క్రొత్తనీరు (మూడవభాగం)
టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
ఆ మర్నాడు సాయంత్రం.
నాలుగు గంటలకు విశ్వనాథ వారి 'అమృతవల్లి 'నవల చదువుకుంటోంది సమీర.
" సమీరా!సరస్వతి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి కాసిన మారేడు దళాలు తీసుకొని వస్తావా!రేపు పొద్దున్నే అభిషేకానికి వెళ్దాము!నీ వెంట వరుణ్ గాడిని తీసుకెళ్ళు!" అంటూ పురమాయించింది సరళ.
ప్రణయ్ వాళ్ళ ఇంట్లో లైబ్రరీ చూద్దామని కుతూహలంతో అత్తయ్య చెప్పగానే "సరే!"నంటూ తయారై వరుణ్ తో పాటు ప్రణయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సమీర.
వీధి చివరే ఇల్లు.. పెద్ద లోగిలి..బయట పెద్ద పెద్ద అరుగులు ఉన్నాయి.
పాతకాలం నాటి మండువా ఇల్లు.
పాతదే అయినా గంభీరంగా ఉంది. గేటు దగ్గరే ఎదురయ్యాడు ప్రణయ్ వాళ్ళ నాన్నగారు వరప్రసాదరావు.
"రామ్మా!రా లోపలికి!"అంటూ సమీరను ఆహ్వానించి "సరస్వతీ!అమ్మాయి వచ్చింది చూడు!"అన్నాడు వరప్రసాదరావు.
లోపలి నుండి సరస్వతి వచ్చింది.
ఆప్యాయంగా సమీర చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది.
పక్కింటి వాళ్ళ బాబుతో ఆడుకుని వస్తానని తుర్రుమన్నాడు వరుణ్.
చిన్నప్పుడు పద్మ తను ఎలా ఆడుకునే వాళ్ళో చెబుతూ ఇల్లంతా సమీరకు చూపించింది సరస్వతి.
పెద్ద పెద్ద గదులు.చాలావరకు పాడైపోయినట్టుగా ఉందా ఇల్లు..తలుపులు దగ్గర పెద్ద పెద్ద గడపలు.
'రోజూ ఈ గడపలు దాటుతూ ఇంట్లో తిరుగుతుంటే తొందరగా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి!' అనుకుంది సమీర
వెనకాల పెద్ద పెరడు. పెరట్లో మామిడి,పనస,జామ, బత్తాయి లాంటి పండ్ల చెట్లే కాక మల్లె, జాజి, మందారాలతో పాటు చాలా రకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి.
మేడమీదకు వెళ్లారిద్దరు.
పైన నాలుగు విశాలమైన గదులు ఉన్నాయి. ఒక పెద్ద గది నిండా పుస్తకాలు ర్యాకుల్లో సర్ది ఉన్నాయి.ఆసక్తిగా పుస్తకాలు చూస్తోంది సమీర
"నువ్వు పుస్తకాలు చూస్తూ ఉండు!నేను ఫలహారం తెచ్చిపెడతా!"అంది సరస్వతి.
"ఇప్పుడేమీ వద్దత్తయ్యా!మీ కెందుకు శ్రమ!" అంది మొహమాటంగా సమీర.
"భలే దానివే!రాక రాక వచ్చావు!మీ అమ్మకైతే నేను చేసిన కజ్జికాయలు అంటే ఎంతిష్టమో! నిన్ననే చేశాను!ఎప్పుడు కజ్జికాయలు చేసినా మీ అమ్మే గుర్తొస్తుంది! ఉండు!" అంటూ కిందకి వెళ్ళింది సరస్వతి.
