నేడే చూడండి, తప్పక చూడండి - అచ్చంగా తెలుగు

నేడే చూడండి, తప్పక చూడండి

Share This
 నేడే చూడండి,తప్పక చూడండి

కాళిదాసు సుబ్బయ్య 




"నేడే చూడండి తప్పక చూడండి, మీ అభిమాన ధియేటర్ దుర్గా టూరింగ్ టాకీస్ లో, అంజలీదేవి, నాగేశ్వరరావు, ఏ.వి.సుబ్బారావు, రేలంగి, కనకం నటించిన శోభనాచలావారి మహత్తర జానపద చిత్రం, కీలుగుర్రం, కీలుగుర్రం, కీలుగుర్రం రోజు రెండు ఆటలు మీఅభిమాన ధియేటర్ దుర్గా టూరింగ్ టాకీస్ లో తప్పక చూడండి. " వెదురు తడికకు సినిమా పోస్టర్లు అంటించి, రెండువైపులా కట్టబడిన ఒంటెద్దు బండిలో కూర్చొని ప్రచారం చేస్తున్నాడు కొండయ్య. చెట్టునీడన బండినిఆపి, విప్పిన ఎద్దును చెట్టుకు కట్టి, దానికింత గడ్డి నీరు పెట్టి , సిగిరెట్ ముట్టిచుకున్న కొండయ్య చుట్టూ చేరారు పిల్లలందరు. నిజానికి కొండయ్య కు సినిమా హీరో కున్నంత పేరుంది, ఆవూరిలో.
అది ఏఊరైనా కావచ్చు, పల్లెటూరి కంటే కొంచెం పెద్దది, పట్నానికంటే చాలా చిన్నది. ఆఊర్లో ఓ టూరింగ్ టాకీస్. డేరాలతోకట్టిన  ఆ హాలులో ఆరు నెలలకు చిత్ర ప్రదర్శనకు అనుమతినిస్తారు.ఆరునెలలతరువాత డేరా ఎత్తెసి, ఇంకో ఊర్లో ప్రదర్శన మొదలు పెడతారు. అక్కడా అనుమతి కాలం పూర్తైతే, అక్కడ పీకేసి మళ్ళీ యిక్కడ. ఒకచోట డేరాపీకి ఇంకోచోట డేరా వేసి సినిమా మొదలు పెట్టడానికి కనీసం ఓ రెండు వారాలు పడుతుంది. ఆరకంగా ఈవూర్లో ఈరోజే ప్రదర్శన మొదలై మొదటిసారి కీలుగుర్రం ప్రచారానికి వచ్చిన బండి, అక్కడ కాసేపాగింది.

అక్కడ పెద్ద మంచినీటి బావి, సగం ఊరికి అదే మంచినీటికాధారం. మంచినీటికొచ్చి, అక్కడ చేరిన ఆడపిల్లలు ఆరునెలలు తరువాత తమ ఊరికి వచ్చిన సినిమా హాలు గురించి అందులో ప్రదర్శించబోయే సినిమా గురించి మాట్లాడుకోసాగారు. నిజానికి ఆసినిమా విడుదలై రెండు సంవత్సరాలైంది. కొంతమందిఅమ్మాయిలు పట్నంలో వున్న చుట్టాలింటికి పోయినపుడు చూచిన వాళ్ళే. అమ్మాయిలందరూ పదకొండు పన్నెండు సంవత్సరాల లోపువారే. వీధిబడిలో అయిదో తరగతి వరకు చదువుకొని, ఆరోతరగతిలో చేరడానికి ఎంట్రన్స్ రాసి అందులో సెలెక్ట్ గాక చదువు ఆపేసిన వాళ్ళే. ఎలాగైనా ఇంట్లో పెద్దవాళ్ళనొప్పించి, సినిమా కెళ్ళాలని నిశ్చయించుకొని, ఈరోజే వచ్చింది గాబట్టి రెండురోజులాగి వెళ్ళాలని తీర్మానించుకొని, ఈలోగ పెద్దవారిని ఒప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టాలనిఏకాభిప్రాయానికొచ్చి, నీళ్ళబిందెలు చంకకెత్తుకొని ఇంటి ముఖం పట్టారు.

