మసిబూసి మారేడుకాయ
కాశీ విశ్వనాథం పట్రాయుడు
దీపావళి గ్రామంలో అచ్చమ్మ, అచ్చియ్య దంపతులు నివసిస్తూ ఉండేవారు. ఇద్దరూ కష్టపడి కూలి పనిచేసి డబ్బులు సంపాదించేవారు. మితంగా ఖర్చు చేసి డబ్బులను పొదుపు చేసేవారు.
కొన్నాళ్ళ తరువాత ఆ గ్రామంలో ‘చెప్పిందొకటి చేసేదొకటి’ అనే చిట్ ఫండ్ కంపెనీ వెలసింది. ‘రూపాయి పెట్టు - పది రూపాయలు పట్టు‘ అనే నినాదం తో ప్రచారం చేసారు. 'ఆరు నెలల్లో మీ సొమ్ము రెట్టింపు చేస్తాం' అని నమ్మబలికారు.
నిజమేనని నమ్మిన వెర్రి జనం ఎన్నాళ్ళ నుంచో కష్టపడి కూడబెట్టిన డబ్బును పట్టుకెళ్ళి చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు.
అచ్చమ్మకి కూడా ఆశపుట్టింది. “మావా! ఎన్నాళ్ళు కష్టపడితే అంత డబ్బు కూడ బెట్టగలం. మనం కూడా అందరిలాగే ఆ కంపెనీలో డబ్బులు దాచుకుందాం. తొందరగా మన డబ్బును రెట్టింపు చేసుకుందాం” అని నస పెట్టసాగింది.
“నా మాట విను, అదంతా మోసం. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది” అని చెప్పాడు అచ్ఛియ్య.
భర్త మాట వినిపించుకోలేదు. సరికదా చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెట్టే వరకు నిద్రపోలేదు అచ్చమ్మ. భార్య మాట కాదనలేకపోయాడు అచ్చియ్య.
ఆరునెలలపాటు చిట్ ఫండ్ కంపెనీ బాగానే నడిచింది. తరువాత రాత్రికి రాత్రే బోర్దుతిప్పేసి కోటి రూపాయలతో పరారయ్యారు చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులు.
ఆ విషయం తెలిసి “నువ్వు చెప్పినా వినలేదు మావా” అంటూ ఏడుస్తూ కూర్చుంది అచ్చమ్మ.
“మనల్ని నమ్మించడానికి మసి పూసి మారేడు కాయ చేస్తారు. నమ్మిన వాళ్లు మోసపోతారు. ఇప్పుడు బాధపడి ఏం లాభం” అన్నాడు భర్త అచ్చియ్య.
“మధ్యలో మారేడు కాయ ఏం చేసింది” అని అమాయకంగా అడిగింది
"ఓసి పిచ్చి మొఖమా మసిబూసి మారేడుకాయ చెయ్యడం ఒక సామెత. నమ్మి మోసపోయిన సందర్భంలో దీనిని వాడుతున్నారు.
పూర్వం అయోధ్యానగరంలో ఉమేష్ చంద్ అనే వ్యక్తి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. తియ్యని మాటలతో ఎదుటివారిని నమ్మించి మోసం చేసేవాడు. నకిలీ రుద్రాక్షలు, పాత కాలం నాణెములను మహిమ కలవని నమ్మించి ఎక్కువ ధరకు అమ్మేవాడు.
అలాగే పెరట్లో ఉన్న చెట్టు కాయలను కోసి వాటికి బూడిద రాసి మారేడు కాయల్లా తయారు చేసి “మహిమ కల మారేడు కాయలు. వీటిని పూజిస్తే సకల కోర్కెలు సిద్ధిస్తాయని” నమ్మ బలికేవాడు. నిజమేనని నమ్మిన ప్రజలు వేలం వెర్రిగా వాటిని కొని పూజించేవారు.
కొన్నాళ్ళకు బూడిద వెలిసిపోయి అవి నిజమైన మారేడు కాయలు కాదని (బూడిద)మసి పూసిన మారేడు కాయలని, మోసపోయామని తెలుసుకుని బాధపడ్డారు.
నాటి నుంచి లేనిది ఉన్నట్లుగా నమ్మించి మోసం చేసే సందర్భంలో మసి బూసి మారేడు కాయ చేశాడు, తిమ్మిని బమ్మి చేశాడు అనే జాతీయాలు వాడుకలోకి వచ్చాయి” అని వివరించాడు అచ్చియ్య.
తన తెలివి తక్కువ తనానికి సిగ్గుపడింది అచ్చమ్మ.
***
No comments:
Post a Comment