క్రొత్తనీరు (ఐదవభాగం ) - అచ్చంగా తెలుగు

క్రొత్తనీరు (ఐదవభాగం )

Share This

 క్రొత్తనీరు (ఐదవభాగం )

 టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర. 




"సమీర పెళ్లి విషయంలో ఏమంటుందిరా?"

ఆ రోజు ఉదయం పద్మ తమ్ముడికి ఫోన్ చేసి అడిగింది.


"సమయం దొరికినప్పుడల్లా  అందరం దానికి పెళ్లి చేసుకోవాలని బోధిస్తున్నాము!ఏదీ!ఏమీ తేల్చిచెప్పటం లేదు!"చెప్పాడు రామకృష్ణ.


"సరే!ఏం చేస్తాం!ఆ ఘడియ ఎప్పుడొస్తుందో?.. ఇక్కడ చిన్నదానికి ఏమీ తోచటంలేదు!అక్క ఎప్పుడొస్తుందని ఒకటే నస.బెంగ పెట్టుకుంది !రెండురోజుల్లో సమీరను హైదరాబాద్ పంపించు!"

అంది పద్మ.


"చిన్నదాని మీద ఎందుకు చెప్తావ్!కూతురు మీద నీకు,బావగారికే బెంగ ఎక్కువ!పంపిస్తాలే!"అన్నాడు రామకృష్ణ నవ్వుతూ.


ఆ సాయంత్రం సమీరను తీసుకొని గుడికి వెళ్ళింది సరళ.

వీళ్ళు గుడిలోకి అడుగుపెట్టంగానే సరస్వతి, ప్రణయ్ కనిపించారు. ప్రణయ్ ని చూడంగానే సమీర కళ్ళు మెరిశాయి.ఆరోజు గుడిలో సామూహిక పారాయణం జరుగుతోంది.ఆడవాళ్ళందరూ మంటపంలో కూర్చుని ఉన్నారు.వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చుంది సరళ. గుడిలో ప్రదక్షణ చేసి ప్రణయ్ దగ్గరికి వచ్చింది సమీర.

 ఇద్దరూ కలిసి మరో మంటపంలో కూర్చున్నారు.


"ఉభయ గోదావరి జిల్లాల్లో నీళ్ల కరువు లేదు కదా! రైతులకు నష్టాలు ఎందుకు వస్తున్నాయి?"అడిగింది సమీర


 "మీరు గమనించలేదేమో! దాదాపు ప్రతి సంవత్సరం నవంబర్లో బంగాళాఖాతంలో తుఫాన్లు వస్తూ ఉంటాయి. వాటి తాకిడికి మా జిల్లాల్లో పంటచేలు మునిగిపోతూ ఉంటాయి. నష్టం అపారంగా ఉంటుంది అయినా సరే రైతులు ధైర్యంతో వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నారు."


" ఈ సమస్యకు పరిష్కారం లేదనుకుంటా!"


" రుణమాఫీలు,రైతుబంధు పథకాలు ఉన్నా కూడా సరిపోవు సమీరా! కళ్లాల్లో ధాన్యం ఆరబోస్తారు రైతులు. వానొస్తే చాలు! ధాన్యం అంతా తడిసిపోతుంది! ప్రతి ఊళ్ళోనూ ధాన్యం కోసం షెడ్డులు కడితే కొంత ఉపయోగం!ప్రభుత్వం  కంటితుడుపు చర్యలు కాకుండా శాశ్వతంగా లబ్ధి చేకూర్చే పనులు చేయాలి! ఏ ప్రభుత్వం చేస్తుంది చెప్పండి! గోదావరి జిల్లాల్లో లంక గ్రామాలు ఎక్కువ.. పెద్ద వాన వస్తే వాగులు పొంగుతాయి! లంక గ్రామాలు దిగ్బంధం అయిపోతాయి! ప్రజలకు ఏమీ దొరకదు!మరీ దారుణం ఏమిటంటే వైద్య సహకారం అస్సలు ఉండదు..గర్భిణీ స్త్రీలను సైతం చిన్న చిన్న టైర్ల మీద కూర్చోబెట్టి నీళ్లలో తోసుకుంటూ మండల కేంద్రంలో ఉన్న హాస్పిటల్స్ కు తీసుకొని వస్తారు! సమయానికి అక్కడ నర్సు,డాక్టరు ఉంటే బతుకు!.. లేదంటే చావు!..ఇలా చెప్పుకుంటూ పోతే పల్లెటూళ్లల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి! పట్టణాల్లో బ్రతుకుతూ 'నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష 'అనుకునేవాళ్లే ఎక్కువ మంది!..పల్లెటూళ్లని బాగు చేసుకోవాలని ఎవరు ఆలోచిస్తారు?పల్లెలన్నీ పాడుబడి పోవడానికి ఇదొక కారణం!దీనివల్ల దేశ ప్రగతి కుంటుపడుతుంది !కల్కి సినిమాలో కాలనీల్లాగా సిటీలు ఉంటాయి! సామాన్య జనం ఆకలితో, పేదరికంతో అలమటిస్తూ ఉంటారు!భరించలేనంత జనాభా నగరాలను ముంచుతూ ఉంటే చివరకు పల్లె అన్నది  కనిపిస్తుందా?... " ఆగాడు ప్రణయ్.


