శ్రీనగజా
తనయం
(మా నర్సాపురం కథలు)
భావరాజు పద్మినీ ప్రియదర్శిని
శ్రీరామనవమి
ఉత్సవాలైనా, గణపతి నవరత్రులైనా, దేవీ నవరాత్రులైనా అంగరంగ వైభవంగా జరుపుతారండోయ్, మా నర్సాపురం గాంధీ బజార్ రోడ్లో ఉన్న రామాలయంలో!
ఆ రామనవమి
నాడు వేసిన తాటాకు పందిట్లో అప్పుడే కల్యాణమైన సీతారాములు పట్టుబట్టల్లో
మెరిసిపోతా ఉన్నారు. "శ్రీనగజా తనయం సహృదయం" అన్న పాట స్పీకర్లోంచి
వినిపిత్తా ఉంటే, అప్పుడే ప్లేట్లో
భోజనవెట్టుకొచ్చిన లోవరాజు "ఒరేయ్, ఈ పాట
రాసినాయన్ది మనూరే తెల్సా!" అన్నాడు బుజ్జిబాబుతో!
"నీతో ఇదే వచ్చిందిరా గొప్పచిక్కు! ఓ మాటేసేత్తావంతే! ఇదేటా అని ఆనక మేవు
తన్నుకుజావాలి. ఈ పాట రాసింది శ్రీశ్రీ గోరు కాదేటీ? మరీనూ!" పూర్ణం బూరె కొరుకుతా కసిరాడు బుజ్జిబాబు!
"ఓరోరి! నిజఁవేరోయ్! పాట శ్రీశ్రీ గోరిదే! పల్లవి మటుకు మనూళ్లో పుట్టిపెరిగిన
పెద్దింటి సూర్యనారయణ దీక్షితులు గోరిది. ఈరెంతటోరైతే శ్రీశ్రీ గోరే ఈయన పేరు
జెప్పిమరీ, వాగ్దానం సినీమటలో ఆయన పల్లవి
వాడుకునుంటారు? ఆలోచించెహె!"
"ఆరెవర్రా! నాన్సకండా చెప్పరా బాబా!" అంటా వారగా ఉన్న కొట్టు అరుగు
దగ్గరకి లోవరాజును లాక్కెళ్లి కూచోబెట్టాడు బుజ్జిబాబు.
***
స్టీమర్
రోడ్లో పెళ్లిళ్ల రాజగోపాలస్వామి ఆలయం వద్ద ఉన్న పెద్ద పెంకుటిల్లది. తరతరాలుగా ఆ
కుటుంబం వారే స్వామివారి గుడిలో అర్చకత్వం చేస్తున్నారు. అనేక రకాల చెట్లతో
విశాలంగా ఉన్న ఆవరణకు ఈశాన్యం మూలన ఉన్న బావి దగ్గర చేదతో నీళ్లు తోడుకుని, కాళ్లు కడుక్కుని వచ్చి, వసారాలో
కూర్చున్నారు కొంతమంది. వాళ్లంతా పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసు గారి వద్ద
హరికథ నేర్చుకోడానికి వచ్చిన శిష్యులు. అలా వచ్చిన వాళ్లకు భోజనాలతో సహా అన్ని
ఏర్పాట్లూ చేసి, ఉచితంగా శిక్షణ ఇవ్వడం ఆయనకు అలవాటు.
"లోకంలో ఎన్నో రకాల వృత్తులూ, ఉద్యోగాలూ, వ్యాపారాలూ ఉన్నాయి. బ్రతకడం కోసం మనిషి ఏదో ఒక పని
చేయవలసిందే, ఎవరో ఒకరికి దాస్యం చేయవలసిందే! కానీ 'హరిదాసులు' అంటే... స్వయానా
హరికే దాస్యం చేసేవారు! ఎవరో ఒకరికి దాస్యం చేసే కంటే... 14 లోకాలను సృష్టించి అందులో కోట్లాది జీవరాశులను పుట్టించి, వాటి కోసం అన్ని రకాల సదుపాయాలనూ ఏర్పాటు చేసిన ఆ పరమాత్మకు
దాస్యం చేయడంలో ఉదాత్తత ఉంది. అంతేకాదు, "దాసస్య దాసోస్మ్యహం" అంటే తన దాసులకు తాను దాసుడనని చెప్పే పరమాత్మ -
తనకు దాస్యం చేసిన హరిదాసులకు, అడగకుండానే సమస్త
భోగాలను,
కీర్తి ప్రతిష్టలను, విద్యాబుద్ధులను
ప్రసాదించి, వారి ఇహపర సౌఖ్యాలకు కావాల్సినవన్నీ
సమకూరుస్తారు. నమ్మిక గల భాగవతులకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు. ఇది సత్యం!
