ఒకటైపోదామా ఊహల వాహినిలో... (20వ భాగం)
ఇంటి లోపలికి వచ్చిన హరిత కాళ్లు కడుక్కుని తల్లి దగ్గరికి వచ్చి కూర్చుంది.
"వెళ్లిన
పని ఏమైందిరా తల్లిగాడు? విరాజ్ అంత
అర్జెంటుగా రమ్మని నీకు ఎందుకు ఫోన్ చేసాడు?"అడిగింది
శకుంతల కూతుర్ని.
ప్రారంభం నుంచి విరాజ్ కి తనకి జరిగిన మొత్తం సంభాషణ
పూసగుచ్చినట్టుగా చెప్పింది.
"మూడేళ్ల క్రితం తనంతట తానుగా వచ్చి నిన్ను
ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇంతకాలం తన కాలక్షేపం కోసం నిన్ను ఒక పావులా వాడుకుని
ఈరోజు ఈ ప్రపంచంలో ఏ ప్రేమికుడు ఏ ప్రేమికురాలిని కోరని కోరిక కోరుతాడా ?
ఆడదంటే మగవాడికి ఎంత లోకువ అయిపోయింది?
స్త్రీ స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడం కంటే మగవాడి చేతిలో ఒక ఆట వస్తువుగా మారడానికే
ఉపయోగపడుతుందన్నమాటను మళ్ళీ పునరావృతం చేయదలుచుకున్నాడా విరాజ్?
సంఘ సంస్కర్తలు మంచి ఆలోచనలతో స్త్రీ స్వేచ్ఛను
ప్రసాదించినా, సభ్య సమాజంలో మద
మృగ సామ్రాజ్యం - స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లయినా కొనసాగుతోంది అనడానికి ఇది
పరాకాష్ట.
ఏమిటీ? ఏమన్నాడు అతను?
నువ్వు అతనితో పెళ్లి కాకుండానే ఒక బిడ్డని కనివ్వాలా?
దానికి బహుమతిగా అతను నీ మీద ప్రేమ ఉంటే జాలితో పెళ్లి చేసుకుంటాడా?"
హరిత తల్లి ఒడిలో తలపెట్టుకుని నిశ్శబ్దంగా
ఉండిపోయింది.
కూతురు తల మీద చేయి వేసి ఐదు నిమిషాల పాటు నిమురుతూ ఉండిపోయింది
శకుంతల.
కూతురు మనసులో మౌనంగా రోదిస్తోందని ఆమెకు తెలుసు.
ఇలాంటి సమయంలోనే కూతురి మనసులో ధైర్యం నింపాలి.
రెండు నిమిషాలు ఆలోచించిన శకుంతల "తల్లిగాడు ...
పైకి లే" అంది.
హరిత లేచి తలెత్తి చూసింది తల్లి కళ్ళలోకి.
చమర్చిన హరిత కళ్ళు ఎర్రగా నిప్పుకణికల్లా ఉన్నాయి.
"వీలైతే విరాజ్ ని ఒకసారి ఇంటికి రమ్మని మెసేజ్
పెట్టమ్మా."
"ఇంకా అతనితో మనకి మాటలు ఏంటమ్మా?"
కూతురి మనసులో ఏముందో తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది
శకుంతలకు.
"ఎందుకంటావేమిటి?
ఇలాంటి విషయాలు ముఖాముఖి అడిగి తెలుసుకోవాలి. నా ఎదురుగా నువ్వు
ఆపని చేయగలిగితే నేను కల్పించుకోను. కానీ నువ్వు అడిగిన విధానం, అతను సమాధానం ఇచ్చిన విధానం స్పష్టంగా ఉండాలి."
"నాకేం తెలుసని అడగనమ్మా?
ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని చెప్పు పుచ్చుకొని కొట్టినట్టు
సమాధానం చెప్పి బయటికి పంపక." కోపంగా అడిగింది హరిత.
"తల్లిగాడు తొందర పడుతున్నావ్ ఆవేశం ఎప్పుడు
అనర్ధ హేతువు. నిజం చెప్పు అతను ఇష్టపడ్డావా లేదా?"
