దురాశ - అచ్చంగా తెలుగు

 దురాశ

 పి.యస్.యమ్. లక్ష్మి




పిల్లలూ, మీకివాళ ఒక పాత కధ చెప్తాను.  ఈ కధ తరతరాలనుంచీ అమ్మమ్మలూ, నాన్నమ్మలూ పిల్లలకి చెప్తూ వస్తున్నారు.  పిల్లలు కూడా ఈ కధల ద్వారా కొన్ని మంచి గుణాలు నేర్చుకుంటున్నారు.  అసలు ఇంత పాత కధ వెదికి తీసుకొచ్చి మీకెందుకు చెప్తున్నానో తెలుసా?  మొన్న డిసెంబర్ లో హైదరాబాద్ లో బుక్స్ ఎగ్జిబిషన్ జరిగింది కదా. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా నేను మీ కోసం ఒక కొత్త కధల పుస్తకం ప్రచురించాలని అనుకున్నాను.  నేను రాసిన కధలు ఎక్కువ లేవు  ..  కానీ పుస్తకం మాత్రం వెయ్యాలనే బలమైన కోరికతో నేను రాసిన కధలు కొన్నీ, మా అమ్మమ్మ నాకు చెప్పిన కధలు కొన్నీ కలిపి "అమ్మల కధలూ .. అమ్మమ్మల కధలూ" అనే పుస్తకం వేశాను.  కొందామనుకున్నవారందరికీ చెప్పాను.  ఇందులో మా అమ్మమ్మ నాకు చెప్పిన కధలు కొన్ని వున్నాయి. అవి తరతరాలనుంచి అందరి ఇళ్ళల్లో పెద్దవాళ్ళు చెబుతున్నవే, మీరు చూసుకుని మీకా కధలు తెలియవంటేనే తీసుకోండి అని.  ఆశ్చర్యమేమిటంటే చాలా మందికి ఆ కధలు తెలియవు, కొందరికి తెలిసినా సరిగా గుర్తులేవు. పిల్లలకయితే అసలే తెలియవు.  మళ్ళీ ఒకసారి పూర్తి కధ చదువుతామని తీసుకున్నారు పుస్తకం చూసిన తల్లిదండ్రులు కూడా. అందుకే ఈ కధ మళ్ళీ మీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను....


రచయిత ఎవరో తెలియదు.  కధ ప్రస్తుతం నా మాటలలో...


చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో చంద్రయ్య అనే ఒకతను వుండేవాడు.  ఆ కాలంలో ఈ చదువులూ, ఈ ఉద్యోగాలూ లేవు కదర్రా.  డబ్బులు సంపాదించటానికి అప్పటి మార్గాలు అప్పుడు వుండేవి.  వ్యవసాయం, వర్తకం, కూలి పనులూ వగైరా.  ఈ చంద్రయ్య తన గ్రామానికి (ఊరికి) సమీపంలో వున్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్మి, ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు.  ఆ కాలంలో మరి ఈ గ్యాస్ స్టౌలు, ఎలక్ట్రిక్ స్టౌలు కాదు కదా, వీటికి ముందున్న కిరోసిన్ స్టౌలు (మీరు చూశారా) కూడా వుండేవి కాదు.  వంట కట్టెలమీద, బొగ్గుల మీదే చేసేవారు.


