శ్రీథర మాధురి - 128
(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
మీరు జీవితంలో కష్టాలు అనుభవిస్తే, అది మంచిదే! ఆ కష్టాల ద్వారా మీరు అమూల్యమైన అనుభవాన్ని గడించి ఉంటారు. అలా అనుభవాన్ని గడించినట్లయితే మీరు జ్ఞానులై ఉంటారు. మీరు కష్టాలు పడ్డారని అనకండి. స్వీయ సానుభూతిని అధిగమించండి. సంకెళ్లను తెంచుకోండి. అనుభవాల గురించి విచారణ చేస్తూ, వాటి నుంచి జ్ఞానాన్ని పొందడం అనేది భగవంతుని చేరేందుకు సింహద్వారం వంటిది. మీరు పాల ను గురించి పరిశోధించినప్పుడు పెరుగు లభిస్తుంది. మరిన్ని పరిశోధనలు చేస్తే వెన్న లభిస్తుంది. వాటన్నింటినీ అధిగమిస్తే నెయ్యి లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క అంశం యొక్క లోతులను పరిశీలించి, జ్ఞానులుగా మారండి.
***
మీరు అన్నింటినీ దైవానికి ఆపాదించగలరా? అన్ని చర్యలలోనూ, నిశ్చేష్టలలోనూ మీరు ఆయనను చూసే ధైర్యాన్ని కలిగి ఉండగలరా?
ఆయనే అన్నిటికీ కర్త అని మీరు భావించగలరా? ఆయన మీ ఊపిరిలో ఉన్నారని అనుభూతి చెందగలరా? ఆయన మీకు తోడుగా ఉన్నారని భావించగలరా? దాహాన్ని కూడా భగవంతునిగా భావించగలరా? ఆ దాహాన్ని తీర్చేందుకు మీరు తాగే నీటిలో ఆయన్ని అనుభూతి చెందగలరా? మంచి-చెడు, తప్పు-ఒప్పు, నిశ్చయం-అనిశ్చయం, సౌందర్యం-వికారం, వంటి అపోహాదృవాలను అధిగమించి, మీరు ఆయన్ని అనుభూతి చెందగలరా?
మీరు ఈ విధంగా ఉండగలిగితే మీరు నిజమైన యోగి అని, 'ఈశ్వర ప్రణిధాన' ను ఆచరించేవారనీ, అర్థం.
***
మీరు అన్నింటినీ ఎలా నిర్వహిస్తారో, ఎలా చూస్తారో, అదే విధంగా ప్రకృతి కూడా తిరిగి మీకు స్పందిస్తుంది. ఏదైనా పనికిరాదని మీరు దాన్నలా భావించినప్పుడు, సహజంగానే ఎటువంటి స్పందనా ఉండదు.
విశ్వశక్తి అన్నిటా, అంతటా వ్యాపించి ఉంది. మీకున్న, అందించబడిన జ్ఞానాన్ని బట్టి మీరు వివక్షను చూపుతూ ఉంటారు. కొన్నింటిని ఆమోదించేలా, కొన్నింటిని నిరాకరించేలా మీరు నియంత్రించబడ్డారు.
కాబట్టి ఆ నియంత్రణలన్నీ తొలగించడానికే ఇప్పటి నా ప్రయత్నం అంతా. నేర్చుకున్నదంతా మరిచిపోవాలి. విశ్వం యొక్క సంప్రదింపులను స్వీకరించడానికి మీరు సిద్ధమవ్వాలంటే ఉన్న కట్టుబాట్లు అన్నింటినీ తెంచుకొని, ఒత్తిడి లేని ఒక స్వచ్ఛమైన స్థితికి చేరుకోవాలి.
అన్నింటిని చుట్టుకోవడం, అభ్యసించడం అన్నవి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేశాయి. అలా చుట్టుకున్నాకా, ఆ కట్లు విప్పుకునేలా చేసే కందెన(lubricant) లేదు. నేర్చుకోవడం అనే పేరుతో మీరు అనంతంగా చుట్టుకుని, అక్కడే ఇరుక్కుపోయారు. ఇప్పుడు కట్లు విడిపించుకోలేరు, ఇంకా అదనంగా కట్టుకోనూ లేరు. మీ వ్యవస్థలో చుట్టుకుని, తిరిగి ఆ కట్లు విప్పుకొనే స్వేచ్ఛ లేదు.
ఇప్పుడు నేను, మీరు ఇరుక్కున్న కట్లను విప్పే కందెనను తెచ్చే ప్రయత్నం చేస్తూన్నాను. అప్పుడు మీరు ఈ ప్రకృతిని మెచ్చుకుని, మరింత నాణ్యమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.
అప్పుడు మీరు డైనింగ్ హాల్ లో ఉన్న కుర్చీ, టేబుల్ కూడా మీకు స్పందిస్తాయని తెలుసుకుంటారు.
చైనాలో ఒక 'జెన్ సన్యాసి' చెక్క పనివాడిగా ఉండేవారని నాకు చెప్పారు. గృహోపకరణాలు చేసేందుకు చెక్క కోసం అడవికి వెళ్ళినప్పుడు, మొదట ఆయన చెట్టుతో మాట్లాడే వారట. ఆ చెట్టు ఒక కుర్చీగా లేక బల్లగా లేక ఏ ఇతర గృహోపకరణంగా అయినా మారాలనుకుంటుందా అని ఆయన మొదట చెట్టుని అడిగేవారట. దాని నుంచి వచ్చే స్పందన ప్రకారం ఆయన గృహోపకరణాలు తయారు చేసేవారట. ఈనాటికీ, వందల సంవత్సరాల తర్వాత కూడా, ఆ గృహోపకరణాలు చెక్కుచెదరకుండా ఉన్నాయట. అవన్నింటినీ బీజింగ్ లోని ఒక మ్యూజియంలో పెట్టినట్టు తెలుస్తోంది.
కాబట్టి మీరు ప్రకృతిని ఎలా చూస్తారో, అదే విధంగా ప్రకృతి మీకు తిరిగి స్పందిస్తుంది. మీ సొంత ఉద్వేగాలను, భావాలను, ఆలోచనలను వెనక్కి ప్రతిఫలించే అద్దం లాంటిది ఈ ప్రకృతి.
***
No comments:
Post a Comment