శ్రీథర మాధురి - 127 - అచ్చంగా తెలుగు

శ్రీథర మాధురి - 127

Share This

 శ్రీథర మాధురి - 127

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)


ఎవరైనా మీ మీద అరిచినప్పుడు, మీ లోపల ఒక అలారం గంట మోగాలి. మీరు అలా ఉండకూడదని తెలుసుకోవాలి.
 
ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినప్పుడు, మీ లోపల ఒక అలారం గంట మోగాలి. మీరు ఎవరినీ మోసం చేయకూడదు.

ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, మీ లోపల ఒక అలారం గంట మోగాలి. మీరు ఎవరినీ, ఎన్నడూ ఇబ్బంది పెట్టకూడదు.
 
ఎవరైనా మీకు నమ్మకద్రోహం చేసినప్పుడు, మీ లోపల ఒక అలారం గంట మ్రోగాలి. మీరు ఎన్నడూ ఒకరి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు.
 
ఎవరైనా మిమ్మల్ని లోకువ చేసినప్పుడు లేదా మీకు అమర్యాదను కలిగించినప్పుడు, మీ లోపల ఒక అలారం గంట మ్రోగాలి. ఎవ్వరికీ అమర్యాద కలిగే విధంగా మీరు ప్రవర్తించకూడదని తెలుసుకోవాలి.
 
అటువంటివారు అజ్ఞానంతో, అవివేకంతో ఉన్నారు. కానీ 'ఎలా ప్రవర్తించకూడదు' అన్న ఒక విలువైన జీవిత పాఠాన్ని వారు మీకు నేర్పుతున్నారు. వారు వారి జీవితాన్ని పణంగా పెట్టి, ఏమేమి చేయకూడదో, మీకు చేసి చూపుతున్నారు.
 
వారు బాగుండాలని, వారికి మేలు కలగాలనీ, నారాయణ భగవానుని ప్రార్థించండి. భవిష్యత్తులో వారు మరింత జాగృతితో, అప్రమత్తంగా  ఉంటూ ఇటువంటి పనులను తిరిగి చేయకుండా ఉండేలా భగవాన్ వారిని దీవించేలా చూడండి.
విభిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉండడం ద్వారా, మీరు మార్పును తీసుకు రాగలుగుతారు.

సంపూర్ణ ఆనందంతో కూడిన స్వేచ్ఛామయమైన జీవితాన్ని మీరు గడపాలంటే, వారు చేసే చెడ్డ పనులే మీరూ చెయ్యకుండా జాగ్రత్త పడుతూ, అప్రమత్తంగా మెలగండి.
 
అలా ఉంటే మీరు మీ జీవితాన్ని స్వీయ సానుభూతి లేక పశ్చాత్తాపం లేకుండా గడపగలుగుతారు. మీరు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి, మీ వ్యవస్థకు, మీ దేశానికి, ప్రపంచానికీ కూడా ఉపయోగపడతారు.
 
***
మీరు పనిలో ఉన్నప్పుడు కొంతమంది మిమ్మల్ని చూసి అసూయ పడవచ్చు. కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. కొంతమంది మీ వెనకాల మాట్లాడవచ్చు. కొంతమంది మీకు సహాయ పడవచ్చు. కొంతమంది మామూలుగా ఉండవచ్చు. ఇదంతా ఒక ప్యాకేజీ లాగా వస్తుంది. పనిలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్న కారణంతో, ఎన్ని ఉద్యోగాలని మారగలరు? ప్రతిచోటా ఎవరో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఉండనే ఉంటారు కదా?
 
మీరు మీ విద్యార్హతలకు, అనుభవానికి తగిన వృత్తిపరమైన వ్యక్తి అయితే, మీరు అటువంటి చిన్న విషయాల గురించి షికాయతు చేయరు, భయపడరు. అటువంటి వ్యక్తుల నుంచి తప్పించుకోవడానికి మీరు మీ బుద్ధిని వాడి, ఒక మృదువైనదారిని వెతుక్కుంటారు. లేకపోతే వ్యక్తిగత జీవితంలో లేక వృత్తిపరమైన జీవితంలో, మీకు ఎక్కడా శాంతి, తృప్తి దొరకదు.

***

No comments:

Post a Comment

Pages