ఖడ్గతిక్కన - అచ్చంగా తెలుగు

 ఖడ్గతిక్కన

అంబడిపూడి శ్యామ సుందరరావు 



మనకు తిక్కన పేరుతో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు మొదటి వారు మహా భారతాన్ని ఆంధ్రీకరించిన తిక్కన సోమయాజి రెండవారు 13 వ శతాబ్దానికి చెందిన వీరుడు ఖడ్గ తిక్కన లేదా రణ  తిక్కన ఆంధ్ర వీరులలో  ఖడ్గతిక్కన బాగా ప్రసిద్ధుడు  ఆతని పరాక్రమ జీవితము పల్లెపదములందును చాటు పద్యముల ద్వారా  ప్రచారం లో ఉండటం చే చాలా కాలం నుండి తెలుగు వారు ఇతనిని    స్మరించు కుంటున్నారు  ఇతడు నియోగి బ్రాహ్మణుడు. సిద్ధనామాత్యునకు పోలమాంబకు  జన్మించిన  ఏడుగురు కుమారులలో పెద్దవాడు. 
ఖడ్గ తిక్కన 1190లో జన్మించాడని ఆరుద్ర చారిత్రక, సాహితీ ఆధారలను పరిశీలించి నిర్ణయించాడు. ఈయన గౌతమస గోత్రికుడు  ఈయన కవి తిక్కన సోమయాజి పెద తండ్రి అయిన సిద్ధన మంత్రి కుమారుడు  కేతన రచించిన దశకుమార చరిత్రలో ఖడ్గ తిక్కన వంశాన్ని చాలా వివరంగా వర్ణించాడు. ఖడ్గ తిక్కన ఇంటి పేరు కొట్టరువు. ఖడ్గ తిక్కన తాత అయిన భాస్కర మంత్రికి  నలుగురు కుమారులు: పెద్దవాడు కేతన ప్రగ్గడ, రెండవవాడు మల్లన, మూడవవాడు సిద్ధన, చివరి వాడు కొమ్మన. తిక్కన సోమయాజి తండ్రి కొమ్మన. ఖడ్గతిక్కన తండ్రి సిద్ధన చోడ తిక్కరాజుకు మంత్రిగా పనిచేశాడు. సిద్ధన మంత్రి ఏడుగురు కుమారులు: ఖడ్గతిక్కన, భాస్కరుడు, కేతన, మల్లన, మల్లన, చిన భాస్కరుడు, పెమ్మన. వీరందరూ నెల్లూరి చోడుల ఆస్థానంలో పని చేసిన వారు ఖడ్గ తిక్కన భార్య జానమ్మ. వీరికి సిద్ధన, కొమ్మన, ఉమ్మడి మనుమసిద్ధి, ముమ్మడి మనుమసిద్ధి అని నలుగురు కుమారులు

ఖడ్గతిక్కన బాల్యమున సంస్కృతాంధ్ర భాషలభ్యసించి రాజనీతి శాస్త్రంలో . ధనుర్విద్యలో  ప్రావీణ్యం సంపాదించి  ఆ కాలములో  ప్రసిద్ధులైన  నెల్లూరు రాజ్యమును పాలించుచున్న మనుమసిద్ధి నృపాలుని వద్ద సేనానాయకుడుగ నుండి అతడు గడించిన విజయము లన్నింటికి తానే  ఆధారమయ్యెను.  ఖడ్గతిక్కన యింత ప్రసిద్ధు డగుటకు ఆతని తల్లియు వీరమాతయు నగు పోలమాంబ స్తన్య ప్రభావమని వేఱుగా చెప్పనవసరం లేదు  ఖడ్గతిక్కన కేవలదండ నాయకుడుగ నుండి కులాచారాలు విడనాడిన వాడు కాదు . ఇతడు వేద గాన లోలుడు. బ్రాహ్మణ కుటుంబ పోషకుడు. దానకర్ణుడు   కేతన కవి ఈ మహావీరుని గుణ గణాలను చాలా  మనోహరముగా  ప్రశంసించి యున్నాడు. ఆయన  ఖడ్గ తిక్కనను ఆంధ్ర పరశురాముడని ప్రశంసించాడు 

కనిగిరి సీమలోని ఎర్రగడ్డ పాడు యాదవ రాజైన కాటమరాజుకు,మనుమసిద్ధికి పుల్లరి విషయమై వైరం వస్తుంది. అది చివరకు యుద్ధానికి దారితీస్తుంది.మనుమసిద్ధి రాజు , తన సర్వసైన్యాధక్షుడైన ఖడ్గతిక్కన ను  కాటమరాజుపై యుద్ధానికి సైన్యంతో సహా పంపాడు. సా.శ. 1260 ప్రాంతాల్లో ఖడ్గతిక్కనకు, కాటమరాజుకు పెన్నా నది ఒడ్డున సోమశిల వద్ద భీకర యుద్ధం జరిగింది. ఖడ్గతిక్కన వీరోచితంగా పోరాడి, సైన్యాన్నంతా పోగొట్టుకుంటాడు. కాటమరాజు ఖడ్గ తిక్కనను   సమీపించి "బ్రాహ్మణోత్తమా! యుద్ధము  మానుకొనుము. బ్రాహ్మణుల చంపిన మాకు బ్రహ్మ హత్య పాతకం వచ్చును. అగ్రవర్ణులగు మీరు మాతో బోరుట న్యాయం కాదు. మమ్ము గోపింపక సంగర (యుద్ధ)యత్నము మానుకొను" మని ప్రార్థించి విడిచిపెట్టెను. ఖడ్గతిక్కన చేయునది లేక గుఱ్ఱము నెక్కి నెల్లూరి కేగి సైన్యముతో రాదలంచి గృహాభిముఖు డయ్యెను మంచములోనున్న సిద్ధానా మాత్యుడు తన కుమారుడు పారిపోయి  వచ్చాడని తలంచి "ఛీ పాఱుబోతా! తుచ్ఛ మగు ప్రాణము కాశపడి యిల్లు చేరిన నిన్ను జూచిన పాపం వచ్చు"నని ఖడ్గతిక్కన అని  చీత్కరించుకున్నాడు . తండ్రి యొక్క  తిరస్కారము చే ఖడ్గతిక్కన హృదయము కలత చెందెను యుద్ధంలో ఓడిపోయి ఇంటికి వచ్చిన ఖడ్గ తిక్కనకు తన తల్లి నుండి కానీ, భార్య నుండి కానీ ఆశించిన పలకరింపు దొరకలేదు. ఆయన భార్య ఒక నులక మంచం అడ్డం పెట్టి రెండు బిందెల నీళ్ళు, ఒక పసుపు ముద్ద పెట్టి స్నానం చేయమని చెప్పింది. ఖడ్గ తిక్కన అవి ఎందుకు అన్నపుడు ' మీరు ఆడువారి వలె యుద్ధం లో ఓడి పారిపోయి వచ్చారు. ఆడవారు స్నానం చేయుట ఎవరూ చూడరాదు అందుకే నులకమంచం అడ్డుగా పెట్టినాను. మీ ముఖానికి రాసుకొనుటకు ఆ పసుపు ముద్ద. ఇకనుండి ఈ ఇంటిలో నేను, మీ తల్లిగారు, మీతో కలసి ముగ్గురు ఆడవాళ్ళమూ అన్నది. భార్య మాటలకు సిగ్గుపడి ఎలాగో స్నానం చేసి భోజనం చేసాడు. చివర తన తల్లి ఇచ్చిన విరిగిపోయిన పోయిన పాలు చూసి 'అమ్మా పాలు విరిగిపోయాయి ' అన్నాడు. ఆ మాటలకు అతని తల్లి 'నాయనా నువ్వు శత్రురాజులతో యుద్ధం చేయలేక కత్తి పారవేసి పిరికివాడిలా పారిపోయి నడుము విరిగిన వాడివి అయితివి, అది చూసి పశువుల నడుములు కూడా విరిగినవి. అందుకే పాలు కూడా విరిగినవి ' అన్నది.

భార్య తల్లి మాటలు విన్న ఖడ్గ తిక్కన పౌరుషంగా యుద్ధభూమికి తిరిగి వెళ్లి వీరమరణం పొందుతాడు మంచములోనున్న సిద్ధానా మాత్యుడు   కుమారుని వీర మరణవార్త వినినంతన యానందబాష్పములు విడుచుచు బరలోక మలంకరించెను. ఆయన తల్లియగు ప్రోలమాంబ కుమారుని శిరము ముద్దాడి యిప్పటికి వీరమాత ననిపించు కొంటిని అని ప్రాణములు విడిచెను. చానమ్మ భర్తతల నొక కాష్ఠమునందుంచి తానును నందుజొచ్చి సర్వజన ప్రశంసాపాత్రురాలై కీర్తి వహించెను ఆ  యుద్ధంలో చివరకు ఎవరు గెలిచారనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు ఈ యుద్ధాన్ని గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఖడ్గతిక్కన గుఱ్ఱంపై వచ్చి పెద్ద అరుపులతో కాటంరాజు సైన్యంపై దూకాడని ఆ తాకిడికి శత్రువులు పలాయనం చిత్తగించారని ఒక గాథ ఉంది. ఇంకొక గాథలో ఖడ్గతిక్కన యుద్ధంలో మరణించాడని వేములవాడ భీమకవి ఆతనిని బ్రతికించాడు అని  అందువల్ల అతనికి సిద్దయ్య తిక్కన అనే పేరు వచ్చిందని మరియొక గాథ ఉంది. 1260 దాకా అంటే 70 యేళ్ళ వయస్సు దాక తిక్కన మనుమ సిద్ది ఉన్నాడని కొంత మంది చరిత్రకారులు చెబుతారు కానీ చాలా మంది చరిత్రకారులు 1260లో కాటమ రాజుతో జరిగిన యుద్ధంలో మరణించాడని చెబుతారు సోమశిల వద్దనున సోమేశ్వరుని దేవాలయం మంటపం ఎదురుగా ఒక వీరుని విగ్రహం ఉంది. అది ఖడ్గతిక్కన విగ్రహం అని అంటారు. పట్టపురాయి వద్దనున్న తిక్కాపూరులో మరియొక సైనికుడు గుఱ్ఱంపై చిత్రించి ఉంది. ఇదికూడా రణ తిక్కనదే నని  అక్కడి ప్రజలు చెబుతారు.


***

No comments:

Post a Comment

Pages