ఆత్మాన్వేషణే జీవిత పరమార్ధం
సి.హెచ్.ప్రతాప్
అధ్యాయం 13, శ్లోకం 25 ఈ విధంగా వుంది
ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా ।
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే
కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు, ఇంకా మరికొందరు ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు అని గీతాచార్యుడు అర్జునుడికి పై శ్లోకం ద్వారా తెలియజేసాడు.కొందరు సాధకులు తమ మనస్సుతో పోరాడి దానిని నియంత్రణ లోనికి తేవటంలో అత్యంత ఆనందాన్ని అనుభవిస్తారు. వారు తమలోనే స్థితమై ఉన్న భగవంతుడి పై ధ్యానం చేయటానికి ఆకర్షితమౌతారు. వారి మనస్సు వారిలోనే ఉన్న భగవంతుని పై ఆశ్రయం పొంది నిలకడగా ఉన్నప్పుడు, వారు అంతులేని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక సాధననే ఆత్మాన్వేషణ అని కూడా అంటారు.
ఈ సృష్టిని ఒక మహాశక్తి నియంత్రిస్తోందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ప్రపంచంలో వున్న వివిధ మతాలు వివిధ సిద్ధాంతాలు, నమ్మకాల ప్రాతిపదికపై విబేధిస్తున్నా ఈ సృష్టిని నియంత్రించే సక్తి ఒకటున్నదనే అంశంపై ఏకీభవిస్తున్నాయి. ఈ నియంత్రణ శక్తికి మూలాధారం ఆత్మ అనే చైతన్యం. ఆత్మకు కర్త కర్మ క్రియ పరమాత్మయని సనాతన వాఙ్మయం విశదీకరిస్తోంది. మనసు ద్వారా చిత్తశుద్ధితో కఠోర సాధన చేస్తే ఆత్మ అను రెండు అక్షరాల ఉనికి తెలుస్తుంది. ఈ రెండక్షరాల మననమే ఆత్మాన్వేషణ అని వేద వాజ్మయం వివరిస్తోంది.మనదు ఒక సద్గురువు నుండి లభించిన మంత్రం లాగే అనుక్షణం ఆత్మ అనే రెండక్షరాల మననమే ఆత్మశోధన అని పతంజలి మహర్షి తన సూత్రాలలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది చిత్రంగా కని పించవచ్చు, కాని ఆత్మ మన లోపల ఉందా? బయట ఉందా? మరి ఎక్కడ ఉంది? అని నిరంతరం ప్రశ్నించుకోవడమే సాధన.
ఏకత్వం వైపు చేసే ప్రయాణంలో విజయం సాధించాలంటే ఉప్పు బొమ్మలా కరిగిపోవాలి. మనలో జన్మ జన్మలుగా గూడు కట్టుకున్న అహంకారాన్ని తొలగించుకున్నప్పుడు మాత్రమే అది సంభవిస్తుంది. అంటే మనది అనుకున్న ప్రతిదాన్నీ వస్తువులనైనా, ఆలోచనలనయినా మనస్సు లోంచి పుర్తిగా తీసి వేయాలి . ఈ జీవన ప్రయాణంలో ‘నా’, ‘నేను’, ‘నాది’ అనేవి వదులుకోవాల్సిన విషయాలే తప్ప అవి మన అస్థిత్వ చిహ్నాలు కాదని అర్ధం చెసుకొని వాటిని మన జీవితంలోంచి పూర్తిగా తీసివేసేందుకు కృషి జరగాలి.
***
No comments:
Post a Comment