తారాశశాంకం - అచ్చంగా తెలుగు

 తారాశశాంకం

నాగమంజరి గుమ్మా



కర్ణపేయంగా వినవస్తోంది విద్యార్థుల వేద ఘోష. ఎత్తైన ఆసనంపై మణిదీపంలా ప్రకాశిస్తున్నారు దేవగురువు బృహస్పతి. విద్యార్థులందరిలో ఒక స్ఫురద్రూపి యైన యువకుడు ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు.  అత్రి మహర్షి కుమారుడైన చంద్రుడతడు. బృహస్పతుల వారికి అనుంగు శిష్యుడు. “ఈరోజుకు విద్యాభ్యాసం చాలిద్దాం. చంద్రా.. వంట పని ఎంత వరకు వచ్చిందో కనుక్కో… ఏమైనా సహాయం కావాలేమో చూడు” ఆదేశించాడు బృహస్పతి.


చంద్రుడు తలవూచి వంటశాల వైపు సాగిపోయాడు. ఆ సమయం కోసమే వంటశాలలో ఎదురుచూస్తోంది తార. చంద్రుణ్ణి అక్కడ నుంచే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని తనివితీరా చూస్తోంది. చంద్రుడు ఒక్కడే రాలేదు, తనతో మరో నలుగురు విద్యార్థులను కూడా తీసుకు వచ్చాడు. తార అసహనంగా చూసింది. 


“అమ్మా వంటశాలలో మీకు ఏమైనా సహాయం చేయాలేమో అడిగిరమ్మన్నారు గురువు గారు” చెప్పాడు చంద్రుడు. 


“చంద్రా, కట్టెలు సరిపోవు అనుకుంటా, అలాగే విస్తర్లకు బాదం ఆకులు, చీపురుపుల్లలు కూడా సేకరించుకు రావాలి, నీ సహాధ్యాయులను ఆ పనికి పురమాయించు. నీవు వంటశాలలోని గుండిగలలో నీళ్లు నింపు” ఆదేశించింది తారాదేవి. చంద్రుడు చిరునవ్వుతో నీటి కడవ అందుకున్నాడు.


ఆమె బృహస్పతుల వారి అర్ధాంగి. అత్రి, అనసూయలు తమ కుమారుడు చంద్రుని విద్యాభ్యాసం కొరకు ఆశ్రమానికి తీసుకు వచ్చిన నాడే ఆతని మోహన రూపాన్ని చూసి మోహించింది. ఆరోజు నుంచి చంద్రుని దృష్టిని ఆకర్షించడానికి తార చేయని ప్రయత్నం లేదు.


కొన్ని రోజులు చంద్రుని విద్యాభ్యాసం సక్రమంగానే సాగింది. ఒకరోజు అనుకోకుండా సెలయేటి నుండి మడి వస్త్రాలతో నీళ్లు తీసుకువస్తున్న తారపై చంద్రుని దృష్టి పడింది. ఇంతవరకు అంతటి సౌందర్యరాశిని చూడనట్లుగా చూస్తుండిపోయాడు. ఎందుకో అటు వైపు చూసిన బృహస్పతి “అయ్యో తారా.. ఎవరి నైనా సహాయం పంపుతానుండు” అని కేకేశారు. వెంటనే గురువాజ్ఞ ప్రకారం చంద్రుడు ఆ నీటి కడవ అందుకుని, ఆశ్రమం వరకు చేరవేసి వచ్చాడు. తార తన ప్రేమను తెలియజేసింది. వెనువెంటనే ఆమె తన గురుపత్నీ అని కూడా చంద్రునికి తెలిసింది. కూడదన్నాడు. మహాపాపం అన్నాడు. ఆసరికే గురువుగారికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. 


రోజులు గడిచే కొద్దీ తార సౌందర్యం చంద్రుని నిలువనీయలేదు. ప్రేమను ప్రకటించడానికి ఒకటే దారి. తారా శశాంకులు ఇద్దరూ తమ ప్రేమను అదేవిధంగా ప్రకటించుకున్నారు. 


కాలక్రమంలో తారాచంద్రులు పూర్తిగా పరిసరాలను మరచిపోయారు. ఒకరొకరిగా అందరికి ఈ విషయం తెలిసింది. అప్పటికే తార గర్భవతి. దేవతలందరితో చర్చించి బ్రహ్మదేవుడు తారా శశాంకులను మందలించి, తారను దేవగురువు బృహస్పతికి అప్పగించాడు. 

తారకు కొడుకు పుట్టాడు. నామకరణ మహోత్సవానికి దేవతలందరూ హాజరైనారు. బృహస్పతి తార పక్కన కూర్చోబోయాడు. చంద్రుడు తానే పీటల మీద కూర్చుంటానని అన్నాడు. మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది. తారకు పుట్టిన కొడుకు ఎవరికి చెందినవాడో తేల్చాలని తారకే విడిచిపెట్టారు. తార “ఈ బిడ్డకు తండ్రి చంద్రుడే” అని ప్రకటించింది. తారతో కలిసి ఆ బిడ్డకు “బుధుడు” అని నామకరణం చేసి, తారను బృహస్పతి కి విడిచిపెట్టి, కొడుకును తనతో తీసుకుపోయాడు. తన తల్లిదండ్రులైన అత్రి, అనసూయలకు అప్పగించాడు. 


అనంతర కాలంలో చంద్రునికి దక్ష ప్రజాపతి అశ్విని  మొదలైన తన ఇరవై ఏడుమంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేసాడు. 


ప్రేమ ప్రకటించే విషయంలో తన, పర బేధం ఉండదని, ఎవ్వరిని లెక్క చేయదని ఆనాటి కాలానుగుణ స్వేచ్ఛను ఈ తారాశశాంకం తెలియజేస్తుంది.

***

No comments:

Post a Comment

Pages