ఒకటైపోదామా... ఊహలవాహినిలో -19 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా... ఊహలవాహినిలో -19

Share This

 ఒకటైపోదామా... ఊహలవాహినిలో -19

 కొత్తపల్లి ఉదయబాబు 




బయటికి వచ్చి హరితకి కాల్ చేద్దామని ఫోన్ చేద్దామనుకుని ఫోన్ తీసాడు విరాజ్.

 

"క్షమించండి. అమ్మకి హఠాత్తుగా సమోసా తినడం వల్ల కాబోలు వాంతులు అవ్వడంతో మీతో చెప్పకుండా వచ్చేసాము .ప్లీజ్ మనస్ఫూర్తిగా క్షమించండి. ఇంటికి చేరాక మళ్లీ మెసేజ్ పెడతాను" అని పది నమస్కారాలతో మెసేజ్ కనబడింది.

 

" అరే పాపం. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేద్దాలే" అనుకున్నాడు విరాజ్.

***

 

" నేను మీ అమ్మగారిని చూడడానికి వస్తున్నాను" అని హరితకి మెసేజ్ పెట్టాడు విరాజ్.

 

" రండి" అని తెలుగు సమాధానం ఇచ్చింది హరిత.

 

సాయంత్రం ఐదు గంటలు దాటాకా హరిత ఇంటికి వచ్చాడు విరాజ్. లోపలికి అడుగుపెడుతూనే అతని కళ్ళు హరిత కోసం వెతికాయి.

 

శకుంతల మంచం మీద లేచి కూర్చుంటూ విరాజ్ ని ఆహ్వానించింది. కొంచెం నీరసంగా కనిపించింది. తాను తెచ్చిన పళ్ళు ఆమె చేతుల్లో పెట్టి,

 

" సారీ ఆంటీ. మీ అనారోగ్యానికి నేనే కారణం. రియల్లీ సారీ "అన్నాడు తప్పు చేసినట్టుగా.

 

" ఏమీ అనుకోకు బాబు. నేను నిజానికి సినిమాకి రాకపోయే దాన్ని. కానీ ఆ చిత్రం అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం. మలినం లేని ప్రేమకి ప్రతిరూపంగా ఉంటుంది ఆ సినిమా. కల్మషం లేని అలాంటి ప్రేమ నిజమైన ప్రేమికులు కోరుకుంటారు. అయితే ఆ ప్రేమ ఫలిస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం.

 

దేవుడు జీవితం ఇచ్చింది జీవించడానికి గాని ఆత్మహత్య చేసుకోవడానికి కాదు కదా. అంతకాలం తన ప్రియుని కోసం ఎంత పవిత్రంగా ఆ అమ్మాయి ఏదో చూసి కూడా చివరికి ఒక కామాంధుడు చేతిలో నిర్దాక్షిణ్యంగా బలిపోయింది. తనని కాదన్న ఒక ఆడదాని మీద మగవాడు అంత దారుణాతి దారుణంగా ప్రవర్తించిన నీ జాతి నీచం.

 

నిజానికి నేను బయట వస్తువులు ఒకటి కూడా తినను. మీరు తెచ్చి ఇచ్చారు కదా పడేయలేక తిన్నాను. బహుశా సమాసానికి వాడిన నూనె వల్ల కాబోలు విపరీతంగా వాంతులు అయిపోయాయి. వెంటనే అమ్మాయితో ఇంటికి వచ్చేసాను. హరిత మీతో చెప్పకుండా వెళ్తే కంగారు పడతారని అంది. నేను మెసేజ్ పెట్టమన్నాను. వస్తూ దారిలో హాస్పిటల్ కి వెళ్లి ఇంజక్షన్ చేయించుకుని ఇంటికి వచ్చేసాను "

 

అంతలో హరిత వేడివేడి పకోడీలు, మంచినీళ్ల గ్లాసు తీసుకొచ్చి విరాజ్ ముందు పెట్టి నుదుటి పట్టిన చెమట తుడుచుకుంది.

 

" ఎంతసేపు అయింది వచ్చి? లోపల పనిలో ఉన్నాను విరాజ్'' అంది.

 

"హాటేగాని స్వీట్ లేదా మరి? "

 

" అయ్యో మర్చిపోయాను. మీరు వస్తానని చెప్పాక చేయకుండా ఉంటానా? " అంటూ లోపలికి వెళ్లి బౌల్లో సేమియా పాయసం తీసుకువచ్చి అతని చేతికిచ్చింది హరిత.

