటూన్న అపరిచితుడిని చూస్తూ “అవును. మీరూ?” అన్నారు
“నా పేరు ప్రకాష్, మీ అమ్మాయి పల్లవి కేదార్నాధ్
ప్రమాద సమయం లో ఫోను చేశాను ..” అనగానే
“అరె, మీరా .. రండి ప్రకాష్” అని సోఫా
చూపిస్తూ అప్రయత్నంగానే ప్రకాష్ చేతులు పట్టుకుని, భుజం మీద చేయి వేస్తూ “ప్రకాష్..
మీకు ఎంత ఋణ పడి ఉన్నామో..”అన్నాడు పక్కన కూర్చొని.
“అంతేమీ లేదండీ.. పల్లవి గారు కోలుకునే
స్థితిలో ఉండటం, నేను అంతగా గాయపడలేదు కాబట్టి కాస్త సహాయ పడ్డాను. ఇప్పుడు పల్లవి
బాగున్నారా?” అంటూన్నప్పుడు అక్కడికి వచ్చారు సీతా, పల్లవీ.
పల్లవి ప్రకాష్ ని గుర్తుపట్టింది.
“బాగున్నారా?? మీ సహాయం మరువలేనిది” అంది
నమస్కరిస్తూ. సీత కూడా ముందుకు వచ్చి పలకరింపుగా నవ్వి ”కాఫీ తెస్తాను” అంటూ
లోనికి వెళ్ళింది. పల్లవి కూడా సీతను అనుసరించడంతో రాజారావు నెమ్మదిగా
“సారీ నేను మీకు మళ్ళీ ఫోను చేయలేక
పోయాను. మా అల్లుడు శ్యామ్ చనిపోవడం పల్లవి ఎలా తీసుకుంటుందో అర్థం కాలేదు. తాను
కొలుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. మధ్యలో ఒకసారి మీకు ఫోను చేయాలనిపించినా
ఆలస్యంగా పలకరిస్తున్నందుకు మీరు
ఏమనుకుంటారో..’అనుకుని...” గిల్టీ గా అన్నారు రాజారావు ప్రకాష్ ను సూటిగా చూడ లేక.
“పరవాలేదు సర్. నేను కూడా అదే బస్సులో
ప్రయాణం చేశాను కాబట్టి శ్యామ్ గారిని చూశాను. అందరూ కొట్టుకు పోతూ ఉంటే నిస్సహాయంగా
చూస్తూ ఉండిపోయాము. పల్లవి గారిని హాస్పిటల్ ల్లో చూశాక గుర్తుపట్టాను. తోటి
మనిషిగా మీకు తెలిపాను. నాకు తెలుసు ఇలాటి సమయంలో కుటుంబం ఎంత బాధ పడుతుందో..”
పల్లవీ ఇద్దరికీ కాఫీ ఇచ్చింది. తను కూడా
ఒక కప్పుతో అక్కడే కూర్చుంది.
“మీతోబాటు మీ వాళ్ళు ఎవరూ రాలేదా ఈ
యాత్రకు?..” పల్లవి ప్రశ్నకు
“లేదండీ. నాన్న చిన్నప్పుడే పోయారు..మా
అమ్మను కరోనా టైము లో పోగొట్టు కున్నాను. ఈ యాత్ర చేయాలని ఆశ ఆమెకు ఉండేది.
అందుకనే నేను ఒకసారి దర్శనం చేసుకు వస్తే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందనిపించి ఒంటరిగా
బయలుదేరాను..” బాధగా అన్నాడు ప్రకాష్.
“సారీ ..” పల్లవి అంది.
ప్రకాష్ తల ఊపి కాఫీ కప్పు కింద
పెట్టాడు. ఖాళీ కప్పులను తీసుకుని పల్లవి లోపలకు వెళ్ళింది.
“మీకు ఇబ్బంది లేకపోతే ఈ పూట
మాయింట్లో ఉండండి.” అన్నారు రాజారావు.
“లేదు సర్ మీతో మాట్లాడాలని వచ్చాను. ఆస్పత్రిలో
పల్లవి గారి అడ్రెస్ తెలిసింది. చాలా ఆలోచించిన తరువాత మీతో ఒకసారి చెప్పి
చూద్దామని అనుకున్నా.. “
“చెప్పండి ప్రకాష్..” ఏమి చెబుతాడో అన్న
ఆతృతతో చూశాడతన్ని.
“సర్, కొద్ది రోజులనుండీ ఒక ఆలోచన
నామనసులో వస్తూంది. శ్యామ్ గారు పోవటంతో పల్లవిగారు ఒంటరి అయ్యారు. తనకీ, నాకూ
కావాల్సింది ఒక తోడు. ఎవరూ లేని వాడిని. నాకు ఒక కుటుంబం కావాలి అనిపించింది. ఇది
తప్పేమో నాకు తెలియదు నా ఆలోచన మీకు చెప్పాను. పల్లవి గారు అంగీకరిస్తే, మీరూ
ఆలోచించుకుని అందరి సమ్మతితో ఏమనుకుంటారో చెప్పండి. మీకు కావాలసినంత సమయం
తీసుకోండి. బలవంతం లేదు. మీ నిర్ణయం ఏదైనా నాకు తెలపండి...” అన్నాడు నమ్రతగా.
రాజారావుకి అతని కోరిక స్వార్థపరంగా
అనిపించలేదు ఆ క్షణంలో. పల్లవికి ఇది మార్పే కాదు ఒక శాశ్వత పరిష్కారం అవుతుందేమో...
ఇంతలో సీత వచ్చి రాజారావు వెనుకగా
నిలబడింది. కొద్ది దూరం లో పల్లవి ....
అతని మాటలు సీత, పల్లవి విని ఉంటారని
ఊహించలేదు రాజారావు.
సీత మొహం లో సమ్మతి కనపడినా పల్లవి
నిర్లిప్తంగా చూస్తూంది.
వెంటనే జవాబు చెప్పలేమేమో అన్న భావంతో
ఉన్న రాజారావు ను చూసి ప్రకాష్
“తొందరేమీలేదు. నిర్ణయం ఏదైనా
నిదానంగా చెప్పండి..” అంటూ లేచాడు.
పల్లవి రెండడుగులు వెనక్కి వేసి గోడనానుకుంది.
రాజారావు ప్రకాష్ తో బయటకు నడిచాడు.
సీత నెమ్మదిగా పల్లవి దగ్గరకు వచ్చి
భుజం మీద చెయ్యేసి౦ది. అమ్మభుజం మీద వాలింది పల్లవి.
శ్యామ్ ని అంతా తొందరగా మరచిపోగలదా...కష్ట
సమయం లో నిలబడి అవసరమున్నవారికంతా సాయం చేసిన మంచి మనిషి ప్రకాష్ ... ఇతన్ని వదులుకోవడమా?... ఎటూ తేల్చుకోలేని స్థితి లో ఉన్న పల్లవి మనసులో అలజడి..
కోరి వచ్చిన ఈ మనిషితో పల్లవి జీవితం
బాగుంటుందని తల్లి భావన.
ప్రకాష్ ను పంపి లోపలకు వచ్చిన
రాజారావు పల్లవి తనకు తానుగా చెబితేనే ముందుకు... అన్న ఆలోచన
ఆ ఇంట అనుకోకుండా ముంచుకొచ్చిన ఒక విషాదo సుఖాంతం అవుతుందా?
జీవితం లో కొన్ని
మలుపులు కాలమే నిర్ణయించాలి !!!
***
No comments:
Post a Comment