కవిసామ్రాట్ ఏకవీర - అచ్చంగా తెలుగు

కవిసామ్రాట్ ఏకవీర

Share This

కవిసామ్రాట్ 'ఏకవీర'

- అక్కిరాజు ప్రసాద్ 


కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ఏకవీర నవలను 1929-30 మధ్యలో రచించారు. 1935వ సంవత్సరంలో భారతి పత్రిక ద్వారా ప్రచురితమైంది. 1969వ సంవత్సరంలో చిత్రంగా విడుదలైంది. విషాదాంతమైన కథను తెరకు ఎక్కించటమంటే ఎంతో ఆలోచించి చేయాలి. అందులో నాలుగు పాత్రలూ ముఖ్యమైనవే. ఆ కథలోని ప్రేమను, త్యాగాన్ని, స్నేహాన్ని ప్రతిబింబించేలా ఎన్టీఆర్, కాంతారావు గారు, జమున గారు, కేఆర్ విజయ గారు పాత్రలను పోషించారు. తాను ప్రేమించిన స్త్రీని అనుకోని పరిస్థితులలో ప్రాణ స్నేహితుడు వివాహం చేసుకోవటంతో కథ విషాదాంతానికి దారి తీస్తుంది. మనసు, కర్తవ్యం, స్నేహం, ధర్మం మధ్య నలిగే ఈ కథకు సంభాషణలు ప్రాణం.
క్లుప్తంగా కథ:
16వ శతాబ్దంలో మదురై రాజకుటుంబానికి చెందిన సేతుపతి మీనాక్షి అనే పేద పిల్లను ప్రేమిస్తాడు. సేతుపతి ప్రాణ స్నేహితుడు వీరభూపతి. అతడు అంబ సముద్రం రాజ కుటుంబానికి చెందిన ఏకవీర అనే రాజకన్యతో ప్రేమలో పడతాడు. పరిస్థితుల ప్రభావంతో సేతుపతి వివాహం ఏకవీరతో నిశ్చయమవుతుంది. వీరభూపతి వివాహం మీనాక్షితో జరుగుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు లేకపోవటంతో ఆ రెండు వైవాహిక జీవితాలు మొక్కుబడిగా దాంపత్య సిద్ధి లేకుండా ఉంటాయి. సేతుపతి తన స్నేహితుడు వీరభూపతి ఇంట తాను గతంలో ప్రేమించిన మీనాక్షిని చూసి, ధర్మానికి కట్టుబడి, ఆమెపై తనకు గల ప్రేమను త్యాగం చేస్తాడు. వీరభూపతికి తన గతాన్ని తెలుపుతాడు. వీరభూపతి నిజాన్ని అంగీకరించి స్నేహితుని నిజాయితీని మెచ్చుకొంటాడు. సేతుపతి ఏకవీరను తన ధర్మపత్నిగా స్వీకరించి ఆమెతో దాంపత్య జీవనం గడపటానికి వస్తున్నానని సందేశం పంపుతాడు.
ఇంతలో రాజుగారి కోటపై దాడి జరిగే అవకాశాలు ఉండటంతో అక్కడునుండి కదలలేకపోతాడు. అతని సందేశం తీసుకువెళుతున్న వార్తాహరుడు చంపబడతాడు. ఆతని మారిన మనసు విషయం ఏకవీరకు చేరదు. ఇంతలో వీరభూపతి ఏకవీర తన స్నేహితుని భార్య అని తెలియక, ఆమెను చూసి తనదానిని చేసుకోవాలనుకొని ముందడుగు వేస్తాడు. తాను ఇంకొకరి దాననని, క్షణికావేశంలో ఆలోచనలు తప్పటడుగులు వేసాయన్న భావనతో ఏకవీర మూర్ఛపోతుంది. సత్యాన్ని భార్య మీనాక్షి ద్వారా తెలుసుకున్న వీరభూపతి కుంగిపోతాడు. సేనాపతి అంతా చూస్తాడు. మీనాక్షి విషం మింగి ప్రాణం విడుస్తుంది. వీరభూపతి తాను స్నేహితుని భార్య పట్ల చూపిన అనుచిత ప్రవర్తనకు పరితపిస్తూ ప్రాణత్యాగం చేస్తాడు.ఏకవీరను అప్పటికైన స్వీకరించటానికి సిద్ధంగా ఉన్న సేతుపతి ఆమెను చూస్తాడు. అప్పటికే వైరాగ్యంతో ఉన్న ఏకవీర ప్రాణత్యాగం చేస్తుంది.
దుఃఖాంతమైనా, చిత్రంలోని పాత్రల ఔన్నత్యం, వారి మనసులోని భావాలు, సంభాషణలలోని లోతైన భావనలు, నలిగిపోయే వ్యక్తిత్వాలు, ప్రాణస్నేహితుల మధ్య అనురాగం, యవ్వనంలో ఉండే కోరికల తరంగాలు, ప్రేయసీ ప్రియుల ఆరాధనా భావనలు, విధి పెట్టే పరీక్షలు, తెచ్చే మలుపులు...ఇలా చిత్రం మొత్తం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ఏకవీరగా కేఆర్ విజయ పాత్రకు జీవం పోశారు. ప్రేయసిగా, భార్యగా జమున తన నటనాకౌశలాన్ని ప్రదర్శించారు. రాచరికపు కథకు అనుగుణంగా చిత్రీకరణ అద్భుతంగా చేశారు దర్శకులు. ఇక సంగీతం, పాటల గురించి చెప్పేదేముంది? ఇప్పటికీ ప్రజలనోట వినబడే పాటలు తోటలో నా రాజు, ప్రతిరాత్రి వసంతరాత్రి, కృష్ణా నీ పేరు తలచినా చాలు. భావగర్భితమైన సాహిత్యాన్ని, మృదుమధురమైన పదజాలాన్ని అందించారు డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఘంటసాల మాష్టారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కలసి పాడిన బహుకొద్ది పాటలలో ప్రతి రాత్రి వసంత రాత్రి ఒకటి. దేవులపల్లి వారి సినీగీతాలలో ఇది చిరస్మరణీయం. అలాగే నారాయణ రెడ్డి గారి గీతాలలో తెలుగుదనానికి తోటలో నారాజు గీతం తలమానికం. కేవీ మహదేవన్ గారి సంగీతం అద్భుతం. ఈ చిత్రంలో నాకిష్టమైన పాట తోటలో నారాజు. సాహిత్యాన్ని పరిశీలిద్దాం.
తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
నవ్వులా అవి? కావు, నవ పారిజాతాలు
రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు
ఆరాజు ఈరోజు అరుదెంచునా
అపరంజి కలలన్ని చిగురించునా
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
పాటలా ధర రాగ భావనను కన్నాను
ఎలనాగ నయనాల కమలాలలో దాగి
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఆపాట నాలో తీయగ మ్రోగనీ
అనురాగ మధుధారయై సాగనీ
అలనాటి చలనచిత్రాలలో కూడా శృంగార గీతాలు ఉండేవి...కానీ, వాటిలో మోహం లేకుండా ఆరాధనా భావం ఉండేది. ప్రేయసీ ప్రియుల మధ్య భావనలను ఆ పరిధిలో ఎంతో పవిత్రంగా ఆవిష్కరించేవారు కవులు. ఆనాటి విలువలకు ఉదాహరణ ఈ గీతం.డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలుగులో మందార మకరందం వంటి పద మాధుర్యాన్ని మనకు వారసత్వ సంపదగా అందించారు. ఆయన సాహిత్యంలోని ఈ తీయదనాన్ని ఎంత ఆస్వాదించినా అందులోని మాధుర్యం తరగదు. ఈ కథలో మొదటి సన్నివేశాలలో ఎన్టీఆర్ మరియు జమునపై ఈ తోటలో నారాజు పాటను చిత్రీకరించారు.
