"బంగారు" ద్వీపం (అనువాద నవల) -30 - అచ్చంగా తెలుగు

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -30

Share This

 "బంగారు" ద్వీపం (అనువాద నవల) -30

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Writer : Enid Blyton
 


 
(జార్జినా పంపిన చీటీని చదివిన డిక్ ఆ ద్వీపంలో తాము గాక వేరే ఎవరైనా ఉన్నారేమో నిర్థారించుకుందుకి సముద్రతీరాన్ని గాలిస్తాడు. అక్కడ చిన్న పడవను చూడగానే, నేలమాళిగలో జార్జి, జూలియన్ బందీలుగా ఉన్నారని గ్రహించి, డిక్, అన్నెతో కలిసి తమ సామాను ఉంచిన గదిలో దాక్కుంటారు. తరువాత ఇద్దరు వ్యక్తులు తమను పిలుస్తూ వెతుకుతున్నట్లు గమనించి, ఇద్దరు ఇల్లలు పాత నూతిలోకి దిగి దాక్కుంటారు. కొద్దిసేపటికి ఆగంతకులు ద్వీపాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్లు మోటారు బోటు చప్పుడు వినిపించింది. తరువాత. . .)
@@@@@@

మోటారు బోటు బయల్దేరిన శబ్దాన్ని డిక్ విన్నాడు.

"అన్నె! ఇప్పుడు మనం సురక్షితంగా బయటకు వెళ్ళొచ్చు" చెప్పాడతను. "ఇక్కడ చల్లగా ఉంది కదా! సూర్యరశ్మిలోకి వెళ్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది."

వాళ్ళు నిచ్చెన ఎక్కి బయటకు దిగి వేసవి సూర్యుని వెచ్చని వెలుతురులో నిలబడ్డారు. మోటారు బోటు ప్రధాన భూభాగం వైపు పరుగెత్తడాన్ని వాళ్ళు చూడగలిగారు.

"సరె! ప్రస్తుతానికి వాళ్ళు వెళ్ళిపోయారు" అన్నాడు డిక్. "వాళ్ళు అన్నట్లుగా, మన పడవను తమతో తీసుకొని పోలేదు. మనం జూలియన్, జార్జిలను రక్షించగలిగితే, మనకు కాస్త సాయం అందుతుంది. ఎందుకంటే జార్జి మనల్ని పడవలో వెనక్కి తీసుకుపోగలదు."

"మనం వారిని ఎందుకు రక్షించలేము?" గట్టిగా అంటున్న అన్నె కళ్ళు మెరిసాయి. "మనం మెట్లు దిగి వెళ్ళి, తలుపు తెరుద్దాం. చేయలేమా?"

"లేదు. మనం చేయలేము" అన్నాడు డిక్. "చూడు!"

అన్నె అతను చూపించిన వైపు చూసింది. ఇద్దరు వ్యక్తులు నేలమాళిగ ద్వారం దగ్గర బరువైన భారీ రాతి స్లాబులను గుట్టగా పెట్టారు. తమ శక్తిని అంతా ఉపయోగించి ఆ వ్యక్తులు ఆ భారీ రాళ్ళను అక్కడ పెట్టగలిగారు. డిక్, అన్నెల నుంచి కనీసం వాటిని చిన్నగా కదిపే శక్తినైనా ఆశించలేరు.

"మెట్లను దిగటం అసాధ్యం" అన్నాడు డిక్. "వాళ్ళు చేసినట్లు ఖచ్చితంగా మనం చేయలేము. రెండవ ద్వారం ఎక్కడ ఉందో మనకు తెలియదని నీకు తెలుసు. అది కోట బురుజు దగ్గర ఎక్కడో ఉందని మాత్రమే మనకు తెలుసు."

"దాన్ని మనం కనిపెట్టగలమేమో చూద్దాం" ఆత్రంగా చెప్పింది అన్నె. వాళ్ళు కోటకు కుడి వైపున ఉన్న బురుజు దగ్గరకు బయల్దేరారు. కానీ ఒకప్పుడు అక్కడ ఏ ప్రవేశద్వారం ఉండేదో అది యిప్పుడు పోయిందని స్పష్టంగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలో కోట చాలా భాగం కూలిపోయింది. ఆ ప్రాంతంలో ప్రతిచోటా చాలాకాలం క్రితం విరిగిపడిన రాళ్ళ కుప్పలు ఉన్నాయి. వాటిని కదలించటం అసాధ్యం. పిల్లలు వెంటనే అన్వేషణను వదిలిపెట్టారు.

"అబ్బా!" డిక్ అన్నాడు. "పాపం జూలియన్, జార్జి కింద బందీలుగా ఉన్నారన్న విషయాన్ని ఆలోచించకుండా ఎలా ఉండగలను? పైగా వారికి కనీస సాయమన్నా చేయలేకపోతున్నాం. ఓ అన్నె! మనం ఏమి చేయాలో నువ్వు ఆలోచించటం లేదా?"

అన్నె ఒక రాతిపై కూర్చుని గట్టిగా ఆలోచించింది. ఆమె బాగా ఆందోళనలో ఉంది. ఉన్నట్లుండి ఉల్లాసవంతమైన ముఖంతో డిక్ వైపు తిరిగింది.

"డిక్! నేను అనుకొనేదేమిటంటే, మనం బావిలో పూర్తిగా కిందకు దిగలేకపోతున్నాం, అంతేకదా! " ఆమె అడిగింది. "అది నేలమాళిగల గుండా వెడుతోందని నీకు తెలుసు. బావి గొట్టం నుంచి నేలమాళిగ గచ్చు మీదకు ఒక కన్నం ఉంది. మనం దానిలో తల, భుజాలను దూర్చి పైకి చూస్తే బావి పైభాగం కనిపించింది నీకు గుర్తులేదా? బావిలో అడ్డంగా పడిపోయిన ఆ స్లాబ్. . .ఇప్పుడే నేను దాని మీద కూర్చున్నాను. .. ఆ స్లాబ్ ని మనం దాటలేమా?"

డిక్ దాని గురించే ఆలోచించాడు. అతను నూతి వద్దకు వెళ్ళి లోనికి తొంగి చూసాడు. "నువ్వు చెప్పింది నిజమే అన్నె!" చివరికి అన్నాడు. "మనం ఆ స్లాబ్ ని పక్కకు నెట్టగలం. అక్కడ కొద్దిగా ఎడము ఉంది. ఈ ఇనుప నిచ్చెన కింద ఎంత దూరం వరకు ఉందో నాకు తెలియదు."

"ఓ డిక్! ప్రయత్నించి చూద్దాం" అన్నె అంది. "వాళ్ళిద్దరిని రక్షించటానికి యిది ఒక్కటే అవకాశం."

"నేను ప్రయత్నిస్తాను అన్నె! నువ్వు వద్దు. నువ్వు ఆ బావిలో పడిపోవటం నాకిష్టం లేదు. నిచ్చెన మధ్యలో సగానికి విరిగిపోవచ్చు, ఇంకా ఏదైనా జరగొచ్చు. నువ్వు మాత్రం యిక్కడే ఉండు. ఏమి చేయగలనో, అది నేను చూసుకొంటాను."

"నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సరేనా?" ఆత్రుతగా అందామె. "నీతో పాటు ఒక తాడు కూడా తీసుకెళ్ళు డిక్! మధ్యలో అవసరమైతే, యింత నిచ్చెన ఎక్కి మళ్ళీ పైకి రావల్సిన అవసరం ఉండదు."

"మంచి ఆలోచన" అన్నాడు డిక్. అతను చిన్న రాతి గదిలోకి వెళ్ళి, తాము అక్కడ ఉంచిన తాళ్ళలోంచి ఒకదాన్ని తీసుకొన్నాడు. అతను దానిని నడుము చుట్టూ కట్టుకున్నాడు. తరువాత అన్నె దగ్గరకు తిరిగి వెళ్ళాడు.

"సరె! వెళ్తున్నాను" ఆమెకు చిరునవ్వుతో చెప్పాడతను. "నా గురించి చింతించకు. నేను బాగానే ఉంటాను."

అన్నె పాలిపోయింది, డిక్ తిన్నగా నూతి అడుగుకు పడిపోతాడేమోనని భయపడింది. ఇనుప నిచ్చెన మీదనుంచి నూతిలో రాతిపలక వరకు దిగటాన్ని ఆమె చూసింది. అతను పలకను పక్కకు నెట్టటానికి తన శక్తి మేరా ప్రయత్నించాడు, కానీ కష్టం అనిపించింది. చివరకు ఎలాగైతేనే సాధించాడు. ఆ తరువాత అన్నె అతన్ని చూడలేదు. కానీ అతను ఆమెను పిలుస్తుండటం వల్ల, తన మాటలను వినగల్గుతోంది.

"నిచ్చెన ఇంకా బలంగా ఉంది, అన్నే! నేను బానే ఉన్నాను. నీకు నా మాట వినిపిస్తోందా? "

"వినిపిస్తోంది" అన్నె బావిలోకి చూస్తూ అరిచింది. ఆమె స్వరం చిత్రంగా ప్రతిధ్వనించి అతనికి బొంగురుగా వినిపిస్తోంది. "జాగ్రత్తగా వెళ్ళు డిక్! నిచ్చెన చివరివరకు వెళ్తుందని ఆశిస్తున్నాను."

"నేను అదే అనుకొంటున్నాను" డిక్ తిరిగి అరిచాడు. తరువాత అతను ఆశ్చర్యకరమైన శబ్దం చేసాడు. "అయ్యో! నిచ్చెన యిక్కడే విరిగిపోయింది. ఇప్పుడే విరిగింది. లేదంటే యిదే ఆఖరు కావచ్చు. ఇప్పుడు నేను నా తాడును వాడాల్సి ఉంటుంది."

డిక్ తన నడుముకి కట్టుకొన్న తాడును విప్పుతూండటం వల్ల కొద్దిసేపు నిశ్శబ్దం తాండవించింది. అతను దానిని నిచ్చెన చివరలో బలంగా ఉన్న పైమెట్టుకి కట్టాడు.

"ఇప్పుడు నేను తాడు పట్టుకు దిగుతున్నాను" అతను అన్నెకు అరిచి చెప్పాడు. "చింతించకు. నేను బాగానే ఉన్నాను. ఇదిగో! వెళ్తున్నా!"

ఆ తర్వాత డిక్ చెప్పినది అన్నె వినలేకపోతోంది, ఎందుకంటే బావిలో గొట్టం వంకర్లు తిరిగి ఉండటాన, ఆమెకు అతని మాటలు సరిగా వినపడటం లేదు. కానీ అతను చెబుతున్నదేమిటో ఆమెకు తెలియకపోయినా, అతని అరుపుల శబ్దం ఆమె చెవులను సోకి చాలా ఆనందంగా ఉంది. ఆమె కూడా తన మాటలు అతనికి వినిపిస్తాయన్న ఆశతో గట్టిగా అరిచి చెబుతోంది.

డిక్ తాడును కిందకు జారవిడిచి, చేతులు, పాదాలు, మోకాళ్ళతో దాన్ని పట్టుకొని మెల్లిగా కిందకు జారుతున్నాడు. స్కూల్లో ఉన్న జిం ప్రావీణ్యం అతనికి కలిసివచ్చింది. తాను నేలమాళిగలకు దగ్గరలోనే ఉన్నాడేమోనని అతను తలపోసాడు. తను కిందకు చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుందని అనిపించింది. జేబులోంచి టార్చిని బయటకు తీయగలిగాడు. దాన్ని వెలిగించి పళ్ళతో పట్టుకొన్నాడు. దానివల్ల తాడును రెండు చేతులతో పట్టుకోవటానికి వీలవుతుంది. టార్చి వెలుతురు అతని చుట్టూ ఉన్న నూతి గోడలను స్పష్టంగా చూపిస్తోంది. తను ప్రస్తుతం నేలమాళిగలకు కింద ఉన్నాడా, పైన ఉన్నాడా అన్నది అంచనా వేయలేకపోతున్నాడు. నూతి అడుగు దాకా వెళ్ళాలని అతను కోరుకోవటం లేదు. నేలమాళిగ గుహలకు వెళ్ళే ద్వారాన్ని అప్పుడే తాను దాటినట్లుగా అతను భావించాడు. అందుకే తిరిగి కొద్ది దూరం తాడుపై పైకెగబాకాడు. తాను అనుకొన్నది నిజమేనన్నట్లు ద్వారం కనిపించి అతను సంతోషించాడు. నేలమాళిగల్లోకి వెళ్ళే దారి అతని తల దగ్గరే కనిపించింది. ఆ ద్వారానికి సమాంతరంగా వచ్చే వరకు పైకి ఎగబాకి ఆపై నూతి గోడలో ఉన్న ఆ దారికి చేరేలా తాడుతో అతను ఊగాడు. చివరకు ద్వారానికి ఉన్న ఇటుక అంచును పట్టుకొని, నేలమాళిగ ద్వారంలో కాలు మోపేలా పెనుగులాడాడు.

అది కష్టమే, కానీ అదృష్టవశాత్తూ డిక్ చిన్నపిల్లాడు. చివరకు ఎలాగో నిభాయించుకొని, ఆ ద్వారంలో కాలు మోపి నిలబడి, ప్రశాంతంగా నిట్టూర్చాడు. ప్రస్తుతం అతను నేలమాళిగలోకి అడుగుపెట్టగలిగాడు! ఇప్పుడు తను గోడపై ఉన్న సుద్ద గుర్తులను అనుసరించి, కడ్డీలు దొరికిన గదో, గుహో, దాని దగ్గరకు చేరుకోగలడు. దానిలోనే జూలియన్, జార్జి బంధించబడ్డారని అతను ఖచ్చితంగా నమ్ముతున్నాడు!

అతను గోడపై తన టార్చి వెలుగుని కేంద్రీకరించాడు. గోడ మీద సుద్ద గుర్తులు ఉన్నాయి. అదృష్టం! వెంటనే నూతి పైభాగం వైపు తన తలను ఉంచి, తన శక్తి కొద్దీ అరిచాడు.

" అన్నె! నేను నేలమాళిగలో ఉన్నాను. ఆ వ్యక్తులు తిరిగి వస్తున్నారేమో గమనించు!"

తరువాత అతను తెల్లని సుద్దముక్క గుర్తులను అనుసరించటం ఆరంభించాడు.

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment

Pages