ఉమా హర విలాసం
నాగమంజరి గుమ్మా
“నా మాట విను బంగారు తల్లీ! పట్టుదల మానుకో” బుజ్జగించింది మేనకాదేవి.
“లేదమ్మా.. నా నిర్ణయానికి తిరుగులేదు. మీరు, నాన్నగారు నన్ను ఆశీర్వదించి పంపండి.” స్థిరంగా పలికింది ఉమాదేవి గొంతు.
“నీ మాట మేమెప్పుడైనా కాదన్నామా? కానీ నువ్వు చేయబోయేది సాహసం. ఇంత చేసినా ఫలప్రదం అవుతుందో లేదో తెలియదు.” అంది మేనకాదేవి. “పోనీ నాన్నగారి చేత కబురుపెట్టమంటావా మరొకసారి?”
“ఎవ్వరి రాయబారాలు అవసరం లేదమ్మా”
“తల్లీ ఎండ కన్నెరగకుండా పెరిగావు. అత్యంత సుకుమారివి. నీకు మనసులో ఈ ఆలోచన ఎలా కలిగిందో తెలియడం లేదు.” అంతవరకు మౌనం గా ఉన్న హిమవంతుడు పలికాడు.
“నారాయణ నారాయణ” నారదుల వారు ప్రవేశించారు. “ఏమిటో తీవ్రమైన చర్చ జరుగుతున్నట్లుంది. నేనేమైనా రాకూడని సమయంలో వచ్చానా?” గంభీర వాతావరణాన్ని గమనిస్తూ అడిగాడు నారదుడు.
“త్రిలోక సంచారులకు నమస్సులు. మనసెరిగి వస్తారు తమరు. మీ రాక మాకు కడు పుణ్యప్రదము. మా సమస్య మీరే తీర్చండి” విన్నవించారు హిమవంతుడు, మేనకాదేవి ముక్తకంఠంతో…
“చెప్పండి గిరి దంపతులారా.. మీకు వచ్చిన సమస్య ఏమిటి?” ప్రశ్నించాడు నారదుడు.
“మా కుమార్తె పార్వతి శివుణ్ణి వివాహమాడుతానని భీష్మించుకుని కూర్చున్న మాట మీరెరుగుదురు కదా… ఆ విషయమై మేము చేయని ప్రయత్నం లేదు. మొదటగా పార్వతికి నచ్చచెప్పి చూసాము. ఇల్లు వాకిలి లేనివాడు, శ్మశాన వాసి, జడధారి, నాగభూషణుడు అయిన పరమశివుణ్ణి వివాహం చేసుకుంటే నీవు కష్టపడవలసి వస్తుందని బుజ్జగించాం. పార్వతి వినలేదు. ససేమిరా అన్నది. శివుణ్ణి పరిణయ విషయమై అంగీకారం కోరడానికి మా కుమారుడు మైనాకుడు పరివార సమేతంగా రుద్రభూమికి వెళ్ళాడు. కానీ ఎంతకీ ధ్యానం చాలించడే ఆ హరుడు. కన్నెత్తి చూడడు. పెదవి విప్పి పలుకరించడు. పరివారమంతా వేచి వేచి, విసిగి, డస్సి ఇంటికి చేరారు. ఇప్పుడు ఉమాదేవి తానే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సుకు బయలుదేరుతాను అంటోంది.” వివరించాడు హిమవంతుడు.
“మేమెంత చెప్పినా వినడం లేదు. మీరైనా చెప్పి చూడండి మహర్షి. వరాలనిచ్చే దేవతలు ఎంతమంది లేరు? మా సుకుమారి రాకుమారి ఎక్కడ? ఆ ఘోర వీర తపస్సు ఎక్కడ? ఈమె కోమల శరీరం ఆ తపో తీవ్రతకు తట్టుకోగలదా.. ఈ సాహసం మానుకోమంటే వినడం లేదే” మాతృ సహజ ఆవేదనతో తల్లడిల్లింది మేనకాదేవి.
“రాజదంపతులారా… కన్న మమకారంతో మీరు ముఖ్య విషయం మరచిపోవుచున్నారు. ఉమ సాక్షాత్తూ శివుని ధర్మపత్ని యైన దాక్షాయని. తొలి జన్మలో దక్షుని కూతురై, శివునికి అర్ధాంగియై, తన తండ్రి చేయు నిరీశ్వర యాగంలో తన భర్తకు, తనకు జరిగిన అవమానం భరించలేక, మరు జన్మలో కూడా మహేశ్వరునే పతిగా తలపోసి యోగాగ్నిచే ఆత్మాహుతి చేసుకున్నది. ఆ సతీదేవియే మీ పుణ్యవశమున మీ పుత్రికగా జన్మించింది. సతీ వియోగం భరించలేని పరమేశ్వరుడు యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా మీకు తెలియనిది కాదు” వివరించాడు నారదుడు.
“ఇప్పుడు మీకు తెలియని విషయం చెప్తాను వినండి. పరమేశ్వరుడు యోగ సమాధి వీడడని గ్రహించి, తారకాసురుడు విజృంభించాడు. తనకు పరమేశ్వరుని కుమారుని చేతిలో మాత్రమే మరణం సంభవించేలాగున బ్రహ్మచే వరం పొందాడు. వర ఫలితంగా తనకు మరణం అసాధ్యం కనుక, విర్రవీగి దేవ మానవ యక్ష కిన్నెర కింపురుషాదులను బేధభావం లేకుండా అందరినీ పలు ఇక్కట్లకు గురి చేస్తున్నాడు. వాడి ఆగడాలు మితిమీరుతున్నవి. ఈ పరిస్థితులలో పరమశివుని కళ్యాణమే మనకు దిక్కు. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. వాక్కు అర్ధమువంటి వారు. ఒకరు లేకుండా మరొకరు లేరు. కనుక మరో ఆలోచన లేకుండా గౌరిని తపస్సునకు సాగనంపండి. శివుని తపస్సు భంగం చేయాలంటే పార్వతి తపస్సు చేయక తప్పదు” అని వారి ఆవేదన తీర్చడానికి, తగిన మనోబలం పొందడానికి అవసరమైన అనునయ వాక్యాలు పలికాడు నారదుడు.
హిమవంతుడు , మేనకాదేవి భారమైన హృదయాలతో తమ కుమార్తె తపస్సు ఫలవంతం కావాలని దీవించారు.
“కల్యాణమస్తు” అని దీవించాడు నారదుడు.
తాను వలచిన పరమేశుని పతిగా పొందడానికి పార్వతి కఠినమైన మార్గం ఎంచుకున్నది. పట్టువస్త్రాలు విడిచిపెట్టింది. నారచీరలు కట్టింది. మణి భూషణములు విడిచింది. రుద్రాక్ష మాలలు ధరించింది. కస్తూరి లేపనాలు విడిచింది. విభూది పూతలు దాల్చింది. రాచభవనాన్ని వీడి, తపోవనమున కేగింది.
శరీరపోషణకై ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకుంటూ శివపంచాక్షరీ మంత్రం జపిస్తూ తపస్సు చేసింది. శివుడు ప్రసన్నం కాలేదు. నడివేసవిలో పైన సూర్యుడు ప్రతాపం చూపుతున్నపుడు నాలుగువైపులా అగ్నిరగిల్చి పంచాగ్నుల మధ్యలో ఒంటికాలిపై తపస్సు చేసింది. ఎముకలు కొరికే చలిలో పీకలోతు నీళ్లలో నిలిచి తపస్సు చేసింది. ఆకులు కూడా తినడం మాని కఠోర తపస్సు చేసి అపర్ణగా పిలువబడింది. ఏనుగు తొండాల వంటి వర్ష ధారలలో నిలిచి తపస్సు చేసింది. రాత్రి, పగలు మర్చిపోయి తపస్సు చేసింది. పార్వతి తపస్సుకు సకల లోకములు విలవిల లాడాయి. ఆమెకు బాసటగా నిలవాలని, ఉమాశంకరుల వివాహం జరగాలని దేవతలందరూ నిశ్చయించుకున్నారు.
వసంతుణ్ణి, మదనుణ్ణి శివుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి పంపారు.
వసంతుని రాకతో ఆ రుద్రభూమి కాస్తా వాసంత వనంగా మారిపోయింది. పక్షుల కిలకిలా రావాలతో, పూల సుగంధాలతో, పూతేనెలు తాగి మత్తెక్కి తిరిగే భ్రమర నాదాలతో, తామరలు వికసించే కొలనులతో, మధురమైన ఫలానిచ్చే వృక్షాలతో, ఫలాలకోసం వచ్చిన మృగాలతో, వాటి ఆశ్లేషలతో, సరిగమపదని సప్తస్వరములతో పులకాంకితమైనది. తన చుట్టూ ఇంత సందోహం కానవస్తున్నా ఇసుమంతైనా ధ్యాన భంగం కాలేదు శివునకు.
దేవతల ప్రోత్సాహంతో మన్మధుడు తెగించి, చిలుక వాహనం ఎక్కి, చెరకు విల్లు సవరించి, అల్లెతాడు బిగించి, నవమల్లికము, నీలోత్పలము, అరవిందము, అశోకము, చూతము అనే పేర్లుగల తన ఐదు బాణాలను గురిచూసి శివుని హృదయానికి నాటేలా విడిచాడు.
పూలబాణాలు మనసున నాటగానే శివుని ఎదలో ఏదో అలజడి. కన్నులు మూడు ఒకేసారి విప్పాడు. యుగయుగాలుగా ధ్యాన సమాధిలో ఉన్న శివుడు ఒక్కసారిగా కన్నులు తెరిచేసరికి కళ్ళలో నిక్షిప్తమై ఉన్న యోగాగ్ని ఒక్కసారిగా ఎదురుగా ఉన్న మన్మథుణ్ణి తాకింది. నిలువునా బూడిద రాసిగా మారాడు మన్మథుడు. నిర్విణ్ణురాలైంది రతీదేవి. హాహాకారాలు చేసింది జగతి.
జరిగినది, జరుగుతున్నది ఏమిటో ఒక్క క్షణం అర్ధం కాలేదు శివునకు. శివునకు తపోభంగం అయిందని తెలుసుకున్న సమస్త దేవపరివారం అక్కడకు చేరుకున్నారు. ఈలోగా శివుడు పరిస్థితిని ఆకళింపు చేసుకున్నాడు. దేవతలు స్తోత్రాలు, స్తుతులతో శివుణ్ణి మెప్పించారు. శివ పార్వతుల కల్యాణానికై దేవతలందరూ ఎదురుచూస్తున్నట్లు చెప్పేరు.
రతీదేవి పరుగున పోయి తనకు జరిగిన అన్యాయాన్ని పార్వతీదేవి తో మొరపెట్టుకుంది. దేవతల పన్నాగాన్ని వివరించింది. శివుడు కళ్ళు తెరవడం, తన భర్త భస్మరాశిగా మారడం తెలిపి విలపించింది. "మీ కల్యాణం చేయబోతే మాకు ఆపద వాటిల్లింద"ని వాపోయింది. పార్వతి రతీదేవి ని ఓదార్చింది. హుటాహుటిన పరమశివుని చెంతకు బయలుదేరింది.
శివుడు పరివార దేవతలమధ్య ఆశీనుడై ఉన్నాడు. పార్వతి నమస్కరించింది. “దేవదేవా! లోక కల్యాణం కోరిన మన్మథుణ్ణి మసి చేయడం భావ్యమా.. రతీదేవికి పతి వియోగం కలిగించడం తప్పు కాదా… మన్మథుడు లేకపోతే సృష్టి స్తంభించిపోదా.. కరుణించండి స్వామీ” అని ప్రార్ధించింది. శివుడు చిరునవ్వులు చిందిస్తూ "మన్మథుడు గతంలో బ్రహ్మచే విధింపబడిన శాప ఫలితంగా తన తనువును కోల్పోయి అనంగుడు అయినాడు. రతీదేవి కనులకు మాత్రం కనిపిస్తాడు. “ అని వరమిచ్చాడు.
కానీ పార్వతీదేవి సౌందర్యాన్ని కానీ, ఆమె తనతో కల్యాణం కోరి తపస్సు చేస్తున్న విషయాన్ని కానీ గుర్తించలేదు, ప్రస్తావించలేదు. పార్వతి తపోభూమికి తరలిపోయింది.
తపోనిష్ఠ లో ఉన్న పార్వతి దగ్గరకు ముడతలు పడిన శరీరంతో కౌపీనం మాత్రమే ధరించిన జడధారి ఒకడు వచ్చాడు. రావడం రావడమే పలకరించి, కుశలం అడిగాడు. వయసులో పెద్దవాడు కదా, పలకరించాడు అని ఆదరించింది పార్వతి. “చూడు అమ్మాయీ… నువ్వు చూడబోతే సుకుమారిలా, ఎండకన్నెరగని రాచబిడ్డలా ఉన్నావు. నీకు ఇక్కడ ఈ తపోభూమిలో ఏం పని? బొమ్మల పెళ్లిళ్లు చేయడానికి కావలసిన పూలు, పళ్ళు సంబారాలకై వచ్చావా… అయ్యో ముళ్ళు, కఠినమైన రాళ్లు నీ సుకుమారమైన పాదాలను కందిపోయేలా చేస్తాయి. ఎక్కడ నీ చెలులు? వారు తీసుకు వస్తారు కానీ నీవు ఇంటికి పో “ అన్నాడు.
“అబ్బే కాదంది” పార్వతి. “శివుణ్ణి వలచాను. ఆతని ప్రసన్నత కై తాను తపస్సు చేస్తున్నా” నన్నది.
“అయ్యో అయ్యో… ముల్లోకాల్లోనూ అందగత్తెవు. సౌందర్యరాశివి. నీకా ముసలి ఎద్దునెక్కి తిరిగే శివుడెందు”కన్నాడు. “ఎగుడు దిగుడు కన్నులవాడు, పాములను మెడలో వేసుకునే వాడు, ఇల్లిల్లు తిరిగి బిచ్చమెత్తుకునేవాడు, వల్లకాటిలో ఉండేవాడు, పిశాచాలను వెంటపెట్టుకునే వాడు, బూడిద పూసుకు తిరిగే దిగంబరుడు, భార్య చచ్చి పిచ్చిపట్టిన వాడు నీకెందు”కన్నాడు.
ఆయన అన్న మాటలన్నీ విన్నది పార్వతి. దృఢనిశ్చయం కలిగిన కంఠంతో ఇలా చెప్పింది. “పెద్దాయనా! నీవు చెప్పినవన్నీ నిజమే కావచ్చు. నేను చిన్నతనం నుంచి మనసావాచా కర్మణా శివుడినే పతిగా ఆరాధిస్తున్నాను. శివ నింద మాని నీ దారి నువ్వు చక్కగా చూసుకు పొ”మ్మన్నది.
పకాలున నవ్వాడు వృద్ధుడు. ”నీకంతగా కావాలనుకుంటే నన్నేపెళ్ళాడు పిల్లా… నా దగ్గర కూడా బూడిద ఉంది. నాకు కూడా చిల్లిగవ్వ ఆస్తిలేదు. నేను కూడా నిన్ను తిరిపెమెత్తి పోషిస్తాను. ఎక్కడో ఉన్న శివుని కోసం ఇంత కఠోరమైన తపస్సు దేనికి?” అని మేలమాడాడు.
పార్వతికి కోపం వచ్చింది “ఓయి మాయావి. చాలించు నీ ప్రేలాపనలు. ఇక్కడ నుంచి తక్షణం కదలకపోతే తగిన మర్యాద చేసి పంపుతాను.”అని హెచ్చరించింది.
తక్షణం తన మాయారూపం విడిచిపెట్టాడు శివుడు. నిజరూపంతో దర్శనమిచ్చాడు. ఉమను అక్కున చేర్చుకున్నాడు. తన మేనిలో సగమిచ్చాడు. అర్ధనారీశ్వరుడై నిలిచాడు. భార్యకు ఇవ్వవలసిన స్థానాన్ని ఆదర్శంగా చూపాడు.
ప్రకృతి, పురుషుల కలయిక విశ్వకల్యాణ మయ్యింది. వాక్కు, అర్ధం కలిసిన ఆది ప్రణవమయ్యింది. చరితలో తొలి ప్రణయ కథను లోకానికి అందించింది.
ఆదిదంపతులను సకల దేవతలు కొలిచి తరించారు.
జన్మలెన్ని మారినా, కష్టాలెన్ని ఎదురైనా, కాలమెంత ఎదురునిలిచినా నిజమైన ప్రేమకు తిరుగులేదని, హృదయంలో అంకురించిన ప్రేమ బీజం ఫలవంతం కావలసిందేనని తెలిపే మహోన్నత కథనం ఈ ఉమా హర విలాసం. స్వస్తి.
***
No comments:
Post a Comment