"బంగారు" ద్వీపం (అనువాద నవల) -27 - అచ్చంగా తెలుగు

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -27

Share This

 "బంగారు" ద్వీపం (అనువాద నవల) -27

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton




@@@@@@@@
(కేకు, బిస్కట్లను తిన్న తరువాత, రాత్రి కావటంతో తిరిగి నేలమాళిగలకు వెళ్ళే ఉద్దేశం మానుకొని, పిల్లలు కిర్రిన్ కోటలోని చిన్నగదిలో నిద్రపోతారు. మరునాడు అల్పాహరం తీసుకున్నాక, వాళ్ళంతా నేలమాళిగలకు బయల్దేరుతారు. అక్కడ మోటగా ఉన్న తలుపుని గొడ్డలితో కొడుతున్నప్పుడు చెక్కపేడు ఎగిరి వచ్చి డిక్ బుగ్గలో గుచ్చుకుంటుంది. అతనికి ప్రధమచికిత్స చేసిన అనంతరం, జూలియన్ తనని పైకి వెళ్ళిపొమ్మంటాడు. తరువాత. . )
@@@@@@

"నేను డిక్ తో వెళ్తాను" అన్నె చెప్పింది. "నువ్వు జార్జితో యిక్కడ ఉండు. మనమంతా వెళ్ళాల్సిన అవసరం లేదుగా!"

కానీ ముందుగా తను డిక్ ని సురక్షితంగా పైన బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్ళాలని, తరువాత అతన్ని అన్నెతో వదిలిపెట్టి, తాను జార్జి వద్దకు తిరిగి వచ్చి తలుపును పగలగొట్టే పనిలో ముందుకు సాగాలని జూలియన్ అనుకొన్నాడు. అతను చేతిలోని గొడ్డలిని జార్జికి యిచ్చాడు.

"నేను పోయినప్పుడు నువ్వు దీన్ని మెల్లిగా ముక్కలు కొడుతూండు" అని చెప్పాడతను. "ఆ తలుపును పగులగొట్టటానికి కొంత సమయం తీసుకొంటుంది. నువ్వు ఈ పని చేస్తూ ఉండు. కొద్ది నిమిషాల్లో నేను తిరిగి వస్తాను. మనం ప్రవేశద్వారానికి మార్గాన్ని సులభంగా తెలుసుకోగలం. ఎందుకంటే నేను గీసిన సుద్దముక్క గుర్తులను మాత్రమే అనుసరించాలి."

"సరె!" అంటూ జార్జి గొడ్డలిని అందుకొంది. "పాపం డిక్! నువ్వు అతని సంగతిని చూడు."

సాహసంతో పెద్ద తలుపుపై దాడి చేస్తున్న టిం తో జార్జిని వదిలిపెట్టి, డిక్, అన్నె లను తీసుకొని జూలియన్ బహిరంగ ప్రదేశానికి వెళ్ళాడు. అన్నె తన చేతి గుడ్డను నీటి కప్పులో ముంచి డిక్ బుగ్గపై సున్నితంగా ఒత్తసాగింది. అలా చేస్తూంటే బుగ్గనుంచి రక్తస్రావం బాగా అవుతోంది. కానీ వాస్తవానికి, గాయం మాత్రం అంత ఘోరంగా లేదు. త్వరలోనే డిక్ శరీరం రంగు యధాస్థితికి వచ్చింది. అతను తిరిగి నేలమాళిగలోకి వస్తానని కోరాడు.

"వద్దు. నువ్వు కాసేపు పడుకోవటం మంచిది" అన్నాడు జూలియన్. "అలా పడుకోవటం ముక్కు నుంచి రక్తస్రావం అయినప్పుడు మంచిది. చెంప నుంచి రక్తస్రావం అయినప్పుడు కూడా మంచిది కావచ్చు. అన్నె, నువ్వు అక్కడ కనిపిస్తున్న రాళ్ళ మీదకి ఎక్కి ఓడ శకలాలను చూస్తూ అరగంట సేపు కాలక్షేపం చేయొచ్చుగా! ఏమంటావు? రండి. మీ యిద్దరినీ నేను అక్కడకు తీసుకెడతాను. కొద్దిసేపు అక్కడ వదిలేస్తాను. చెంప నుంచి రక్తస్రావం ఆగిపోయేవరకు నువ్వు లేవకుండా విశ్రాంతి తీసుకోవటమే మంచిది కుర్రాడా!"

