రామరాజ్యంలో గుమ్మడికాయ మాయ
కర్లపాలెం హనుమంతరావు
తండ్రి పిన్నమ్మకిచ్చిన మాట
తానుగా పాటించే నిమిత్తం అడవుల బాటపట్టాడు రామచంద్రుడు.
మేనమామ ఇంటి నుంచి
తిరిగొచ్చిన భరతుడు తన తల్లి కారణంగా
జరిగిన అనర్థం విని తల్లడిల్లాడు. అడవిదారిలోనే
అడ్డగించి అన్నగారిని తిరిగొచ్చి అయోధ్యను ఏలుకొమ్మని పరిపరి విధాలా ప్రాధేయపడ్డాడు. ఇచ్చిన మాటకు
మాత్రమే కట్టుబడటం తెలిసిన అన్న ఆన మేరకు
రామప్రతినిధిగా రాజ్యపాలన సాగించేందుకు సిద్ధమమనక తప్పింది కాదు తమ్ముడు
భరతుడికి.
పంటల కాలం నడుస్తోంది.
ఆక్రమంలో ఊడ్పుల పని కూడా ముగించుకుని
ఫలసాయాన్ని ఇళ్లకు చేరవేసుకునే
రైతుల నుండి రాబట్టవలసిన శిస్తుల విషయం ప్రధాన మంత్రి సుమంతుడు భరతుడి వద్ద
ప్రస్తావించాడా రోజు.
అన్నగారు గాని ఉండుంటే ఆదేశాలు ఏ విధంగా జారీ అయేవో ఊహించుకొని
భరతుడు తదనుగుణంగానే తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
రాజాజ్ఞ ప్రకారం
పండించిన పంటతో నిమిత్తం లేకుండా రైతాంగం
యావత్తూ యథాశక్తి ఖజానాకు సొమ్ము చెల్లించుకోవచ్చు .
భరతునికైతే దీనజన
బాంధవుడన్న ప్రశంసలు దక్కాయి కాని,
రైతన్నల బుద్ధి మాత్రం
పెడమార్గం పట్టింది. అదను చూసి
రైతులు దర్బారుకు
హాజరై 'తెగుళ్ల వల్ల పండివ పంటలో సగమైనా ఇళ్లకు చేరింది కాదు.
ప్రభువులు కృపా సముద్రులు. శిస్తు
మినహాయింపుకు అభ్యర్థిస్తున్నాం.' అంటూ
కల్లబొల్లి విన్నపాలు భరతుని ముందుంచారు.
అన్నదాతల పన్నాగం
ఫలించింది. కైకేయుడు దయతో వారి
విన్నపం మన్నించాడు.
రైతుల జిత్తులు తెలిసీ రాజాజ్ఞను ప్రశ్నించే సాహసం చేయలేక
గమ్మునుండి పోయింది సిబ్బంది కూడా .
మరుసటి ఏడూ రాజుగారి
ముందు అన్నదాతలది అదే తరహా
మొత్తుకోళ్లు. యధాప్రకారం ధశరథ పుత్రుని దయాగుణం
కారణంగా ప్రభుత్వ ఖజానాకు శిస్తుల చెల్లింపు లేకుండా పోయింది.
ఆ ఏటి నుంచి ఇబ్బడి ముబ్బడిగా పండినా పంటను
అధిక ధరలకు అమ్ముకుంటూ సంపదను పెంచుకోవడం అలవాటు చేసుకొన్నారు
వ్యవసాయదారులు. దీని కారణంగా ప్రభుత్వ ధనాగారం క్రమంగా చిక్కిపోవడం ఆరంభమయింది.
అరణ్యవాసం ముగించుకొని
అయోధ్య చేరిన రామచంద్రుడు భరతుడి నుంచి బాధ్యతలు
స్వీకరించే సమయంలో వట్టి పోయిన బొక్కసం
చూసి అవాక్కయాడు . ఆర్థిక పరిపుష్టి
లేమి దారితీసే అనర్థాలు పాలనా దక్షుడు రామన్నకు తెలియనివి కావు . ప్రధానమంత్రి
సుమంత్రులవారిచ్చిన సమాచారంతో రైతుల
దుష్ప్రవర్తన పట్ల సంపూర్ణావగాహన ఏర్పడింది రామచంద్రమూర్తికి.