రాకుల్లో తెలుగు,ఇంగ్లీషు పుస్తకాలతో పాటు సంస్కృత కావ్యాలు కూడా ఉన్నాయి. ప్రాచీన తెలుగు కావ్యాలు, ఆధునిక కవిత్వం, జానపద సాహిత్యం అని లేబుల్స్ రాసి అక్కడ అతికించి ఉన్నాయి.అలా చూస్తూ చూస్తూ ఎమెస్కో పాకెట్ బుక్స్ నుంచి వినుకొండ నాగరాజు వ్రాసిన 'ఊబిలోదున్న' నవల తీసింది సమీర.
"హలో!"
తిరిగిచూసింది.
ప్రణయ్.
"మీరు వచ్చారని అమ్మ చెప్పింది!" అన్నాడు నవ్వుతూ.
"మీ దగ్గర మంచి మంచి బుక్స్ ఉన్నాయి! ఇవన్నీ మీరే సేకరించారా?"
"లేదండి! మా తాత గారి దగ్గర నుంచి సేకరించినవి.. వీటిల్లో కొంతవరకు చదివాను! పొలం నుండి వచ్చాక బుక్స్, రేడియో నాకు కాలక్షేపం. "
"వ్యవసాయం చేయడం ఎలా ఉంటుంది? రైతులకు గిట్టుబాటుధర రాలేదని...నష్టాలే తప్ప కష్టానికి తగిన ప్రతిఫలం రాదని పేపర్లో చదువుతూ ఉంటాను! మీరు అమెరికా నుంచి వచ్చి ఈ రంగాన్ని ఎలా ఎంచుకున్నారు?" అడిగింది సమీర
" ఏ రంగంలో అయినా కష్టాలు ఉంటూనే ఉంటాయి!కష్టపడకుండా డబ్బులు రావు కదా! మా చిన్నప్పుడు నాన్నగారే వ్యవసాయం చేసేవాళ్ళు.. తర్వాత కౌలు కిచ్చారు. మా తమ్ముడు వినయ్ వెల్లూరులో మెడిసిన్ చదువుతున్నాడు. నేనమెరికా వెళ్ళాను...కానీ అక్కడ ఉండలేకపోయాను! నిరంతరం ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని అభద్రత.... ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం అంత బాగాలేదు.. అమెరికాలో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లోనే లే ఆఫ్స్ జరుగుతున్నాయి!.. అక్కడ రేసిజం ఎక్కువవుతోంది. అక్కడ ఉండే నేటివ్ అమెరికన్సుకి మనమంటే ఈర్ష, ద్వేషం రోజురోజుకీ పెరుగుతున్నాయి!.. అక్కడ భవిష్యత్తు లేదని నేను ఇండియా వచ్చేసాను!నిజానికి మా నాన్నగారికి నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదు! వ్యవసాయం చేయడం చాలా కష్టమని ఆయన అభిప్రాయం!... అప్పు చేసి మరి అంత దూరం వెళ్లి చదివి,పనికిమాలినట్లుగా వెనక్కి వచ్చానని బాధపడుతూ ఉంటారు!అయితే నేను మాత్రం కొంచెం ధైర్యంగానే అడుగు వేసాను! పాతదారే!...మన వాళ్ళందరూ నడిచిన దారే!..ఈరోజు నేను కొత్తగా చేయడం లేదు!.. "
అతడి మాటలు వింటూ తనలో తాను ఆలోచనలో పడింది సమీర.
'తనకు ఉద్యోగం పోయింది! ఇంకోటి దొరికేదాకా మనసులో టెన్షన్ గానే ఉంది!.... కానీ ఇతడు భయాన్ని జయించాడు!.. తనకు అంత ధైర్యం వస్తుందా? "
"ఏమిటి ఆలోచిస్తున్నారు?"
ప్రణయ్ సమీరనే చూస్తున్నాడు.
"ఏమీ లేదు!ఏమీ లేదు!... నాకున్న ఉద్యోగం పోయింది!ఇంకోటి దొరుకుతుందా లేదా అని భయంగానే ఉంది! మీకు భవిష్యత్తు మీద భయం వేయడం లేదా? వ్యవసాయం అంతా ప్రకృతి పై ఆధారపడి ఉంటుంది!వరదలు,అతివృష్టి,అనావృష్టి ఎక్కువ! ఇలాంటి రంగాల్లో నష్టాలు ఎక్కువ మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? "
నవ్వాడు ప్రణయ్.
"ధైర్యం లేకపోతే మనిషికి మనుగుడే లేదు!మీరు రేపు ఒకసారి మా పొలానికి రండి!నా వ్యవసాయం చూపిస్తాను!... మీకు కొంచెం అవగాహన వస్తుంది!" అంటూ అతడు పరండాలోకి దారి తీశాడు.
వరండాలో చెక్క ఉయ్యాల ఉంది.ఆ తర్వాత అంతా ఖాళీ మేడ.మేడలో చాలా భాగం పూల కుండీలు ఆక్రమించాయి... పువ్వుల పరిమళం....పచ్చని మొక్కలు....లతలు....ఆహ్లాదంగా ఉన్న పరిసరాలు.
ఉయ్యాల మీద కూర్చున్నారిద్దరూ.
అప్పుడే ఫలహారాల డబ్బా తీసుకొని వచ్చింది సరస్వతి. వెనకాలే ప్లేట్లు పట్టుకొని వచ్చాడు వరుణ్.
"నీ ఆట అయిపోయిందా!" అంటూ వరుణ్ చేతిలోని ప్లేట్లు తీసుకున్నాడు ప్రణయ్. ముగ్గురికీ కజ్జికాయలు,చేగోడీలు ప్లేట్లో పెట్టించింది సరస్వతి.
" మీరు కూడా తీసుకోండి అత్తయ్యా!" ప్లేట్ సరస్వతికి అందించింది సమీర.
"ఇప్పుడు తిన్నానంటే రాత్రికి ఏమి తినలేను!కాసేపాగి మావయ్య గారు,నేను టిఫిన్ చేస్తాంలే!అంది సరస్వతి.
"నిజంగానే కజ్జికాయలు చాలా బాగున్నాయి!అమ్మ చేసే వాటికంటే డిఫరెంట్ గా ఉన్నాయి!ఏమేమి కలుపుతారో చెప్పండి!నేను కూడా చేస్తాను! అంది సమీర నవ్వుతూ.
" మా అమ్మ చేసే వంటల్లో స్పెషల్ ఏమిటో చెప్పనా!"
అన్నాడు ప్రణయ్ తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి.
" చెప్పండి!చెప్పండి!నేర్చుకుంటాను!"
ప్రణయ్ తో మాట్లాడటం సరదాగా ఉంది సమీరకు.
" ప్రేమ,ఆప్యాయత చేసే వంటల్లో కలుపుతూ ఉంటుంది మా అమ్మ...అందుకే అంత రుచి!"
కొడుకు మాటలకి నవ్వింది సరస్వతి.
కాసేపు కబుర్లతో కాలం గడిపి ఇంక ఇంటికి వెళ్లాలంటూ లేచింది సమీర.
క్రిందకు వచ్చి కవర్ నిండా మారేడు దళాలు కోసిచ్చాడు ప్రణయ్.
"రేపు పదింటికి పరమేశం ఆటో తీసుకొని వస్తాడు!పొలానికి వచ్చేయండి!" మళ్ళీ గుర్తు చేశాడు ప్రణయ్.
"వెళ్లి మా వాడి వ్యవసాయం చూసి రా సమీరా!సిటీల్లో కనిపించని పచ్చదనమంతా అక్కడే కనిపిస్తుంది!"అంది సరస్వతి.గేటుదాకా వచ్చి సాగనంపాడు ప్రణయ్.
రాత్రి చాలాసేపు ప్రణయ్ గురించి ఆలోచిస్తూ 'ఊబిలో దున్న నవల' పూర్తి చేసింది సమీర.
(సశేషం )
No comments:
Post a Comment