 "నిజమే!  సిటీలో ఉన్న సౌకర్యాలు ఇక్కడ ఉండవు! పెద్ద చదువులు చదవటానికి కాలేజీలు,ఉద్యోగాలు చేయడానికి కంపెనీలు,ఏమైనా సరే ఉపాధి అవకాశాలు ఇక్కడతక్కువే!మరి ప్రజలు పల్లెలకు తిరిగి రావాలంటే ఇక్కడ ఆదాయం తగినంతగా ఉండాలి! మీలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు వెనక్కు వస్తే మాత్రం ఏం ఒరుగుతుంది?ప్రజల్లో చైతన్యం అంత త్వరగా వస్తుందా?"



 "అస్సలు చైతన్యం లేదని కాదు!ఉంది సమీరగారూ!అయితే అది చాలా తక్కువ శాతం మాత్రమే!నాకు ఇక్కడే ఉండి సక్సెస్ తెచ్చుకోవాలని ఉంది!పోయిన సంవత్సరం దాకా నేను ఒక్కడినే! ఇప్పుడు చందు వచ్చాడు! రేపు ఇంకొకరు రావచ్చు! ఆశావహదృక్పథాన్ని ఎందుకు వదిలేయాలి?నా చిన్నప్పుడు మేడల మీద చెట్లు పెంచేవారు కాదు.. అందరూ మేడల మీద చాప వేసుకొని పడుకునేవాళ్లు. ఇప్పుడు చూడండి! అందరివి న్యూక్లియర్ ఫ్యామిలీస్.చాలామంది మిద్దెతోట పెంపకం శ్రద్ధగా చేస్తున్నారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ పెరిగింది. వాళ్లు పండించుకున్న కూరగాయలే తింటున్నారు. ఆర్గానిక్ ఫుడ్స్ కి గిరాకీ పెరిగింది.రైతులు వీటితో లాభాలు పొందుతున్నారు.దేశవాళీ ఆవుల పెంపకం మెల్లమెల్లగా ఊపొందుకొంటోంది.ఆవులను రక్షించుకోవాలనే తపన ఎక్కువ అవుతోంది.మన దేశం గురించి, మన సంస్కృతి గురించిన శ్రద్ధ పెరుగుతోంది.ఇంతకుముందు లాగా విదేశాలంటే గంగ వెర్రులెత్తటం లేదు. ఆ మోజు కాస్త కాస్త తగ్గుతోంది.మీ మామయ్య లాంటి ఆయుర్వేద వైద్యులకు డిమాండ్ పెరిగింది. మెల్లమెల్లగా మనుషుల్లో మార్పు వస్తోంది.ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం ఆహారపుటలవాట్లు మార్చుకొనే జనాభా ఎక్కువవుతోంది. మూలికా వైద్యానికి కూడా గుర్తింపు వస్తోంది.కొంతమంది వాటినే పెంచుకుంటున్నారు.ఇప్పుడు మన పల్లెల్లో స్వయం ఉపాధి అవకాశాలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. "

 ప్రణయ్ వివరణ వింటూ ఆలోచిస్తోంది సమీర.


' చదువుకున్న వాళ్ళల్లో  ప్రణయ్ లాగా ఎంతమంది ఆలోచిస్తారు?'


" నేను ఒక విషయం గమనించాను!"అన్నాడు ప్రణయ్. 


"ఏమిటది?" కించిత్తు ఆసక్తిగా అడిగింది సమీర.


" నేను మాట్లాడుతుంటే మీరు మీ ఆలోచనల్లో మునిగిపోతూ ఉంటారు!"నవ్వాడు ప్రణయ్.


 "మీరు చెప్పిన విషయాల గురించే ఆలోచిస్తున్నాను!"అంటూ తను కూడా నవ్వింది సమీర.


గుడిలో పారాయణ పూర్తయింది.హారతి ఇస్తున్నాడు పూజారి.ఇద్దరూ లేచి వెళ్లారు.


" ఎల్లుండే హైదరాబాద్ వెళుతున్నావట కదా!"సమీరని అడిగింది సరస్వతి.


"అవునత్తయ్యా!అమ్మని వదిలి ఎప్పుడూ ఇన్ని రోజులు ఉండలేదు!"


 సమీర అంత తొందరగా హైదరాబాద్ వెళుతుందంటే ప్రణయ్ కు నిరుత్సాహంగా ఉంది.


" రేపు అందరూ మా ఇంటికి భోజనానికి రండి సరళా!రామకృష్ణ పనుందంటాడేమో కుదరదని చెప్పు!తప్పకుండా రావాలి! "అంటూ మాట తీసికొంది సరస్వతి.


"సరే!"నంటూ గుడి నుండి ఇంటికి వచ్చారు సరళ, సమీర.



మర్నాడు పదకొండు గంటలకు  రామకృష్ణ భార్య,పిల్లల్ని, సమీరను తీసుకొని ప్రణయ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు.

వరప్రసాదరావు,రామకృష్ణ వరండాలో కూర్చుని కబుర్లలో పడ్డారు. సరళ వంటింట్లోకి చొరబడి సరస్వతితో మాట్లాడుతూ కొరవ సవర పని చేస్తోంది. అక్కడ సమీరకు ప్రణయ్ కనిపించలేదు. కొద్దిగా నిరుత్సాహంగా అనిపించింది.

పుస్తకాలు చూద్దామని మేడ పైకి వచ్చింది.పుస్తకాల రాకులు వెదికి' అమరావతి కథలు' తీసుకొని వరండాలోని ఉయ్యాల మీద కూర్చుంది.

కాసేపటికి అడుగుల సవ్వడి వినిపించింది.

 ప్రణయ్..

 సమీర ముఖం విప్పారింది.


"మీరు ఇంత పాత పుస్తకాలు చదువుతారనుకోలేదు!" అక్కడున్న కుర్చీమీద కూర్చున్నాడు ప్రణయ్.


 నవ్వింది సమీర.


 "చిన్నప్పటినుండి నాకు పుస్తకాలు చదవటం మా నాన్నే అలవాటు చేశారు.. గ్రాంథిక పుస్తకాల నుంచి చదివించారు! మా చెల్లెలు అయితే పుస్తకం ముట్టదు.. దానికి టీవీ,సెల్ ఫోన్ ఉంటే చాలు!"


" మనలాంటి వాళ్ళు ఇప్పుడు తక్కువ!మా స్నేహితులు చదువుతారు కానీ ఎక్కువగా ఇంగ్లీష్ మాత్రమే! తెలుగు భాష దాదాపుగా కనుమరుగవుతోంది!తెలుగు భాష కోసం గట్టిగా ప్రయత్నించాలి! ఖాళీ దొరికితే నేను మీ వరుణ్, వికాస్ లాంటి పిల్లల్ని పట్టుకొని తెలుగు పద్యాలు నేర్పిస్తూ ఉంటాను! ఇక్కడ మా బంధువులమ్మాయి రాధ ఆన్ లైన్ ద్వారా మీ హైదరాబాదులో ఉండే పిల్లలకు తెలుగు పాఠాలు నేర్పిస్తోంది!"


"అయితే ఇప్పుడు కూడా తెలుగు నేర్చుకునే వారు ఉన్నారన్నమాట!"


"ఎందుకు లేరు?సంఖ్య తక్కువ కావచ్చు కానీ ఉన్నారు!తెలుగు పద్యాలు రాసే వాళ్ళు కూడా ఉన్నారు!"


"మీరు హైదరాబాదు ఎప్పుడన్నా వస్తుంటారా? "


"ఎందుకు రాను?.. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను! వచ్చే నెలలో రావాలి!మా స్నేహితుడి చెల్లెలు పెళ్లి ఉంది!"


"మీరు హైదరాబాదు వస్తే మా ఇంటికి తప్పకుండా రండి!నాకు ఫోన్ చేయండి!"అంటూ తన ఫోన్ నెంబర్ ప్రణయ్ కి ఇచ్చింది సమీర.


ఇద్దరూ  మాట్లాడుకుంటూ ఉంటే   భోజనాలకు పిలుపు వచ్చింది. అందరూ సరదాగా భోజనం చేశారు. సాయంత్రం నాలుగు అవుతుంటే కాఫీలు త్రాగి  ఇంటికి బయలుదేరతామంది సరళ. సమీరకు చీర పెట్టింది సరస్వతి.సరస్వతీ,వరప్రసాదరావుల పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకుని సమీర.

  అందరూ ఇంటికి వచ్చారు.

ఇంటికి రాగానే ప్రణయ్ దగ్గర్నుంచి మెసేజ్ వచ్చింది.


"మీ కోసం ఉప్పాడ నుండి చీర తెచ్చాను! నా సెలక్షన్ ఎలా ఉందో చెప్పండి!"


సమీర బుగ్గలు ఎర్రబడ్డాయి.

లేత గులాబీ రంగు చీరమీద బ్లూ కలర్ ఆకులు, లతలు.మెత్తగా ఉంది చీర.


" చాలా చాలా బాగుంది!"అంటూ మెసేజ్ పెట్టింది సమీర.


(సశేషం )

No comments:

Post a Comment

Pages