నాట్య వేదవ్యాస్ - అచ్చంగా తెలుగు

నాట్య వేదవ్యాస్

Share This

నాట్య వేదవ్యాస్

-బ్నిం


నల్లగొండ జిల్లా ‘చందుపట్ల ‘లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనదే – అక్కడ పూజారిగారి కుటుంబంలో మన ‘హీరో’ పుట్టాడు. ముడుంబ లక్ష్మీ నరసింహా చార్యులు, వెంకట పద్మల మూడో అబ్బాయి. మన వేదవ్యాస్ కు మాత్రం బడి గంటల కంటే ముందే గుడి గంటలు, నట్టువాంగం వినిపించాయి. అందుకే ఆటపాటల భవితను ఊహించుకున్నాడు –
మంచి కుటుంబం- మంచి కల్చర్-ఆటోమేటిక్ గా ‘సంస్కారం’ వారసత్వంగా వచ్చాయి.
పోతన దగ్గరనుంచి..శ్రీశ్రీ వరకూ కళాత్మకమైన అభిరుచి కలిగిన కుటుంబంలో.. తల్లిదండ్రులు అందుకోని ఆనందాన్ని పిల్లలకు ఇవ్వాలని చిన్నప్పట్నించే ఆడనిచ్చారు-పాడనిచ్చారు- ఇంక వేదవ్యాస్ ఎక్కడ డప్పు శబ్దం వినబడినా నాట్యం ఆడేవాడు. అన్నగారు ఫణివంశీకి అతని నాట్యం భలే నచ్చింది- “ఇలా చెయ్..అలా చెయ్” అని ప్రోత్సహించేవాడు.
ఇంకా గణపతి మండపాలు, స్కూల్లో వేదికలు. ఇతని జానపద నృత్యాలతో
కళకళలాడేవి. “అడవి తల్లికి దండాలో” అంటూ కోయవాని వేషంలో గజ్జె కట్టిన చిన్నారి... అందరి మెప్పులు పొందిన కొన్నాళ్ళకి ... పిల్లల చదువు నిమిత్తం తల్లిదండ్రులు హైదరాబాదుకి వచ్చాక జానపదం-శాస్త్రీయం అయింది-
అప్పుడూ..అన్న ఫణిగారే ఇంటర్మీడియట్ చదువుతున్న తమ్ముని దగ్గరికి
వచ్చి ‘త్యాగరాజు మ్యూజిక్ & డాన్స్ కాలేజి’ అడ్మిషన్ ఫారం తెచ్చి కూచిపూడి నాట్యంలో ప్రవేశించమని రెచ్చకొట్టారు.
అప్పుడు పరిచయమయ్యారు. ప్రసన్నరాణిగారు చింత ఆదినారాయణ శర్మగారు. వారి గురుత్వంలో శాస్త్రీయ నాట్య ప్రభావం మరింతగా అవగతం అవుతూ, ఆరాధన పెరిగింది. “సర్టిఫికెట్ కోర్స్” పూర్తి అయింది. 2010
జనవరి 31 న శ్రీ అర్ధనారీశ్వరం  వెంకట్ గారి ఆధ్వర్యంలో కాళికా విజయం నృత్యరూపకంలో బ్రహ్మగా, మునిగా డబల్ యాక్షన్ తో అన్నగారి కల నిజమైనది.వేదవ్యాస్ కళా పండింది.....
చదువు సాగుతుంది... B.tech సీట్ వచ్చింది! డాన్స్ కొనసాగుతూనే ఉంది!! 150 కు పైగా ప్రదర్శనలు చేసే చాన్స్ వచ్చింది. successfullగా ఆయా పాత్రల్లో నటించారు. శ్రీ కె.వి.సత్యనారాయణగారు, ch.అజయ్ గారు, వెంపటి మోహన్ గారు, అలా చాలా మంది పరిచయాలతో నాట్య విన్యాసం విస్తృతి తెలిసింది.
ఇప్పుడు మిసైల్ టెక్నాలజీలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ని పూర్తి చేశాడు. H.A.L లో క్వాలిటీ అనాలసిస్ గా రిసెర్చ్ చేస్తున్నాడు అయినా! డాన్స్ ని మాత్రం మర్చిపోలేదు.
పాపం డాన్స్ ఇన్స్ట్యూట్  నిర్వాహకులు (నాట్యగురువులు) సొంత అవసరాల కోసం విద్యార్థులను వినియోగించుకోవటమే కాకుండా, డాన్స్ ని ఖరీదైన విద్య
చేసేశారు అనే అభిప్రాయం కూడా ఈ ‘తెలంగాణా పోరాట వీరుడికి’ తెలిసిపోయింది. కొందరికి అందుకే శత్రువుని కూడా అయ్యానంటాడు.
మరీ నిజాయితీ కోసం అంతా పోరాటం ఎందుకో? మనిషి చూస్తే సాప్ట్, బ్రెయిన్ చూస్తె షార్ప్, ఐడియాలు చూస్తే హార్ష్ కానీ! హి ఈజ్ స్మార్ట్!
ఒక బ్యాలే గురించి డిస్కస్ చేయటానికి మొన్నీమధ్యే నా దగ్గరికి వచ్చాడు. డబ్బెంత ఇస్తావని అడక్కుండా... సబ్జెక్టు ఏంటి అన్నానంటా! అందుకని నన్ను ప్రేమించటం మొదలుపెట్టాడు.
అవునూ మరీ!.... అంతకు ముందు ఆయనికి కలిసిన రైటర్లు నాకు భిన్నంగా ప్రవర్తించారట నేను “bnim “ గానే ప్రవర్తిస్తానుగా! ఆయన మీద ప్రేమ ఎక్కువైపోయి నిన్న ‘నీ దగ్గర డబ్బులు తీసుకోను బాబూ, నీకు నచ్చేలా నాతో స్క్రిప్ట్ రాయించుకోటానికి అవస్థపడు’ అని వరం ఇచ్చా. అయినా నేను వదలను డబ్బులు కాదు అతని స్నేహాన్ని –
ఇంకా ఎవరిని ప్రేమించలేదట – డాన్స్ ని తప్ప! అమ్మాయిల తండ్రులు సూటబులిటి ఉంటే వెంటాడొచ్చు. ఈ స్మార్ట్ గై కోసం.
వేదవ్యాస్ గారు కంపోస్ చేసిన నాట్యాన్ని క్రింది లింక్ లో చుడండి.
***

No comments:

Post a Comment

Pages