బంగారు ద్వీపం - 29వ భాగం
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton
(నేలమాళిగలో జూలియన్, జార్జిలను పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు దొరికిన బంగారంపై ఘర్షణకు దిగుతారు. పైన సముద్రపు గట్టున ఉన్న డిక్, అన్నెలను కిందకు రమ్మని ఉత్తరం వ్రాయమని, లేదంటే కుక్కను కాల్చి చంపేస్తామని వాళ్ళు బెదిరించి, జార్జి చేత ఉత్తరం వ్రాయించి, అదే కుక్క చేత పైకి పంపిస్తారు. ఆ చీటిని చదివిన డిక్ ఆలోచనలో పడతాడు. తరువాత......)
@@@@@@
అతనలా కూర్చునే , ఆ చీటీ వైపు అయోమయంగా చూస్తున్నాడు.
"ఏమిటి విషయం?" అన్నె అసహనాన్ని చూపించింది.
"చూడు. 'జార్జినా' అన్న పేరుతో అకస్మాత్తుగా జార్జి సంతకం చేయటాన్ని నువ్వు చిత్రంగా అనుకోవటం లేదా?" నెమ్మదిగా అన్నాడు డిక్. "తనను ఆడపిల్ల అనిపించుకోవటాన్ని, ఆడపిల్ల పేరుని ఆమె ఎంత అసహ్యించుకుంటుందో నీకు తెలుసు. ఒకవేళ ఎవరైనా ఆమెను జార్జినా అని పిలిస్తే ఆమె బదులివ్వదని నీకు తెలుసు. కానీ ఆమె ఈ చీటీలో సంతకం చేసింది తనకు నచ్చని పేరుతో. ఇది నాకు చిత్రంగా అనిపిస్తోంది. అక్కడేదో ప్రమాదం జరుగుతోందని ఆమె మనను హెచ్చరిస్తున్నట్లుగా దాదాపుగా నాకు అనిపిస్తోంది."
"ఓ! మరీ అంత అవివేకిలా మాట్లాడకు డిక్!" అంది అన్నె. "ప్రమాదమేంటి? పద వెళ్దాం."
"అన్నె! ఈ దీవికి మరొకరెవరూ రాలేదని నిర్ధారించుకొందుకి, మనం ఉన్న ఈ తీరం రేవుని తనిఖీ చేయాలనుకొంటున్నాను" అన్నాడు డిక్. "నువ్వు ఇక్కడే ఉండు."
కానీ అన్నె అక్కడ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడలేదు. ఆమె తీరం చుట్టూ డిక్ తో పరుగెడుతూ, అతను చాలా తెలివితక్కువవాడని ఆమె భావిస్తున్నట్లు పదే పదే చెప్పసాగింది.
కానీ వారు చిన్న నౌకాశ్రయానికి చేరుకోగానే, అక్కడ మరొక పడవను వారు గమనించారు. అది అచ్చు వారి పడవ మాదిరే ఉంది. అది కూడా మోటారు బోటే! అంటే మరొకరు కూడా ఆ దీవిలో ఉన్నారన్నమాట!
"చూడు" డిక్ మెల్లిగా గొణిగాడు. "ఇక్కడ మరొకరు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ దీవిని కొనాలని చూస్తున్న వ్యక్తులే అని నా పందెం. వారు ఆ పాత పటాన్ని అధ్యయనం చేసి, ఇక్కడ బంగారం ఉందని తెలుసుకున్నారని నేను పందెం వేస్తున్నాను. వాళ్ళు జార్జి, జూలియన్ లను పట్టుకొన్నారని, మన నలుగురినీ ఆ నేలమాళిగలో ఒకే చోటికి చేర్చి, తాము బంగారాన్ని దొంగిలించేవరకు రహస్య ప్రదేశంలో బంధించి ఉంచాలనుకొంటున్నారు. అందుకే వాళ్ళు మనకి జార్జి చీటీని పంపేలా చేసారు. కానీ ఆమె మనని హెచ్చరించటానికి తాను ఎప్పుడూ ఉపయోగించని పేరుతో సంతకం చేసింది. ప్రస్తుతం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏమి చేయాలి?"
@@@@@@@@@@@@@@@
అన్నె చేతిని పట్టుకొని రహస్య ప్రాంతం నుంచి ఆమెను వేగంగా బయటకు లాగాడు డిక్. ఈ దీవికి వచ్చిన వాళ్ళు ఎక్కడినుంచైనా తమను గమనించవచ్చని అతను భయపడ్డాడు. ఆ పిల్లాడు తమ సామాన్లు ఉంచిన చిన్న రాతి గదికి ఆ పాపను తీసుకెళ్ళాడు. ఆ గదిలో వాళ్ళొక మూల కూర్చున్నారు.
"వచ్చిన వాళ్ళెవరో తలుపును పగలగొడుతున్న జార్జి, జూలియన్ లను చూసి ఉంటారని నాకు అనిపిస్తోంది" డిక్ ఆమె దగ్గర గొణిగాడు. "ఇప్పుడు నేనేమి చేయాలో తోచటం లేదు. మనం కింద ఉన్న నేలమాళిగలోకి వెళ్ళకూడదు. లేదంటే ఖచ్చితంగా మనం పట్టుబడతాం. హల్లో. . .టిం ఎక్కడకు వెళ్ళాడు?"
కుక్క కొద్దిసేపు వారితోనే ఉంది. కానీ ప్రస్తుతం అది నేలమాళిగ దగ్గరకు పారిపోయింది. అక్కడ మెట్లు దిగి అదృశ్యమైంది. తన యజమానురాలు ప్రమాదంలో ఉందని తెలుసు గనుక జార్జి దగ్గరకు తిరిగి కుక్క వెళ్ళిపోయింది. డిక్, అన్నె తెల్లబోయారు. అతను తమతో ఉన్నప్పుడు సురక్షితమని భావించారు. ప్రస్తుతం వెళ్ళిపోయినందుకు బాధపడ్డారు.
ఏమి చేయాలో వారికేమీ తోచటం లేదు. అప్పుడు అన్నెకి ఒక ఆలోచన వచ్చింది. "నాకు తట్టేదేమిటంటే" ఆమె చెప్పింది. "పడవలో మనం గట్టుకి తిరిగి వెళ్ళి ఎవరిదన్నా సాయం పొందుదాం."
"నేనూ అదే అనుకొన్నాను" డిక్ దిగులుగా చెప్పాడు. "కానీ రేవులోని ఆ ప్రమాదకరమైన రాళ్ళ మధ్య నుంచి పడవను నడపటం మనకు రాదని నీకు బాగా తెలుసు. పడవ ప్రమాదానికి లోను కావచ్చు; అంతేగాక పడవలో గట్టుకెళ్ళి, తిరిగి వెనక్కి నడుపుకొచ్చేటంత బలంగా మనం లేమని నా దృఢవిశ్వాసం. అయ్యో! ఏమి చేయాలో మనం గట్టిగా ఆలోచించాల్సి ఉంటుంది."
వాళ్ళు తమ మెదడులకు ఎక్కువ పదును పెట్టాల్సిన అవకాశం లేదు. ఆ వ్యక్తులిద్దరూ నేలమాళిగ నుంచి బయటకొచ్చారు. ఇద్దరు పిల్లల కోసం వేటను ప్రారంభించారు! టిం వెనక్కి రాగానే తన మెడలో చీటీ లేదని వాళ్ళు గమనించారు. కాబట్టి ఆ చీటీని యిద్దరు పిల్లలు తీసుకొన్నారని వాళ్ళకు అర్ధమైంది. కానీ జార్జి చీటీలో వ్రాసినట్లుగా కింద నేలమాళిగల్లోకి రావాలన్న కోరికను ఆ పిల్లలు ఎందుకు పట్టించుకోలేదో వాళ్ళ ఊహకు అందటం లేదు!
డిక్ వాళ్ళ మాటలను విన్నాడు. నిశ్శబ్దంగా ఉండమన్నట్లుగా అతను అన్నె భుజాన్ని నొక్కాడు. విరిగిన కమాను ద్వారంలోంచి అతను తాము ఉన్న చోటికి వ్యతిరేక దిశలో వెళ్తున్న ఆ వ్యక్తులను చూసాడు.
"అన్నె! మనం ఎక్కడ దాక్కోగలమో నాకు తెలుసు" ఉత్సాహంగా చెప్పాడా అబ్బాయి. "పాత బావి లోపల! మనం నిచ్చెన ఆధారంతో కొద్దిగా లోనికి దిగి అక్కడ దాక్కోవచ్చు. ఎవరూ అక్కడ వెతకరని నేను ఖచ్చితంగా చెప్పగలను."
అన్నె బావిలో కొద్ది దూరమైనా దిగటానికి ఏమాత్రం యిష్టపడటం లేదు. కానీ డిక్ బలవంతంగా ఆమెను లాగుతూంటే నిలబడక తప్పలేదు. వెంటనే అతను తొందర చేయటంతో వాళ్ళు కోటలోని మండువా మధ్యకు చేరారు. అదే సమయంలో ఆ వ్యక్తులు వీళ్ళని వెతకటానికి కోట అవతల వైపుకి వెళ్ళారు. ఆ కొద్ది సమయంలో వారు నూతి దగ్గర నిచ్చెన ఎక్కారు. డిక్ నూతి మీద చెక్క పలకను పక్కకు నెట్టి, అన్నె నిచ్చెన సాయంతో లోనికి దిగటానికి సాయపడ్డాడు. ఆమె భయంతో వణికిపోయింది. తరువాత అతను నిచ్చెన ద్వారా లోనికి దిగుతూ, చెక్క పలకను తనకు సాధ్యమైనంత వరకు తన తలపైకి లాక్కున్నాడు.
టిం జారిపడిన బావిలోని పాత రాతి పలక యింకా అలాగే ఉంది. డిక్ దానిపైకి దిగి పరీక్షించాడు. అది ఏమాత్రం కదలకుండా ఉంది.
