మాధవ భూధవ మదనజనక - అచ్చంగా తెలుగు

 మాధవ భూధవ మదనజనక 

ఆచార్య  తాడేపల్లి పతంజలి

7780541502


రేకు: 0355-01 సాళంగం సం: 04-321

పల్లవి: మాధవ భూధవ మదనజనక

సాధురక్షణచతుర శరణు శరణు

చ.1: నారాయణాచ్యుతానంత గోవింద శ్రీ -

నారసింహా కృష్ణ నాగశయన

వారాహ వామన వాసుదేవ మురారి

శౌరి జయజయతు శరణు శరణు

చ.2: పుండరీకేక్షణ భువనపూర్ణగుణ

అండజగమన నిత్య హరి ముకుంద

పండరిరమణ రామ బలరామ పరమపురుష

చండభార్గవరామ శరణు శరణు

చ.3: దేవ దేవోత్తమ దివ్యావతార నిజ -

భావ భావనాతీత పద్మనాభ

శ్రీవేంకటాచల శృంగారమూర్తి నవ

సావయవసారూప్య శరణు శరణు


పల్లవి:

లక్ష్మీదేవికి మగడా! భూదేవికి మగడా! మన్మథునికి తండ్రి అయిన వాడా!

మంచి వారిని రక్షించే విషయములో నేర్పరీ! నీకు శరణము. శరణము

1.

1.ఓ నారాయణుడా! అచ్యుతుడా ! అనంతుడా! గోవిందుడా! శ్రీ నరసింహుడా!కృష్ణుడా! ఆదిశేషునిపై  పడుకొన్నవాడా!వరాహమూర్తీ! వామనుడా! వాసుదేవుడా! మురారీ!శౌరీ! నీకు జయము.జయము. నీకు శరణము. శరణము

2.తెల్లతామరవంటి కన్ను కలవాడా ! లోకమంతానిండిన గుణము కలవాడా!గరుత్మంతుని వాహనముగా కలిగినవాడా ! శాశ్వతుడా ! హరీ! ముకుందుడా!పండరి క్షేత్రములో వెలసి అనందించువాడా! రాముడా! బలరాముడా! శ్రేష్ఠుడైనవాడా!భయంకర స్వభావము కలిగిన పరశురాముడా! నీకు శరణము. శరణము

3.దేవతలకు నాయకుడైన ఉత్తముడా! గొప్పవైన అవతారము కలవాడా!తనవయిన భావములతో  ఎవరైనా భావించుటకు కూడా అతీతమయిన సత్వ రజస్తమో గుణము దాటిన వాడా !పద్మ నాభుడా!శ్రీవేంకట పర్వతములో నెకొన్న శృంగార మూర్తీ! అందమయినఅవయవముతో కలిసిన రూపముతో సారూప్య ముక్తిని ఇచ్చువాడా ! నీకు శరణము. శరణము.

                       

విశేషాలు

మాధవ భూధవ

1.లక్ష్మీ దేవిభూదేవి అని రెండు రూపాల్లో మనం పూజిస్తున్నాం. నిజానికి అమ్మవారు ఒక్కరే. అమ్మవారు మూడు స్థానాల్లో లయార్చభోగార్చ మరియూ ఆధికారార్చ అనే రూపాల్లో దర్శనమిస్తుందని పెద్దలు చెబుతారు. లయార్చ అంటే భగవంతుని యొక్క  వక్షస్థలంపై ఉన్న రూపం. భోగార్చ అంటే భగవంతునికి  ప్రక్కగా ఉండే  రూపం. ఒంటరిగా భగవంతుడు ప్రక్కన లేని రూపంలో దర్శనమిచ్చే రూపం అధికారార్చ.మన మానవ సంబంధాలను దేవునికి అంటగడితే కొన్ని ప్రశ్నలకు జవాబు తెగవు. ఉదాహరణకి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో వేంకటేశుడు భూదేవి పుత్రి సీతకు భర్తగా చెబుతారు. అదే సుప్రభాతంలో భూదేవి భర్తగా చెబుతారు. రెండిరటికి సమన్వయం కష్టం. నారాయణుడు భూదేవికి భర్త. శ్రీ రాముడు సీతకు భర్త. మన వావి వరుస సర్వము తానైన భగవంతునికి అంటకట్టకూడదు.

        ఒకటికి రెండుసార్లు లేదా వేయిసార్లు దేవుని పొగడటం మనకు అలవాటు. లేకపోతే మనకు తృప్తి ఉండదు. అందుకే దేవుని ఇద్దరు  భార్యతో కలిపి పూజిస్తున్నాం. తత్వం ఒకటే అనే జ్ఞానం వచ్చేంతవరకు వేంకటేశుని ఇద్దరు భార్యతో కలిసి పూజించే అలవాటు పెద్దలు చేసారు. అన్నమయ్య కూడా అందుకే పన్నిన లక్ష్మి  భూమి పతి వి నీవు’  అన్నాడు.

పండరి రమణ

            పాండురంగడు  మహారాష్ట్రములో పండరీపురములో వెసిన దేవుడు. ఆ స్వామిని పండరి రమణ అని ఆత్మీయతతో అన్నమయ్య పిలుస్తున్నాడు.నామదేవుడు అనే భక్తునికి  అలవడిన జ్ఞానము స్థిరమైనదాకాదా?’’ యని పండరినాథుడు పరీక్షింపదలచి ఒకనాడు శునకరూపముతో అచటకు వచ్చాడు. కొందరు తరిమివేసారు.. మరికొందరు దానిని దుడ్డు కర్రతో బాదారు.. ఆ శునకం పారిపోయి తిరిగి వచ్చి తటాలున నామదేవుని చేతిలోని రొట్టెను నోట గరచుకుని పారిపోవటం మొదలుపెట్టింది.. నామదేవుడు చీదరించుకోకుండా నేయిపంచదార అద్దిన రొట్టెముక్కను దాని నోటికి అందించాడు.. ఆ శునకము ప్రీతితో ఆ రొట్టెముక్క తిన్నది. తర్వాత నామదేవుని ఒడిలోని కుక్క దివ్యమంగళ విగ్రహమై నామదేవుని అనుగ్రహించి మాయమైంది.ఇలా ఎంతోమంది భక్తులను అనుగ్రహించినవాడు పాండురంగడు.

సారూప్య

        జనన మరణ బంధ విమోచనం ముక్తి. అవిద్య నశించడం ముక్తి. ఇలాంటి ముక్తులు నాలుగు విధాలని కొందరుఐదు విధాలని కొందరు అంటారు.

       ఐదు విధాల ముక్తులివి : 1. సార్ష్టి  2. సాలోక్యం, 3. సామీప్యం, 4. సారూప్యం, 5. సాయుజ్యం. నాలుగు విధాలనే వారు సార్ష్టిని ఇందులో చేర్చరు. సార్ష్టిసాయుజ్యం ఒకటే అని సూర్య రాయాంధ్ర నిఘంటువు  వివరించింది.

       తాను ఉపాసించే దేవతను నిరంతరం ధ్యానించడం చేత ఆ దేవతా రూపాన్ని యథాతథంగా ధరించడం ‘‘సారూప్యముక్తి’’. వైకుంఠంలో  విష్ణువులామణిద్వీపంలో అమ్మలా,కైలాసంలోశివునిలా  రూపాలు.. పొందడం. నిరంతరం  దేవునిలోకాన్ని భావించటం  చేత ఆ దేవతాలోకంలో నివసించడం ‘‘సాలోక్యం’’  దేవతకి సమీపంలో ఉండగలిగే ముక్తి ‘‘సామీప్యం’’. దేవతకు భిన్నము కాకుండా దేవతలో విలీనం కావడం ‘‘సాయుజ్యం’’.అన్నమయ్య ఇందులో సారూప్యాన్ని కోరుకొన్నాడు ఈ కీర్తనలో.మనము కూడా అన్నమయ్యతో గొంతు కలిపి  స్వామి వారిని ప్రార్థిద్దాం. 

ధన్యవాదములు.
 
***

No comments:

Post a Comment

Pages