"నన్ను పరీక్షిస్తున్నావా అమ్మ?
ఇష్టపడటం వేరు, ప్రేమించడం వేరు. అతనిని నేను
ఇష్టపడలేదు... ప్రేమించను లేదు, అభిమానించాను. ఎందుకంటే ఒక
స్నేహితుడిలా నాకు కొన్ని సహాయాలు చేశాడు అతను. ఉద్యోగం వచ్చేలా చేసాడు. నా శారీరక
ఆరోగ్యం బాగుండడానికి జిమ్ లో చేర్పించాడు.నా మానసిక ప్రశాంతత కోసం గుడికి
తీసుకెళ్లాడు.అందుకే అతను అంటే నాకు ఎప్పటికీ అభిమానమే. అతను నన్ను ప్రేమికురాలా
చూసుకున్నాడేమో కానీ నేను అతన్ని ఎప్పుడు ప్రేమికుడిగా చూడలేదు.
ఈ వేళ అంటే అతను ఒక ఛాలెంజ్ని నా ముందు పెట్టి
ఆడదానిగా నన్ను అవమానపరిచాడు. అతని మాటలు వింటూ నిస్చేష్టురాలినైపోయాను.
ఆశ్చర్యపోయాను... వాదించాను. కానీ ఆడదాన్ని ఒక పిల్లలు కని యంత్రంలా చూసిన అతని
తత్వానికి బాధపడ్డానమ్మా. చాలా బాధపడ్డాను. ఈ మూడేళ్ల జీవితంలో అతను నన్ను అర్థం చేసుకున్నది
అదేనా? అని మూడేళ్ల గతాన్ని
ప్రశ్నించుకున్నాను.
నిజమైన ప్రేమ యొక్క విలువ ఏమిటో అతనికి తెలియ
చెప్పాను. నా అభిమాన చిత్రాన్ని కూడా చూపించాను. అతను దాన్ని సినిమాలాగే చూసాడేమో.
నాకైతే అతనితో మాట్లాడే అవసరం ఏమీ లేదు. నిజంగా అతను
తన ఛాలెంజ్ మీదే నిలబడి ఉంటే మాత్రం అతనితో స్నేహం వదులుకోవడానికి సిద్ధం.
జీవితంలో మళ్ళీ అతనికేసి కన్నెత్తి చూడను పన్నెత్తి పలకరించను.
అతను బహుమతిగా ఇచ్చిన మొబైల్ కూడా నిర్మొహమాటంగా అతనికిచ్చేస్తాను"
ఆవేశంగా అంది హరిత.
"నీ ఆత్మ విశ్వాసం నాకు చాలా నచ్చింది
తల్లిగాడు. మూడేళ్లుగా నేను స్వేచ్ఛ
ఇచ్చినా నువ్వు హద్దు దాటలేదు అంటే నువ్వు నా కూతురివైనందుకు గర్విస్తున్నాను.
అయితే చిన్న పిల్లవి అనుభవం లేని దానివి కదా... ఆవేశపడుతుంటే మాత్రం నవ్వొస్తుంది
నాకు" అని పక పక నవ్వింది శకుంతల
"ఏ ధైర్యంతో అంతగా నవ్వ గలుగుతున్నావమ్మా?
" అడిగింది హరిత కళ్ళు తుడుచుకుని.
"లేకపోతే ఏడుస్తూ కూర్చోనా నీతో పాటు?
పిచ్చి పిల్ల. ఒక కోటీశ్వరుని కొడుకు, అంత
క్రితం ఏనాడు నిన్ను చూడని వాడు, నీ కాలేజీకి వచ్చి అందరి
ఆడపిల్లలోను నిన్నే ఎన్నుకొని, నిన్నే పెళ్లి చేసుకుంటానని
ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడంటే... అతను ఏమైనా దేవుడా? అతని
ఆలోచనలు వెనక ఏదో పథకము, ఎవరిదో ప్రభావం ఉండే ఉంటుందని
గ్రహించిన నా ఊహ తప్పు కాదని ఈరోజు నిర్ధారణ అయింది. నిజంగా అతను నీ నుంచి అదే
పొందాలని కోరుతున్నాడో, లేదా అతని పెద్దలు ప్రభావం గానీ,
స్నేహితులతో పందెంగానీ ఏమైనా ఉందా? లేదా ఈ
మూడేళ్లు కావాలని నీతో కాలక్షేపం చేసి, ఈ వేళ నిన్ను విడిచి
పెట్టడానికి ఈ పథకం వేసాడా? ఇవన్నీ తెలుసుకోవాలి కదా..