చెంచాతో ఒక స్పూన్ పాయసం నోట్లో పెట్టుకుని" ఎక్సలెంట్.. అన్ని సరిగ్గా సరిపోయాయి. నిజానికి నేను తీపి ఎక్కువగా ఇష్టపడను. కానీ చాలా బాగుంది. ఇదే సమయంలో నీకు ఒక మంచి శుభవార్త కూడా. నీకు జాబ్ కూడా కన్ఫర్మ్ అయినట్టే? "

 

" నిజమా ? ఏ ఉద్యోగం అండి?ఏ కంపెనీలో? " ఉత్సాహంగా అడిగింది హరిత

 

" ఎటోచ్చి ఎండలో నువ్వు తిరిగి చేయగలవా లేదా అన్నది ఆలోచిస్తున్నాను.

 

ఆడపిల్లలకి నీడ పట్టున ఉండే ఉద్యోగం అయితే మంచిది కదా " అన్నాడు విరాజ్.

 

" నాకు ఉద్యోగం వచ్చింది అన్న ఆత్మసంతృప్తి ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా మీకు? మనం ఎవరి మీద ఆధారపడకూడదు అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచేది ఉద్యోగం అంటే. అది ఎంత కష్టమైనా చేస్తాను"అంది హరిత.

 

"అదే... రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఇంటింటికి సర్వే చేస్తారే బైక్ మీద. ఆ కంపెనీలో." చెప్పాడు విరాజ్.

 

''బాబు అన్నట్టు నువ్ ఎండలో తిరిగి చేయలేవేమోనమ్మా '' అంది శకుంతల తక్కువ స్వరంలో.

 

''అలా నిరుత్సాహపరచవద్దమ్మా. కష్టపడందే ఏ విద్యా రాదు అని నువ్వే నేర్పి నేను కష్టపడి చదువుకునేలా చేసావ్. ఎక్కడ కొత్త విజ్ఞానం నీకు అందుబాటులోకి వచ్చినా దాన్ని నేర్చుకో..అది జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడవచ్చు అని కూడా చెప్పావ్. అన్నిటికీ భయపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్లలేనమ్మా. నేను ఈ జాబ్ చేస్తాను విరాజ్ గారు.'' అంది ఆనందం కలగలిసిన ఆవేశంతో హరిత.

 

 

 

''కొంతకాలం చెయ్యనివ్వండి ఆంటీ. లోతుపాతులు తెలుసుకుంటే తానే చెయ్యాలో వద్దో నిర్ణయించుకుంటుంది.'' అన్నాడు విరాజ్.

 

''మంచిరోజు చూసుకుని చెబితే మొదటిరోజు అక్కడకు తీసుకువెళ్లి పరిచయం చేస్తాను.''

 

''ఒక పని సత్ఫలితం ఇవ్వడం, లేకపోవడం అన్నది మంచిరోజు మీద ఆధారపడదు సర్. మనం ఏకాగ్రతతో చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. మీకు అభ్యంతరము లేకపోతే రేపు మీరు రమ్మన్నచోటికి వస్తాను. మీరు దగ్గరుంచి జాయిన్ చేయండి. ఏమ్మా? ఏమంటావ్?'' అనుమతి కోసం తల్లికేసి చూసింది హరిత.

 

''సరేనమ్మా...నీ ఇష్టం.''అంది ఆవిడ.

 

మరునాడు ఏ సమయంలో ఎక్కడకు రావాలో చెప్పి, అక్కడకు వచ్చిన వెంటనే ఫోన్ చేయమని చెప్పి, శకుంతలకు ఆరోగ్యపరమైన సూచనలు ఇచ్చి విరాజ్ వెళ్ళిపోయాడు.

 

***

 

మరునాడే విరాజ్ సహాయంతో ఫుడ్ డెలివర్ ఎగ్జిక్యూటివ్ గా చేరిపోయింది. దానికి తగ్గ ఫార్మాలిటీస్ అన్నీ విరాజ్ దగ్గరుండి పూర్తిచేయించి ఆమెను జాయిన్ చేసాడు.

