ఉడత సాయం - అచ్చంగా తెలుగు

ఉడత సాయం

కాశీ  విశ్వనాథం పట్రాయుడు




కామేశ్వరమ్మ గారు  వీధిలో కళ్ళాపి చల్లుతున్నారు. అది చూసిన మనవరాలు  శ్రీకాత్యాయని పరుగు పరుగున వెళ్ళి గుమ్మంలో ఉన్న ముగ్గు డబ్బా పట్టుకెళ్ళి నాన్నమ్మకి ఇచ్చింది. 


“ఊరికినే అనలేదు ‘కుంచమంత కూతురుంటే మంచం మీదకే కూడు’  అంటూ మనవరాలి బుగ్గ గిల్లి చేతిలోని ముగ్గు డబ్బా అందుకుంది నాన్నమ్మ. 


కామేశ్వరమ్మ ముగ్గు పెడుతూ ఉంటే  “నేనూ ముగ్గు వేస్తాను” అని మారాం చేసింది మనవరాలు. “నువ్వు పెద్దయ్యాక వేద్దువులే” అని మనవరాలిని సముదాయించి ఇంట్లోకి తీసుకువెళ్ళింది కామేశ్వరమ్మ. ఆవిడ వెనకాలే తిరుగుతూ, నాన్నమ్మ పూజకు పువ్వులు కోస్తే, గిన్నె పట్టుకోవడం, కూరలు తరిగితే చాకు పట్టుకోవడం, పిండి కలిపితే రొట్టెల పీట, కర్ర అందించడం చేసేది మనవరాలు.


కాసేపటి తర్వాత  పెరటి గుమ్మంలో కూర్చుని బియ్యంలో రాళ్ళు ఏరుతోంది కామేశ్వరమ్మ. “నేను సాయం చేస్తా నాన్నమ్మ” అంటూ బియ్యంలో రాళ్ళు ఏరడం మొదలు పెట్టింది శ్రీకాత్యాయని. 

“నువ్వు దగ్గర ఉంటే మీ నానమ్మ పనులు చేసుకున్నట్లే. నువ్వు సాయం చేస్తే ఐదు నిమిషాల పని అరగంట అవుతుంది. లోపలికి రా!” అని ఇంట్లోంచి పిలిచింది మానస.


“పరవాలేదు కోడలా ఏదో ఉడతా సాయం చెయ్యనివ్వు. చేస్తూ ఉంటేనే పనులు చేతనౌతాయి.” చెప్పింది కామేశ్వరమ్మ.


“ఉడత సాయమా? బుడత సాయమా?” అడిగింది మానస.


“ఆనాడు శ్రీరాముడు రావణాసురుడి చెర నుంచి  సీతమ్మని విడిపించడానికి సముద్రంపై వారధి నిర్మాణం ప్రారంభించాడు. వానరులు రాళ్లు మోసి సహాయం చేసారు. అది చూసి చిన్ని ఉడుత తన శరీరాన్ని నేలపై పొర్లించి, ఇసుక అంటించుకుని, వెళ్ళి సముద్రపు నీటిలో ఆ ఇసుకను వదిలి రాముడిపై తనకున్న భక్తిని చాటుకుంది. 


ఆ భక్తిని ఉడుతభక్తి అని, ఉడుత రాముడికి చేసిన ఆ చిరుసహాయాన్ని ఉడత సాయం అని జనబాహుళ్యంలోకి వాడుకలోకి వచ్చింది. ఇది ఒక జాతీయం.


ఒక మహత్కార్యాన్ని తలపెట్టినప్పుడు అది పూర్తికావడానికి ఎందరో సహాయం చేయవలసి ఉంటుంది. ఎవరికి వారు తోచినంత సహాయం చేస్తేనే ఆ పని పూర్తవుతుంది. సహాయం చేయడానికి చిన్న పెద్ద తారతమ్యం లేదు.


ఆ కార్యం పూర్తికావడానికి సరిపోయేంత కాకపోయినా సహాయం చేయడానికి ప్రయత్నం చేయడాన్ని ఉడత సాయం అని, ఉడతాభక్తిగా చేయడం అని అంటారు.” అని చెప్పింది కామేశ్వరమ్మ.

***

No comments:

Post a Comment

Pages