భక్తి మార్గం సులభతరం - అచ్చంగా తెలుగు

భక్తి మార్గం సులభతరం

Share This

భక్తి మార్గం సులభతరం

సి.హెచ్.ప్రతాప్




భగవద్గీత 12 వ అధ్యాయం భక్తి యోగం లో మొదటి శ్లోకం :

ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే ।
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ||

ఈ పరమాత్మా, నీ యొక్క సాకార రూపం పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మ ను ఉపాసించే వారు – వీరిలో, యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు అని అర్జునుడు భగవంతుడిని పై శ్లోకం ద్వారా ప్రశ్నించాడు.

భక్తి మారం యొక్క ప్రాశస్థ్యం ఈ అధ్యాయం వీవరిస్తుంది. ముక్తిని పొందేందుకు భక్తి ఒక మార్గము. జీవునికి , దేవునికి మధ్య వారధి భక్తి . కాల ప్రవాహానికి ఒడిదొడుకులకు అతీతమయినది భక్తి. భక్తి తో తన ఇష్ట‌దైవాన్ని ఆరాధిస్తే మనఃశ్శాంతి కలుగుతుంది . మనసులో చెడు ఆలోచ‌నలకు తావుండదు . . . సన్మార్గ‌ములో నడిచేందుకు వీలుపడుతుంది . ఎన్నో మానసిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చును . నిత్యజీవ‌నంలో ఒత్తిళ్ళకు , ఒడిదొడుకులను తట్టుకునే మనోధైర్యం కలుగుతుంది. మనసు ప్రశాంతం గా ఉంటే శరీరము ఆరోగ్యం గా ఉంటుంది . 80 శాతము శరీరక రుగ్మతలకు మానసిక ఆందోళనే కారణము. భక్తి తో వీటినన్నింటినీ అధిగమించవచ్చును. అందుకే త్యాగరాజస్వామి తన ఒక దివ్య సంకీర్తలనలో తెలియలేరు రామ భక్తిమార్గమును, ఇల నంతట తిరుగుచుఁ గలువరించేరేగాని అని గొప్పగా రాసాడు. భక్తి జ్ఞానమార్గములలో ఏ మార్గము అవలంబించినప్పటికీ, ఆ మార్గములో నిజాయితీగా లీనమవాలి.  పరిపక్వత ఇంకా రానప్పుడు మార్గమునుండి ప్రక్కదోవ పట్టి తదేక ధ్యాసను కోల్పోరాదు.

భగవంతుని దర్శించడానికి యుగయుగాలుగా మానవుడు తపన పడుతూనే వున్నాడు. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగము మరియు ద్వాపర యుగములలో యజ్ఞయాగాదులతోను ఆ పరాత్పరుని ప్రత్యక్షం చేసుకొన్నారు. యుగయుగాలకు భావనలో మార్పు వచ్చింది కాని భక్తి మాత్రం ఒక్కటే! ఈ చరాచర సృష్టికి మూలమైన పరమాత్మను శ్లాఘిస్తూ కల్పన చేసే మనోభావాలనే భక్తి అంటారు.సుఖ దుఃఖాలలో సమాన భక్తి భావన చేయువాడే స్థితప్రజ్ఞుడు. భక్తికి పరాకాష్ఠ ఆర్తి. భగవంతుని సాక్షాత్కారం కోసం ఇహపరములు ఎరుగక మరణానుభవంతో చేసే ఆరాధనే ఆర్తి. సత్సంగము ద్వారా శ్రవణమును అనుభవించవచ్చు. భగవంతుని లీలలను శ్రవణము చేయుట భక్తి భావనలో మొదటి సోపానము. శ్రవణము సంతృప్తికరమై కీర్తనకు దారితీస్తుంది.

ఈ కలియుగంలో కర్మ, జ్ఞాన యోగాలను అనుష్టించడం చాలా కష్టం ఎందుకంటే ఈ సాధనల ద్వారా భగవంతుని చేరుకునేందుకు కావ్ల్సిన శ్రద్ధ, సహనం, ఓపిక సాధకులలో నశిస్తోంది. కాబట్టి కలకల్మషాలలో కుడిన ఈ కలియుగంలో సులభంగా తరించేందుకు భగవంతుడు భక్తి యోగం అనే ఒక సులభమైన ప్రత్యామ్నాయం మానవాళికి అందించాడు.

భక్తియోగంలో పయనించాలంటే భక్తులకు భగవంతునిపై అచంచల ప్రేమ, విశ్వాసం వుండాలి. అన్ని దేశాలు, సమస్త మానవాళి సుఖ శాంతులు అనుభవించాలని కోరుకోవాలి. సమస్త లోకా సుఖినోభవంతు అన్న ప్రార్ధనే మన పెదవులపై నిత్యం కదలాడాలి. . ఈ భూమి అంత విశాలమైన ప్రేమను, సముద్రమంత సహనాన్ని అలవరచుకోవాలి.సహనం.పట్టుదల, పవిత్రత అనే దివ్య లక్షణాలను అలవరచుకోవాలి.ఎంతటి కష్ట నష్తములు, నిందా నిష్టూరాలు వచ్చినా కూడా భక్తులు తమ దీక్షను విడిచిపెట్టకూడదు.హృదయంలో పూర్తిగా భగవంతునిపై విశ్వాసం నింపుకొని, సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవించడం కోసం లౌకికమైన బాధలను ఏ మాత్రం లక్ష్యపెట్టక హృదయాలను హృదయేశుని భావంలో విలీనం చేసేందుకు ప్రతీ సాధకుడు పూనుకోవాలి.

ఈ కలియుగంలో అందరికి అందుబాటులో ఉన్న ఏకైక భక్తిమార్గము. భగవంతుని కీర్తించడంలో ఆనందము సిద్ధిస్తుంది. సంకీర్తన, స్మరణ చివరకు బ్రహ్మానందమును అందిస్తాయి. 

***

No comments:

Post a Comment

Pages