పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -4 - అచ్చంగా తెలుగు
demo-image

పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -4

Share This

                                       పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం - 4

బాలకాండ

దినవహి సత్యవతి

 


rama1

                                

                                                                       46.

సముద్రునిపై తీక్షణమౌ బాణములు ప్రయోగించెను,

క్షోభించిన సముద్రుడు భయముతో కంపించెను,

రాముని యెదుట నిజరూపాన ప్రత్యక్షమయ్యెను,

సేతువు కట్టుటకు రాముడికి ఉపాయం  చెప్పెను,

నలునిచే సేతువు కట్టించె రాముడనె, నారదుడు, సత్య!

47.       

సేతు మార్గమున రాముడు లంకను చేరెను,

యుద్ధమునందు రావణాసురిని సంహరించెను,

సీతను తిరిగి స్వీకరించుటకు సిగ్గు పడెను,

పరగృహాన వసించిన సీతను దూషించెను,

అవమానపడి  సీత అగ్ని ప్రవేశం చేసెననె, సత్య!

48.      

సీత పాపరహితయని అగ్నిదేవుడు పలికెను,  

అగ్నిదేవుని మాటలకు రాముడు సంతసించెను,

దేవతలచే మహాత్ముడని రాముడు పూజింపబడెను,  

రావణుని చావుకు ముల్లోకాలూ సంతసించెను,   

ఋషులూ, దేవతలూ రాముని స్తుతించిరనె, సత్య!

49.      

 రాముడు పూర్వం విభీషణుని అభిషిక్తుని చేసెను,

నాడతని లంకకు రాజు చేతునని ప్రతిజ్ఞ చేసెను,

అటులే విభీషణుని లంకాభిషిక్తుని జేసెను,

తన ప్రతిజ్ఞ నెరవేర్చుటలో కృతకృత్యుడయెను,

 దేవతలు రాముని చూడవచ్చి వరాలిచ్చిరనె, సత్య!  

50.      

ఆ వరాలతో మృతవానరుల బ్రతికించుకొనెను,

పుష్పక విమానారూఢుడై అయోధ్యకు తరలెను

హితులతో రాముడు భరధ్వాజ ఆశ్రమం చేరెను,

పిదప హనుమను, భరతుని వద్దకు పంపెను,

సుగ్రీవాదులకు పూర్వవృత్తాంతము చెప్పెననె, సత్య!

51.      

సీతా సమేతుడై రాముడు నందిగ్రామం చేరెను,

అచట తన సోదరులందరినీ మరలా కలిసెను,

సీతా, లక్ష్మణులతో కలిసి జటలను విడిచెను,

అటుల సీతనూ, తిరిగి రాజ్యమునూ పొందెను,

అయోధ్య రాజుగా అభిషిక్తుడయ్యె రాముడనె, సత్య!

52.      

రాముడు అయోధ్య రాజుగా అభిషిక్తుడయ్యెను,   

లోకమంతా సంతోషాతిశయంచే గగుర్పాటు చెందెను,

ఆనందముచే లోకానికి పరిపుష్టి లభించెను,  

ప్రీతి చెందిన ప్రజ  ధర్మమాచరించుచుండెను,

లోకమందు సకల బాధలు తొలగిపోయెననె, సత్య!

53.      

రామరాజ్యంలో, తండ్రియుండ పుత్రుడు మరణించడనె,  

స్త్రీలు వైధవ్యంలేక సదా పతివ్రతలై యుందురనె,

అగ్ని, జల, వాత, జ్వర, చోర భయములుండవనె,

క్షుధ్బాధ లేక దేశాలు సర్వ సమృద్ధాలై యున్నవనె,

కృతయుగంలోవలే ప్రజలు సంతుష్టులై యున్నారనె, సత్య!

54.      

రాముడు వేలాది అశ్వమేధ యాగాలు చేయుననె,    

 బహుసువర్ణక యాగాలతో సురల పూజించుననె

పదివేల కోట్ల గోవులు, ధనం బ్రాహ్మణులకిచ్చుననె,   

 దానాలతో తనదౌ శాశ్వత స్థానము పొందగలడనె 

రాజ్యాలిచ్చి క్షత్రియుల వంశాభివృద్ధి చేయుననె, సత్య!

55.  

 నాల్గు వర్ణాల వారిచే ధర్మాచరణ చేయించుననె

ప్రజలు సుఖము పొందునట్లు పాలించగలడనె,  

పదకొండువేల యేండట్లు రాజ్యపాలన చేయుననె,

పిదప రాముడు చేరు బ్రహ్మ లోకమును చేరుననె,

వేద సమ రామ చరిత్ర పరిశుద్ధి కల్గించుననె, సత్య!

56.  

 రామచరిత పుణ్యమిడి, పాపం నశింపజేయుననె,   

చదువెడివారి సర్వ పాపములు తొలగిపోవుననె,

రామాయణ ఆఖ్యానంతో ఆయుర్వృద్ధి కల్గుననె,

వారు పుత్రపౌత్రాదులతో సుఖంగా యుందురనె,  

 భృత్యు బంధు గణాలతో సౌఖ్యాలనుభవింతురనె, సత్య!  

57.  

రామాయణాఖ్యాన పఠితుడు స్వర్గం చేరుననెను 

అచట దేవతలచే పూజింపబడగలడనెను,

అట్లు నారదుడు సంక్షిప్త రామాయణ కథ చెప్పెను,    

నారదుని పల్కులు వాల్మీకి శ్రద్ధగా ఆలకించెను,

కథ విని నారద మహర్షికి ప్రణమిల్లె వాల్మీకి, సత్య!    

58.  

రామాయణ గ్రంథమునెల్లరూ పఠించదగును,

ద్విజుడు చదువ అష్టాదశ విద్యల్లో నేర్పరగును,

క్షత్రియుడు పఠించిన భూమండలాధిపతియగును,

వైశ్యుడు చదివిన వ్యాపారంలో లాభము పొందును,

శూద్రుడు పఠించిన గొప్పవాడగునని తెలుపబడె, సత్య!   

(మొదటి సర్గ సమాప్తం)

Comment Using!!

Pages