పరధర్మో భయావహ: - అచ్చంగా తెలుగు

పరధర్మో భయావహ:

సి.హెచ్.ప్రతాప్
 




భగవద్గీత 2 వ అధ్యాయం, సాంఖ్యయోగం లోని 32 వ శ్లోకం ఈ క్రింది విధంగా వుంది.

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ ।
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్

 ఓ అర్జునా ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు, కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి.

భగవద్గీతలో 3 వ అధ్యాయంలో 35 వ శ్లోకం లో స్వధర్మం గురించి మరొక చక్కని శ్లోకం వుంది.

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః

గొప్పగా ఉందనుకునే ఇతరుల ధర్మం కంటే, గొప్పగా కనిపించకపోయినా తన ధర్మమే మంచిది. ఆ ధర్మం ఆచరిస్తూ చనిపోయినా మంచిదే. అంతే కానీ పరుల ధర్మం ఆచరించడం భయంకరమైనది అని పై శ్లోకం భావం.

శ్రేయాన్‌ స్వధర్మో విగుణః అంటే స్వధర్మం అనేది కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, అది కొంచెం చెడ్డదని మనసుకు  అనిపిస్తున్నప్పటికీ అదే శ్రేయస్కరం అని పై శ్లోకం స్పష్టం చేస్తోంది. పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్‌ పరధర్మం ఎంత గొప్పగా చేసినప్పటికీ స్వధర్మమంత గొప్పగా ఉండదు. స్వధర్మే నిధనం శ్రేయః అంతే  మన ధర్మానికి మనం కట్టుబడి ఉండడం, మన వృత్తికి మనం కట్టుబడి ఉండడం మంచిది అని శాస్త్రం చెబుతోంది. పరధర్మో భయావహః ఒక వృత్తిలో ఉన్న వాడు మరో వృత్తిలోకి ప్రవేశిస్తే, ఒక ధర్మం చేయవలసిన వాడు, ఇతరుల ధర్మం స్వీకరిస్తే ఎప్పటికైనా అతనికీ, లోకానికీ భయావహం అవుతుంది

స్వధర్మం, అంటే ఒకరి స్వంత ధర్మం , స్వయం మరియు ధర్మం అనే పదాల నుండి ఉద్భవించింది. స్వధర్మం అనేది ఒకరి సామర్థ్యంపై ఆధారపడిన వ్యక్తి యొక్క చట్టబద్ధమైన ప్రవర్తనగా వివరించబడింది. ఒక వ్యక్తి తన బలాలు, సామర్థ్యాలు మరియు బలహీనతల గురించి తెలుసుకోవడం అవసరం. స్వధర్మం అంటే ఎవరు ఏ ఆత్మ పరిణామ దశల్లో వున్నారో ఆ ఆత్మస్థాయికి తగ్గ ధర్మం అన్న వివరణ శాస్త్రంలో వుంది. పరధర్మం అంటే ఇతరులు ఏ ఆత్మ పరిణితి స్థాయిలో ఉన్నారో వారి వారి ఆత్మ పరిణితి స్థాయిలకు తగ్గ ధర్మాలు.మనలో సహజసిద్ధంగా ఉన్న అభిరుచి, వాసనలను అనుసరించి ఒకానొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది అదే స్వధర్మం అవుతుంది.ఇతరులకు నిర్దేశించబడినవి,మరి మనకు నిర్దేశించబడనిది అయినదే పరధర్మం. సదా, సర్వత్రా స్వధర్మాశ్రయమే శరణ్యం అవుతుంది.స్వధర్మపాలనలో మరణం సంభవించినా మేలే అన్నవిషయాన్ని గీతాచార్యుడు అర్జునుడికి స్పష్టం చేసాడు.

స్వధరం ఆచరించే అవకాశం మానవులందరికీ లభించినా అందరూ దానిని అంది పుచ్చుకొని స్వధర్మాచరణ ద్వారా సద్వినియోగం చేసుకోలేరు.అధికశాతం పర ధర్మం, పర సంస్కృతి యొక్క ఆకర్షణలకు లోనై వటిని ఆచరిస్తూ తమ ధర్మానికి అన్యాయం చెస్తుంటారు. ఈ విధానం తప్పని భగవానుడు ఆనాడే పై శ్లోకం ద్వారా మానవాళిని హెచ్చరించాడు.

ఒకరి స్వంత కర్తవ్యం, శ్రేష్ఠత లేకున్నా మరొకరి స్పష్టంగా నిర్వర్తించే కర్తవ్యం కంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ యోగ్యమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి తన స్వభావాన్ని బట్టి నిర్దేశించిన పనులు చేయడం వల్ల పాపం జరగదు.
  

***

No comments:

Post a Comment

Pages