"బంగారు" ద్వీపం (అనువాద నవల) -28
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Writer : Enid Blyton
(చెక్కపేడు గుచ్చుకొని గాయపడ్ద డిక్ని, అన్నెని తీసుకొని జూలియన్ బహిరంగ ప్రదేశానికి తీసుకొస్తాడు. వాళ్ళను అక్కడ వదిలిపెట్టి, అతను తిరిగి సుద్ద గుర్తులను బట్టి నేలమాళిగ గదికి చేరుకుంటాడు. అక్కడ గదికి ఉన్న తాళం బద్దలుకొట్టి, చూసిన వాళ్ళకు బంగారపు కడ్డీలు కనిపిస్తాయి. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అక్కడకొచ్చి ఇక్కడ ఏమి చేస్తున్నారని వాళ్ళను అడుగుతాడు. తరువాత. . .)
@@@@@@@
"ఓ! అయితే నువ్వు జవాబు చెప్పవు" రెండవ వ్యక్తి అంటూ పిల్లలకు దగ్గరగా కదిలాడు.
టిం తన దంతాలు బయటపడేలా గుర్రుమన్నాడు. కానీ ఆ వ్యక్తి అతనికి భయపడినట్లు కనిపించలేదు. ఆ వ్యక్తి తలుపు దగ్గరకు వెళ్ళి నేలమాళిగలోకి తన టార్చి కాంతిని ప్రసరింపచేసాడు. అతను ఆశ్చర్యకరమైన పెద్ద ఈల వేసాడు.
"జేక్! ఇక్కడ చూడు!" అతను చెప్పాడు. "నువ్వు సరిగా చెప్పావు. బంగారం యిక్కడే ఉంది. తీసుకెళ్ళటం కూడా ఎంతో సులభం! లోహపు కడ్డీలు; నా మాట ఏమిటంటే, మనకు దొరికిన వాటిలో ఇదే అత్యంత అద్భుతమైన వస్తువు!"
"ఈ బంగారం నాది" జార్జి కోపంగా అంది. "ఈ ద్వీపం, ఈ కోట మా అమ్మకు చెందినవి. ఇక్కడ దొరికిన ప్రతీది ఆమెదే! నా పెద్ద ముత్తాత తన ఓడ ధ్వంసమయ్యే ముందు ఈ బంగారాన్ని యిక్కడకు తీసుకు వచ్చి దాచాడు. ఇది మీది కాదు, ఎప్పటికీ కాబోదు. నేను యింటికి వెళ్ళిన వెంటనే యిక్కడ మాకేమి దొరికిందో మా అమ్మకి, నాన్నకి చెబుతాను. ఆపైన మీరు ఖచ్చితంగా ఈ కోటను, ద్వీపాన్నీ కొనలేరు. మీ తెలివితేటలతో పాత పెట్టెలోని పటం వల్ల మీరు బంగారం గురించి తెలుసుకొని ఉండొచ్చు. కానీ తెలివితేటలు ఒక్కటే మనకు సరిపోవు. దీన్ని మొదట మేము కనుగొన్నాం."
జార్జి కోపంగా స్పష్టమైన కంఠంతో చెప్పిన మాటలను ఆ వ్యక్తులిద్దరూ మౌనంగా విన్నారు. వారిలో ఒకడు నవ్వాడు.
"నువ్వు చిన్నపిల్లవి మాత్రమే!" అన్నాడతను. "మమ్మల్ని ఖచ్చితంగా దారి తప్పించగలనని నువ్వు అనుకొంటున్నావా? మేము ఈ ద్వీపాన్ని కొనుగోలు చేయబోతున్నాం- దీనిలో ఉన్న ప్రతీ వస్తువును! ఒప్పంద పత్రంపై సంతకాలు చేసినప్పుడు మేము బంగారాన్ని తీసుకొంటాం. ఒకవేళ అనుకోకుండా మేము ఈ ద్వీపాన్ని కొనలేకపోయినా, మేము అదే బంగారాన్ని తీసుకొంటాం. ఒక ఓడను యిక్కడికి తీసుకొచ్చి, యిక్కడనుండి పడవ ద్వారా ఓడ మీదకు ఈ కడ్డీలను బదిలీ చేయటం చాలా సులభం. చింతించకండి. మేము ఏది కావాలని కోరుకొన్నామో దాన్ని మేము తప్పకుండా పొందుతాం."
"మీరు పొందలేరు" అంటూ జార్జి తలుపుని దాటి బయటకు వచ్చింది. "నేను ఇప్పుడు నేరుగా యింటికి వెళ్తున్నాను. మీరు చెప్పినవన్నీ నేను మా నాన్నగారికి చెబుతాను."
"నా ప్రియమైన బాలికా! నువ్విప్పుడు యింటికి వెళ్ళటం లేదు" మొదటి వ్యక్తి చెప్పాడు. అతను జార్జిపై చేతులు వేసి, ఆమెను నేలమాళిగలోని గదిలోకి బలంగా నెట్టాడు. "పనిలో పని, నేను ఈ అసహ్యకరమైన కుక్కను కాల్చకుండా ఉండాలంటే, దీన్ని వెనక్కి పిలు. పిలుస్తావుగా?"
ఆ వ్యక్తి చేతిలో మెరుస్తున్న రివాల్వర్ని జార్జి నిరాశతో చూసింది. భయంతో టిం మెడను పట్టుకొని తన వైపుకి లాక్కుంది. "ప్రశాంతంగా ఉండు టిం! అంతా సవ్యంగానే ఉంది."
కానీ అక్కడ పరిస్థితి బాగులేదని టింకి తెలుసు. ఏదో తప్పు ఉన్నట్లు అనిపించింది. అతను తీవ్రంగా గర్జించటం మానలేదు.
"ఇప్పుడు నేను చెప్పేది విను" ఆ వ్యక్తి తన సహచరుడితో హడావిడిగా చర్చించాక జార్జితో అన్నాడు. "నువ్వు తెలివిగా వ్యవహరిస్తే, అవాంఛనీయమైనదేదీ నీకు జరుగదు. కానీ నువ్వు మొండిగా ఉంటే, నువ్వే బాధపడతావు. మేము చేయదలుచుకొన్నది ఏమిటంటే, మీ యిద్దరినీ భద్రంగా యిక్కడ బంధించి, మేము మా మోటారు బోటులో వెళ్ళిపోతాం. తరువాత ఒక ఓడను సంపాదించి బంగారం కోసం తిరిగి వస్తాం. ఈ ద్వీపాన్ని కొనుగోలు చేసేటప్పుడు అది యింత విలువైనదని మేము అనుకోలేదు. ఇప్పుడు లోహపు కడ్డీలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలిసింది."
"నువ్వు బంగారాన్ని కనుగొన్నావని, వాటిని చూడటానికి వాళ్ళను కిందకు రమ్మని, నువ్వు పైన ఉన్న నీ సహచరులకు ఒక ఉత్తరాన్ని వ్రాస్తావు" రెండవ వ్యక్తి చెప్పాడు. "తరువాత మీ అందరినీ మేము ఈ నేలమాళిగలో ఉంచి తాళం పెడతాం. మేము వచ్చేవరకు మీరు ఆడుకోవటానికి ఈ కడ్డీలు ఉంటాయి. మేము తిరిగి వచ్చేవరకూ మీకు ఆహారాన్ని, పానీయాన్ని వదిలి వెడతాం. ఇప్పుడు - యిక్కడ ఒక పెన్సిలు ఉంది. వాళ్ళు ఎవరైనా, డిక్ మరియు అన్నెలకు నువ్వు ఒక చీటీ వ్రాయాలి. నీ కుక్కతో దాన్ని పైకి పంపాలి. రా!"
"నేను చేయను" జార్జి ముఖం ఆగ్రహంతో ఎరుపెక్కింది. "నేను వ్రాయను. నువ్వు నా చేత అలాంటి పని చేయించలేవు. అమాయకులైన డిక్, అన్నె లను కిందకు రప్పించి, వాళ్ళు బందీలయ్యేలా చేయను. ఇప్పుడే నేను కనుగొన్న బంగారాన్ని మిమ్మల్ని తీసుకెళ్ళనివ్వను."
"మేము చెప్పినట్లు నువ్వు చేయకపోతే, నీ కుక్కను కాల్చివేస్తాం" అకస్మాత్తుగా మొదటి వ్యక్తి అన్నాడు. జార్జి హృదయం కుంగిపోయింది. ఒళ్ళంతా చల్లబడిపోయి, భయంతో వణికింది.
"వద్దు వద్దు" నిరాశ నిండిన స్వరంతో నీరసంగా అంది.
"అయితే చీటీని వ్రాయి" అంటూ ఆ వ్యక్తి ఆమె చేతికి పెన్సిలు, కాగితం యిచ్చాడు. "కానీయి. ఏమి వ్రాయాలో నేను చెప్తాను."
"నేను చేయలేను" జార్జి వెక్కుతూ చెప్పింది. "బందీలను చేయటానికి నేను అన్నె, డిక్ లను కిందకు రప్పించను."
"అయితే సరె! నేను కుక్కను కాల్చేస్తాను" కర్కశంగా అంటూ ఆ వ్యక్తి చేతిలోని రివాల్వర్ని టిం కి గురిపెట్టాడు. తన చేతులతో జార్జి కుక్కను చుట్టేసి కీచుమంటూ అరిచింది.
"వద్దు వద్దు. నేను చీటీని వ్రాస్తాను. టింని కాల్చకండి, టింని కాల్చకండి!"
