బంగారు ద్వీపం - 26
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton
(నేలమాళిగలను కనుక్కొన్న పిల్లలు రాతి మెట్లను దిగి ఒక యినుప తలుపు దగ్గరకు వస్తారు. దానిని తెరవటానికి ప్రయత్నించి, గొడ్డలి తెచ్చి ఆ తలుపును పగలగొట్టటమే మార్గమనుకుంటారు. కానీ వెనుదిరిగి వస్తున్నప్పుడు దారి తప్పిపోయిన వారికి పాతకాలపు బావి కనిపిస్తుంది. చివరకు వారు కష్టపడి తాము దిగిన మెట్ల మార్గాన్ని చేరుకొని, పైకి వస్తారు. అందరికీ ఆకలి వేయటంతో రొట్టె ముక్కలు, కేకు, బిస్కట్లను తింటారు. తరువాత. . . .)
@@@@@@@@@@@
సాయంత్రం సూర్యుని వెచ్చదనంలో నడుము వాల్చటం, రొట్టె ముక్కలు, జున్ను కేక్, బిస్కట్లను నమిలి తినటం, ఎంతో ఆనందంగా అనిపించింది. వారంతా ఆ అనుభూతులను బాగా ఆస్వాదించారు. టింకి కూడా మంచి భోజనం దొరికింది. అతనికి భూగర్భంలో గడపటం అంతగా నచ్చలేదు. అక్కడ ఉన్నంతసేపు తోకను బాగా ముడిచి, వాళ్ళను అంటిపెట్టుకొనే తిరిగాడు. అటు పక్కనుంచి, యిటు పక్కనుంచి వచ్చే విచిత్రమైన ప్రతిధ్వనులకు బాగా భయపడ్డాడు కూడా!
ఒకసారి తను మొరిగినప్పుడు నేలమాళిగలు మొత్తం కుక్కలతో నిండిపోయినట్లు, అవి తన కన్నా గట్టిగా మొరుగుతున్నట్లు టిం భావించాడు. ఆ తరువాత తను మూలిగే ధైర్యం కూడా చేయలేదు. కానీ యిప్పుడు చాలా ఆనందంగా ఉండటమే కాక, పిల్లలు పెట్టే చిరుతిళ్ళను తింటూ, జార్జి తనకు సమీపంలో ఉన్నప్పుడు ఆమెను నాకుతున్నాడు.
పిల్లలు తమ భోజనాలను ముగించి శుభ్రం చేసుకొనేసరికి ఎనిమిది దాటింది. జూలియన్ మిగిలినవారి వైపు చూసాడు. సూర్యుడు పూర్తిగా కుంకటంతో వెచ్చదనం కూడా పోయింది.
"సరే," అతను చెప్పాడు, "మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఈ రోజు మళ్ళీ ఆ నేలమాళిగల్లోకి దిగాలని నేను అనుకోవటం లేదు. గొడ్డలితో ఆ తలుపును పగులగొట్టి తెరవాలని కూడా కోరుకోవటం లేదు. నేను అలసిపోయాను. రాత్రిపూట ఆ నేలమాళిగల్లో దారి తప్పిపోయి వెతుకులాడే ఆలోచన కూడా లేదు."
మిగిలినవారు అతనితో మనస్ఫూర్తిగా ఏకీభవించారు. అన్నె అయితే, కమ్ముకొంటున్న చీకటిరాత్రిలో కిందకు వెళ్ళాలంటే, మనసులో తెగ వణికిపోతోంది. ఆ చిన్నపిల్ల దాదాపు నిద్రలో మునిగింది. తాను పడ్డ శ్రమ మరియు ఆందోళనతో ఆమె బాగా అలసిపోయింది.
"రా అన్నె!" ఆమె పాదాలను పట్టి లాగుతూ పిలిచింది జార్జి. "నీ పక్క అక్కడ. మనం ఆ చిన్న గదిలో నేల మీద దుప్పట్లు కప్పుకొని, కరచుకొని పడుకొందాం. ఉదయం లేవగానే ఆ పెద్ద చెక్క తలుపుని తెరవటం గురించి ఆలోచిస్తుంటే ఎంతో గగుర్పాటుగా ఉంటుంది."
టిం తమను దగ్గరగా అనుసరిస్తూండగా, నలుగురు పిల్లలు ఆ చిన్న రాతిగదిలోకి చేరుకొన్నారు. వాళ్ళు తమ రగ్గుల గుట్టలపై ముడుచుకొని పడుకోగా, జార్జి, అన్నెల పక్కన టిం చేరింది. అతను వాళ్ళపై పడుకోగా, అన్నెకు బరువు అనిపించి అతని కాళ్ళను తన మీద నుంచి పక్కకు నెట్టింది.