అసలు హరికథలు
ఎందుకు చెప్తారో తెలుసా? లోకోద్ధరణ కోసం!
ఎలాగో వినండి. సమాజంలో రకరకాల
వ్యక్తులుంటారు. పండితులుంటారు, పామరులూ ఉంటారు.
పిల్లలూ,
యువకులూ, మధ్యవయసు వారూ, వృద్ధులూ... అందరినీ సమానంగా అలరించేది - సంగీతం. ఈ
సంగీతానికి లయబద్ధంగా పద్యగద్య సాహిత్యాన్ని కూర్చి, వాయిద్య సహకారం, అభినయం, నాట్యంతో రసవత్తరంగా కథాగానం చేస్తే... అది అందరినీ సమానంగా
అలరిస్తుంది. నానాచిత్త వృత్తులతో సతమతమవుతున్న వారి మనస్సులను కట్టిపడేసి...
హరిలీలలలో నిమగ్నమయ్యేలా చేస్తుంది. కలియుగంలో నామస్మరణ మాత్రమే చాలు కనుక, అనేక పనుల్లో మునిగి, ఆ నామస్మరణ
కూడా చేయలేని వారిని భక్తి మార్గంలోకి మళ్లించడానికి ఈ హరికథలే ఉత్తమమైన మార్గం.
హరికథకుడికి
ఎటువంటి భేషజాలూ ఉండకూడదు. కనుక హరికథ చెప్పాలనుకునేవారు మొదట వదలాల్సింది అహాన్ని, భేషజాలను. హరికథకు ఆద్యుడైన నారద మహాముని పద్ధతిలో పంచె, నడుముకు కట్టిన ఉత్తరీయం, మెడలో దండ, కుడి చేతిలో చిడతలు, కాళ్లకు గజ్జెలు, ఇలా
నిరాడంబరంగా ఉండాలి. ఈ హరికథకులను 'దాసులు', 'భాగవతార్' లు అంటారు. సకల కళా
సంగమమైన ఈ హరికథలు చెప్పడం నేర్చుకోడానికి, భాగ్యశాలురైన
మీరంతా ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది."
అంటూ అందరినీ
చూసి,
"ఇవాల్టికిది చాలు నాయనలారా! భోజనాలు సిద్ధంగా
ఉన్నాయి. అందరూ కడుపునిండా తిని వెళ్లండి." అంటూ లేచారు దీక్షిత దాస
భాగవతార్ గారు.
అవతల వసారాలో
మరోప్రక్క ఇద్దరు పెద్దమనుషులు ఎదురు చూస్తున్నారు. దీక్షితులు గారక్కడికి
వెళ్లగానే, లేచి నుంచుని నమస్కరించారు. ఆయన
తిరిగి నమస్కరించి, కూచోమని సైగ చేసారు.
"అయ్యా! ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డా.శంకర్ దయాళ్ శర్మగారు మమ్మల్ని పంపారు.
మీకు 'కళాప్రపూర్ణ' గౌరవ
డాక్టరేట్ ను ఇవ్వాలని వారి సంకల్పం. దయచేసి మన్నించగలరు." అభ్యర్థనగా
అడిగారు అందులో తిరునామాలు పెట్టుకుని ఉన్న ఒక పెద్దాయన.
"వారి ఉదారతకు నా నమస్సులు. కానీ, నాకంతటి
అర్హత ఉందంటారా?" సంశయంగా చూస్తూ అడిగారు
దీక్షితులు గారు.
"మీ ప్రశ్నకు సమాధానం వీరు చెబుతారు" అంటూ తన ప్రక్కన ఉన్నాయనను చూపించారు
పెద్దాయన.
"అయ్యా! నా పేరు శ్రీనివాసు. యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్నాను. మా షడ్డకుడిది
ఈఊరే. వాళ్లబ్బాయి మీవద్దనే హరికథాగానం అభ్యసించి, పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఈనాటికీ
పర్వదినాల్లో ఆలయాల్లో హరికథను వినిపిస్తున్నాడు. పైసా తీసుకోకుండా, కడుపు నిండా భోజనం పెట్టి మరీ, మీరు విద్యనేర్పే విధానం గురించి, మీ నిరాడంబరమైన జీవనశైలి గురించీ, అతను చెప్పగా విన్నాను."
"తల్లి పక్షి, పిల్ల పక్షుల
నోళ్లలో గింజలు తెచ్చి పెడుతుంది. అవి రెక్కలొచ్చి ఎగిరిపోయాకా, ఎవరికెవరో! కానీ ఆనాడు పిల్ల నోట్లో ఆహారం రూపంలో పొదిగిన
కళ,
ఇలా రెక్కలు విప్పి విస్తరించిందని, తెలిసినప్పుడు... అప్పుడు కదా, మాలాంటి తల్లిమనసున్న వారికి నిజమైన సంబరం!" అంటూ
ఆనందపడిపోతూన్న ఆయన్ని చూస్తా, ఓ తేదీ ఖాయం
చేసుకుని,
బొజ్జనిండా వారెట్టిన బువ్వతినెళ్లిపోయారోళ్లు!
డాక్టరేటొచ్చిందన్న
ఆనందం కంటే... తాను నేర్పిన హరికథ మరొకచోట మారుమ్రోగుతోందన్న ఆనందమే
ఎక్కువానుతోందాయన ముఖంలో!
***
నర్సాపురం...
1987...
ఆ వేళ
దీక్షితులు దాసు గారి సహస్ర చంద్ర దర్శనోత్సవం సందర్భంగా, ఆయనకు కనకాభిషేకం జరుగుతోంది. ఆయన్ని గురించిన పరిచయం
చదూతున్నాడొకాయన.
"ఘంటా కంకణము, సింహతలాటము, గండపెండేరము, బంగారు కాసు, ఉంగరము, ఇలాగీరి చేతులకీ
కాళ్లకీ రకరకాలయి తగిలించి, సన్మానించుకున్నారండీ
అంతా. కానీ మన నర్సాపురవోఁళ్లకి ఇట్టవొఁచచినా కట్టవొఁచ్చినా ఘనంగా జెప్పడం అలవాటు
కదండీ! అంచేత చేతికో, కాలికో, వేలికో కాకుండా, ఏకంగా
ఒళ్లంతా కనకాభిషేకం చేసి మన అభిమానాన్ని చాటి చెప్పుకోవాలనే... ఈ కనకాభిషేకం!
దానికంటే ముందు, దాసుగోరి గురించో నాలుగు
మాటలనుకుందాం!
భార్గవ
గోత్రీకులైన అప్పలాచార్యులు, సీతమ్మ దంపతులకు 25/10/1904వ సంవత్సరంలో దాసుగోరు జన్మించారు. ఈరి తాత ముత్తాతలిక్కడి
రాజగోపాల స్వామి ఆలయంలో వంశపారంపర్య అర్చకులు, కవిత్వ సంగీత
సాహిత్యాలలో ప్రవీణులు.
దాసుగోరు మన
టైలర్ హై స్కూల్లో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివాక సంస్కృతాంధ్ర భాషల్లో మహా పండితుల
వద్ద విద్యను అభ్యసించి ఉభయ భాషా ప్రవీణులయ్యారు. పువ్వు పుట్టగానే
పరిమళిస్తుందన్నట్లు 16 సంవత్సరాల వయసు
నుంచే కవిత్వం వ్రాయడం మొదలుపెట్టి అనేక కీర్తనలు, హరికథలు, యక్షగానాలు రచించారు. నలచరిత్రము, ద్రౌపదీమాన సంరక్షణము, సీతాకల్యాణం, హనుమత్సత్యాగ్రహము వీరి రచనల్లో కొన్ని. కేవలం రచించడం
మాత్రమే కాక పూరి, బరంపూర్, జైపూర్, కలకత్తా మొదలైన
ప్రాంతాలలో కథా గానం చేశారు. వీరి కీర్తనలను బాలమురళీకృష్ణ గోరు, నేదునూరి కృష్ణమూర్తి గోరు, శ్రీరంగం గోపాలరత్నం గోరు, వంటి మహామహులెందరో
ఆకాశవాణి భక్తి రంజనిలో ఆలపించారు. రేడియో, టీవీలలో ఈరి
ఇంటర్వ్యూలు, స్వీయ కవిత గానాలు ప్రసారమయ్యాయి.