ఇంట్లోవాళ్ళను బతిమిలాడో, అలిగి అన్నం మానేసో, ఏడ్చి కాకరచ్చచేసో, మొత్తానికి ఎలగైతేనేం పెద్దవాళ్ళను ఒప్పించారు సినిమాకు పంపడానికి. ఈరోజు ఫస్టషోకు వెళ్ళడానికి ముహూర్తం ఖరారు. సినిమా ఏడుగంటలకంటే ఆరున్నరకల్లా ఇంట్లో బయలు దేరాలి. సినిమాకు బయలుదేరే లోపే లాంతర్లలో కిరోసిన్ పోసి, చక్కగా తుడిచి, ముగ్గు పిండితో చిమ్నీలు శుభ్రంచేసి,లాంతర్లు వెలిగించి, వత్తి చిన్నది చేసి, అప్పుడు బయలుదేరి వెళ్ళాలి. స్నేహితురాళ్ళంతా కట్టగట్టగొని, ముచ్చట్లు చెప్పుకుంటూ బయలుదేరారు సినిమాకు. టూరింగ్ టాకీస్ దగ్గరకు చేరుతుండగా, అప్పటిదాకా యల్లమంద సినిమా హాలు ముందు వాయిస్తున్న డప్పు ఆగిపోయింది. సినిమా మొదలుపెట్టడానికి ఓ పావుగంట ముందునుంచి సినిమా మొదలు పెట్టేవరకు  యల్లమంద డప్పు వాయిస్తూ వుంటాడు. సినిమా హాలు ముందు డప్పుఆగిపోయిందటే , సినిమా మొదలు పెట్టివుంటారని, అమ్మాయిలందరూ సినిమా హాలు దగ్గరకు పరుగు తీయసాగారు. హాలుముందు తాటాకు మంటమీద డప్పు వేడి చేస్తున్న యల్లమందను చూసి " ఏం యల్లమందా! ఆటమొదలైందా! అని ప్రశ్నించారు.
"లేదమ్మా,ఇంకాలేదు. "
" మరిడప్పెందుకాపావు. "
"డప్పు చల్లబడింది కొంచెం వేడి చేద్దామని "యల్లమంద మాట పూర్తికాకముందే
"గొప్పపనిచేశావ్. ఆటమొదలైందని. హడావుడిగా పరుగెత్తాము." అంటూ కొంచెం అలుపు దీర్చుకొని టిక్కెట్లు కొనడానికి బుకింగ్ వైపు పరుగు దీశారు అమ్మాయిలు ఉత్సాహంగా.
గేటు దగ్గర టిక్కెట్లు చూపించి లోపలికెళ్ళి, చీలలు లేకుండా చూచుకొని బెంచీల మీద కూర్చొన్నారు. నేలలో చౌక మొద్దులు పాతి వాటిమీద కొయ్యబల్ల వేసి మేకులు కొట్టి తయారుచేసిన బెంచీలు. మేకులుచూచుకోకుండా కూర్చుంటే బట్టలు చినగటం ఇంట్లోవాళ్ళచేత చీవాట్లు తప్పవు.

న్యూస్ రీల్ మొదలైంది. న్యూస్ రీల్ పూర్తైసినిమా మొదలుపెట్టగానే, నేలక్లాస్ నుంచి ఈలలు కేకలు చప్పట్లు
"శ్రీశోభన గిరి నిలయా!దయామయా! " రావు బాలసరస్వతి పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ వుండగా టైటిల్స్. టైటిల్స్ పూర్తికాగానే, గుర్రాల మీద రాజుగారు ఏ.వి.సుబ్బారావు, అతని చెలికాడు  రేలంగి వేటకు వెళ్ళటంతో సినిమా మొదలైంది. సినిమా చూస్తున్న ధనమ్మ అని పిలవబడే ధనలక్ష్మి "సినిమా ఎన్ని రీళ్ళు నేను చూడటంమరచి పోయాను"పెద్దగా అరిచింది. "పందొమ్మిది రీళ్ళు "అంతేగట్టిగా అరచి సమాధానం చెప్పింది కామమ్మ అనిపిలవబడే కామాక్షి. ప్రేక్షకులు సైలెంట్ అయి సినిమాలో లీనమైపోయారు. ఇంతలోలైట్లువెలిగి సినిమా ఆగిపోయింది, రీలుమార్పు కోసం. ఆహాలుకు సింగిల్ ప్రొజెక్టర్. అందుచేత ఇంటర్బెల్ కు ముందొకసారి, ఇంటర్బెల్ తరువాతొకసారి రీలుమార్పు కోసం సినిమా ఆపుతారు. ఇదిగాక ఎప్పడైనా రీలు తెగినా సినిమా ఆపి రీలు అతికించి సినిమా మొదలు పెట్టడం ఆనవాయితి. ఇలా ఆగిన ప్రతిసారి ఓ అయిదు నిమిషాలు విరామం. ఆ విరామ సమయంలో వేరుశనగ కాయలు, మసాలా వడలు, సోడాలు మొదలైన తినుబండారాలు సినిమాపాటల పుస్తకాల అమ్మకాలు జరుగుతుంటాయి. అమ్మకానికొచ్చిన పాటల పుస్తకాన్ని వర్ధని అనిపిలవబడే పర్వతవర్ధని కొనింది. ప్రతిసినిమా పాటలపుస్తకాన్నికొనటం ఆ అమ్మాయి కి అలవాటు. పాటలపుస్తకం కొన్నవెంటనే ఆమె చేతిలోని పుస్తకాన్ని లాక్కొంది ధనమ్మ. ఇది ఈమె అలవాటు. సినిమా మొదలైంది కథ మంచి పట్టుగా సాగిపోతుంది. ప్రేక్షకులు లీనమై ఉత్కంఠంతో సినిమా చూస్తూవుండగానే, ఇంటర్బెల్, లైట్లు వెలగడం, సినిమా ఆగడం. అమ్మేవాళ్ళు వారివారి సరుకులు అమ్ముకోవడం మామూలుగా జరిగి పోయాయి. వర్ధనమ్మ దగ్గర పాటల పుస్తకం తీసుకున్న ధనమ్మ ఆపుస్తకం తెరచి "కాదు సుమా! కలకాదు సుమా! "అని పెద్దగా పాడటం మొదలు పెట్టింది తనబొంగురు గొంతుతో.
"పాటాపు ఇంటికి పోయి పాడుకో"
కసిరింది కామాక్షి. సినిమామొదలైంది. రీలుమార్పుకోసం ఆట ఆగటం, అమ్మకాలు కొనుగోళ్లు మళ్ళీ సినిమా మొదలౌడం షరామామూలే