 

''నా హృదయపూర్వక అభినందనలు. అయితే...?''వెళ్ళబోతూ అన్నాడు హరితతో.

 

''ఊ ...అయితే?'' ప్రశ్నర్థకంగా చూసింది హరిత అతనివంక.

 

''నేను అపుడపుడు ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు ఇంటికి.''

 

''ఎస్ బాస్.'' హరిత అన్న విధానానికి నవ్వేసి ''వెళ్ళొస్తాను. ఏమైనా ఇబ్బంది పడినా, అవసరం ఉన్నా ఫోన్ చేయడం మర్చిపోకు.'' అనేసి వెళ్ళిపోయాడు విరాజ్.

 

మొదటి రోజు కంపెనీ ఇచ్చిన జాకెట్,జాయినింగ్ కిట్ తీసుకుని మొదటి డెలివరీ చేస్తున్నప్పుడు ఎంతో సంతోషం ఫీల్ అయింది హరిత. ఆరోజు మొత్తం మూడు డెలివరీస్ ఇచ్చింది.

 

డ్యూటీ అయిపోయాకా విరాజ్ కి మెసేజ్ పెట్టింది ''సదా కృతజ్ఞతలతో ...హరిత''

 

మూడు రోజుల అనంతరం జిమ్ లో కూడా చేరింది ఫిజికల్ ఫిట్నెస్ కోసం.

 

***

 

దాదాపు నెల రోజుల తర్వాత హరిత డిగ్రీ ఫలితాలు వచ్చాయి. ఫైనల్ ఇయర్ లో మరిన్ని ఎక్కువ మార్కులు వచ్చి మొత్తం డిగ్రీ మీద 83.2% మార్కులు సాధించింది.

 

హరితకు హార్దిక శుభాకాంక్షలు తెలిపి బహుమతిగా ఏం కావాలో కోరుకోమన్నాడు విరాజ్.

 

" తల్లిదండ్రుల కష్టపడి చదువు చెప్పిస్తున్నప్పుడు బాధ్యతగా చదువుకోవాల్సిన గురుతర బాధ్యత పిల్లలది. ఇప్పుడు నేను చేసిన పని అదే. మీరు ఏ బహుమతి ఇచ్చిన నిర్మొహమాటంగా చెప్తున్నాను... నేను తీసుకోను. మన కలయిక ఏ కోవెల్లో జరిగిందో ఆ స్వామిని దర్శించుకుని మళ్లీ నాకు తోచిన కోరిక కోరిక వస్తాను ఆ సంతృప్తి చాలు నాకు." ఫలానా రోజు డ్యూటీ అయిపోయాక డైరెక్ట్ గా నేను కోవెలకొచ్చేస్తాను. మీకు సమయం కుదిరితే ఆ సమయానికి రండి. ఇద్దరం కబుర్లు చెప్పేసుకున్న తర్వాత ఎవరింటికి వాళ్లు వాళ్ళు వెళ్ళిపోదాం. "అంది హరిత.

 

" సరే "అన్నాడు విరాజ్.

 

***

 

విరాజ్ హరితలో ఒకరికొకరు పరిచయం అయ్యాక, రెండు మూడు ముఖ్యమైన అంశాలు తప్ప రెండేళ్ల 8 మాసాలు కాల గర్భంలో ప్రశాంతంగా జరిగిపోయాయి అని చెప్పాలి.

 

అంశాల్లో ముఖ్యమైనది విరాజ్ ప్రొప్రైటర్ గా గవర్రా జు రెండో బ్రాంచ్ ని ఓపెన్ చేయించాడు.

 

ఫుడ్ ఎగ్జిక్యూటివ్ గా ఏ విధమైనటువంటి ఫిర్యాదులు హరిత మీద లేకపోవడంతో ఆమె ప్రశాంతంగా అదే ఉద్యోగాన్ని కొనసాగిస్తోంది

 

మంచి ఫుడ్ ఎగ్జిక్యూటివ్ గా పేరు తెచ్చుకుంది.

 

కూతురు మీద నమ్మకం ఏర్పడడంతో, విరాజ్ హరిత ఏదైనా ప్రదేశానికి పగటి పూట వెళ్లి రావడానికి శకుంతల అంగీకరించేది.

