చ్యవనుడు – సుకన్య
నాగమంజరి గుమ్మా
“రాకుమారీ, అటువైపు పోవద్దు. మార్గం సుగమంగా లేదు. మన భటులు ఇటు వైపు పొదలు, లతలు నరికి మార్గం చేశారు. అయినా మీకు ఇదేం సరదా.. హాయిగా పూలతలతో , ఫలభరిత వృక్షాలతో, చంద్రకాంత శిలలతో నిండిన ఉద్యానవనంలో విహరించక ఈ అరణ్య విహారం ఏమిటమ్మా…” హెచ్చరిస్తూ… అంతలోనే ఆందోళనతో నిట్టూర్చింది ప్రధాన చెలికత్తె మాలతి.
కిలకిలా నవ్వింది సుకన్య. “మనచేతులతో తీర్చిదిద్దిన మొక్కల మధ్య అందం ఆనందం ఏమిటీ… ఇచ్ఛ వచ్చినట్లు పెరిగిన ఈ అరణ్య అందం చూడు…” బదులిచ్చింది సుకన్య.
“అమ్మా మీరు ముచ్చట పడే హరిణాలు, మయూరాలు, చిలుకలు, గోరువంకలు, ఇవన్నీ మన రాజోద్యానవనంలో ఉన్నాయి కదమ్మా…” అటు ఇటు పరుగులు పెడుతున్న రాకుమారిని అనుసరించలేక వగరుస్తూ అంది మాలతి.
“పైగా ఇక్కడ గజములు, వ్యాఘ్రములు, సివంగులు, జంబుకములు మొదలైన క్రూరమృగములు కూడా సంచరిస్తూ ఉంటాయి దేవీ…” చెప్పింది మాలతి.
“ఆయుధ ధారులైన భటులు ఉన్నారు కదా” తూనీగలను , సీతాకోకచిలుకలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పింది సుకన్య.
“అమ్మా.. అటు పాముల పుట్టలున్నాయి. ఇటు రండి” బతిమాలింది మాలతి.
“ఉండవే.. ఇక్కడ మిణుగురు పురుగులు ఉన్నాయి. ఎంత బావున్నాయో… కాసిని చేతితో పట్టి తీసుకు వస్తాను.”
“అరె, అదేమిటి, ఈ పుట్టలో ఏదో మెరుస్తూంది. “ గబగబా చేతి కందిన రెండు పుల్లలను తీసుకుని ఆ మెరుపులను పొడిచి తీయబోయింది.
“హా…. దైవమా… బాధ.. నొప్పి… నా కన్నులు… అయ్యో… “ అనే ఆర్తనాదాలు వినిపించినవి. ఆ జ్యోతుల కనిపించిన ప్రదేశము నుండి నెత్తురు ధారలు స్రవించసాగినవి.
నిర్విణ్ణురాలైంది సుకన్య. ఆమె చెలికత్తెలు త్వర త్వరగా ఆమెను తీసుకుపోయి రథంలో కూర్చోబెట్టారు. సాయుధులైన భటులు వెంటారాగా అక్కడ నుండి రాజ్యానికి బయలుదేరారు.
రాజభవనం చేరుకునేసరికి అక్కడ అంతటా అల్లకల్లోలం గా ఉంది. అదురుతున్న గుండెలతో అంతఃపురంలో అడుగుపెట్టింది చెలికత్తెలతో కూడి సుకన్య. మహారాజు శర్యాతి కూడా అంతఃపురంలోనే ఉన్నారు. మహారాణి తీవ్ర వేదన అనుభవిస్తున్నట్లుంది. ఆమె యే కాదు, యావత్ పరివారజనుల ముఖాల్లో ఏదో బాధ. ఏమైందని తండ్రిని ప్రశ్నించింది. ఒక ఘడియ కాలం నుంచి అందరికి మలమూత్ర బంధన మయినట్లుగా, రాచ కుటుంబం, పరివారమే కాకుండా రాజ్య ప్రజలందరూ కూడా ఇదే అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా రాచవైద్యులు తెలియజేసారు. అకస్మాత్తుగా ఈ పరిణామం ఎలా సంభవించిందో తెలియక అయోమయానికి గురౌతున్నారు. సుకన్యకు తాను చేసిన పని గుర్తుకు వచ్చి, తండ్రిగారికి విన్నవించింది.
శర్యాతి మహారాజు ఉన్న ఫళాన అరణ్యానికి బయలుదేరాడు. ఇంతకు ముందు సుకన్యతో వెళ్లిన పరివార భటులు మహారాజును అనుసరించి వెళ్లి, ఆ పుట్టను చూపారు. పరీక్షగా చూసాడు మహారాజు. కడవల కొద్దీ నీళ్లు తెప్పించి పుట్టపై పోయించాడు. పుట్ట కరిగిపోయి ధ్యాన నిమగ్నుడైన ముని కనిపించాడు. ఆయన నేత్రాల నుండి నెత్తురు ధారలై స్రవిస్తోంది.
“మహాత్మా! నేను శర్యాతిని. అపర బ్రహ్మవలె అలరారుతున్న తమరెవ్వరు? ఇంతకు ముందు పుట్టలో నుంచి జ్ఞాన జ్యోతులై వెలుగుచున్న మీ నేత్రద్వయాన్ని మిణుగురులనుకొని అపచారం చేసిన బాలిక నా కుమార్తె. అజ్ఞానంతో చేసిన తప్పిదంగా భావించి మన్నించవలసిందిగా వేడుకుంటున్నాను.” అని చేతులు జోడించి ప్రార్ధించాడు శర్యాతి మహారాజు.
“మహారాజా… నేను భృగు మహర్షి సుతుడను. చ్యవనుడు నాపేరు. చిరకాలంగా తపమాచరించుటచే చుట్టును చెదలు పుట్టలు పెట్టినవి. నీ కూతురు తెలియక చేసినను, తెలిసి చేసినను దోషము దోషమే, ఆమె చేసిన తప్పిద ఫలితమే మీ రాచ కుటుంబానికి, రాజ్య ప్రజలకు మల, మూత్ర, ఆపానవాయు దిగ్బంధనము. పాపానికి ఫలితం అనుభవించక తప్పదు” అని చెప్పాడు చ్యవన మహర్షి
మహారాజు పరిపరి విధాల అపచారాన్ని మన్నించి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు చ్యవన మహర్షి శాంత చిత్తుడై ఉండి తన చూపు పోవడం వల్ల తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా, అపరాధి శర్యాతి కుమార్తె సుకన్య కనుక, ఆమెను తనకిచ్చి వివాహం జరపమన్నాడు. శర్యాతి విచార మనస్కుడై రాచ భవనానికి తిరిగి వచ్చాడు.
చూస్తూ చూస్తూ రాకుమార్తెను వృద్ధుడు, అంధుడు అయిన చ్యవనమహర్షికి ఇచ్చి వివాహం చేయడానికి మనస్కరించ లేదు. కానీ రాజ్య ప్రజల కష్టాన్ని చూడలేక పోతున్నాడు. శర్యాతి సంకోచాన్ని గమనించిన సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారము జరిగిందని ఆ అపచార నివృత్తి చ్యవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారానే తీరుతుందని, తన వివాహం చ్యవన మహర్షితో జరపమని, తండ్రితో చెప్పింది.
విధిలేని పరిస్థితిలో చ్యవనమహర్షికి సుకన్యను ఇచ్చి వివాహం జరిపించారు శర్యాతి దంపతులు. వివాహం జరిగాక తండ్రి ఇస్తానన్న చీని చీనాంబరాలను, మణిమయ నగలను, పరిచారికలను వద్దని చ్యవన మహర్షి ఆశ్రమానికి నార చీరలు కట్టుకొని చేరుకున్నది. పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకొంటున్నది.
ఇలా కాలము గడుచుచుండగా ఒక రోజు సుకన్య నదికి నీరు తెచ్చు కోవడానికి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళ్ళుతున్న అశ్వనీ దేవతలు సుకన్యని చూసి “ఎవరీ నవయవ్వన సుందరాంగి” అని అనుకొని పరిచయం అడిగారు. సుకన్య తాను చ్యవన మహర్షి భార్యనని చెప్పింది. అప్పుడు వారు “మేము అశ్వనీ దేవతలము, దేవ వైద్యులము. నిత్య యవ్వనులము. ఆ గుడ్డి మునితో కాలం గడిపే బదులు మాతో వచ్చి సర్వసుఖాలు అనుభవించ”మని కోరారు. దానికి సుకన్య అంగీకరించక పాతివ్రత్య ధర్మాన్ని తెలుపుతుంది.
అశ్వనీ దేవతలు ఒక పరీక్ష పెట్టదలచి “వృద్ధుడు, అంధుడు అయిన చ్యవన మహర్షిని తీసుకు వస్తే వైద్యశక్తులతో తమ వలే నవయవ్వనుడిని చేస్తా”మన్నారు. సుకన్య ఆ విషయం చ్యవన మహర్షికి తెలుపగా చ్యవన మహర్షి అందుకు అంగీకరించాడు. చ్యవనమహర్షితో కలిసి అశ్వినిదేవతలు నదిలో మునిగారు. పైకి తేలిన వారిని చూసి సుకన్య ఆశ్చర్యపోయింది. ఆ ముగ్గురు చూడడానికి ఒకే విధంగా నవయవ్వనంలో ఉన్నారు. “మా ముగ్గురిలో నీ భర్త ఎవరో పోల్చుకుంటే ఇచ్చేస్తామని, లేదంటే తమలో ఒకరిని తప్పక వివాహం చేసుకో వలసిందని” చెప్పారు అశ్వినిదేవతలు. మళ్ళీ నీటిలో మునిగి లేచారు. సుకన్య పోల్చుకోలేకపోయింది.
జగన్మాతని ప్రార్థించింది. దేవతలు అనిమిషులు. రెప్పపాటు ఉండదు, పోల్చుకోమని జగదాంబ చెప్పింది. ఆ ప్రకారమే సుకన్య పరిశీలించి చ్యవనుని గుర్తించిది. అశ్వనీ దేవతలు కూడా సంతోషించి తమకు సెలవు ఇవ్వమని చ్యవన మహర్షిని కోరారు. చ్యవన మహర్షి తనకు యవ్వనమును, దృష్టిని ప్రసాదించిన కారణమున అశ్వనీదేవతలను ఏదైన వరము కోరుకోమన్నాడు. అప్పుడు అశ్వనీదేవతలు తమకు యజ్ఞయాగాదులలో సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ సోమరస పానం కావాలని కోరుకున్నారు. వారి అభీష్టం సిద్దించేలాగున వరమిచ్చాడు మహర్షి చ్యవనుడు.
అశ్వనీదేవతలకు యజ్ఞయాగాదులలో సోమరస పాన అర్హత కల్పించగలిగిన మహర్షికి తన వృద్ధాప్యం, అంధత్వం పోగొట్టుకోవడం ఒక లెక్క కాదు. కానీ తపశ్శక్తిని స్వీయ అవసరాలకు, చిన్న చిన్న కార్యక్రమాలకు వినియోగించడం సరికాదు. అలాగే తన వల్ల జరిగిన తప్పును సరిదిద్దుకోడానికి సుకన్య వెనుకంజ వేయలేదు. ఆరోగ్యం, యవ్వనం, అందం కలిగిన అశ్వినిదేవతలు వచ్చి ఆశ చూపినా పతివ్రతాధర్మం చెప్పి, మెప్పించి , వరముగా తన భర్తను యవ్వనవంతునిగా మార్చుకోగలిగింది.
సత్యమైన నిత్యమైన ప్రేమకు మరోరూపం సుకన్య, చ్యవనుల కథ. ఈ కథను చదివిన వారికి అశ్వినిదేవతల కరుణ కలుగుతుందని అంటారు.
(సశేషం)
No comments:
Post a Comment