కొత్తనీరు -4 - అచ్చంగా తెలుగు
క్రొత్తనీరు (నాల్గవభాగం ).

 టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
 



మర్నాడు ప్రణయ్ వాళ్ళ పొలానికి వెళ్ళటానికి రెడీ అయింది సమీర.

"హై హీల్స్ వేసుకోకు!పొలం గట్ల మీద జారుతాయి!" హెచ్చరించింది సరళ.

 బ్లాక్ జీన్స్ ప్యాంటు, దానిమీద వదులుగా ఉండే లేతాకుపచ్చ  టీ షర్టు వేసుకుంది సమీర.
 ఆటో వచ్చింది. పొలానికి వెళ్ళింది సమీర.

"రండి!రండి!" అంటూ ఎదురు వచ్చాడు ప్రణయ్.

చుట్టూ పరుచుకున్న  పచ్చదనం..అక్కడ రకరకాల కూరగాయల మొక్కలు, ఆకుకూరల మడులు ఉన్నాయి. ఒక చోట పొడవుగా కందకంలాగా త్రవ్వి ఉంది. దానిలో నీళ్లు ఉన్నాయి.
జాగ్రత్తగా నడుస్తోంది సమీర.

 "ఇక్కడ తక్కువ పెట్టుబడితో కూరగాయలు వేసాను! ఇదిగో! ఇక్కడ అల్లం, పసుపు కూడా వేసాను!... అరటి,బొప్పాయి, బత్తాయి చెట్లు.
వీటివల్ల నష్టం లేదు!చుట్టూ వెదురు ఫెన్సింగ్ వేసాను! చూడండి! నాలుగేళ్లకు వెదురు మీద లాభాలు చూడొచ్చు!అంటూ ప్రణయ్ సమీరకు తోటంతా  చూపించాడు.

 ఆసక్తిగా అతడు చెప్పేది వింటూ  చూస్తోంది సమీర.

"ఈ కందకం ఏమిటి?"

"ఇదా!వాటర్ కోసం.. వాన నీళ్లను ఒడిసి పడుతుందీ కందకం.. కాలువలాగా ఉంటుంది.
కూరగాయల పంటలకు వరిలాగా నీళ్లు ఎక్కువ అవసరం లేదు! కూలీ ఖర్చు తక్కువే!ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి పురుగు మందుల ఖర్చు తక్కువ!నాకు ఇక్కడే గానుగ నూనె తీసే షెడ్డు ఉంది!పాల డైరీ కూడా ఉంది!నా పొలానికి ఎరువు నాకున్న ఆవుల ద్వారా వస్తుంది! నా పాల డైరీ , నూనె షెడ్డు కూడా చూద్దురుగానీ!"అంటూ దారి తీశాడు ప్రణయ్.

అక్కడి నుండి ఆటోలో కొంత దూరం వెళ్ళాక గానుగ. నూనె తీసే షెడ్డు కనిపించింది. నాలుగు ఎద్దులు ఉన్నాయి అక్కడ..పెద్ద పెద్ద రోళ్లల్లో నూనె గింజెలు ఉన్నాయి.నూనె తీస్తున్నారు ఇద్దరు.. ఎద్దులు గానుగకు కట్టి ఉన్నాయి. గుండ్రంగా తిరుగుతున్నాయా ఎద్దులు.
తమాషాగా ఉంది సమీరకు.
పుట్టి బుద్ధెరిగాక ఇలాంటివి చూడలేదు.

 అక్కడే ఒక రూమ్ లో నలుగురు ఆడవాళ్లు  తీసిన నూనెను గాజు సీసాల్లో పోసి అట్ట పెట్టెల్లో పెడుతున్నారు.

 అక్కడినుండి ఇంకొంచెం దూరంలో ఉన్న మిల్క్ డైరీకి  వెళ్ళారిద్దరూ.
అక్కడ దాదాపు పదిహేను ఆవులు, పది దాకా దూడలు,
ఆరేడు ఎద్దులు కూడా ఉన్నాయి. ఆవు పాలు కాచడం, పెరుగు తోడు పెట్టడం,వెన్న చిలకటం ఎలాగో, అన్నీ చూపించాడు ప్రణయ్.

"నష్టం లేని బిజినెస్ ఇది! ఇప్పుడు గానుగ నూనెకు చాలా డిమాండ్ ఉంది.. స్వచ్ఛమైన నెయ్యిని అలవాటుగా కొనుక్కునే కస్టమర్స్ నాకు ఉన్నారు! అందువల్ల కాస్త ధైర్యంగా ఉంది!"

"పల్లెటూర్లలో ఇంత మంచి ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు అందరూ ఇక్కడి నుండి వలసలు ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం కావటం లేదు?" అంది సమీర.

"అందరికీ లక్షల్లో పెట్టుబడి పెట్టే డబ్బులు ఉండవు సమీరగారు! రైతులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం  తమకు వచ్చే ఆదాయంతో  బొటాబొటిగా నెట్టుకొస్తున్నారు.. నేను అమెరికాలో సంపాదించుకుని వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టుకున్నాను!ఒక్కొక్క యూనిటుకు దాదాపు ఎనిమిది లక్షలు అయింది!..అన్నీ సొంతంగా చూసుకోవాలి!..ఏ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా కూడా నష్టం వెంటాడుతూ ఉంటుంది!చాలా బాధ్యతగా ఉండాలి! మార్కెటింగ్ ట్రెండ్ ఎలా ఉందో అప్పటికప్పుడు మన ఉత్పత్తులని మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి! నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి!అధికారుల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉండాలి!ఇది అంతా కూడా కొద్దిగా కష్టమైన విషయం! సంప్రదాయంగా వ్యవసాయం చేసే వాళ్ళు సాధారణంగా ప్రయోగాలు చేయడానికి జంకుతారు!కాస్త ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే లాభాలు చూడొచ్చు! రైతులకు ప్రకృతి వైపరీత్యాలు చాలా నష్టాన్ని కలుగజేస్తాయి! అంతకంటే ఎక్కువగా దళారీల చేతుల్లో మోసపోతుంటారు!మన దేశంలో చాలామంది రైతులు ఇప్పటికీ చదువు లేనివాళ్లే!చదువుకుంటే చాలా విషయాలు తెలుస్తాయని వాళ్లకు తెలియదు!.. పైగా చదువుకునే అవకాశాలు కూడా ఇక్కడ తక్కువ!పిల్లలను వేరే ఊర్లో పెట్టి చదివించడం కంటే కాస్త వయసు వచ్చాక పొలం పనులకు పంపించటమే మేలనుకుంటారు!" వివరించాడు ప్రణయ్.

"మిమ్మల్ని చూసి ఎవరైనా ఇలా పల్లెటూర్లకు వచ్చి స్థిరపడ్డారా?"

"నేను ఇక్కడికి వచ్చి మూడేళ్లయింది. ఇప్పుడిప్పుడే కాస్త సక్సెస్ చూస్తున్నాను.. నా స్నేహితులు నలుగురు ఈ మధ్య అమెరికా నుండి వచ్చి వాళ్ళ సొంత వూళ్ళల్లో వ్యవసాయం మొదలుపెట్టారు.. ఇక్కడ నా పార్టనర్ చందూ ఉన్నాడు..వాడు హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీరు. పోయిన సంవత్సరం వాడికి జాబ్ పోయింది.. అందుకని ఇక్కడికి వచ్చి నాతో పాటు వ్యవసాయం చూసుకుంటున్నాడు.. మాలాగా ఇక్కడికి తిరిగి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ!కానీ!చూడాలి!పరిస్థితులు మారినప్పుడు ఈ జనాలు మళ్ళీ వెనక్కు తిరిగి చూస్తారేమో!పల్లెబాట పడతారేమో!"

ప్రణయ్ చెప్తున్న విషయాల గురించి సమీరకు అస్సలు తెలియదు.హైదరాబాదులోనే పెరగటం వలన ఆమెకు పల్లెటూరివాళ్ళ కష్టనష్టాల గురించి అవగాహన లేదు. ప్రణయ్ ఆమెకు పల్లె ప్రజల సమస్యల గురించి, వ్యవసాయంలో ఉండే సాదకబాధకాల వివరిస్తూ ఉన్నాడు. అప్పటికే మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది.

"చూశారా!మీతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు! "అంది సమీర నవ్వుతూ.

ప్రణయ్ నవ్వాడు.ఆటోను పిలిపించాడు.

సమీర 'వద్దు వద్దు!'అంటున్నా వినకుండా బుట్టనిండా కూరగాయలు, పండ్లు పెట్టి పంపించాడు.

ఇంటికి వచ్చింది సమీర.

(సశేషం )

No comments:

Post a Comment

Pages