క్రొత్తనీరు (ఆరవ భాగం )
రచన :టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
ఆ రోజు ఆదివారం. సమయం ఉదయం పది గంటలు. బద్ధకంగా ప్రక్క మీద దొర్లుతోంది మాళవిక.
మిత్ర దగ్గర్నుంచి కాల్ వచ్చింది.
"మల్లీ!అమ్మను,నాన్నను తీసుకొని హైదరాబాద్ వచ్చాను.అంకుల్ ఫ్రీగా ఎప్పుడు ఉంటారో చెప్పు!ఇంటికి తీసుకొని వస్తాను!మా అమ్మా,నాన్న అంకుల్ ని ఆంటీ ని చూడాలనుకుంటున్నారు!"
"తప్పకుండా రండి!అమ్మ నాన్న ఖాళీగానే ఉన్నారు...."
అంటూ అడ్రస్ చెప్పింది మాళవిక.
"నాన్నా!మిత్ర వాళ్ళ అమ్మానాన్నల్ని తీసుకొని ఇంకో గంటలో వస్తున్నాడు!"
అని కేక పెట్టి బాత్రూంలో దూరింది.
ఒక గంటకి వసంత,నాగరాజు, మిత్ర వచ్చారు.ఒక బుట్ట నిండుగా పళ్ళు తీసుకొని వచ్చారు.కుశల ప్రశ్నలు అయ్యాయి.
"చాలా సంతోషం నాగరాజూ! పిల్లలిద్దరూ ప్రయోజకులయ్యారు. మీ కష్టం ఫలించింది!"
మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు వాసుదేవరావు.
రెండు చేతులు జోడించాడు నాగరాజు.
"మీవంటి పెద్దవారి ఆశీర్వచనం!అంతా ఆ దేవుడి దయ బాబుగారూ!మీరు మాకు ఎంతో సహాయం చేసేవారు... మేము ఆ రుణం తీర్చుకోలేము! అమ్మాయిగారి పెళ్లి కుదిరితే చెప్పండి!అన్ని ఏర్పాట్లు మావాడు చేస్తాడు!.." వినయంగా చెప్పాడు నాగరాజు.
"తప్పకుండా!వరంగల్ లో ఉన్నప్పుడు మీరు మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చి చేసేవాళ్లు!ఇప్పుడు మీ అబ్బాయి చేస్తాడన్నమాట!... గుడ్..గుడ్.. బాగుంది!" అన్నాడు వాసుదేవరావు నవ్వుతూ.
"కాఫీలు తెస్తానంటూ "లేచింది నీరజ.
మాళవిక,మిత్ర రూములో కంప్యూటర్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నీరజ వెనకాలే వంటింట్లోకి వచ్చింది వసంత. నీరజను స్టవ్వు ముట్టుకోనివ్వకుండా తనే కాఫీలు పెట్టింది.
ఆ మాట ఈ మాట మాట్లాడుతూ పనిమనిషి బోర్లించిన గిన్నెలు సర్ది పెట్టింది.
"బజారులో పనుందని "లేచాడు నాగరాజు.
"మీరు పని ముగించుకొని రండి!నేను కాసేపు అమ్మగారి దగ్గర ఉంటాను!"అంది వసంత.
"సరే!నీ యిష్టం!"అంటూ మిత్రా, నాగరాజు బయటికి వెళ్లారు.
వసంత చకచకా మిగిలివున్న వంటపని పూర్తిచేసింది.
వంటింట్లో ఆల్మరాల్లో డబ్బాలు తీసి తుడిచి కొత్త కాయితాలు వేసి పెట్టింది.
గబగబా ఫ్రిజ్ తుడిచిపెట్టింది.
నీరజకు సంతోషం వేసింది.
కొడుకు రెండు చేతులా సంపాదిస్తున్నా కూడా వసంతలో ఏమీ మార్పు రాలేదు.. చిన్నప్పుడు ఎలా తమ ఇంట్లో వంట పనికి వచ్చినప్పుడు ఎలా చేసేదో అలాగే చేస్తుందిప్పుడు కూడా.
"సొంత ఇల్లు ఏమన్నా కొనుక్కున్నారా వసంతా!"
అని అడిగింది నీరజ.
"అపార్ట్మెంట్ ఒకటి కొన్నాడమ్మా!నాకు నానుతాడు, గాజులు,నెక్లెస్ కూడా చేయించాడు!"
అంటూ మెరుస్తున్న కళ్ళతో చేతుల గాజులు, మెడలోని మంగళసూత్రం చూపించింది వసంత.
" అప్పుడప్పుడూ హైదరాబాదు వచ్చినప్పుడు వస్తూ ఉండు!"
"అలాగేనమ్మా ఎప్పుడన్నా వంట పనికి కావాలంటే ఫోన్ చేయండమ్మా!వరంగల్ నుండి ఎంతసేపట్లో వస్తాను! ఒక్కదాన్నే బయలుదేరి రాగలను!..." అంటూ "ఎలాగూ వచ్చాను కదా!బాబుగారికి మైసూర్ పాకు ఇష్టం కదా!చేయమంటారా!" అంటూ శెనగపిండి డబ్బా తీసింది వసంత.
"ఈయన ఇప్పుడు స్వీట్లు తినడం లేదులే!అమ్మాయి తింటుంది!కొంచెంగా చెయ్యి!..." గబగబా స్వీట్ చేసి డబ్బాలో సర్దింది వసంత.సాయంత్రానికి కావలసిన కూరలు తరిగిపెట్టింది. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే మిత్ర వచ్చాడు.
"ఇంక వెళ్తామంటూ!" బయలుదేరింది వసంత.
వసంతకు బొట్టు పెట్టి జాకెట్ పీస్ పెట్టింది నీరజ.మిత్రా, వసంత వెళ్లారు.
ఆ పూటంతా వసంత పనితనాన్ని పొగుడుతూనే ఉంది నీరజ.
ఆ రోజు సాయంత్రం సమీర మాళవికకు ఫోన్ చేసింది.
"హైదరాబాదుకు వచ్చేసావా!ఏమిటి విశేషాలు?" అడిగింది మాళవిక.
"వచ్చేసాను!రేపు ఆఫీసుకు వస్తాను మధ్యాహ్నం కలుద్దాం.!"
"ఈ రోజు మిత్రా వాళ్ళు వచ్చారు సమీరా! రేపు మధ్యాహ్నం నాతో పాటు లంచ్ కి మిత్ర వస్తానన్నాడు.. నిన్ను పరిచయం చేస్తాను!"
"ఓకే!.కలుద్దాం!ఫోన్ పెట్టేసింది సమీర.
కాఫటేరియాలో సమీర, మాళవిక మిత్త్ర కూర్చున్నారు.
ప్రణయ్ గురించి చెప్పింది సమీర.
"ఇంట్రెస్టింగ్! ఎమ్మెస్ చేసిన వాడు వ్యవసాయం చేస్తున్నాడా! చూడాలి హీరోని!.. " అన్నాడు మిత్ర.
"ఈ నెలాఖరికి తన ఫ్రెండు సిస్టర్ పెళ్లి ఉందన్నాడు ప్రణయ్.హైదరాబాద్ వస్తున్నాడు!"
"నాక్కూడా రెండు మూడు వెడ్డింగ్ ఈవెంట్స్ ఇక్కడే ఉన్నాయి!ప్రణయ్ వాళ్ళ ఫ్రెండ్ సిస్టర్ వెడ్డింగ్ ఎక్కడా?" అడిగాడు మిత్ర.
"అడిగి చెప్తాను! అంటూ ప్రణయ్ కు ఫోన్ చేసింది సమీర.
"అమీర్ పేటలో కమ్మ సంఘం.."
"ఓ!... నేను ఆ పెళ్లి ఈవెంట్ చేస్తున్నాను!పెళ్లి కూతురు పేరు సంపంగి...."
ప్రణయ్ కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసికొని ఫోన్ మిత్ర కిచ్చింది సమీర.
మిత్ర ప్రణయ్ తో మాట్లాడాడు.
"నైస్ పర్సన్!.. కలుద్దాం!"అన్నాడు మిత్ర.
మళ్ళీ ప్రణయ్ ని కలుస్తున్నందుకు ఆనందంగా ఉంది సమీరకు.
మిత్ర పరిచయం ఈ రోజే అయినా అతడితో మాట్లాడుతుంటే పాత స్నేహితుడితో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది సమీరకు.
***
హైదరాబాద్ వచ్చాడు ప్రణయ్.
పెళ్లిలో మిత్ర,ప్రణయ్ కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. ప్రక్క రోజు కాఫటేరియాలో సమీర, మాళవికల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు ప్రణయ్, మిత్రలు.
కాసేపటికి సమీర, మాళవిక అక్కడికి వస్తూ కనిపించారు.
సమీరను చూపు తిప్పుకోకుండా చూస్తున్నాడు ప్రణయ్.
కారణం సమీర కట్టుకున్న చీర...అది ప్రణయ్ గిఫ్ట్ గా ఇచ్చింది..సాధారణంగా కొన్ని చీరలు చూస్తే బాగుంటాయి.కంటికి బాగున్న చీరలు ఒక్కోసారి ఆడవాళ్లు కట్టుకుంటే వాళ్ళ ఒంటిమీద అంతగా బాగుండవు.. ఈ చీర అలా కాదు..చీర బాగుందో లేక అది సమీర కట్టుకోవడం వలన అందం వచ్చిందో చెప్పటం కష్టం!...మొత్తానికి సమీర కొత్త వెలుగుతో మెరిసిపోతుంది.
కాసేపు కులాసా కబుర్లు చెప్పుకున్నారు మిత్రులు.
" ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? " సమీరను అడిగాడు ప్రణయ్.
"రెజ్యూమ్స్ పంపిస్తున్నాను! ...నౌకరీ, లింక్ డిన్ లలో పెట్టాను చూడాలి!ఇది కాక ప్రక్కన సెల్ఫ్ గా చేసే బిజినెస్సులు ఏమన్నా ఉన్నాయేమో చూస్తున్నాను!... తక్కువ పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ ఒకటి కనిపిస్తోంది...ప్రస్తుతానికి ఇండియాలో పెద్ద మార్కెటింగ్ ఉంది దానికి..అయితే దానికి వంటలో ట్రైనింగ్ తీసుకోవాలి!..."
" స్వీట్స్ హాట్స్ వరకు చేయండి సమీరా! నేనే ఆర్డర్ ఇవ్వగలను!నేను చేసే పెళ్లిళ్లలో మగపెళ్లి వారికిచ్చే సారె లో స్వీట్స్,హాట్స్ కూడా మేమే సప్లై చేస్తున్నాము! మీరు చేస్తానంటే కాంటాక్ట్ ఇవ్వడానికి నేను రెడీ!... "
అన్నాడు మిత్ర.
"ఎలాగూ జాబ్ పోతుంది కాబట్టి నాకు ఎక్కువ పని లేదు.. ఒక పూట వెళ్లి ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాను!ప్రణయ్ ని చూశాక నాకు ఈ ఆలోచన వచ్చింది..ఇంట్లో ఊరికే కూర్చోకుండా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ చూడాలి!"
"గుడ్ గుడ్! కొంచెం శ్రమ అయినా తృప్తి మాత్రం చాలా వస్తుంది. నష్టం లేని బిజినెస్ మనకు!."
అని
"ప్రణయ్! మీరు నా ఈవెంట్స్ కు నూనె,నెయ్యి పంపిచగలరా!" అడిగాడు మిత్ర.
"పంపిస్తాను!కానీ ఈ గారూ...మీరూ..తీసేయాలి!నెలకు ఎంతెంత కావాలో ముందే చెప్పాలి!"
నవ్వారు మిగిలిన మిత్రులు.
"ఈరోజు నాకు ఖాళీ!ఈ పూట ఏం చేద్దాం!...... పోనీ మీరిద్దరూ ఆఫీసులకు హాఫ్ డే సెలవు పెడితే కారు మాట్లాడుకుని ఎక్కడికైనా వెళ్లి వద్దామా!"ఆడపిల్లల్ని ఉద్దేశించి చెప్పాడు మిత్ర.
మిత్ర మాటలకి ఆడపిల్లలు ఇద్దరూ మొహాలు చూసుకున్నారు
"రాత్రి ఎనిమిది లోపల ఇల్లు చేరాలి.!.. ఒకవేళ లేట్ అయితే అమ్మా వాళ్ళు కంగారు పడతారు!.."
డౌట్ గా అంది మాళవిక.
"ఇప్పుడు రెండు కూడా అవలేదు.దగ్గరగా అయితే యాదగిరి గుట్టకు వెళ్లి రావచ్చు! డోంట్ వర్రీ!"అన్నాడు మిత్ర.
కాసేపటికి అందరూ 'యాదగిరిగుట్టకు వెళదాం' అనుకున్నారు.
ఆడపిల్లలు ఎవరి పేరెంట్స్ కు వాళ్ళు 'ఫ్రెండ్స్ తో యాదగిరిగుట్టకు వెళుతున్నామని, రాత్రికి భోజనానికి వస్తామని' మెసేజ్ పెట్టారు.
కారులో నలుగురు బయలుదేరారు.
ప్రణయ్ ప్రక్కన ప్రయాణం సమీర మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలుకు చేస్తోంది. ఆరోజు వర్కింగ్ డే అవ్వడంతో దేవాలయంలో రష్ ఎక్కువగా లేదు.
దైవదర్శనం చేసుకుని మంటపంలో కూర్చున్నారు మిత్రులు. మాళవిక, మిత్ర 'ప్రసాదం తెస్తామని' వెళ్లారు.
సమీర, ప్రణయ్ మిగిలారు.
" చీర బావుంది!"ప్రణయ్ మెచ్చుకోలుకు మురిపెంగా నవ్వింది సమీర.
" మీరు ఏ రోజు ప్రాక్టీస్ చేసిన వంటలని ఆరోజు రెసిపీ చూపిస్తూ వీడియో తీయించి యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి!అందరికీ తెలుస్తుంది!"
సలహా ఇచ్చాడు ప్రణయ్.
"మీరు..గారూ..తీసేయాలి మరి!అప్పుడే మీ సలహా వింటాను!"
నవ్వాడు ప్రణయ్.
"సరే నన్ను కూడా పేరు పెట్టి పిలవాలి!"
మిత్ర మాళవిక ప్రసాదాలు తీసుకొని వచ్చారు. అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. సరదాగా మాట్లాడుకుంటూ అందరూ రాత్రికి హైదరాబాద్ చేరారు.
***
క్లౌడ్ కిచెన్ పెట్టుకోవటానికి ట్రైనింగ్ కు వెళ్తానంది సమీర.
పద్మకు ఇదంతా అనవసరమైన పని అనిపిస్తుంది.
'హాయిగా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసుకుంటే ఏ రొస్టు లేదు కదా!' అనే భావన ఆమెది..
కానీ సమీర ఒప్పుకోలేదు.
తల్లిని కూర్చోబెట్టి,'క్లౌడ్ కిచెన్ 'అంటే ఏమిటో దాన్ని సక్సెస్ ఇండియాలో ఎలా ఉందో చెప్తూ మాళవిక ఫ్రెండ్ మిత్ర చేసే వెడ్డింగ్ ఈవెంట్స్ కి స్వీట్స్ సప్లై చేయమన్నాడని దానివలన నష్టం రాదని' సర్ది చెప్పింది.
"ఖాళీగా ఉండే బదులు అమ్మాయిని తనకి ఇష్టమైన పని ఏదో ఒకటి చేసుకోమని చెప్పు! మళ్ళీ ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం వస్తే చేరవచ్చు!"అని రఘురామ్ కూడా సమీరను సపోర్ట్ చేశాడు.
నలుగురు మిత్రులు మాట్లాడుకుంటూ తమ పనులు తాము చేసుకుంటున్నారు.
రెండు నెలలు గడిచాయి.
సమీర ఫుడ్ లైసెన్స్, జి. ఎస్. టి. లైసెన్సు, లేబర్ లైసెన్సు తీసికొంది.
యు ట్యూబ్ లో చూసిన వాళ్ళు కొందరు అర్థర్లు ఇస్తున్నారు.
ఇంట్లో పనివాళ్ళు తిరుగుతూ ఉంటే పద్మకు చికాగ్గా ఉంటుందని ఇంటికి దగ్గర్లో ఉన్న రెండు గదుల పోర్షన్ ఒకటి అద్దెకు తీసికొంది సమీర.మొదట ఇద్దరు పనివాళ్ళను పెట్టుకుంది.మాళవిక,మిత్ర, మిత్రా వాళ్ళ పేరెంట్స్ ప్రారంభానికి వచ్చారు. నాగరాజు బంధువుల్లో వంటవాళ్ళే ఎక్కువమంది ఉన్నారు. అందులో కొంచెం అనుభవం ఉన్న రమణయ్య అనే అతడిని సమీర దగ్గర పనిలో పెట్టాడు. అంతా సెట్ చేసుకునే సరికి సమీరకు ఆ నెల్లో ఏభై వేలు అయ్యింది.
ఫంక్షన్ల డేట్స్ చెప్పి, ఎన్ని కేజీలు స్వీట్స్, ఎన్ని కేజీలు హాట్స్ కావాలో చెప్పాడు మిత్ర.
ప్రణయ్ మిత్ర ఈవెంట్సుకే కాకుండా సమీర కిచెనుకు కూడా నెయ్యి, నూనెలు సప్లై చేస్తున్నాడు.
తెలిసిన వాళ్లకు, ఆఫీసులో ఫ్రెండ్స్ కు తన ఫుడ్స్ పంపిస్తోంది సమీర.
కిచెన్ నడుస్తోంది. ఆర్దర్స్ ఎన్ని వచ్చాయో చూసుకొని ఆ ప్రకారం చేయిస్తోంది సమీర.
నష్టం మాత్రం రావటం లేదు.
(సశేషం )
No comments:
Post a Comment