అతను మళ్ళీ ఆమె మీద కూర్చోవటంతో, ఆమె సగం నిద్రలో మూలిగింది. టిం తన తోకను ఊపుతూ ఆమె కాలి చీలమండలపై బలంగా కొట్టాడు. అప్పుడు జార్జి అతన్ని తన కాళ్ళపైకి లాక్కుని పడుకోబెట్టింది. దానితో అతను తృప్తిగా ఊపిరి పీల్చుకొన్నాడు. ఆమె సంతోషించింది. జార్జి తన ద్వీపంలో రాత్రంతా గడుపుతోంది. తాము లోహపు కడ్డీలను దాదాపుగా కనుగొన్నట్లు ఆమె భావిస్తోంది. టిం కూడా తనతోనే ఉన్నాడు. ఆమె రగ్గుల మీదే హాయిగా నిద్రపోతున్నాడు. ఏదో విధంగా మొత్తమంతా సవ్యంగా జరగొచ్చు.
ఆమె నిద్రలోకి జారుకుంది. టిమ్ కాపలాగా పిల్లలు సంపూర్ణ సురక్షితంగా ఉన్నారు. వాళ్ళు ఉదయం వరకు ప్రశాంతంగా నిద్రపోయారు. ఒక కుందేలు ఆ చిన్న గదికి దారి తీసే విరిగిన కమానుపై ఉండటం చూసిన టిం, దానిని వెంబడిస్తూ కొంతదూరం తరిమింది. అతను రగ్గు మీద నుంచి దూకుడుగా లేవటంతో జార్జి మేలుకొంది. వెంటనే లేచి కూర్చుని కళ్ళను చేతులతో రుద్దుకొంది.
"లేవండి" అంటూ మిగిలినవాళ్ళను గట్టిగా పిలిచింది. "మీరంతా లేవండి. తెల్లారిపోయింది. అందులోను మనం ద్వీపంలో ఉన్నాం."
వాళ్ళంతా నిద్ర లేచారు. కూర్చుని ప్రతీది గుర్తు చేసుకోవటం వారికి ఎంతో గగుర్పాటు కలిగిస్తుంది. జూలియన్ వెంటనే పెద్ద చెక్క తలుపు గురించి ఆలోచించాడు. తను త్వరలోనే దాన్ని తన గొడ్డలితో పగలగొట్టడం ఖాయం అనుకొన్నాడు. ఆ తరువాత వాళ్ళు ఏమి కనుగొంటారు?
వారు అల్పాహారాన్ని తీసుకొని ఎప్పటిలాగే తమకు కావలసినంత తిన్నారు. తరువాత జూలియన్ తమతో తెచ్చుకొన్న గొడ్డలిని అందుకొని, అందరినీ మెట్ల దగ్గరకు తీసుకొచ్చాడు. టిం కూడా తన తోకను ఊపుకొంటూ వారి వెనుకే వెళ్ళాడు. కానీ నిజంగా ఎన్నో కుక్కలు మొరిగినట్లు అనిపించే ఆ వింత ప్రదేశాలలోకి దిగి వెళ్ళటం అతనికి యిష్టం లేదు. అమాయకుడైన టిం ఈ ప్రతిధ్వనులను ఎప్పటికీ అర్ధం చేసుకోలేడు!
వాళ్ళంతా మళ్ళీ ఆ భూగర్భంలోకి దిగారు. ఆపై, మామూలుగానే ఆ చెక్క తలుపుకి మార్గాన్ని మరిచిపోయారు. అది చాలా చిరాకు పెట్టే పని.
"మనం మళ్ళీ మళ్ళీ దారి తప్పిపోతున్నాము" నిరాశగా అంది జార్జి. "ఈ నేలమాళిగలు నాకు తెలిసి భూగర్భంలో అత్యంత విస్తారంగా వ్యాపించి ఉన్న చిట్టడవికి చెందిన గుహలు! మనం ప్రతిచోటా దారి తప్పవచ్చు."
జూలియన్ కి అమోఘమైన ఆలోచన వచ్చింది. అతని జేబులో తెల్లటి సుద్ద ముక్క ఉంది. దాన్ని బయటకు తీసాడు. అతను మెట్ల వద్దకు తిరిగి వెళ్లి, అక్కడ గోడను గుర్తించాడు. తరువాత బూజు పట్టిన చీకట్లోకి నడుస్తూ దారిలో అక్కడక్కడ సుద్దతో గుర్తులు పెట్టసాగాడు. చివరకు నూతి దగ్గరకు చేరుకోవటంతో జూలియన్ ఆనందించాడు.