ఆనాటి రాత్రి
మారువేషంలో నగర సంచారం చేసి రైతులు
గడించిన అంతులేని సంపత్తిని కళ్లారా
చూసిన రామభద్రుని మదిలో కొత్త ఆలోచనలు రేకెత్తాయి.
మరసటి రోజే నగరం నాలుగు
దిక్కులా దండోరా మోగింది.
'ఇందుమూలముగా తెలియ జేయడమేమనగా..రేపు సుముహూర్తంలో రామచంద్రులవారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగ భోజనోత్సవం జరగనున్నది. ఈ సందర్భంగా
యుద్ధసమయంలో అండదండలు అందించిన వానర
సైన్యాన్ని ప్రభువులవారు తగురీతిన
సత్కరించదలిచారు. విందులో మర్కట మహాశయులకు
మిక్కలి మక్కువైన కూష్మాండ వంటకం వడ్డించ దలిచినందున..పౌరులందరూ తలా ఒక్క
గుమ్మడికాయ రాజాజ్ఞగా భావించి తప్పనిసరిగా
సమర్పించుకోవలసిందని ఆదేశించడమైనదహో!'
ప్రకటన విన్న రైతాంగం యావత్తూ గుమ్మడికాయల
మీద ప్రభువులవారికిలా మనసెందుకు పోయిందో అవగతం కాక అబ్బురపోయింది.
ఆరాత్రి కారుచీకట్లు కమ్మి
పౌరులంతా గాఢనిద్రలో మునిగి వున్న వేళ
గుర్తు తెలియని ఆకారాలు కొన్ని నగరం మీద రవంత సేపు సవ్వడి కాకుండా సందళ్లు చేసి..రెండో ఝాము కల్లా అంతర్ధాన మయిపోయాయి!
మర్నాడు ఉషోదయాన అనుకున్న సుముహూర్తంలో రామచంద్రుని భోజనోత్సవం
అట్టహాసంగా ఆరంభమయింది .
ఉత్సవానికి హాజరయిన
ప్రముఖులకు దీటుగా అయోధ్యానగర వాసులూ తాహతు
కొద్దీ ఓపిన కట్న కానుకలు ప్రభువులకు
సమర్పించుకొని జన్మలు తరించినట్లు
ఉప్పొంగిపోతున్నారు.
దాశరథి, పోగైన కానుకల వైపు దృష్టి సారించాడు. వాటిలో కావలిసిన
గుమ్మడికాయలు మాత్రం కానరాలేదు! రామభద్రునికి ఆగ్రహం ముంచుకొచ్చింది.
సింహాసనం మీద నుంచి తటాల్మని లేచి నిలబడి కఠిన స్వరంతో గర్జించాడు 'వానర
సేనకు ప్రీతిపాత్ర మైన గుమ్మడి పండు
ఒక్కటీ ఇక్కడ కనిపించడంలేదు. ప్రధానమని
ప్రకటించినా అలక్ష్యంగా ప్రవర్తించి రాజధిక్కరానికి సాహసించిన రైతాంగం మొత్తానికి తక్షణమే సభాముఖంగా శిక్ష విధించబడుతుంది'
రామమూర్తి రౌద్రాకారం
ప్రప్రథమంగా చూసిన రైతులకు ముంచుకొచ్చే
ఉపద్రవం కళ్ల ముందు మెదిలి కాళ్ల వణుకుడు ఆరంభమయింది.
గుంపులో రవ్వంత గుండెధైర్యం
గల రైతుపెద్ద ముందుకొచ్చి సవినయంగా
సెలవిచ్చుకొన్నాడు 'రామచంద్రా! కావాలని
చేసింది కాదు ఈ అకార్యం. దేవరవారి ఆదేశానుసారం
గుమ్మడికాయే సమర్పించుకుందుము . కాని, ఏ గాలిదేవుడి మాయ వల్లో రాత్రికి రాత్రే కాసిన కాయలన్నీ కనికట్టు
చేసినట్లు మాయమైపోయాయి మహాప్రభో! దాసుల దోషానికి పరిహారంగా గుమ్మడి కాయంత బరువు
బంగారమైనా చదివించుకునేందుకు సిద్ధము..'
అంత సంకటంలోనూ ధన మదం
ప్రదర్శించే రైతాంగం వంక పరిహస పూర్వకంగా
చూసి రామచంద్రుడు అన్నాడూ, 'ఇంతలా
వేడుకున్నా పంతం వదలనంటం రాజధర్మం కాదు.
మీ ధనంతోనే ప్రపంచంలో ఏ మూలనున్నా గుమ్మడి పండ్లను రాసులుగా రప్పిద్దాం. కాని ఒక్క షరతు! బంగారం..గుమ్మడి కాయకు
సరిసమానంగా తూగితీరాలి. ఆవగింజ పరిమాణంలో
తారతమ్యం వచ్చినా రాజధిక్కారం జరిగినట్లే
లెక్క. శిక్ష తప్పదు'
రైతులందరి ఆమోదం మీద అంతఃపుర ఉద్యానవనంలో పండిన ఒక
గుమ్మడికాయ సభాభవనం మధ్య అమర్చిన తరాజు
సిబ్బెలోకి చేరింది. ఒక్కో రైతూ తన వంతు
వచ్చినప్పుడు పట్టించుకొచ్చిన బంగారాన్ని త్రాసు మరో సిబ్బెలో వేయడంగా..వ్యవహారం సాగుతోంది. ఏ ఒక్క
రైతు సొత్తూ గుమ్మడి పండు ఉంచిన సిబ్బెను రవ్యంత కదలించలేకపోయింది! అయోధ్యలోని
అన్నదాతలు ఇంత కాలం తాము అక్రమంగా గడించిన
సొమ్మంతా కలిపి తూచినా.. ఊహూఁ..తక్కెడ తట్ట అణువంతైనా కదిలేది లేదంటూ
మొండికేసింది! రామబంటు వాయుపుత్రుడు స్వామి ఆదేశానుసారం గుమ్మడిపండు గర్భంలో
చేరినట్లు పసిగట్టలేని రైతులు 'ఈ మాయ ఛేదించడం ఇక మాకశక్యం మహాప్రభో'అంటూ చేతులెత్తేసారు.
రామచంద్రుడు రవ్వంత రౌద్రం అభినయిస్తూ, ‘రాజద్రోహం మీ వల్లనవుతుంది! ధర్మమార్గాన ఆదర్శవంతంగా సాగే రాజ్యపాలనకు కళంక మాపాదించడం మీ వల్లనవుతుంది!! తుచ్ఛమైన తాత్కాలిక సంపదల పై మక్కువ పెంచుకొని నమ్మిన రాజ్యలక్ష్మి ని నిర్వీర్యం చేయడం ప్రస్తుతం మీ వల్లనే అవుతున్నది!!! రామరాజ్యం కలకాలం ధర్మరాజ్యంగా వర్ధిల్లేందుకు ఇక్ష్వాక వంశజులం చేసే నిస్వార్థ సేవల పట్ల ఇక ముందు నుంచైనా విశ్వాస బుద్ధితో మసలుకోండి! ప్రథమ దోషంగా భావించి మిమ్ము ఈసారికి మన్నిస్తున్నాము. సర్వజనావళి సౌభాగ్య సంక్షేమాది బాధ్యతలు తమ భుజస్కంధాలపై ఉన్న కారణంగా పీఠమెక్కిన ప్రభువులు న్యాయబద్ధంగా పాలన సాగించేందుకు పాటుపడతారు. బాధ్యతగల సత్పౌరులుగా మీరూ మీ వంతు సహకారం మనస్తూర్తిగా అందించినప్పుడే సర్వకాలాలకూ ఆదర్శనీయమైన రామరాజ్యం స్థాపించడం సాధ్యమవుతుంది ' అంటూ శ్రీరామచంద్రమూర్తి ఆనాటికి సభను చాలించాడు .
No comments:
Post a Comment