సొల్యూషన్ (పిల్లల కథ)
పి.యస్.యమ్. లక్ష్మి
అదొక మిడిల్ క్లాస్ కాలనీ. హైదరాబాద్ పాండీ బజార్ అనే పేరు కూడా వున్నది. ఎందుకంటే సినిమా స్టూడియోలకి సమీపంలో వుండటంవల్ల పెద్దలంతా జుబిలీ హిల్స్, బంజారా హిల్స్ వగైరా ధనిక కాలనీలలో సెటిల్ అయితే, స్టూడియోలమీద ఆధార పడ్డ అనేకమంది ఔత్సాహికులు ఇక్కడ సెటిల్ అవటంవల్ల. అంతేకాదు. రాజధాని అని ఊళ్ళనించి వచ్చిన తాపీ మేస్త్రీలు, వాళ్ళ అసిస్టెంట్స్ తో సహా చిన్న స్ధలం కొనుక్కుని, చేతిలో వున్న విద్య కదాని ఒక గది వేసుకుని వుండటం మొదలుపెట్టారు.
ఇదంతా నలభై ఏళ్ళ క్రితం సంగతి. ఇప్పుడు ఆ కాలనీని స్లమ్ అంటే ఎవరూ ఒప్పుకోవటం లేదు. స్ధలాలకి రిజిస్ట్రేషన్ కాకపోవటంతో చాలామంది వచ్చినకాడికి అమ్ముకుని వెళ్ళారు.
కొనుక్కున్నవాళ్ళు, స్ధలం అమ్మక ధైర్యంగా వున్నవాళ్ళు అప్పటి వాళ్ళ పరిస్ధితులబట్టి ఇళ్ళు కట్టుకుంటూ, ఓ పది రూపాయలు అద్దెకూడా రావాలని ఆలోచించారు. అద్దెల కోసం అంగుళం ఖాళీ లేకుండా ఇళ్ళు కట్టేశారు. అద్దెలు చౌక అని జనాభా పెరిగారు.
సర్కారు వారి పుణ్యమా అని లేండ్ రెగ్యులరైజ్ అయింది. ఇంకేం. రెండు గదుల ఇళ్ళు కాస్తా4, 5 అంతస్తుల బిల్డింగులయ్యాయి. అయితే ముందు స్ధలం కొన్నవాళ్ళకిగానీ, తర్వాత ఇళ్ళు కట్టినవాళ్ళకిగానీ, తాముగానీ, ఆ ఇళ్ళల్లో వుండేవాళ్ళుగానీ వాహనాలు కొంటామనే ఆలోచన లేక దాదాపు ఎవరూ పార్కింగ్ ప్లేస్ లేకుండా ఇళ్ళు కట్టేశారు. అంతకు ముందువున్న కుటుంబాలే కాకుండా, చదువుకోసం, ఉద్యోగం కోసం రాజధానికి వచ్చే యువత సంఖ్య ఎక్కువై ఒక్కొక్క పోర్షన్ లో నలుగురైదుగురు వుండటం మొదలు పెట్టారు. మరి కొన్ని సౌకర్యాలు, ట్రాఫిక్ జామ్ లూ పెరగటంతో, వేళ్టికి డ్యూటీకి వెళ్ళాలని ప్రతిఒక్కరూ బైక్ లు, అవీ, మొగపిల్లలు ఎక్కువగా ఇష్టపడే మొద్దు బళ్ళు కొనేశారు. అంతా బాగానే వుందయ్యా. ఇది అన్ని చోట్లా వుండే సంగతే కదా, దీనికోసం కధ ఎందుకు, అదీ పిల్లల కధ అంటున్నారు కదూ. హడావిడి పడకండి. అక్కడికే వస్తున్నా.
అసలు సమస్య ఇక్కడే. ఐదంతస్తుల బిల్డింగ్ కి పది బైక్ లు, వీలునిబట్టి ఒకటి రెండు కార్లు తప్పనిసరిగా వుంటున్నాయి. మరి వీటికి పార్కింగ్ ప్లేస్. ఇంటి ముందు ఇంట్లోవాళ్ళు నుంచోవటానికే స్ధలం వుండదు. ఎంత చిన్నదయినా రోడ్డు మనదే. దానిమీద అందరికీ హక్కు వున్నది. అంతే రోడ్లు పార్కింగ్ స్ధలాలయ్యాయి. దానితో ట్రాఫిక్ జాంలు రహదారులమీదే కాదు, సందుల్లో కూడా మొదలయినాయి. అడ్డంగా పార్క్ చేసిన వాహనం తీసేదాకా దోవలో వెళ్ళేవాళ్ళ హారన్లతో ఇళ్ళు హోరెత్తిపోతున్నాయి. మరి ఈ వాహనాలకన్నింటికీ పార్కింగ్ స్ధలం. రోడ్లే. ముందు కొలతల ప్రకారం వేసినా ఇళ్ళు కట్టుకునేవాళ్ళు అటో చెయ్యి, ఇటో చెయ్యీ నెట్టటంతో కుంచించుకు పోయినా రోడ్లంటూ వున్నాయి కదా. అవి మనవే. పార్క్ చేసేయ్. ఎవరి ఇంటి ముందయితే ఏమిటి, ఎవరికి అడ్డు వస్తే ఏమిటి.
ఏదో స్ధలం లేకుండా ఇబ్బంది పడుతున్నారులే అని రోడ్డున పోయే వాహనదారులు సాధ్యమైనంతమటుకూ ఎవరినీ ఏమీ అనకుండా రెండు వైపులా పార్కు చేసిన వాహనాల మధ్యనుంచి దోవ చేసుకుని వెళ్తుంటారు. ఓపిక వున్న వాళ్ళయితే పెద్ద వాహనాలలోంచి దిగి అడ్డం వచ్చిన ద్విచక్రాలను సరి చేసుకుంటూ మరీ ముందుకు సాగుతారు. లేనివాళ్ళు వాహనం దిగకుండా హారన్ మోగిస్తూ వుంటారు. ఎవరి ఓపిక వారిది.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా మనవడు సాయి తెలివితేటలని మీకు చెప్పాలని.
మా బడుధ్ధాయికి మొన్ననే పదేళ్ళు నిండాయి. పట్టుమని పదేళ్ళే వున్నావాడికెన్ని తెలివితేటలనుకుంటారు. రోజూ ఇంట్లో దేని గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ ట్రాఫిక్ సమస్య గురించి తప్పక చర్చలు జరుగుతాయి. మా మనవడు ఇవ్వన్నీ వింటూ వుంటాడు. ఎవరెవరో బళ్ళు తీసుకువచ్చి మా ఇంటి ముందు పెట్టి వెళ్తుంటే నేను తరచూ కేకలేస్తూ వుంటాను. ఇవ్వన్నీ చూశాడు.
ఆ రోజు అమ్మమ్మా, నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేశాను అన్నాడు. ఇన్నేళ్ళనుంచీ ఆ ఇంట్లో వుంటూరోజుకి ఒకరిద్దరికైనా ఈ పార్కింగ్ విషయంలో వాళ్ళకి అక్కర్లేని సలహాలిచ్చే నేను సాల్వ్చెయ్యలేని నా ప్రాబ్లమ్ పదేళ్ళ గుంటడెలా సాల్వ్ చేశాడని ఆశ్చర్యపోయాను, వాడివన్నీ నా తెలివితేటలే అని ఎప్పుడూ సంతోషించేదాన్నే అయినా.
నా ఆశ్చర్యాన్ని చూసి ఇటురా అంటూ మా గేట్లోకి తీసుకెళ్ళి ప్రహరీ గోడకి వేళ్ళాడుతున్న బోర్డు చూపించాడు. దానిమీద బైక్ పార్కింగ్ ఛార్జీ నెలకి రూ. 500 అని వున్నది. అదేమిట్రా, రోడ్డు మీద పార్క్ చేస్తే నువ్వు డబ్బులెలా వసూలు చేస్తావ్ అని అడిగాను.
డబ్బులిచ్చి మీ ఇంటి ముందు ఎవరూ పెట్టరులే అమ్మమ్మా, పెడితే ఆ డబ్బలుతో ఈరోడ్డు బాగు చేయించెయ్యి అన్నాడు. సర్కారువారికి ఈ ఆలోచన వచ్చిందంటే అరాకొరాగా వేసే రోడ్లు కూడా ఆపేస్తారు కదా ఆనిపించింది.
ఆ మర్నాటినుంచి మా ఇంటి ముందు పార్క్ చేసే బళ్ళ సంఖ్య తగ్గిందని వేరే చెప్పక్కర్లేదుగా.
No comments:
Post a Comment