ఇంటికి గుట్టు మడికి గట్టు - అచ్చంగా తెలుగు

ఇంటికి గుట్టు మడికి గట్టు

Share This

ఇంటికి గుట్టు మడికి గట్టు

కాశీ విశ్వనాథం పట్రాయుడు.

9494524445




విజయవాడలో నివాసముంటున్న రాజేష్ కుమారి దంపతుల కుమార్తె రాగిణి. విలాస్ ఖాన్ పాలెంలో ఉన్న దూరపు బంధువు రామారావు కొడుకు విజయ్ కి ఇచ్చి రెండేళ్ల క్రిందట పెళ్లి చేసారు.


రామారావుకు నలుగురు కొడుకులు విజయ్ ఆఖరివాడు. కొడుకులు, కోడళ్ళు, మనవలు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు.  వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.


రామారావు ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం లేదు.  వారు కోళ్ళు,  కుక్కలు, పిల్లులను పెంచుకునేవారు. రాగిణి పట్నం నుంచి వచ్చిన పిల్ల. మరుగు దొడ్డి సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడింది. ఆ విషయాన్ని భర్తకు, అత్తమామలకు చెప్పింది. “మిగతా కోడళ్లుకు లేని ఇబ్బంది నీకే వచ్చిందా సర్డుకుపో” అని చెప్పారు.


ఇంటి చుట్టూ కోడి రెట్టలతో చాలా అపరిశుభ్రంగా ఉండేది. అవి శుభ్రం చెయ్యలేదని అత్తామామలు తిట్టిపోసేవారు. పిల్లులంటే అసహ్యం, కుక్కంటే భయం రాగిణికి.  ఇంట్లో తిరిగే కుక్కలు, పిల్లుల వలన రాగిణికి భయం భయంగా ఉండేది.


ఆ యింట్లో ఇమడలేకపోయింది. పుట్టింటికి వచ్చింది. అత్తింటికి వెళ్లనని పేచీ పెట్టింది. భర్త వచ్చి మరుగుదొడ్డి కట్టిస్తానని, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని,  మాట ఇచ్చి రాగిణిని తీసుకువెళ్ళాడు.


తీరా తీసుకువెళ్ళాక పాత పాటే పాడారు. దాంతో విసిగిపోయిన రాగిణి భర్తతో గొడవకి దిగింది. అది భరించలేని  అత్తామామలు, భర్త కలసి రాగిణి పై దుష్ప్రచారం చేయడం, నిందలు మోపడం చేసారు. అవి ఆనోటా ఈనోటా అందరికీ తెలిసాయి. విజయ్ తాతకి ఈ విషయం తెలిసి  ఒకరోజు కుటుంబసభ్యుల అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పడం ప్రారంభించాడు.


“ఇంటి గుట్టు బయట పెట్టారు. దానివల్ల మన కుటుంబ పరువు బజారు పాలు అయ్యింది. మన గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. మరుగుదొడ్డి లేకపోవడం, ఇల్లు అపరిశుభ్రంగా ఉంచుకోవడం అనాగరికతకు చిహ్నం. కాలం మారింది, కాలంతో పాటే మనమూ మారాలి. పెంపుడు జంతువుల విషయంలో మీరు తీసుకున్న శ్రద్ధ, వాటి మీద చూపిస్తున్న ప్రేమ కొత్త కోడలిమీద మీద ఎందుకు చూపించడం లేదు?


విజయ్! ఆమె నీకు శత్రువు కాదు అర్ధాంగి. తన అమ్మా నాన్నలను వదిలి నీ మీద నమ్మకంతో నీతో ఏడడుగులు వేసింది. ఆమె కష్ట సుఖాల్లో తోడునీడగా నిలవాల్సింది నువ్వు. అలాంటిది నువ్వే అర్థం చేసుకోక, సమస్యని పరిష్కరించకపోతే ఆ ఆడపిల్ల తన గోడును ఎవరికి వినిపిస్తుంది.


‘ఇంటికి గుట్టు మడికి గట్టు’  ఎందుకు అన్నారో తెలుసా? ఇంటి గుట్టు బయటి వాళ్ళకి తెలిస్తే చులకనై వైవాహిక జీవితం దెబ్బతింటుంది. మడికి గట్టు లేకపోతే మడిలో నీరంతా బయటకు ప్రవహించి మడి ఎండిపోతుంది. తత్ఫలితంగా పంట పండదు.


ఇకనైనా  మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. సామరస్యంగా సమస్యని పరిష్కరించుకోండి.” అని హితవు పలికాడు తాతయ్య. ఇంటికి గుట్టు మడికి గట్టు అన్న సామెత అలా ప్రజా బహుళ్యం లోకి వచ్చింది.


***

No comments:

Post a Comment

Pages