'యుగము'నకు 'ఆది' 'ఉగాది!' - అచ్చంగా తెలుగు

'యుగము'నకు 'ఆది' 'ఉగాది!'

-సుజాత.పి.వి.ఎల్, 
సైనిక్ పురి, సికిందరాబాద్.




'యుగా'నికి 'ఆది' 'ఉగాది!'
మనకు చైత్రశుధ్ధ పాడ్యమి సంవత్సరాది పండగ దీనినే ఉగాది పండగ అనికూడా అంటున్నాము. దీనిని సంవత్సరాది అని కూడా అంటారు. ''యుగాది'' పదము యొక్క రూపాంతరము''ఉగాది'' యుగమునకు 'ఆది' కనుక యుగాది అనబడినది. బ్రహ్మ దేవుడు తన సృష్టి ప్రారంభించిన తొలి రోజుకు ప్రతీకగా ఉగాది పండుగను జరుపుకుంటున్నాము.
వర్తమాన కాలంలో ప్రపంచమందంతట ఏకీకృతంగా నున్న సంవత్సరాది జనవరి ఒకటవ తేదీ, కానీ ప్రపంచంలోని అన్ని దేశాలలో వారి వారి సంప్రదాయమును బట్టి ఉగాది పండుగ వేరు వేరు దినములలో జరుపుకుంటున్నారు.
మన భారతదేశంలోనే ఐదు విధములుగా వత్సరమానములు అమలునందున్నవి
చాంద్రమానవత్సరం : ఛైత్రశుద్ధపాడ్యమి నుండి 12 మాసములు లెక్కింపబడుచున్నవి. ఇందు 354 దినములుండును.
సౌరమాన వత్సరం : సూర్యుడు మేషరాశి లో ప్రవేశించినప్పటినుండి 12 రాసులు 12 మాసములుగా లెక్కింపబడుచున్నవి. దీనియందు 365 దినములుండును.
బార్హస్పత్యమాన వత్సరం: మేషాది రాశులయందు బృహస్పతి గమనము ననుసరించి గణించునది దీనిలో 361 దినములుండును.
సావనమాన వత్సరం : నెలకు 30 దినముల వంతున లెక్కింతురు. ఈ సంవత్సరమునందు 360 దినములుండును. యుగ మన్వంతాది విభాగ క్రమము తెలుసుకొనుటకు ఉపయోగింతురు.
నక్షత్రమాన వత్సరం : అశ్వని మొదలగు 27 నక్షత్రముల యందు చంద్రుని గతి ననుసరించి లెక్కింపబడును . ఈ 12 మాసములలో 324 దినములు మాత్రమే యుండును. కానీ విస్తారంగా మన దేశంలో అనుసరించుచున్నవి మొదటి మూడు మాసములు .
చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాసం శుక్ల పక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిధి ఉన్న రోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు. వసంత ఋతువు కావడం చేత చెట్లన్నీ కొత్త లేచిగుళ్లతో, పూల పరిమళాలతో ప్రకృతి అంతా పచ్చగా కళకళలాడుతూ, శోభాయమానంగా కనిపించే సుందర దృశ్యాలను చూసి కోయిలలు తన్మయత్వంతో కమ్మని స్వరాలాపన చేస్తూ ఉగాదికి స్వాగతం పలకడం అద్భుతం.
ఇక ఉగాది రోజు ప్రత్యేకం ఉగాది పచ్చడి.
వేపపువ్వు 'చేదు' , మామిడికాయ' వగరు', కొత్త బెల్లం' తీపి' , కొత్త చింతపండు 'పులుపు' , నల్ల మిరియాల'కారం' , ఉప్పు'కటువు'..ఈ షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఉగాది పచ్చడిని సేవించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని శాస్త్రాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా ఈ షడ్రుచుల సమభావదృష్టి గ్రహించే పరమార్థం ఏమిటంటే..మన జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలను, మంచి చెడులను సమంగా, సంతోషంగా ఎదుర్కోవాలని. కష్టమొచ్చినప్పుడు కృంగిపోకుండా, సంతోషానికి పొంగిపోకుండా రెండింటిని సమానంగా గ్రహించి మనుగడ సాగించాలనేదే ఇందులోని భావం.

****


No comments:

Post a Comment

Pages