"ఇప్పుడు," అతను చెప్పాడు, "మనం నూతి దగ్గరకు వచ్చినప్పుడల్లా, తిరిగి మెట్ల దగ్గరకు వెళ్ళే దారిని కనీసం కనుక్కోగలం. ఎందుకంటే మనకు ఈ సుద్ద గుర్తులే ఆధారం. ఇప్పుడు విషయం ఏమిటంటే- తరువాతి మార్గం ఏమిటి? మనం ప్రయత్నించి కనుక్కొంటాం. వెళ్ళే దారిలో గోడలపై నేను అక్కడక్కడ సుద్దముక్కతో గుర్తులు పెడతాను. కానీ మనం తప్పుదారిలో వెళ్ళి వెనక్కి రావలసి వస్తే, ఆ దారిలో ఉన్న గుర్తులను చెరిపేద్దాం. తిరిగి నూతి దగ్గరనుంచి మరొక దారిలో ప్రయత్నిద్దాం."
ఇది నిజంగా చాలా మంచి ఆలోచన. వారు తప్పు మార్గంలో వెళ్ళారు. తిరిగి వెనక్కి వచ్చేస్తూంటే, జూలియన్ పెట్టిన సుద్ద గుర్తులను చెరిపేసారు. వారు నూతిని చేరుకొన్నాక, తాము వచ్చిన దారికి వ్యతిరేక దిక్కులో బయల్దేరారు. ఈసారి వారు చెక్క తలుపును కనుగొన్నారు! అక్కడ అది దృఢంగాను, మోటగాను ఉంది. దానికి ఉన్న పాత యినుప మేకులు తుప్పుపట్టి ఎర్రగా ఉన్నాయి. దాన్ని చూసి పిల్లలు ఉత్సాహపడ్డారు. జూలియన్ తన గొడ్డలిని ఎత్తాడు.
ఫెళఫెళమని చప్పుడైంది. అతడు గొడ్డలిని కీహోల్ చుట్టూ ఉన్న చెక్కలోకి దిగగొట్టాడు. కానీ ఆ చెక్క యింకా దృఢంగా ఉంది. గొడ్డలి ఒకటి, రెండు అంగుళాలు మాత్రమే లోనికి దిగింది. జూలియన్ మరొకసారి వేటు వేసాడు. గొడ్డలి ఒక పెద్ద మేకుకు తగిలి ఒక పక్కకు జారింది. ఒక పెద్ద చెక్కపేడు బయటకొచ్చి డిక్ చెంపను తాకింది.
అతను బాధగా అరిచాడు. జూలియన్ కంగారుగా పక్కకు దూకి, అతని వైపు తిరిగి చూసాడు. డిక్ చెంప నుంచి రక్తం కారుతోంది.
"ఏదో తలుపునుంచి బయటకొచ్చి నాకు తగిలింది" డిక్ బాధగా అన్నాడు. "అది చెక్కపేడో, మరేమిటో!"
"అయ్యో!" జూలియన్ తన చేతిలోని టార్చీ వెలుతురిని డిక్ పైకి మళ్ళించాడు. "బుగ్గలో గుచ్చుకొన్న ఆ చెక్కముక్కను బయటకు లాగుతాను. ఆ బాధను నువ్వు భరించగలవా? ఇది చాలా పెద్దది. ఇంకా నీ బుగ్గలో గుచ్చుకొనే ఉంది."
కానీ డిక్ దానిని స్వయంగా బయటకు లాగాడు. అతని ముఖం మొదట బాధతో ముడుచుకొని తదుపరి పాలిపోయింది.
"నువ్వు కొద్దిసేపు పైకెళ్ళి బయట గాలిలో తిరిగితే మంచిది. నీ చెంపని బాగా శుభ్రం చేసి రక్తస్రావాన్ని ఎలాగైనా ఆపాలి. అన్నె దగ్గర శుభ్రమైన గుడ్డ ఉంది. దాన్ని నీటిలో ముంచి గాయంపై మెల్లిగా ఒత్తుతాం. అదృష్టవశాత్తూ మనతో పాటు కొద్దిగా నీటిని తేవటం మంచిదైంది."
"నేను డిక్ తో వెళ్తాను" అన్నె చెప్పింది.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment