అక్కన్న
-సుజాత.పి.వి.ఎల్.
రాత్రి పన్నెండున్నర.
"రోజూ నేను రెండు మూడు సార్లు బెల్లు కొట్టినా తలుపు తీయవు, అలాంటిది నా కోసం తలుపులు తీసే ఉంచావు, ఏంటో చిత్రం..?" అరవింద్ మాటల్లో గుప్పున మందు కంపు.
"చాలా కాలానికి మా అక్క నన్ను చూడ్డానికి వచ్చింది. దయచేసి మన సంసారాన్ని దాని ముందు పడేయకండీ" గాయత్రి ప్రాధేయ పడింది.
"ఆమె ఇప్పుడు మనింటికి అతిథి. నీకు అక్క కాదు. మనకు తగ్గట్టు ఆమె ఉండాలి. ఆమెకి తగ్గట్టు మనం కాదు. ఎన్ని రోజులుంటుందట" తన గదిలోకి వెళుతూ వెటకారంగా అన్నాడు.
"రాక రాక వచ్చింది. ఓ రెండ్రోజులుంటుందేమో? అయినా అది మనకేం అడ్డుకాదు కదా..మీరు కాస్త..."
" ఆ..నేను కాస్త..అంటే పద్ధతిగా ఉండాలి అంతేగా! నా ఇంట్లో నేను పరాయివాడిగా, తనేమో మహరాణీలా...ఛీ నా బతుకు" అంటూ మంచం మీద వాలిపోయాడు.
నెమ్మదిగా తలుపేసి కింద ఛాపేసుకుని పడుకుంది.
***
ఉదయం.
ఆదరబాదరగా లేచి స్నానం చేసి, దేవుడికి రెండు పూలేసి, అగరొత్తులు వెలిగించి తనగదిలో నుంచి బయటకొచ్చి అక్క గదిలోకి వెళ్లింది.
అప్పటికే తయారయి, కుర్చీలో కూర్చుని చరవాణిలో దినపత్రిక చదువుకుంటున్న అక్క దగ్గరకొచ్చి-
"అక్కా, రాత్రి బాగా నిద్రపట్టిందా?" తమ మాటలు విందేమో అన్న అనుమానంతో అంది.
"ఆ(..హాయిగా" నవ్వుతూ అంది.
హ్యమ్మయ్యా అని మనసులో తేలికపడి "ఉండక్కా, నీకు అటుకుల పులిహార ఇష్టం కదా! క్షణాల్లో చేసుకొస్తా" అంటూ వెళ్ళబోయింది.
"ఇంతకుముందే నీకిష్టమైన ఇడ్లీ, నా కోసం పూరీ మీ ఇంటి పక్కనే ఉన్న బండీ నుంచి కొనుక్కొచ్చాను. బాగా చేస్తాడనుకుంటా, చాలామందే తింటున్నారు. రా ఇలా కూర్చో, నిన్న సాయంత్రం వచ్చిన దగ్గర్నుంచి మనం సరిగా మాట్లాడుకుంది లేదు" అంది ఆప్యాయంగా... చెల్లి శరీరంలో వచ్చిన మార్పులు, ఆమెని తనకు అక్కయ్యలా కన్పించేలా చేస్తున్నాయన్నది గమనిస్తూ.
గాయత్రి అక్క పక్కనే ఆనుకుని కూర్చుంది.
"ఎంతైనా రక్తస్పర్శ వేరే, నీ పక్కన కూర్చుంటే ఎంత సంతోషంగా ఉందో" మెరుస్తున్న కళ్లతో మనస్ఫూర్తిగా హాయిని అనుభూతిస్తూ అంది.
"నీకు చిన్నప్పటి రోజులు గుర్తున్నాయా? అమ్మానాన్నకి మనిద్దరమే సంతానం. నేనేమో మగాడిలా...నాన్న మాటల్లో మగాడిదలా పెరిగితే, నువ్వు మాత్రం సంప్రదాయ బద్ధంగా, ఛాందసంగా ఉండేదానివి."
"అవునక్కా, నన్నెవరన్నా ఏమైనా అంటే వాళ్లని తిట్టి, కొట్టొచ్చేదాకా నిద్రపోయేదానివి కాదు. ఒకరోజు లెక్కల మాస్టారు లెక్క సరిగ్గా చేయలేకపోయానని వాతలు తేలేలా నన్ను బెత్తంతో కొడితే, ఆయన సైకిల్లో గాలి తీసేశావు. ఎప్పుడన్నా నావల్ల ఏదైనా పొరబాటు జరిగినా, అది నీ ఖాతాలో వేసుకుని నాన్న చేత దెబ్బలు తినేదానివి. అన్నయ్య లేని లోటు లేకుండా చేశావని నిన్ను అక్కన్న అని అభిమానంగా పిలుచుకునేదాన్ని"
"నేనేమో నాకు నచ్చే సంబంధం వచ్చేదాకా పెళ్ళిచూపుల పర్వాలు కానిచ్చి పెళ్ళి చేసుకుంటే, నువ్వేమో నాన్న తెచ్చిన మొదటి సంబంధానికే తలూపి తాళి కట్టించుకున్నావు. తర్వాత నేను మా ఆయనతో అమెరికా వెళ్ళిపోయాను. అమ్మా, నాన్నా చనిపోయినప్పుడు మాత్రమే వచ్చి ఆ కార్యక్రమాలు అయిపోగానే మళ్ళీ వెళ్లిపోయాను. ఇదిగో ఇప్పుడు నెలక్రితం శాశ్వతంగా బెంగళూరు వచ్చేశాం. కాస్తా ఇల్లూ, పరిస్థితులూ కుదురుకున్నాక, వెంటనే ఇదిగో ఇలా నిన్ను చూడాలని వచ్చాను. అన్నట్టు నీకో బాబు కదూ ఎక్కడున్నాడు? నాకు కనిపించలేదు"
"మనతో చదువుకున్న సుశీల పక్క వీధిలో ఉంటోంది. వాళ్ళింట్లోనే ఉన్నాడు, వాళ్లబ్బాయితో చదువుకుంటాడు. వాడికిప్పుడు ఆరేళ్ళు"
"ఏం ఇక్కడుంటే పాడైపోతాడనా?" సూటిగా గాయత్రిని చూస్తూ అంది.
ఆ ప్రశ్నతో గాయత్రి గతుక్కుమంది, తన అక్క నిన్న రాత్రి జరిగింది చూసిందేమోనని...
"నీ మనసులో మెదిలింది నిజమే! నిన్న రాత్రి జరిగింది విన్నాను, కళ్ళారా చూశాను. మీ ఆయన మంచివాడని అందరు అనుకునేవారు కదా, మరెప్పుడిలా మారాడే? ఈ దిక్కుమాలిన మందు అలవాటెప్పట్నుంచి?"
గాయత్రి మౌనం వహించింది. కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి.
"మన నాన్నగాని, అన్నగానీ ఉండుంటే నీ జీవితానికి కంచెలా ఉండేవారు! నాన్న లేరు. మన జీవితంలో అన్నయ్య లేనేలేడు. ఉన్న నేనొక్కదాన్నేమో దూరతీరాలకి తరలిపోయాను. నీ పరిస్థితి ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. తెలిసుంటే రెక్కలు కట్టుకుని ఆఘమేఘాల మీద వచ్చి నీ ముందు వాలేదాన్ని. నిజం చెప్పాలంటే నాకన్నా అందగత్తెవే నువ్వు. రంగుపోయి, ఎముకలు కనిపిస్తూ, అక్కడక్కడా జుత్తు నెరిసి...ఇలాగైపోయావేంటే?" కన్నీళ్ళతో చెల్లిని కౌగలించుకుంది.
"రెండేళ్ల క్రితం వరకు ఆయన దేవుడే. నన్నెంతో బాగా చూసుకునేవాడు. అతని చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. మా పెళ్లైన ఆర్నెళ్లకు వైరల్ ఫీవర్ వచ్చి వాళ్ళమ్మ చనిపోయింది. అతనికి పెద్దగా చుట్టాలు కూడా లేరు. స్నేహితుడి మాటలు నమ్మి వ్యాపారంలో బాగస్వామి అయి డబ్బంతా పోగొట్టుకున్నాడు. అప్పట్నుంచి మనుషుల మీద నమ్మకం పోయింది. భార్యనైన నన్ను కూడా పట్టించుకోవడం లేదు. ఎవరెదురైనా సూటీ పోటీ మాటలే. రాత్రీ పగలు తాగుడు. పనీపాటా ఏం లేదు. డబ్బంతా అవగొట్టేశాడు. రెండు నెల్ల ఇంటి అద్దె బాకీ. ఇల్లుగలాయన ఖాళీ చేయమని గొడవ. ఈ మనిషికేం పట్టదు. సమస్యలు చెబుతున్నానని ఒకట్రెండు సార్లు నా మీద చేయి కూడా చేసుకున్నాడు. బాబు ఇక్కడుంటే పాడైపోతాడని సుశీలా వాళ్ళింట్లో అనాథలా ఉంచి చదివిస్తున్నాను" బావురుమంది.
"అనుకున్నా, పొద్దున్నే ఇలాంటి సోది మొదలెడతారని. చుట్టం చూపుగా వచ్చావు, చెల్లిని చూశావు, ఇక పెట్టె సర్దుకుని వెళ్ళిపో...అంతేకాని మా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చొద్దు."
"నిన్నేమని సంబోధించాలో అర్థం కావడం లేదు. నువ్వు నిద్ర లేచి మంచిదయింది. లేకపోతే పోలీసులు లేపి పట్టుకెళ్ళేవారు. ఇంకొక్క మాట మాట్లాడావంటే మర్యాద దక్కదు. వ్యక్తిగతమా, ఏంటి వ్యక్తిగతం? గుట్టుగా జరుగుతున్నప్పుడే అది వ్యక్తిగతం, హింసలోకి దిగితే అది అందరికీ సంబంధించిందవుతుంది, అందరూ తలదూరుస్తారు. బొక్కలో వేయిస్తారు. అది నీకు చెప్పిందో లేదో, నా సంగతి నీకు తెలియదు. దానికీ నాకూ మనస్థత్వంలో చాలా తేడా ఉంది. అది మెత్తది. కానీ నేనలా కాదు చాలా మొండిదాన్ని. బెంగళూరులోని స్త్రీల హక్కుల సంఘంలో క్రియాశీలక సభ్యురాల్ని. మా శాఖ ఇక్కడ కూడా ఉంది. ఒక్క మాట చెప్పానంటే ఈ వీధిలో నీ జీవితం నగ్నమావుతుంది. ఇదిగో ఈ కాగితంలో నాకు సంబంధించిన విషయాలు చిరునామా, చరవాణి సంఖ్యతో సహా ఉన్నాయి. గాయత్రీ, త్వరగా పెట్టె సర్దుకో, రాక్షసుడితో రోజూ నరకంలో ఉండేకన్నా, నీ దారి నువ్వు చూసుకోవడం మంచిది. మొగుడు ఎంత హింసించినా నాలుగ్గోడల మధ్యా భరించే రోజులు పోయాయి." అంది కళ్లలో నిప్పులు కురిపిస్తూ అరవింద్ వంక చూస్తూ.
గాయత్రి గబగబ తన బట్టలు, సామానూ సర్దేసుకుని అక్క దగ్గరకెళ్లి నుంచుంది. అరవింద్ కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. మిడిగుడ్లేసుకుని చూస్తున్నాడు. ఒక ఆడది అలా కొట్టినట్టు మాట్లాడడం అతని అనుభవంలో లేదు.
గాయత్రి చేయి పట్టుకుని బయటకి అడుగేస్తూ ‘ఈ ఇంటి గుమ్మం దాటితే మళ్ళీ లోపలికి రాలేవు, నాతో నీకే సంబంధమూ ఉండదు’ ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడవనే అనుకుంటున్నాను. తమ అసమర్థతకి, చేతకానితనానికి ఇంట్లో ఆడవాళ్లను హిసించే వాళ్లను నేనైతే మనుషులుగా పరిగణించను. ఎప్పటికన్నా నువ్వు మారి ఒక న్యాయవాదిని పట్టుకుని వస్తే నాకు నమ్మకం కలిగితే అప్పుడు గాయత్రిని పూర్తి దస్తావేజు రక్షణతో నీతో పంపుతా. ఈ లోపల పిచ్చి వేషాలేస్తే, నేనెక్కడదాకా అయినా పోగలను."అని గాయత్రితో బయటకి అడుగేసి అటుగా వెళుతున్న ఖాలీ ఆటోను ఆపి ఎక్కారు.
అక్కన్న తనను నిత్యనరకం నుంచి తప్పించిందన్న సంతోషంతో, నెమ్మళించిన మనసుతో అక్క భూజానికి చేరగిలబడింది. గాయత్రిని చేత్తో మరింత దగ్గరగా పొదువుకుని "సుశీల ఇల్లు ఎక్కడో చెప్పు, కృతజ్ఞతలు చెప్పి బాబును తీసుకెళదాం" అంది.
***
గాయత్రి అక్కన్న ఇంటి పక్కనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. యూ ట్యూబ్ లో లిటిల్ హెడ్స్ ఛానల్ ప్రారంభించి పిల్లలకి చదువు పట్ల భయం పోగొట్టి, ఇష్టం ఏర్పడేట్టు చేస్తోంది. ఆ ఛానల్ బాగా పేరొందింది. ప్రతిరోజు ‘అక్కన్న లేకపోతే తన జీవితం మసకబారిపోయేది. ఏ గుర్తింపూ నోచుకునేది కాదు. తన జీవితంలో అక్కే బాధ్యత తెలిసిన అన్న’ మనసులో అనుకుంటూ దణ్నం పెట్టుకుంటుంది.
కొంతకాలం తర్వాత దారీ తెన్నూ లేక చూసుకునే దిక్కు లేక పీకల్దాకా మందుతాగి అరవింద్ ప్రమాదంలో మరణించాడన్న వార్త సుశీల ద్వారా తెలిసినా, గాయత్రి కంట్లో నీరు ఉబకలేదు.
***
No comments:
Post a Comment