"అన్నె! నువ్వు కూర్చోవటానికి ఇది సురక్షితమైనది. నీకు నిచ్చెన పట్టుకొని వేలాడటం యిష్టం లేకపోతే, దాని మీద కూర్చో!" అంటూ గుసగుసలాడాడు. అందువల్ల బావి గొట్టానికి అడ్డంగా ఉన్న రాతిపలకపై ఆమె కూర్చుంది. తాము పట్టుబడతామో, లేదో అన్న ఆందోళనతో ఆమె వణికిపోతోంది. వాళ్ళకి ఆ వ్యక్తుల మాటలు కొద్దిసేపు దగ్గరగా, కొద్దిసేపు దూరం నుంచి వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తులు గట్టిగా వీళ్ళని పిలుస్తున్నారు.
"డిక్! అన్నే! వాళ్ళిద్దరూ మిమ్మల్ని కోరుకుంటున్నారు! మీరు ఎక్కడ ఉన్నారు? మీ కోసం మా దగ్గర ఉత్తేజకరమైన వార్తలు ఉన్నాయి."
"సరె! ఆ విషయమేదో జూలియన్, జార్జిలే బయటకు వచ్చి ఎందుకు చెప్పనివ్వరు?" డిక్ గుసగుసలాడాడు. "తప్పేదో ఉంది. ఉందని నాకు తెలుసు. జూలియన్, జార్జి వద్దకు వెళ్ళి ఏమి జరిగిందో మనం తెలుసుకోవాలి."
ఇద్దరు వ్యక్తులు మండువా ప్రాంతానికి వచ్చారు. వాళ్ళకు కోపం వచ్చింది. "ఆ గుంట వెధవలు ఎక్కడ ఉన్నారు?" జేక్ అన్నాడు. "వాళ్ళ పడవ యిప్పటికీ రేవులోనే ఉంది. కాబట్టి వాళ్ళు దూరంగా వెళ్ళిపోలేదు. వాళ్ళు ఖచ్చితంగా యిక్కడే ఎక్కడో దాక్కున్నారు. మనం వాళ్ళ కోసం రోజంతా నిరీక్షించలేము."
"సరె! మనం కింద బంధించిన యిద్దరికి తినటానికి, తాగటానికి పట్టుకెడదాం" అవతలి వ్యక్తి చెప్పాడు. "ఆ చిన్న రాతి గదిలో చాలా ఉన్నాయి. అవి బహుశా పిల్లలు తెచ్చుకొని నిల్వ చేసుకొన్నవి అనుకుంటా! వాటిలో సగం ఈ యిద్దరు పిల్లల కోసం గదిలో వదిలేద్దాం. వాళ్ళ పడవను మాత్రం మనతో తీసుకుపోదాం. దానివల్ల వీళ్ళు తప్పించుకోలేరు."
"అలాగే!" జేక్ చెప్పాడు. "మనం సాధ్యమైనంత త్వరగా బంగారాన్ని తరలించాలి. మనం యిక్కడనుంచి సురక్షితంగా తప్పించుకొనేవరకూ పిల్లలు యిక్కడ బందీలుగా ఉండేలా చూసుకోవాలి. ఈ దీవిని కొనుగోలు చేయటానికి ప్రయత్నించటం గురించి మనం అంతగా బాధపడనక్కర్లేదు. కడ్డీలను పొందాలనే ఆలోచన మాత్రమే మనం కిర్రిన్ కోటను, ఈ దీవిని కొనాలనే ఆలోచనను కలిగించింది."
"సరె పద!"అతని సహచరుడు అన్నాడు. "ఇప్పుడు మనం ఆహారాన్ని కిందకు తీసుకెళ్దాం. మిగిలిన యిద్దరి గురించి ఆలోచించొద్దు. నేను కిందకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కనిపిస్తారేమో, ఇక్కడే ఉండి నువ్వు చూడు."
ఇవన్నీ విన్నప్పుడు డిక్, అన్నె ఊపిరి పీల్చటానికి కూడా సాహసించలేదు. ఈ వ్యక్తులు నూతిలోకి తొంగి చూడాలని ఆలోచించరని వాళ్ళెలా ఆశిస్తారు? ఒక వ్యక్తి చిన్న రాతి గదికి వెళ్తున్నట్లు వాళ్ళు విన్నారు. దిగువ నేలమాళిగలో ఉన్న ఇద్దరు ఖైదీలకు ఆహారం మరియు పానీయాలను అతను తీసుకొని వెళ్తాడన్నది సుస్పష్టం. అవతలి వ్యక్తి చిన్నగా ఈలలు వేస్తూ మండువా ప్రాంతంలోనే ఉండిపోయాడు.
దాక్కున్న పిల్లలకు చాలా సమయం తరువాత మొదటి వ్యక్తి తిరిగి వచ్చినట్లు అనిపించింది. తరువాత యిద్దరూ కాసేపు మాట్లాడుకొని చివరకు రేవుకి వెళ్ళారు. మోటారు బోటు బయల్దేరిన శబ్దాన్ని డిక్ విన్నాడు.
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment