అమ్మ గాజులు - అచ్చంగా తెలుగు

అమ్మ గాజులు

డాక్టర్. బీ. యన్. వీ. పార్ధసారధి




రామలక్ష్మి కి పెళ్లి లో పుట్టింటి వాళ్ళు రెండు జతల  బంగారు గాజులు పెట్టారు. ఒక్కొక్క బంగారు గాజు ఇరవై గ్రాములు వుంటుంది. రామలక్ష్మి కి మంచి సంబంధమే చూసి పెళ్లి చేసారు. కానీ  వివాహమయ్యాక రామలక్ష్మిని  దురదృష్టం వెన్నంటే వెంటాడింది. భర్త రామ్మోహన్ కుటుంబానికి పది లారీలు ఉండేవి. సంపాదన కూడా బాగానే వుండేది. ఇరవై ఎకరాల పొలం కూడా వుండేది. రామ్మోహన్ కి సినిమాల పిచ్చి. ఒక సినిమా భారీగా ఖర్చు పెట్టి నిర్మించి విడుదల చేసాడు. అదికాస్తా తుస్సుమంది. దానితో ఆస్తి కర్పూరంలా కరిగిపోయి అప్పు మాత్రం కొండంత పెరిగింది. అప్పటికి ఇద్దరూ పిల్లలు కూడా పుట్టారు.  కొడుకు అనిల్ ఆ తరవాత కూతురు కల్పన.

రామ్మోహన్ బాగా కృంగిపోయాడు. కానీ కుటుంబ బాధ్యతలు మాత్రం రోజు రోజుకీ  పిల్లలతోపాటు పెరుగుతూ వచ్చాయి. తన స్నేహితుడి రవాణా కంపనీ లో మేనేజర్ గా చేరాడు. మొదట్లో అప్పుడప్పుడు అవసరం అయినప్పుడల్లా రామలక్ష్మి తన గాజులు తాకట్టు పెట్టేది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక  వాళ్ళ చదువులకి తరచూ ఆ గాజులు తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఒక గాజుల జత విడిపించుకోలేక చివరికి వాటిని తాకట్టు పెట్టిన మార్వాడీ కి సమర్పించారు. రెండో గాజుల జత మాత్రం కొన్నాళ్ళు ఇంట్లో, కొన్నాళ్ళు మార్వాడీ దగ్గర వుండేది. రాను రాను ఆ గాజులు కూడా ఎక్కువగా మార్వాడీ దగ్గర వుండటం తో, ఎప్పుడైనా భర్త వాటిని విడిపించుకుని వస్తే, ఎలాగు మళ్ళీ వాటిని కొన్నాళ్ళలో తాకట్టు పెట్టాలి కాబట్టి, రామలక్ష్మి ఆ గాజులని ధరించటం మానేసింది.   

అవసరానికి తమ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునే ఆ గాజులంటే ఒకింత విలువ ఉన్నప్పటికీ, మిగిలిన ఆ ఒక్క జత గాజులని తమ అమ్మ వాటిని  పూర్తిగా ధరించడం మానేసాక అనిల్, కల్పనలకి ఆ గాజులమీద కాస్త కోపం కూడా కలిగేది. అనిల్, కల్పనలు బాగా కష్టపడి చదువుకున్నారు. అనిల్ కి మంచి ఉద్యోగం వచ్చింది. కల్పనకి కూడా (ఏ కట్న కానుకలు లేకుండా) మంచి సంబంధం కుదిరింది. అనిల్ తన మేనమామ కూతురిని పెళ్లి చేసుకున్నాడు. రామలక్ష్మి జత గాజులు ఇప్పుడు ఇంట్లోనే పదిలంగా వున్నాయి. ఆ గాజులు  చేతికి ధరించమని ఎన్నిసార్లు అనిల్ బలవంతం చేసినప్పటికీ , రామలక్ష్మి మాత్రం వాటిని ధరించలేదు. రామ్మోహన్ మరిణించిన మరో రెండేళ్ళకి రామలక్ష్మి కూడా కాలం చేసింది. అనిల్, కల్పన ఇద్దరి కుటుంబాలు ఆర్ధికంగా బాగా నిలదొక్కుకున్నాయి. రామలక్ష్మి అంత్యక్రియలు, కర్మలు అన్నీ సాఫీ గా, ఘనం గా జరిగాయి.

  మర్నాడు ఊరికి ప్రయాణం అనగా కల్పన, “నువ్వు మరోలా అనుకోకపోతే అమ్మ జ్ఞాపకార్ధం గా గాజుల జత నేను తీసుకెళ్ళనా? అని అడిగింది అనిల్ ని. అనిల్ మౌనం గా ఉండటంతో బహుశ అతనికి అమ్మ గాజుల జతని తనకి ఇవ్వడం ఒకవేళ ఇష్టం లేదేమో’ అని తలపోసింది కల్పన. తాను తొందరపడి అన్న ని నొప్పించానని అనుకుంది.

ఆ రోజు రాత్రి అనిల్ బీరువా లాకర్ లోంచి తన అమ్మ గాజుల జత తీసి వాటికేసి పదే పదే ఒక విధమైన బాధ తో చూస్తున్నాడు. “ఈ గాజుల జత ఎవరివండీ ?” అని అడిగింది అనిల్  భార్య లక్ష్మి. అనిల్  లక్ష్మి కి అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. “ ఏదీ ఒకసారి ఈ గాజుల జత ఇవ్వండి . చూస్తాను “ అంది లక్ష్మి. లక్ష్మి ఆ గాజుల జతని చూడటం అదే తొలిసారి. లక్ష్మి ఆ గాజుల జతని చూస్తున్నప్పుడు ఆమె వదనం లో ఒకింత ఆశ్చర్యం కలగటం గమనించాడు అనిల్.

లక్ష్మి గబగబా వెళ్లి బీరువాలో తన నగలన్నీ తీసి అందులోంచి ఒక గాజుల జత తీసి , వాటిని తేరిపార చూసి భర్త అనిల్ చేతిలోపెట్టింది. అవి చూసి ఆశ్చర్య పోయాడు అనిల్. లక్ష్మి ఇచ్చిన ఆ జత బంగారు గాజులు అచ్చం తన అమ్మ గాజుల్లగా వున్నాయి. “మన పెళ్ళిలో మా అమ్మ ఈ గాజుల జత ఇచ్చింది. తనకి పెళ్ళిలో మా బామ్మ వాళ్ళు రెండు జతల గాజులు పెట్టారని అందులో ఇది ఒక జత అని, వాళ్ళ గుర్తుగా నన్ను భద్రం గా ఉంచుకోమని ఇచ్చింది.”  అంది లక్ష్మి.

‘ తన అమ్మమ్మ వాళ్ళు తన అమ్మకి రెండు జతల బంగారు గాజులు ఎలాగైతే పెట్టారో, అదేవిధంగా తన మేనమామ అయిన లక్ష్మి తండ్రి పెళ్ళిలో కూడా అటువంటి గాజులు మరో రెండు జతలు తన అత్త కి పెట్టారని వెంటనే గ్రహించాడు అనిల్.

మర్నాడు కల్పన ఊరికి ప్రయాణం అవుతున్నదనగా, లక్ష్మి కల్పనకి బొట్టు పెట్టి, బొట్టుతో పాటు జత బంగారం గాజులు కూడా పెట్టింది. “అమ్మ గాజులు నాకు ఇచ్చినందుకు చాలా థాంక్స్ వదినా” అంది కల్పన . పక్కనే వున్న అనిల్  తన చేతిలో వున్న మరో బంగారు గాజుల జత తీసి కల్పనకి చూపెట్టాడు. “ అరే ! ఇవి అచ్చంగా అమ్మ గాజుల్లగా వున్నాయే !” అంది కల్పన. “ వదిన నీకు పెట్టినవి నీ పుట్టింటి వారి గాజులు. నా చేతిలోనివి  మీ వదిన పుట్టింటివారు పెట్టిన గాజులు “ అన్నాడు నవ్వుతూ అనిల్.    


***

No comments:

Post a Comment

Pages