'అంతం లేని ఆరంభం!'
నిరాశకు నిదర్శనంలా ముకురం ముందు నిలుచుని
నువ్వెవ్వరని ప్రశ్నిస్తుంటే...
గత జన్మ స్మృతులు అలల తెరలుగా
యవనికపై తారట్లాడుతున్నాయి..
చీకటిని చీల్చుకొని బయటికొచ్చేందుకు
విశ్వ ప్రయత్నం చేసే జీవి జననానికి ముందు పడే చిత్రవధ
ఎవరికి కనబడుతుంది?..
ప్రతి ప్రాణికి తప్పని అవస్థే!
తల్లి ప్రసవ వేదన నుండి బిడ్డ రోదన మధ్య జరిగే చర్య
కర్మ..
అదే జీవన దీప్తి,
తనని తాను వెతుకుతున్నంత కాలం
లో లోపలే దాగి ఉన్న బంధాలకు బంధీకావలసిందే!
నిశీథి నిశ్శబ్ధంలో కురిసే అమృతపు జ్ఞానం,
ఆత్మలోని సత్యాన్ని చాటేందుకు బహిర్గతమవుతున్న
జీవి జననం
జీవితం అనే మహోన్నత యాత్రకు శ్రీకారం.
అక్కడ ఓ జీవి అస్తమయం చరమగీతమైతే
ఇక్కడ పునః జన్మఫలం
ఆరంభ స్వాగతం.
జీవులకు మరణం మలుపు
జననం కొత్త అధ్యాయానికి పిలుపు..
విశ్వ చక్రభ్రమణ సందేశం
పునరపి జననం..
పునరపి మరణం.
ఇది నిత్య సత్యం!
విధి దర్శకత్వ నాటకం!
***
No comments:
Post a Comment