తల్లిగాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మనకి
ఎవరిమీదైనా ఏ విషయంలో అయినా అనుమానం వస్తే, నిర్మొహమాటంగా ఆ వ్యక్తితో అన్ని కోణాల్లో మాట్లాడి అనుమానం తీర్చుకోవడం
మంచిది. నిజంగా అవతల వాడు ద్రోహి అయితే ఆ స్నేహాన్ని వదిలేస్తాం. మనమే ఎదుటి వాళ్ళ
మీద అనవసరంగా అనుమానపడ్డామని గ్రహిస్తే మనకి జీవితం ఒక గుణపాఠం నేర్పినట్టే.
అంతేకాదు ఒక మంచి స్నేహితుడు మనకి లభించినట్టే. అందుకనే అతన్ని ఒకసారి ఇంటికి నేను
రమ్మన్నానని మెసేజ్ పెట్టు.
ఇదేదో సమస్య లాగా భావించి మన పనులు మనం పాడు
చేసుకోవడం, మన మనసులు పాడు చేసుకోవడం చేయొద్దు.
మీ ఇద్దరి ఎదురుగా అతన్ని అన్ని కోణాలలోను
ప్రశ్నిస్తాను. అతను చెప్పిన సమాధానాన్ని బట్టి మన ప్రణాళిక నిర్ణయించుకుందాం..
అంతేగాని ఆవేశపడి సమస్యను మరింత జటిలం చేసుకోవడం వివేకవంతులు లక్షణం కాదు.
వాళ్లు డబ్బు ఉన్నవాళ్లు. ఇప్పుడు వాళ్లు మన మీద
చేసింది మానసికమైన దాడి. శారీరమైన దాడి చేసే అవకాశం ఉండి కూడా అతను చేయలేదు,
లేదా చేయించలేదు అంటే... అతని మనసు మృదువైన మనసే.
అసలు ఈ ఆలోచనలు ఎందుకు?
నేను చెప్పినట్టు చెయ్... మనకి కొంత అవగాహన అయి ఏదో ఒక మార్గం
దొరుకుతుంది. ఏమంటావు... తల్లిగాడు. నీకు ఇష్టం లేకపోతేచెప్పు. వెంటనే అతని కళ్ళకి
నువు జీవితంలో కనపడకుండా చేసేస్తాను. మన ప్రయత్నం మనం చేద్దాం అంటావా.. ఫోన్
తీసుకొచ్చి మెసేజ్ పెట్టు. "
అంత బలంగా తల్లి చెప్పినప్పుడు హరిత ఏమి మాట్లాడకుండా
వెళ్లి ఫోన్ తీసుకువచ్చి విరాజ్ ని ఖాళీ కుదిరినప్పుడు ఇంటికి రమ్మని మెసేజ్
పెట్టింది.
విరాజ్ కి సందేశం చేరినట్టు వాట్సాప్ లో రెండు
టిక్కులు వచ్చాయి.
ఆ రాత్రి హరిత చంటి పిల్లలా తల్లి గుండెల్లో
ముడుచుకుని పడుకుంది.
శకుంతల హరిత తలను గుండెలకు అదుముకొని ప్రేమతో ఆమె
వీపు నిమురుతూ ఆలోచనలో పడింది.
ఆమె దృష్టి అనుకోకుండా భర్త ఫోటో మీద పడింది.
"ముల్లుని
ముల్లుతోనే తీసేయ్ శకూ . అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి." అని సందేశం
చెప్పినట్టుగా అనిపించింది శకుంతలకి.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment