ప్రణయం - 1 - అచ్చంగా తెలుగు
ప్రణయం - 1 
నాగమంజరి గుమ్మా




ప్రేమ...
ఈ పదమే ఒక మాయ. ఎవరిపై ఎలా ఎప్పుడు కలుగుతుందో చెప్పలేము.
ముందుగా చూసుకోకున్నా, ప్రేమించుకోకున్నా, వివాహబంధంతో ఒక్కటై, భార్యాభర్తలిద్దరూ ప్రేమకు మారుపేరుగా దాంపత్యాన్ని పండించుకున్న జంటలెన్నో…

రుక్మిణీ పరిణయం
విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ రాజుకి రుక్మిణీ అనే కుమార్తె ఉంది. రుక్మిణికి, రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు సోదరులు ఉన్నారు. రుక్మిణీదేవి శరత్కాల చంద్ర బింబం వలే దిన దిన ప్రవర్థమానమై యవ్వన వయస్సుకు వచ్చింది.
వసుదేవ నందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణి దేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకున్నాడు. అదే విధంగా రుక్మిణీ దేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకొంది. 

భీష్మకుడు మొదలగు పెద్దలు రుక్మిణీ కృష్ణుల వివాహానికి అంగీకారం తెలిపారు.  పెళ్ళి పనులు ప్రారంభించారు. రుక్మిణీదేవి పెద్దన్న రుక్మికి రుక్మిణి ని కృష్ణునికి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేదు.  తన సోదరిని శిశుపాలుడి కిచ్చి పెళ్ళి చేయాలని పట్టుబట్టాడు. రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టించాడు. 

ఈ విషయం తెలుసుకొన్న రుక్మిణీ దేవి చాలా చింతించింది. కొద్ది సేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిద్యోతనుడు అనే విప్రవరుడిని రప్పించి తన మనస్సు విప్పి, విషయం చెప్పి ద్వారకానగరమునకు వెళ్ళి శ్రీకృష్ణునకు తన అభీష్టము తెలిపి, ముహూర్తమునకు ముందే ఇక్కడకు వచ్చి తనని చేపట్టమన్నది.

అగ్నిద్యోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్ళి రుక్మిణీ దేవి పలికిన పలుకులు శ్రీకృష్ణునకు విన్నవించాడు. అంతేకాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవరుడు రుక్మిణీ దేవి ఏవిధంగా చేపట్టాలో ఆలోచన కూడా చెప్పాడు. "యదువంశ నందనా! రుక్మిణీ దేవి వారి వంశాచారము ప్రకారం పాణిగ్రహణానికి ముందు నగరం పొలిమేరలలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది. ఆ సమయములో నందకుమారా, నువ్వు ఆమెను తీసుకొని వెళ్ళవచ్చు. ఆమెతో పాటు ఎవ్వరు ఉండరు కావున యుద్ధము జరిగే ప్రసక్తి కూడా ఉండదు." అన్నాడు.

శ్రీ కృష్ణుడు అందుకు అంగీకరించాడు. కృష్ణుడు, అగ్నిద్యోతనుడు విదర్భ దేశము వైపు బయలు దేరారు. అగ్నిద్యోతనుడు రుక్మిణి వద్దకు వెళ్ళి శ్రీ కృష్ణుడితో జరిగిన సంభాషణ చెప్పాడు, శ్రీకృష్ణుడు ఆమెని సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెప్పాడు.
అనుకున్న ప్రకారము రుక్మిణీ దేవి నగరపొలిమేరలలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వెళ్ళింది. అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది. రుక్మి పంపిన వివాహ ఆహ్వానం  అందుకొని  అనేక రాజ్యాల రాజులు శిశుపాలుని వివాహం చూడటానికి రాజధానికి వచ్చారు . వారు అందరు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటహుటిన ద్వారక వైపు బయలుదేరాడు.

రుక్మిణీ దేవిని తిసుకొని వెళ్ళుతున్న శ్రీకృష్ణుడిని చూసి అందరు తెల్లబోయారు. తేరుకొని శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరారు. అప్పుడు బలరాముడు మొదలైన యదువీరులు ఆ రాజులను చెల్లాచెదురు చేశారు. ఆ రాజులు పిక్కబలం చూపి పారిపోతూ, శిశుపాలుని చూసి "నాయనా! బతికి ఉంటే కదా భార్య! ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరో రాచకన్యని పెళ్ళి చేసుకో" మని చెబుతారు. కాని రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్ళి శ్రీకృష్ణుడి రథానికి ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. అనేక విధాల శ్రీకృష్ణుడిని దుర్భాషలాడి బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు ఒక్క బాణం తో ధనస్సు ఖండించాడు. మరికొన్ని నిశిత శరాలతో గుఱ్ఱాలను చంపాడు. శిశుపాలుడు పరిగ, గద ఆదిగా గల అనేక ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటిని ఛేదించాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలచ బోగా, రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడి కాళ్ళపై పడి తన సోదరుడిని క్షమించి విడిచి పెట్ట మంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తల గొరిగించే సన్మానం చేస్తాడు. అది చూసి రుక్మిణీ దేవి విచారిస్తుండగా, బలరాముడు రుక్మిణీ దేవిని ఓదార్చాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని ద్వారకకు తీసుకొని వెళ్తాడు. ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు వేదోక్తంగా రుక్మిణీ శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు.
ప్రేమ నిజమైనది అయినపుడు పెద్దల ఆమోదం కూడా ఉంటే ఆటంకాలు ఎదురైనా కూడా విజయం సాధిస్తుంది.
స్వస్తి

****

No comments:

Post a Comment

Pages