రెండేళ్ల పాటు ఆకాశవాణి కేంద్రంలో ఆడిషన్ జడ్జిగానూ, కపిలేశ్వరపురంలోని 'సర్వరాయ హరికథ పాఠశాల'లో ఒక సంవత్సరం ప్రిన్సిపల్ గానూ ఈరు పనిచేశారు. 1981- 84 వరకు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన విద్వాంసులుగా
నియమించబడ్డారు. 1981 ఉగాది నాడు అప్పటి
ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి అంజయ్య గారు వీరిని 'తెలుగు వెలుగు'గా సన్మానించారు. శ్రీ పెద్దింటి
సీతారామ భార్గవ గారు కోరుకొండలో 58 జతల ఎడ్లను పూన్చిన
బండిపై ఊరేగించి, ఘనంగా సన్మానం
చేశారు. వీరి రచనలలో కొన్నిటిపై, కొందరు పరిశోధన చేసి
పట్టాలను పొందారు.
కవి కథక రత్న, హరికథాసుధాకర, సారస్వత
విభూషణ,
ఆంధ్రవ్యాస, హరికథక
సార్వభౌమ,
కథాగాన కళా ప్రపూర్ణ, హరికథాగాన
కవి కులాలంకార, హరికథక శిరోమణి అయిన దాసు గారు, మన నర్సాపురం వోరు కాడఁవూ, ఈ రోజున మనం వోరికి కనకాభిషేకం చేసే అదృష్టం మనకు దక్కడఁవూ మన సుకృతం."
అనగానే ఆ హాల్లో చప్పట్లు మారుమ్రోగాయి.
***
"అదొరే బుజ్జిబాబుగా! వోళ్లక్కూడా తెలీని సంగతోటి జెప్తా విను. ఈరి చేతి వ్రాత
ముత్యాలు పేర్సినట్టుండేదంట. అంతేగాక, ఉన్నదంతా
పిల్లలను చేరదీసి ఉచితంగా బట్టలు, భోజనాలు పెట్టి, హరికథలు నేర్పడానికే ఖర్చెడతన్నారని తెలిసి, ఉదారులైన ఒక ధనికుడు, ఒకసారోరికి
కొంత భూఁవినిచ్చారట. ఆ భూఁవిని కూడా అమ్మి హరికథలు నేర్పే వాళ్ళకే పెట్టాడీ
మహానుభావుడు." అంటూ ముగించాడు లోవరాజు.
"ఒరే! ఇంటాంటేనే మనసంతా సంబరంగా ఉందిరా! మరిప్పుడు మన నర్సాఁపురంలో ఎంతమందికీరి
గురించి జ్ఞాపకముందో ఏటో!" ఆలోచిత్తా అన్నాడు బుజ్జిబాబు.
"దాసు గారి గుర్తుగా మన నరసాపురం రాజగోపాలస్వామి గుడి మండపంలో, వారి శిష్యులు వచ్చి, 'హరికథ సప్తాహం' జేత్తన్నార్రా.
అంతేగాక,
ఈ మజ్జనే జనవరి 5, 2024 లో,
రాజమండ్రిలో జరిగిన తెలుగు మహాసభల్లో దీక్షితదాసు గారిని
స్మరించుకుని, "పూర్ణకుంభ పురస్కారం"
ఇచ్చారంట."
"గొప్పోరిని గురించి జెప్పావొరే! కాలంతో చరిత్ర చెదిరిపోతున్న ఈరోజుల్లో
నీలాంటోడికడుండాలిరా లోవరాజూ!" అంటా ఇంకో పానకం గ్లాసందిత్తా, స్నేహితుడి భుజం తట్టాడు బుజ్జిబాబు.
No comments:
Post a Comment