చంద్రయ్య వెళ్ళే అడవిలో ఒక నది కూడా పారుతూ వుండేది.  అప్పుడు నదులలో నీరు చాలా స్వఛ్ఛంగా వుండేది.  చంద్రయ్య ఆ నది  నీళ్ళల్లో కాళ్ళు, చేతులు కడుక్కుని మధ్యాహ్నం భోజనం చేసేవాడు, ఆ నది నీరు తాగేవాడు.  ఆ రోజు చంద్రయ్య నది పక్కనే వున్న ఒక ఎండి పోయిన చెట్టుని కట్టెల కోసం కొట్టసాగాడు.  చెట్టు గట్టిగా వుండటంతో గొడ్డలితో కొంచెం బలమైన దెబ్బలు వెయ్యసాగాడు. గొడ్డలి ఎలా వుంటుందో మీకు తెలుసు కదా.  ఒక కర్ర చివర పదునుగా వున్న ఇనప ముక్కకి చిల్లి చేసి తొడుగుతారు.  ఆ ఇనప ముక్క చివర సన్నగా, బాగా పదును తేరి వుంటుంది.  దానితో ఎటువంటి వస్తువునైనా నరకవచ్చు.  చంద్రయ్య బలంగా కొట్టటంతో గొడ్డలి చెయ్యి జారి చెట్టు పక్కనే వున్న నది నీటిలో పడ్డది.  చంద్రయ్య వెంటనే నదిలోకి దిగి గొడ్డలి కోసం వెతికాడు, కానీ కనబడలేదు.  దానీతో ఆ నది ఒడ్డునే దిగులుగా కూర్చున్నాడు.  తనకి మళ్ళీ వెంటనే ఇంకో గొడ్డలి కొనుక్కునే స్తోమత లేదు.  కట్టెలు కొట్టి అమ్మక పోతే భార్యా, పిల్లలకి భోజనం పెట్టలేడు.  ఎలాగా అని ఆలోచిస్తూ వుండటంతో అతనికి తెలియకుండానే అతని కళ్ళనించి నీరు కారసాగింది.


చంద్రయ్య దిగులుగా కూర్చోవటం ఆ నదీ దేవత చూసింది.  (మన సంప్రదాయం ప్రకారం నదులని మన కల్మషాలని దూరం చేసే దేవతల కిందే చూస్తాము, పూజిస్తాము).  వెంటనే ఆవిడ  చంద్రయ్య ఎదుట ప్రత్యక్షమై "ఎందుకు చంద్రయ్యా, అంత దిగులుగా వున్నావు"  అని అడిగింది. 


చంద్రయ్య ఆశ్చర్యంగా ఆ దేవతని చూసి, "అమ్మా, మీరెవరు? ఇంతకు ముందెప్పుడూ మిమ్మల్ని ఇక్కడ చూడలేదు"  అని అడిగాడు.


దానికి ఆ నదీ దేవత "నేను ఈ నదీ దేవతని.  రోజూ నిన్ను చూస్తూనే వుంటాను.  ఎప్పుడూ అలుపెరగకుండా పని చేసేవాడివి, ఇవాళ ఎందుకిలా కూర్చున్నావు?"  అని అడిగింది.


 "ఏమి చెప్పనమ్మా నా దురదృష్టం.  కట్టెలు కొడుతూ వుంటే నా గొడ్డలి జారి నీళ్ళల్లో పడిపోయింది.  వెతికినా దొరకలేదు.  కట్టెలు తీసుకెళ్ళి అమ్మక పోతే మా ఇంట్లో వాళ్ళకి భోజనం వుండదు.  పిల్లలు ఆకలికి వుండలేరు.  ఎలాగా అని ఆలోచిస్తున్నాను"  అన్నాడు.


 "ఒక్క క్షణం ఆగు" అని నదీ దేవత నీళ్ళల్లో మునిగి ఒక బంగారం గొడ్డలి తీసుకు వచ్చింది.


"ఇదిగో నీ గొడ్డలి తీసుకో" అంటూ.  చంద్రయ్య ఆ గొడ్డలి చూసి "ఇది నాది కాదమ్మా," అని తీసుకోలేదు.  "సరే, వుండు"  అంటూ ఆ దేవత మళ్ళీ నీళ్ళల్లో మునిగి ఈ మారు వెండి గొడ్డలి తీసుకువచ్చింది.  కాన చంద్రయ్య అది కూడా తనది కాదని, తనకి తన గొడ్డలి దొరికితే చాలన్నాడు.  ఆ దేవత మళ్ళీ నీళ్ళల్లో మునిగి, ఈ మారు చంద్రయ్య గొడ్డలి తీసుకు వచ్చింది.  చంద్రయ్య సంతోషంగా దానిని అందుకుని, ఆ దేవతకి అనేక నమస్కారాలు చేశాడు, తన గొడ్డలి తనకి వెతికి ఇచ్చినందుకు.  ఆ దేవత కూడా సంతోషించి మిగిలిన రెండు గొడ్డళ్ళు కూడా చంద్రయ్యకిచ్చి, వాటిని అమ్మి, ఆ డబ్బుతో సుఖంగా జీవించమని చెప్పింది.  చంద్రయ్య నిజాయితీ అతని కుటుంబానికి మంచి జీవితాన్నిచ్చింది.


 చందయ్య వుంటున్న ఇంటి దగ్గరే సోమయ్య అనే వ్యక్తి అతని కుటుంబంతో జీవిస్తున్నాడు. అతను కూడా కట్టెలు కొట్టుకునే జీవించేవాడు.  అయితే సోమయ్య బద్ధకస్తుడు.  ఎప్పుడూ పని ఎగ్గొట్టే మార్గం ఆలోచిస్తూ వుంటాడు.  అతను అకస్మాత్తుగా చంద్రయ్య ధనవంతుడవటం చూశాడు. ఆరాటం ఆగదుకదా.  విషయం తెలుసుకున్నాడు. తను కూడా ధనవంతుడు అయిపోవాలనుకున్నాడు.   మర్నాడు  గొడ్డలి తీసుకుని ఆ నది ఒడ్డున వున్న చెట్టుని కొట్టటం ప్రారంభించాడు.  కొద్ది నిముషాలు కొట్టి, తనే గొడ్డలి నీళ్ళల్లో పడేటట్లు విసిరేశాడు.  కొంచెం సేపు గొడ్డలి కోసం వెతికినట్లు వెతికి ఒడ్డున కూర్చుని ఏడవసాగాడు.  దేవతలు కరుణా మూర్తులు.  నదీ దేవత సోమయ్య దుఃఖం చూసి ఏమయిందో పాపం అని వచ్చి విషయం అడిగింది. 


ఇంకేముంది, సోమయ్య విజృంభించి, తన కష్టాలన్నీ చెప్పేసి, తన గొడ్డలి తన కిప్పించమన్నాడు.  నమ్మిన నదీ దేవత నీళ్ళల్లోకెళ్ళి, చంద్రయ్యని పరీక్షించినట్లే ఇతన్ని కూడా పరీక్షించటానికని బంగారం గొడ్డలి తీసుకొచ్చి "ఇదేనా, నీ గొడ్డలి?" అని అడిగింది.  సోమయ్యకి బంగారం గొడ్డలిని చూడగానే ఎక్కడలేని ఆశ పుట్టింది.


ఆది కాదంటే దేవత వెళ్ళి ఏ ఇనప గొడ్డలో తెచ్చిస్తే తన గతేంకాను, అని అత్యాశతో ఆ బంగారం గొడ్డలి తనదేనని చెప్పాడు.  దేవత ఆగ్రహించి "అత్యాశతో నువ్వు అబద్ధం చెప్పావుగనుక నీకు ఏ గొడ్డలీ లేదు" అని మాయమయిపోయింది.  పాపం సోమయ్యకి బంగారం గొడ్డలి రాలేదు సరికదా వున్న గొడ్డలి కూడా పోయింది.


మా అమ్మమ్మ ఇంతే చెప్పేదర్రా.  ఇప్పటి కధల్లోలాగా నీతి అని ట్యాగ్ పెట్టి చెప్పేది కాదు.  అలా చెప్పాలని అమ్మమ్మకి తెలుసో లేదో నాకు తెలియదు.  కానీ మళ్ళీ నన్నే అడిగేది, ఈ కధ ద్వారా ఏం నేర్చుకున్నావ్ అని.  మరి పిల్లలూ, మీరు కూడా ఏం నేర్చుకున్నారో చెప్పండి.


***

No comments:

Post a Comment

Pages