కథ మంచి పట్టులో వుంది. రాజుగారిపెద్దభార్య చచ్చిపోలేదని, ఇంకా బతికే వుందని తెలుసుకున్న అంజలీదేవి, "నీగుడ్డి పాలన ఇలా వుంది" అని వేళాకోళమాడి, తాను వెళ్ళిపోతానని బెదిరించి, పెద్దరాణికి ఉరిశిక్ష వేయించి, రేపే అందరి సమక్షంలో ఉరితీయాలని రాజుగారి మీద ఒత్తిడి తెచ్చి ఒప్పిస్తుంది. అంజలీదేవి తలనొప్పికి మందు తేవడానికి వెళ్ళిన నాగేశ్వరరావు నిజం తెలుసుకొని, అమ్మకళ్ళు తీసుకొని అంజలీదేవి ప్రాణాలు దాచిపెట్టబడివున్న కీటకాన్ని చేజిక్కించుకొని, ఇద్దరమ్మాయిలను వెంటబెట్టుకొని కీలుగుఱ్ఱం ఎక్కి బయలు దేరాడు. ఇక్కడ నిండుసభలో పెద్దరాణి ఉరికి ఏర్పాట్లు సాగుతున్నాయి. చూస్తున్న ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి సినిమా చూడటంలో లీనమైపోయారు.
సినిమా చూస్తున్న ధనమ్మ ఒక్కసారి పెద్దగా "ఓ నాగేశ్వరరావూ తొందరగా రావయ్యా మీ అమ్మను ఇక్కడ ఉరిదీస్తున్నారు. "పెద్దగా శోకాలు పెడుతుంటే, తెరమీద రాణిగారి తలమీద ముసుగు వేస్తూ ఉరి ఏర్పాట్లు చేస్తున్న భటులతో
"బాబూ!మీరాణి చాలా మంచిది. కాస్తాగండిరా! నాగేశ్వరరావు వచ్చి అన్ని చెపుతాడు" అని కేకలేస్తూ వుండగానే, కెమెరా అంజలీదేవి వైపు తిరిగింది. అంజలీదేవిని చూడగానే కోపంతో ఊగిపోతూ, "దొంగముండ, ఇదీ అసలు రాక్షసి. ఈముండను తీయాలి ఉరి" అరుస్తూ వుండగానే సీను మారి నాగేశ్వరరావు ఇద్దరమ్మాయిలతో కీలుగుఱ్ఱమీద కనపడగానే, ధనమ్మ పెద్దగా "ఒరే నాగ్యా! తొందరగా పోయే మీట నొక్కరా! అక్కడ మీ అమ్మను ఉరిదీస్తున్నారు. నేను చెపితే ఎవరూ వింటంలేదు."
ఈమిలా గోలచేస్తూనే వుంది, నాగేశ్వరరావు రావటం, చెతిలో వున్న పురుగును నలిమి అంజలీదేవిని చంపటం,అమ్మకు కళ్ళు అమర్చటం జరిగి సినిమా సుఖాంతమైంది. అమ్మాయిలందరు ఇంటిదారి పట్టారు వాళ్ళను తీసుకుపోవడానికి వచ్చిన పెద్దవాళ్ళ వెనుక
"ధనమ్మ నాపాటల పుస్తకం యివ్వు" అడిగింది వర్ధని
"రేపిస్తాలే కథచదివి" అంటున్న ధనమ్మ తో కామాక్షి "ఏమే ధనం! సినిమా చూస్తూ ఏమిటా అరుపులు,ఏడుపు పెడబొబ్బలు చూసే వాళ్ళేమనుకుంటారు" అని మందలిస్తె,
"నేను ఏడ్చి పెద్దగా అరిచాను కాబట్టే ఆ నాగ్యాడు తొందరగా వచ్చాడు .లేకపోతే ఇంకా ఆలస్యం చేసేవాడు"ధనమ్మ సమాధానం.

*******


No comments:

Post a Comment

Pages