ఆ అమ్మాయి వణుకుతున్న చేతులతో కాగితం, పెన్సిల్ అందుకొని ఆ వ్యక్తి వైపు చూసింది. "ఇలా వ్రాయి" ఆదేశించాడతను. "ప్రియమైన డిక్, అన్నెలకు, మేము బంగారాన్ని కనుగొన్నాం. తక్షణం కిందకు వచ్చి దాన్ని చూడండి." తరువాత నీ పేరుతో సంతకం చేయి."
జార్జి ఆ వ్యక్తి చెప్పినట్లే వ్రాసింది. అప్పుడు తన పేరుతో సంతకం చేసింది. కానీ "జార్జి"కి బదులు "జార్జినా" అని వ్రాసింది. ఆమె తన పేరుతో ఎప్పుడూ సంతకం చేయదని, అలా చేసిందంటే ఏదో ఉందని మిగతావాళ్ళు భావిస్తారని ఆమెకు తెలుసు. జరగరానిదేదో జరుగుతున్నట్లుగా ఆమె హెచ్చరిస్తోందని వాళ్ళు గమనిస్తారని ఆమె ఆశించింది. ఆ వ్యక్తి చీటీని తీసుకొని టిం మెడకు కట్టాడు. కుక్క ఆపకుండా గుర్రుమంటూనే ఉంది. కానీ జార్జి కరవవద్దని కుక్కకు చెబుతోంది.
"ఇప్పుడు వెళ్ళి మీ స్నేహితులు ఎక్కడ ఉన్నారో కనుక్కోమని అతనికి చెప్పు" అన్నాడా వ్యక్తి.
"డిక్, అన్నెలను చూసి రా ఫో!" ఆజ్ఞాపించింది జార్జి. "వెళ్ళు టిం! డిక్, అన్నె లను కలిసి ఈ చీటి యిచ్చి రా!"
జార్జిని వదిలి వెళ్ళటం టిం కి యిష్టం లేదు. కానీ ఆమె స్వరంలో ఏదో అత్యవసరం ద్యోతకమవుతోంది. అతను తన యజమానురాలి వైపు చివరగా చూసి, ఆమె చేతిని నాకాడు. తరువాత చీకటి వసారాలోంచి వేగంగా దూసుకెళ్ళాడు. అతనికి ప్రస్తుతం దారి బాగా తెలుసు. ప్రతి మెట్టును దూకుతూ ఎక్కి ఆరుబయలు ప్రదేశానికి వచ్చాడు. అక్కడ పాత యార్డులో ఆగి చుట్టూ ముక్కుతో వాసన చూసాడు. డిక్, అన్నె ఎక్కడ ఉన్నారు? నేల మీద ముక్కు పెట్టి వాళ్ళ అడుగుజాడలను వాసన చూస్తూ పరుగులాంటి నడకతో ముందుకు సాగాడు. అతను త్వరలోనే రాళ్ళపై ఉన్న యిద్దరు పిల్లలను కనుగొన్నాడు. ప్రస్తుతం డిక్ ఒంట్లో బాగున్న అనుభూతిని పొందుతూ, రాళ్ళపై కూర్చున్నాడు. అతని బుగ్గపై రక్తస్రావం దాదాపుగా ఆగిపోయింది.
"హల్లో!" టిం ని చూసి ఆశ్చర్యపోయాడతను. "ఇదిగో తిమోతీ! ఎందుకు . . .ముసలోడా!. . . నువ్వు మమ్మల్ని చూడటానికి ఎందుకొచ్చావు? ఆ భూగర్భంలోని చీకట్లో ఉండటం వల్ల విసుగెత్తిపోయావా?"
"అటు చూడు డిక్ ! తన మెళ్ళో ఏదో మెలి చుట్టి ఉన్నట్లు ఉంది" తన చురుకైన కళ్ళతో అక్కడ ఉన్న కాగితాన్ని చూస్తూ అన్నె చెప్పింది. "అది ఒక చీటి. మన యిద్దరినీ కిందకు రమ్మని అది జార్జి వాళ్ళే పంపి ఉంటారు. దాన్ని మన దగ్గరకు తెచ్చిన టిం తెలివైనది కాదంటావా? "
టిం మెడలోని కాగితాన్ని డిక్ విప్పాడు. అతడు దాన్ని తెరిచి చదివాడు.
"ప్రియమైన డిక్, అన్నె. . ." అతను గట్టిగా చదవసాగాడు. "మేము బంగారాన్ని కనుగొన్నాము. వెంటనే కిందకు వచ్చి దాన్ని చూడండి.. .జార్జియానా!"
"ఓహ్!" అన్న అన్నె కళ్ళు మెరిసాయి. "వాళ్ళు దాన్ని కనుగొన్నారు. ఓహ్ డిక్! ఇప్పుడు నువ్వు కిందకు వచ్చేంత బాగున్నావా? త్వరగా వెళ్దాం."
కానీ డిక్ కూర్చున్న రాళ్ళ మీద నుంచి లేవలేదు. అతనలా కూర్చునే , ఆ చీటీ వైపు అయోమయంగా చూస్తున్నాడు.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment