ఆనందానికి మార్గం- సజ్జనులతో సహవాసం
సి.హెచ్.ప్రతాప్
నీచగుణములెల్ల నిర్మూలమైపోవు
కొదువ లేదు సుజన గొష్ఠి వలన
గంధమలదమేమి కంపడగినయట్లు
విశ్వధాభిరామ వినురవేమ !
సజ్జన సాంగత్యం గురించి మానవాళికి వేమన చెసిన అధుతమైన బోధ ఇది. సజ్జనులతో సాంగత్యము వలన,వారితో మాట్లాడడం
వలన మనలోని దుర్గుణములు తొలగిపోతాయి. మంచి వారితో కలిసి మెలసి తిరగడము వంటికి గంధము పూసుకోవడము వంటిది.శరీరములోని దుర్గంధాన్ని మంచి గంధము పూత యెలా దూరము చెస్తుందో , అలాగే సజ్జన సాంగత్యము మనలోని అవలక్షణాలని దూరము చేస్తుందని ఈ పద్య భావము.
ఈ సంసారమనే విషవృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు వున్నాయట. అందులో మొదటిది సజ్జన సాంగత్యం. రెండవది సద్గ్రంథ పఠనం. మంచివారితో చెలిమివల్ల ఒనగూడే ప్రయోజనాలు- జీవిత సాఫల్య సోపానాలుగా భాసిస్తాయి. ‘దుష్టులకు దూరంగా వుండాలని’ కూడా మన పెద్దలు చెప్పారు. సంఘజీవి అయిన మనిషి- ఏకాంతంగా బ్రతకలేడు. సంఘంలో వుంటూనే, తన నడవడికను ఏర్పరుచుకోవాలి. మనం చేసే సాంగత్యమే మన ఉన్నతికి దుస్థితికి కారణవౌతుంది అన్నది శాస్త్ర వాక్యం.. ఈ ప్రపంచంలో సజ్జన సాంగత్యం, దుర్జన సాంగత్యం అని రెండు రకాలు. కలి ప్రభావాం వలన లోకంలో సజ్జనులు తక్కువగాను, దుర్జనులు ఎక్కువగాను ఉంటున్నారు. సజ్జన సాంగత్యం చేయాలని సకల శాస్త్రాలు చెబుతున్నాయి. దుర్జనుల వల్ల సమాజానికి భయోత్పాతాలు ఏర్పడితే సజ్జనుల వల్ల సమాజాభివృద్ధి కలుగుతుంది.
“సజ్జన సాంగత్యం” అంటే ‘సత్యం తెలుసుకున్న జనులతో కలవడం, “సజ్జన సాంగత్యం” అంటే జ్ఞానుల ద్వారా సత్య ప్రవచనాలు వినడం ,“సజ్జన సాంగత్యం” అంటే యోగుల ద్వారా ధ్యానానుభవాలు వినడం అని శాస్త్రం నిర్వచించింది. ఈ లోకంలో అడుగు పెట్టామంటే అప్రమేయంగా అనేక బంధాలకు బందీ అయినట్లే అని తెలుసుకోవాలి. మనలను సక్రమ మార్గం వైపు నడిపే శక్తి కేవలం సజ్జనులకే ఉంటుంది. ఒక మనిషి సజ్జనుడుగా పేరు ప్రతిష్టలు గడించినా, దుర్జనుడిగా అపకీర్తి పాలైనా అది సాంగత్యం వలననే సాధ్యం.” ఎంత దుష్ట సంస్కారాలు గలవాడైనా సాధు సాంగత్యం చేత వృద్ధిలోకి వస్తాడు. అత్తరు దుకాణంలోకి పోతే ఆ వాసన నీకు ఇష్టం లేకపోయినా నీ ముక్కుకు సోకుతుంది” అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస.శుద్ధమైన ఆత్మానుభవంతో, అపారమైన ఆత్మవిజ్ఞానంతో, మరి మిత్రకోటి లాభంతో సర్వజనులూ మహా ఆనందంగా జీవించాలి.అందుకు సజ్జన సాంగత్యమే ఉత్తమ మార్గం. సజ్జన సాంగత్యం పొందాలంటే, అంతకు ముందుగా మనలో ఏళ్ళ తరబడి ఉన్న మూర్ఖత్వాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే సజ్జనులు ఎవరన్న విషయం బోధపడుతుంది. మనం కోరుకున్నంత మాత్రాన సజ్జనులు మన దగ్గరికి రారు. వారున్న చోటికి మనమే చేరుకోవాలి. అందుకు సచ్చీలత, పరిశుద్ధమైన వ్యక్తిత్వం, సజ్జన సాంగత్యం కావాలన్న బలమైన కోరిక వుండాలి.
మానవులలో దానవ మానవ గుణాలు రెండూ నిక్షిప్తమై వుంటాయి. సమయం సందర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటిత మౌతూ వుంటుంది అని మానసిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.. దుర్జనులతో సాంగత్యం చేస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులు చేస్తాం. సజ్జన సాంగత్యం మనలో రజో తమో గుణాలు తగ్గించి సాత్విక భావాలు పెంచుతుంది. నీ స్నేహితుడెవరో చెప్పు, నువ్వెలాంటివాడివో చెబుతాను’ అన్నది పెద్దల మాట.. సాంగత్యంవల్లనే స్వభావాలు ఏర్పడతాయి. ‘సిరి అబ్బదు కానీ చీడ అబ్బుతుంది’ అని కూడా అన్నారు మన పెద్దలు. చెడు త్వరగా పరివ్యాపిస్తుంది. మంచి గుణాలు అలవడడం, సంస్కారయుతమైన జీవనం లభ్యం కావడం అనేవి జన్మతః కొంత అలవడగా- సజ్జన సాంగత్యంవల్ల వికసిస్తాయి.
మానవుడు ఎంత మంచి వాడయినా, తనలో ఎన్నో సద్గుణాలు వున్నా, ఎన్ని శాస్త్రాలు చదివి అంతులేని విజ్ఞానాన్ని పోది చేసుకున్నా, ఒక దుర్మార్గుడితో సహవాసం చేస్తే , స్వచ్చమైన పాలను ఒక విషపు చుక్క విషమయం చేసినట్లు , అతడి సద్గుణాలు అన్నీ నాశనమైపోతాయి అని కర్ణుడి ఉదంతం మనకు నిరూపిస్తోంది.
మంచి సహవాసం బుద్ధి మాంద్యం తొలగిస్తుంది. నిర్భీతిగా మన చేత నిజాన్ని పలికిస్తుంది. పాపాన్ని పోగొడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు తెచ్చి పెట్టి మన కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తుంది. అందుకే ఆచితూచి స్నేహం చేయ మన్నారు.
No comments:
Post a Comment