దొరకినయప్పుడేతుదగాక - అచ్చంగా తెలుగు
demo-image

దొరకినయప్పుడేతుదగాక

Share This

 దొరకినయప్పుడేతుదగాక

ఆచార్య  తాడేపల్లి పతంజలి


tr


రేకు: 0355-02  సం: 04-322

పల్లవి: దొరకినయప్పుడే తుదగాక

మరుగకుమెన్నడు మరి మనసా

చ.1: తనుభోగంబుల దనిపినపిమ్మట

వెనుకొని హరిదడవేనంటే

దినమును దను నింద్రియములచల మిది

తనియుట యెన్నడు దగు మనసా

చ.2: తిరమగునాసల దీరినపిమ్మట

తెరలి విరతి బొందే నంటే

మరలని యాశామయ మీచిత్తము

విరతి యెన్నడిక వెడ మనసా

చ.3: ముదిసినపిమ్మట మొగి శ్రీవేంకట -

సదయు గొలుతు నిచ్చలునంటే

హృదయము శ్రీవేంకటేశునినెల విది

యిదిగనుటెన్నడు యీమహి మనసా


భావం

పల్లవి:

ఓ మనసా !దొరకినయప్పుడే గట్టెక్కాలి.( ఎంతోఅదృష్టమయిన మానవ జన్మ దొరికింది.ఇప్పుడే స్వామి అనుగ్రహంతో మోక్షమనే గట్టెక్కాలని భావం)

లౌకిక భోగాలను ఎన్నడు మరుగకుము.

చ.1:

శరీర భోగములతో  తృప్తి పొందిన పిమ్మట ఆ తర్వాత శ్రీ హరి భక్తిని గూర్చి ఆలోచిస్తానంటే అది సాగదు. ఎందుకంటే ప్రతిరోజు శరీరముతో ఇంద్రియముల పంతము  కొనసాగుతుంది.( శరీరము ఇంద్రియవశమని భావం)

ఓమనసా! ఇక  తృప్తి  కి ఆస్కారమేముంది? (  తృప్తి  పడలేమని భావం)

చ.2:

స్థిరమగు ఆశలు తీరినపిమ్మట తరువాత విశ్రాంతి పొందుతానంటే అది సాగదు.

ఎందుకంటే ఏనాటికి మరలని ఆశలతో ( తీరని ఆశలతో ) కూడినది ఈ చిత్తము.

అల్పమైన మనసా !ఇక ఆ ఆశలనుంచి విశ్రాంతి ఎప్పుడు?  (ఆశలనిగ్రహం అవసరమని ప్రబోధం)

చ.3:

ముసలివాడయిన పిమ్మట మరలా  శ్రీవేంకటేశ్వరుని నిత్యము కొలుస్తానంటే కుదరదు.

ఈ  హృద  యము శ్రీవేంకటేశుని స్థానము.

ఓ మనసా !ఈ భూమిలో   హృద  యాన్ని కనుగొనుటెన్నడు ?( హృదయంలో ఉన్న శ్రీ వేంకటేశుని కనుగొనుటకు  ముసలితనం వచ్చేటంతవరకు ఆగకూడదని నిరంతరం ధ్యానిస్తుండాలని ప్రబోధం)

***

Comment Using!!

Pages