పదప్రయోగానికి సినారె గారు పెట్టిన పేరు. చాంగురే, మజ్జారే,దొరసాని వంటి ఎన్నో పదాలకు సృష్టికర్తయైన నారాయణ రెడ్డి గారు ఈ గీతంలో ప్రేమను లలితమైన భావనలతో అందమైన పదమాలికగా ఆవిష్కరించారు. భౌతికమైన స్పర్శ లేకుండా, దూరంగా ఉండి, తమ భావనలను సభ్యతతో, పవిత్రతతో వ్యక్తపరచే ప్రేయసీ ప్రియులు నాటి కవుల మేధో సంపత్తి. పారిజాత పుష్పం వంటి నవ్వుట ఆ ప్రియునిది...ఎటువంటి శబ్దమూ లేని రస రమ్యమైన గీతాలట ఆతని నవ్వులు..గీతం మొత్తం ఇటువంటి భావనలతోనే సాగుతుంది. భావనలను పాట ద్వారా వినటం, పాట ద్వారానే తెలియజేయటం ఆ కవికే, ఆ పాత్రలకే చెందింది.
ఎప్పుడో తోటలో ఆ రాజు తొంగి చూశాడట, నీటిలో ఆ రాజు నీడ నేడు నవ్విందట. పూలల్లుతూ నాయిక నాయకుని గురించి తలచే అద్భుతమైన సన్నివేశం ఈ గీతానిది. ఆ రాజు మళ్లీ ఈ రోజు వస్తాడా? అందమైన ఈ కన్య కలలన్నీ మళ్లీ చిగురిస్తాయా అని కలలు కంటుంది నాయిక. నాయకుడు వెంటనే స్పందించి, చాటు మాటుగా విన్నాను, పాటలో ఆ స్త్రీ (ధర అంటే స్త్రీ అని అర్థం) అనురాగంతో కూడిన భావనలు తెలుసుకున్నాను అంటాడు. ఎలనాగ నయనాల కమలాలలో దాగి అన్న వాక్యం పరిశీలించండి. ఎలనాగ అన్న పదం యవ్వనంలో ఉన్న స్త్రీని వర్ణించేది. ఇంతకుమునుపు ఎక్కడా వినని పదాన్ని సందర్భోచితంగా ఉపయోగించి సినారె గారు గీతానికి జీవం పోసారు. నాయిక కలువల వంటి కన్నులలో, ఎదలో కదలే తుమ్మెద ఝుంకారం వంటి పాటను విన్నాడట నాయకుడు. తుమ్మెదకు, కలువకు, ప్రేయసీ ప్రియుల మధ్య భావావేశానికి ఎంత సారూప్యతో! మరోమారు దీనిని మనకు అందమైన పదాలలో రచయిత తెలిపారు. సినారె గారి గీతానికి కేవీ మహదేవన్ గారు సంగీతం కూర్చగా ఘంటసాల, సుశీల గారు యుగళ గీతాన్ని ఒక రసరమ్యమైన భావనగా మనకు అందించారు.
ఏకవీర చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించలేకపోయినా, రసికుల మదిలో ఒక స్థానాన్ని నిలుపుకుంది. బహుశా ఈ విధమైన వైవిధ్యభరితమైన దుఃఖాతము గల కథను ప్రజలు అప్పటికి ఎక్కువ చూడాలేదేమో. స్త్రీ పురుషుల మధ్య కలిగే భావనలను విశ్వనాథవారి కలంలో వెలువడినంత అందంగా చిత్రం కూడా ఆవిష్కరించింది. కానీ, సమాజం అంత తేలికగా దానిని ఆహ్వానించలేక, అర్థం చేసుకోలేకపోవటంతో చిత్రం పరాజయం పొందింది.

No comments:

Post a Comment

Pages