 

అయితే విరాట్ చెప్పిన చోటికి హరిత బస్సులో గాని బైకులో గాని వెళ్ళేది. అది సినిమా అయినా, గుడి అయినా పార్క్ అయినా, ఇటువంటి పబ్లిక్ పేస్ అయినా ఆమె అభ్యంతరం చెప్పేది కాదు.

 

విరాజ్ తన స్నేహితుల కుటుంబాల్లో పెళ్లి అయ్యాక ఎదురవుతున్న సమస్యలను ఎన్నిటినో హరితతో చర్చించేవాడు. ఒకవేళ రేపు తమ జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదురైతే ఏ విధంగా ముందడుగు వేయాలి, ఎవరెవరి సలహాలు తీసుకోవాలి అనే విషయాలు కూడా చర్చించుకునేవారు.

 

అలా మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా విషయం చెప్పడం మానేసి, " నేను నిన్ను టచ్ చేసేస్తాను. నేను ఇంక ఆగలేక పోతున్నాను." అని సరదాగా హరితని ఏడిపించేవాడు.

 

" సరే విరాజ్ మీ ఇష్టం. మీ షాప్ కి అంతమంది కస్టమర్లు వస్తారు కదా. గాజులు వేస్తున్నట్టు నటించి వాళ్ళ చేతులు పట్టుకోండి. మీ ముచ్చట తీరిపోతుందిగా. అలా తీరిపోయినప్పుడు చెప్పండి. నన్ను ప్రేమిస్తున్నవాడు మనసుని కంట్రోల్ చేసుకోలేని బలహీనుడు అని నిర్ణయం చేసుకుంటాను" అనేసింది.

 

" నీకు అలాగే ఉంటుంది హరిత. నువ్వు నవ్వనంటే ఒక్క జోక్ చెప్తాను."

 

" చెప్పండి"

 

" నవ్వకూడదు మరి. తర్వాత మళ్లీ నన్ను ఏడిపించ కూడదు. ఈ విషయంలో మాత్రం ప్రామిస్ చెయ్యి" అన్నాడు అతను.

 

" ప్రామిస్" అంది చేతులు కట్టుకుని హరిత

 

" ప్రతినెల ఒక కొత్త దిండును మార్చాల్సి వస్తోంది "

 

" అంటే? " అర్థం కానట్టు చూసింది హరిత.

 

" నువ్వు గుర్తొచ్చినప్పుడు దాన్ని గట్టిగా కావలించుకుని గాఢంగా నిద్రపోతున్నాను. దిండు మీద చొంగ మరకలు, తలనూనె మరకలు తోటి అది అసహ్యంగా తయారవుతోంది. మా అమ్మగారు తిడుతున్నారు. మళ్లీ కొత్త దిండు కొంటున్నాను. నిద్దట్లో చింపేస్తున్నానో ఏమో..

 

కొన్నిసార్లు అయితే మంచం నిండా స్పాంజ్ ముక్కలవీ ఉంటున్నాయి. ఇవన్నీ వింటుంటే నీకు కొత్తగా లేదూ?. "

 

" కొత్తగానా....నాకా... భయంగా ఉంది. నిజంగా పెళ్లి అయ్యాక మీ అల్లరి నేను భరించగలనా అని? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు మరో చరిత్ర సినిమా చూడండి "

 

" అందుకే ధ్యానం చేసే సమయాన్ని కూడా పెంచుకున్నాను హరిత.రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. శారీరకంగా అలసిపోయి ఎక్కువ సేపు నిద్రపోతే ఇక చెడు ఆలోచనలు రావు. నువ్వేం భయపడకు.

 

ఆ విషయంలో నిశ్చింతగా ఉండు. " అన్నాడు విరాజ్.

 

శారీరికమైన ఆకర్షణకి లొంగిపోకుండా మానసికంగా వాళ్ళిద్దరు దగ్గరవుతున్నారు అని వారి ఒకరి మనసులో ఒకరికి అర్థమైంది.

 

ఆ నాలుగు నెలలు కూడా పూర్తయ్యాయి.. అంటే వారి స్నేహం మూడో వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంది.

 

ఆ మూడో వార్షికోత్సవంనాడే అదే కోవెలలో వీరాజ్... "మన విషయాన్ని మా నాన్నగారి ముందు ఉంచుదాం అని అనుకుంటున్నాను." అన్నాడు హరితతో.

 

" అయితే ఈ మూడేళ్ల నుంచి మీ నాన్నగారికి ఈ విషయం తెలియదనే అంటారా? "

 

" నువ్వు నాకు మొట్టమొదటి రోజు ఓకే చెప్పిననాడే మా నాన్నగారికి మన విషయం చెప్పేద్దాం అనుకున్నాను. కానీ ఒక నెల రోజుల తర్వాత ఆయన ఏం గమనించారో తెలియదు కానీ...' ఏరా ప్రేమలో పడ్డావా?' అని అడిగారు ఒకరోజు... నేను చెప్పేసాను. "ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మూడేళ్లు ఒకరినొకరు అర్థం చేశాక మీ అనుమతితో పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయికి చెప్పాను." అని.

 

" డబ్బు కోసం వలవేసే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా చూసుకో. వాళ్లు నీ వల్ల తల్లులయ్యే పరిస్థితిమాత్రం తెచ్చుకోకు. అలా తెచ్చుకుంటే మన ఆస్తులన్నీ వాళ్లకి భరణం కింద పంచిపెట్టడమే సరిపోతుంది. " అని సలహా ఇచ్చారు.

 

ఈ మూడేళ్లు మనం ఒకళ్ళకొకళ్ళం బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి మా నాన్నగారిని ఈ రాత్రి మనం పెళ్లి చేసుకోవడానికి అనుమతి కోరుతాను. " అన్నాడు విరాజ్.

 

" సరే, విరాజ్.ఒకవేళ ఆయన

 

ఒప్పుకోకపోతే? "

 

" ప్రతి దానికి సామ దాన భేద దండోపాయాలు ఉన్నాయి అంటారు. మన ప్రయత్నం మనం చేద్దాం. కాదన్నప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం." అన్నాడు విరాజ్.

 

" మూడు సంవత్సరాల పాటు నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడిన మీరు ఈ వేళ కాదన్నప్పుడు చూద్దాం... అన్నారంటే.. నా ఈ మూడు సంవత్సరాల ప్రేమ జీవితం వృధా అయిపోయినట్టేనా..మీరు అనవలసింది ఆ మాట కాదు విరాజ్. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా ఒక మాట అంటారనుకున్నాను.

 

ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే నాకన్నా ఎక్కువ బాధపడేది మా అమ్మ. అసలు నిన్నే ప్రేమిస్తున్నాను అని మీరు నా జీవితంలోకి ఎందుకు వచ్చారు? మీరు కోరాక నేనెందుకు ఒప్పుకున్నాను?...

 

రేపు నిజంగా మీ నాన్నగారు ఒప్పుకోకపోతే... నేనేమీ ఆత్మహత్య చేసేసుకుని చచ్చిపోను. కానీ ఒక అసమర్థున్ని ప్రేమించాను అనేటువంటి మాట మాత్రం అనుకోకుండా ఉండలేను. " ఈ మాటలు వీరాజ్ ని అడుగుదాం అని అనుకున్నా హరిత ఒక మాట అడగలేకపోయింది. ఏ పరిస్థితి అయినా ఇందులో ఒప్పుకున్నందుకు నా తప్పు ఉంది కాబట్టి దానికి తగ్గ శిక్ష అనుభవించాల్సిందే... అనుకుని మనస్సు స్థిరపరచుకొని

 

" మీ ప్రయత్నం విజయవంతం కావాలని ఆ భగవంతుని ఎదురుగా కోరుకుంటున్నాను."

 

అని కళ్ళు మూసుకుని ప్రార్థించింది హరిత.

 

విరాజ్ కూడా భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నాడు తండ్రిని అడగబోయే తన కోరిక తీరాలని.

 

***

 

మూడేళ్ల క్రితం విరాజ్ పరిచయమైనప్పటినుంచి నిన్నరాత్రివరకు జరిగిన విషయాలన్నీ ఆటోలో ఇంటికి వస్తూ గుర్తుతెచ్చుకున్న హరిత ''వర్తమాన కాలం''లోకి వచ్చి ఇంటిముందు ఆగిన ఆటోకు డబ్బులు ఇచ్చేసి " అమ్మ... ఇదిగో చిల్లర తీసుకోండి" అని ఆటో డ్రైవర్ పిలుస్తున్నా వినకుండా లోపలికి వచ్చేసింది.

 

(ఇంకా ఉంది )

 

No comments:

Post a Comment

Pages