జూలియన్ వారిద్దరినీ కోట ప్రాంగణం నుంచి ఆ ద్వీప ముఖ ద్వారం, విశాలమైన సముద్రానికి అభిముఖంగా ఉన్న ప్రాంతంలోని కొండరాళ్ళ పైకి తీసుకెళ్ళాడు. శిధిలమైన నల్లని పాత ఓడ ఆకారం యింకా ఆ రాళ్ళపైనే ఉంది. డిక్ అక్కడ వెల్లకిలా పడుకొని పైనున్న ఆకాశం వైపు చూసాడు. తన చెంప నుంచి రక్తస్రావం త్వరగా ఆగిపోవాలని కోరుకొన్నాడు. ఏ రకమైన వినోదాన్ని అతను వదిలిపెట్ట దలుచుకోలేదు.

అన్నె అతని చేతిని పట్టుకొంది. ఆ చిన్న ప్రమాదానికే ఆమె పూర్తిగా తలకిందులైంది. ఆమె కూడా వినోదాన్ని కోల్పోకూడదని అనుకొన్నా, తనకు బాగయ్యిందని డిక్ భావించేవరకు ఆమె అతనితోనే ఉండాలని ఉద్దేశించబడింది. జూలియన్ ఒకటి లేదా రెండు నిమిషాలు వారి పక్కన కూర్చున్నాడు. తరువాత తిరిగి రాతి మెట్ల వద్దకు వెళ్ళి వాటి కిందకు అదృశ్యమయ్యాడు. అతను తను పెట్టిన సుద్ద గుర్తులను అనుసరించి త్వరలోనే తలుపును పగులగొడుతున్న జార్జిని చేరుకొన్నాడు.

ఆమె తాళం చుట్టూ ఉన్న చెక్కను బాగానే పగులగొట్టింది. కానీ అది దారి యివ్వలేదు. జూలియన్ ఆ గొడ్డలిని అందుకొని దానిని బలంగా చెక్కలోకి దిగగొట్టాడు.

ఒకటి, రెండు దెబ్బల తరువాత తాళానికి ఏదో జరిగినట్లు అనిపించింది. అది వదులై కొద్దిగా కిందకు వేలాడింది. జూలియన్ తన గొడ్డలిని కింద పెట్టాడు.

"ఇప్పుడు మనం ఏదో విధంగా తలుపును తెరవగలమని అనుకొంటున్నాను" ఉత్తేజంతో చెప్పాడతను. "టిం! నువ్వు పక్కకు తప్పుకో! జార్జి! ఇప్పుడు నెట్టు !"

వారిద్దరూ బలంగా నెట్టారు. తాళం పెద్ద శబ్దంతో ఊడి వచ్చింది. పెద్ద తలుపు కిర్రుమంటూ తెరుచుకొంది. ఇద్దరు పిల్లలు ఉత్సాహంగా తమ టార్చీలను వెలిగించి లోనికి నడిచారు.

అ గది ఒక గుహ కన్నా పెద్దగా లేదు, రాతినుంచి తొలిచినట్లుగా ఉంది. కానీ యింతకు ముందు వారు చూసిన పీపాలకు, పెట్టెలకు పూర్తి భిన్నంగా ఉంది. వెనుకభాగంలో దుమ్ము పట్టిన గుట్టల్లో, నిస్తేజమైన పసుపు-గోధుమ వర్ణాల మిశ్రితమైన లోహపు వస్తువులు, ఇటుక రూపంలో ఆసక్తిని గొలుపుతున్నాయి. జూలియన్ ఒకదాన్ని చేతిలోకి తీసుకొన్నాడు.

"జార్జి!" ఆనందంగా అరిచాడు. "లోహపు కడ్డీలు! ఇవి నిజమైన బంగారం! ఓహ్! ఇవి అలా కనిపించటం లేదని నాకు తెలుసు. కానీ అచ్చు అలాగే ఉన్నాయి. జార్జ్! ఓ జార్జి! ఈ సెల్లార్ లో ఒక చిన్న సంపదే ఉంది. ఇదంతా నీదే! ఎట్టకేలకు దీన్ని మనం కనుగొన్నాం."

@@@@@@@@@@

జార్జి నోట మాట రాలేదు. చేతిలో ఒక కడ్డీని పట్టుకొని నిశ్చలంగా కడ్డీల గుట్టను కన్నార్పకుండా చూస్తోంది. ఇటుక ఆకారంలో ఉన్న ఈ వింత వస్తువులు నిజంగా బంగారమన్న విషయాన్ని ఆమె నమ్మలేకపోతోంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎంత అద్భుతమైన, అపురూపమైన ఆవిష్కరణ!

అకస్మాత్తుగా టిం గట్టిగా మొరగటం మొదలెట్టింది. వీపును పిల్లల వైపు, ముక్కును తలుపు వైపు ఉంచి ఎంతలా మొరుగుతోంది!

"ఊరుకో టిం!" అన్నాడు జూలియన్. "నీకేమి వినిపిస్తోంది? వాళ్ళిద్దరూ వెనక్కి వస్తున్నారా?"

అతను తలుపు దగ్గరకెళ్ళి, సన్నని దారి వైపు చూసి గట్టిగా పిలిచాడు. "అన్నె! డిక్! అది మీరేనా? త్వరగా రండి. ఎందుకంటే మేము కడ్డీలను కనుగొన్నాము! మేము కనుగొన్నాము వాటిని! వేగం! వేగం!"

టిం కొద్దిసేపు మొరగటం ఆపి తిరిగి గుర్రుమనటం మొదలెట్టింది. జార్జి విస్తుపోయింది.

"టింతో ఏమైనా కావచ్చు" అందామె. "ఖచ్చితంగా డిక్, అన్నెలను చూసి అతను గుర్రుమనడు."

అప్పుడు పిల్లలిద్దరికీ విపరీతమైన షాక్ తగిలింది. ఆ చీకటి బాటలోంచి ఒక వ్యక్తి కంఠం గట్టిగా మోగింది. అదే సమయంలో చుట్టుపక్కల నుంచి విచిత్రంగా ప్రతిధ్వనించింది. "ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎవరు ఉన్నారు?"

జార్జి భయంతో జూలియన్‌ భుజాన్ని నొక్కిపట్టింది. టిం ఆపకుండా గుర్రుమంటుంటే, తన మెడ చుట్టూ ఉన్న వెంట్రుకలు నిక్కపొడుచుకొన్నాయి.

"నిశ్శబ్దంగా ఉండు టిం" జార్జి గుసగుసలాడుతూ, తన చేతిలోని టార్చి ఆర్పేసింది.

కానీ టిం మౌనం దాల్చలేదు. అతను చిన్న ఉరుములతో కూడిన గాలి వానలా ఆపకుండా గుర్రుమంటున్నాడు. నేలమాళిగ వసారా ముందున్న మలుపు దగ్గర శక్తివంతమైన టార్చిలైటు వెలుతురును పిల్లలు చూసారు. తరువాత ఆ వెలుతురు ఈ పిల్లలపై పడింది. టార్చి పట్టుకొన్న వాడు అకస్మాత్తుగా ఆగాడు.

"బాగుంది బాగుంది బాగుంది" ఒక స్వరం మోగింది. "ఇక్కడ ఎవరున్నారో చూడండి! నా కోటలోని నేలమాళిగలో ఇద్దరు పిల్లలు."

"నీ కోటా? ఏమిటి నీ అర్ధం?" జార్జి అరిచింది.

"సరే, నా ప్రియమైన చిన్న అమ్మాయీ! ఇది నా కోట. ఎందుకంటే నేను దీనిని కొనే ప్రక్రియలో ఉన్నాను”అని ఆ కంఠం చెప్పింది. అప్పుడు మరొక గొంతు మరింత కఠినంగా మాట్లాడింది.

"మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? మీరు అన్నె, డిక్ అని అరవటంలో మీ ఉద్దేశం ఏమిటి? మీరు కడ్డీలను కనుగొన్నామని చెబుతున్నారా? ఏ కడ్డీలు?"

"జవాబు ఇవ్వకు" జూలియన్ జార్జి వద్ద గొణిగాడు. కానీ ప్రతిధ్వని ఆ పదాలను అందుకొని వసారాలో మరింత గట్టిగా వినిపించేలా చేసింది. "జవాబు ఇవ్వకు. . . .జవాబు ఇవ్వకు."

"ఓ! అయితే నువ్వు జవాబు చెప్పవు" రెండవ వ్యక్తి అంటూ పిల్లలకు దగ్గరగా కదిలాడు.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages